ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ లో మహిళలకు ప్రాధాన్యత ‘గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించేందుకు టీకా కార్యక్రమం... కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన
మాతా శిశు సంరక్షణ కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల మధ్య సమన్వయం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి...కేంద్ర ఆర్థిక మంత్రి
డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత పటిష్టం చేయడానికి యు-విన్ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు
Posted On:
01 FEB 2024 12:44PM by PIB Hyderabad
మహిళల అభివృద్ధి, సంక్షేమానికి 2024-25 మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది.
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడం లక్ష్యంగా బడ్జెట్ రూపొందించిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడానికి టీకా కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు. మాతా శిశు సంరక్షణ కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను కలిపి అమలు చేయాలని ప్రతిపాదించారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది. అర్హులైన వారు ఈ టీకాను తీసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు.
మాతా, శిశు సంరక్షణ కోసం అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాల మధ్య సమన్వయం తీసుకురావడానికి ఒక సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ‘సాక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0’ కింద అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తామని ఆమె తెలిపారు. దీనివల్ల పోషకాహారం పంపిణీ, బాల్య సంరక్షణ, అభివృద్ధి మెరుగుపడుతుందని ఆమె అన్నారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు దేశవ్యాప్తంగా కొత్తగా అభివృద్ధి చేసిన యు -విన్ ప్లాట్‌ఫారమ్‌ను వేగంగా విస్తరించాలని శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ ప్లాట్‌ఫారమ్ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, మిషన్ ఇంద్రధనుష్ కింద ప్రయత్నాలను పటిష్టంగా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది అని ఆమె తెలిపారు
***
(Release ID: 2001625)
Visitor Counter : 307