ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘పిఎం- జ‌న్మన్‌’ కింద లక్షమంది ‘పిఎంఎవై’(జి) లబ్ధిదారులకు తొలివిడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి


‘‘గిరిజన సమాజంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి
చేకూర్చడమే పిఎం- జ‌న్మన్‌ మహా అభియాన్ లక్ష్యం’’;

‘‘దేశంలో నేడు తొలుత పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఉంది’’;

‘‘శబరిమాత లేని శ్రీరాముని కథను ఊహించలేం’’;

‘‘ఎవరికీ పట్టని పేదలను మోదీ అక్కున చేర్చుకున్నాడు’’;

‘‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం
లబ్ధిదారులలో అధికశాతం నా గిరిజన సోదరసోదరీమణులే’’;

‘‘గిరిజన సంస్కృతి-ఆత్మగౌరవం దిశగా మా ప్రభుత్వ పనితీరును
గిరిజన సమాజం నేడు గమనిస్తోంది... అర్థం చేసుకుంటోంది’’

Posted On: 15 JAN 2024 3:16PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహాభియాన్ (పిఎం-జ‌న్మన్‌) కింద లక్షమంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (పిఎంఎవై-జి) లబ్ధిదారులకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా తొలివిడత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘పిఎం-జ‌న్మన్‌’ లబ్ధిదారులతో ఆయన సంభాషించారు.

   ఈ కార్యక్రమంలో ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని జాష్పూర్ జిల్లా వాస్త‌వ్యురాలు శ్రీమతి మ‌న్‌కున్వ‌రి బాయి మాట్లాడుతూ- తాను, తన భర్త వ్యవసాయ పనులకు వెళ్తుంటామని తెలిపారు. తానిప్పుడు స్వయం సహాయ సంఘంలో సభ్యత్వంతో ‘డోనా పట్టాల్’ (పేపర్ ప్లేట్లు, గిన్నెల) తయారీలో శిక్షణ పొందుతున్నానని చెప్పారు. అలాగే జన్మన్ సంఘం సభ్యురాలుగా ‘పిఎం-జన్మన్’ కార్యక్రమం సంబంధిత పథకాల గురించి ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నానని తెలిపారు. ప్రస్తుతం ‘దీప సమూహ్’ పేరిట 12 మందితో ఏర్పాటైన స్వయం సహాయ సంఘంలో ఆమె సభ్యురాలు. సంఘాల సభ్యులు తయారుచేసే ఉత్పత్తులను వన్-ధన్ కేంద్రాలద్వారా విక్రయించే ప్రణాళిక గురించి కూడా శ్రీమతి మ‌న్‌కున్వ‌రి ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా తనకు లభించిన ప్రయోజనాల గురించి వెల్లడిస్తూ- ‘పక్కా ఇల్లు, కొళాయి నీరు, వంటగ్యాస్, విద్యుత్ కనెక్షన్, ఆయుష్మాన్ కార్డ్’ వగైరాలను ప్రస్తావించారు. తన భర్త చెవి సంబంధిత వ్యాధికి ఉచిత చికిత్స పొందగా, తన కుమార్తెకు రూ.30,000 విలువైన చికిత్స ఉచితంగా లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ‘అటవీ హక్కుల పరిరక్షణ చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ), కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ వగైరా ప్రయోజనాలు కూడా తనకు లభించాయని తెలిపారు. కొళాయి కనెక్షన్ రావడంవల్ల తమ కుటుంబం కలుషిత జలంతో రోగాలబారిన పడే ముప్పు తప్పిందన్నారు. గ్యాస్ కనెక్షన్ వల్ల పొగనుంచి విముక్తి లభించడమేగాక తనకు సమయం కలసివచ్చిందని చెప్పారు. ప్రభుత్వ చొరవతో తనకు లభించిన ప్రయోజనాలపై ఆమె ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ- ‘‘గడచిన 75 ఏళ్లుగా కాని పనులు ఇప్పుడు 25 రోజుల్లో పూర్తవుతున్నాయి’’ అని హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నవారికి క్రీడలపై ఆసక్తి గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు. క్రీడాసక్తిగల యువతులు, బాలికలు చేతులు పైకెత్తాల్సిందిగా ఆయన సూచించారు. క్రీడలపై ఇంకా మక్కువ పెంచుకోవాలని, ఇటీవలి కాలంలో అత్యధిక క్రీడా పురస్కారాలు సాధిస్తున్న వారిలో గిరిజన సమాజ సభ్యులే ఎక్కువగా ఉన్నారన్నారు. శ్రీమతి మన్‌కున్వరి అనేక పథకాల కింద ప్రయోజనాలు పొందటాన్ని ప్రస్తావిస్తూ- అవన్నీ ఆమెకు జీవిత సౌలభ్యం కల్పించడంపై ప్రధాని సంతోషం వ్యక్తంచేశారు. ‘‘మీరు ప్రయోజనం పొందడమేగాక ఇతరులకూ వాటిపై అవగాహన కల్పించడం హర్షణీయం’’ అని ఆమెను అభినందించారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ పథకాల ప్రభావం అనేక రెట్లు పెరుగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధిదారుల జాబితాలో చేరేలా ప్రభుత్వం చేస్తున్న కృషిని పునరుద్ఘాటిస్తూ ఆమెతో సంభాషణను ప్రధాని ముగించారు.

   మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన సహరియా జనజాతి సభ్యురాలు శ్రీమతి లలితా ఆదివాసి ముగ్గురు పిల్లల తల్లి. ఆమె ఆయుష్మాన్ కార్డ్, రేషన్ కార్డ్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారు. ఆమె కుమార్తె 6వ తరగతి చదువుతూ ‘లాడ్లీ లక్ష్మి’ పథకం కింద ప్రయోజనంతోపాటు ఉపకార వేతనం, యూనిఫాం, పుస్తకాలు కూడా అందుకుంటోంది. అలాగే 2వ తరగతి చదివే కుమారుడికీ ఉపకార వేతనం, ఇతర సౌకర్యాలు లభిస్తున్నాయి. ఆఖరి సంతానమైన కుమారుడు అంగన్‌వాడీలో అక్షరాభ్యాసం చేస్తున్నాడు. ఆమె షీత్లా మయ్యా స్వయం సహాయ సంఘం సభ్యురాలుగా ఉన్నారు. ఆమె వ్యవసాయ పరికరాలు అద్దెకిచ్చే కేంద్రం నిర్వహిస్తోంది. శ్రీమతి లలితకు తొలివిడతలో పక్కా ఇల్లు మంజూరు కావడంపై ప్రధాని ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలపై ప్రధాని ఎంతో అవగాహనతో ఆలోచించడంపై ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనం నేడు అన్ని పథకాల ప్రయోజనాలూ పొందుతున్నారని, జన్మన్ అభియాన్ ద్వారా వచ్చిన ఈ మార్పు సంతోషం కలిగిస్తున్నదని తెలిపారు.  తమ స్వయం సహాయ సంఘం సమావేశాల్లో ఈ కార్యక్రమం గురించి తనతోపాటు పలువురికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. దీంతో మొదట పక్కా ఇల్లు పొందానని, తన మామగారు కిసాన్ క్రెడిట్ కార్డు పొందారని ప్రధానికి చెప్పారు. కాగా, జన్మన్ అభియాన్ నిర్వహణ సందర్భంగా 100 అదనపు ఆయుష్మాన్ కార్డులు జారీచేయబడ్డాయి. ఆమె గ్రామంలో ఇప్పుడు ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఉంది. అలాగే లబ్ధిదారులకు కొత్త గృహాలు కూడా కేటాయించబడుతున్నాయి. గిరిజన, గ్రామీణ మహిళల నాయకత్వ లక్షణాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. స్థానిక పంచాయతీ సభ్యురాలు విద్యా ఆదివాసి తమ గ్రామం మ్యాప్ చూపుతూ అభివృద్ధి ప్రణాళికను గ్రామ నమూనాతో ప్రధానికి వివరించారు. దీనిపై ప్ర‌ధాని స్పందిస్తూ- క్షేత్రస్థాయిలో ప్ర‌ధానమంత్రి జన్మన్ సానుకూల ప్ర‌భావం చూపడంపై సంతృప్తి వ్య‌క్తం చేశారు. అర్హులైన ప్ర‌తి ఒక్క ల‌బ్ధిదారుకూ ప్రయోజనాలు అందించాలన్న ప్ర‌భుత్వ సంకల్పాన్ని ఆయన పున‌రుద్ఘాటించారు.

   మహారాష్ట్రలోని నాసిక్‌ నివాసి, పింప్రిలోని ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న భారతి నారాయణ్ రన్ ప్రధానితో మాట్లాడిన సందర్భంగా తన హిందీ భాషా నైపుణ్యంతో ఆయనను ఆకట్టుకుంది. పాఠశాలలో అందుబాటులోగల సౌకర్యాల గురించి ప్రధాని వాకబు చేయగా, తమకు పెద్ద ఆట మైదానం, హాస్టల్ వసతితోపాటు పరిశుభ్రమైన ఆహారం లభిస్తున్నదని తెలిపింది. అలాగే భవిష్యత్తులో తాను ఐఏఎస్ అధికారిని కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పింది. ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడైన తన అన్నయ్య స్ఫూర్తితో విద్యాభ్యాసం చేస్తున్నట్లు తెలిపింది. భారతి సోదరుడు శ్రీ పాండురంగ తాను సిబిఎస్ఇ బోర్డు పాఠ్య ప్రణాళికతో 6 నుంచి 12వ తరగతిదాకా ఏకలవ్య పాఠశాలలోనే చదివి, ఆ తర్వాత నాసిక్‌లో పట్టభద్రుడయ్యానని ప్రధానికి తెలిపారు. ఏకలవ్య పాఠశాలలో చదివేలా తమ సమాజంలోని పిల్లలందర్నీ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా భవిష్యత్తు కోసం పెద్ద నగరాలకు వెళ్లాలనుకునే వారిని ప్రోత్సహించడం గురించి కూడా తెలిపారు. తమకు ఇప్పటిదాకా లభించిన ప్రయోజనాల గురించి శ్రీ పాండురంగ వివరిస్తూ- పిఎంఎవై కింద పక్కా ఇల్లు, మరుగుదొడ్లు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి, ఉజ్వల గ్యాస్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, కొళాయి నీటి సరఫరా, ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు,  ఆయుష్మాన్ కార్డు వగైరాలను ప్రస్తావించారు. అలాగే ‘పిఎం-జన్మన్’ కింద ఇవాళ పక్కా ఇంటి కోసం తొలివిడత కింద రూ.90,000 విడుదల కావడాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. తమ సమాజంలోని పిల్లలందరికీ విద్యనందించాలని ఆకాంక్షిస్తున్నట్లు శ్రీ పాండురంగ తెలిపారు. తద్వారా వారు దేశంలోని ఏ మూలకు వెళ్లినా తమదైన మార్గంలో దేశ సేవ చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాలనే ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా తమ ఇద్దరు పిల్లలను విద్యావంతులను చేయాలని తపిస్తున్న దంపతులకు ప్రధాని నమస్కరిస్తూ, చదువుపై శ్రద్ధాసక్తులు చూపుతున్న వారి పిల్లలను అభినందించారు. ఇక ఐఎఎస్ అధికారి కావాలన్న భారతి ఆకాంక్ష నెరవేరగలదని ఆశాభావం వ్యక్తం చేస్తూ, దేశంలో ఏకలవ్య పాఠశాలల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ ఏకలవ్య పాఠశాలల్లో చేరాలని ప్రధాని మోదీ కోరారు.

   ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా వాస్తవ్యురాలైన శ్రీమతి స్వావీ గంగ ఇద్దరు పిల్లల తల్లి. ఆమె పిఎం-జన్మాన్‌ కింద ఇల్లు, గ్యాస్‌ కనెక్షన్‌, విద్యుత్‌ కనెక్షన్‌, నీటి కనెక్షన్‌ పొందారు. వారి నివాస ప్రాంతమైన అరకు లోయ కాఫీ పంటకు ప్రసిద్ధి చెందినది కావడంతో ఆమె ఆ తోటల్లో పనికి వెళ్తూంటుంది. ప్రభుత్వ పథకాలతో తమ ఉత్పత్తులకు మంచి ధర లభిస్తున్నదని ఆమె తెలిపారు. వ్యవసాయం, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌ సంబంధిత నైపుణ్యాభివృద్ధి పథకాల ప్రయోజనాలతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందుతున్నానని ఆమె ప్రధానికి చెప్పారు. వన్-ధన్ పథకం తన ఆదాయం పెంచడమే కాకుండా దళారుల నుంచి తనను రక్షించిందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో లక్షాధికారి సోదరీమణిగా మారడంపై ఆమెను ప్రధాని మోదీ అభినందించారు. దేశంలో 2 కోట్ల మందిని ఈ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తమ గ్రామంలో కొత్త రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం తదితరాలపై శ్రీమతి స్వావి హర్షం వ్యక్తం చేశారు. అరకు లోయలోని కఠినమైన శీతల వాతావరణంలో  పక్కా ఇల్లు లభంచడం తన జీవితంలో నిజమైన పరివర్తన తెచ్చిందని ఆమె చెప్పారు. ఆమెతో మాట్లాడిన అనంతరం 2047 నాటికి వికసిత భారతం సంకల్పాన్ని కచ్చితంగా సాధిస్తామని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

   జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా వాస్తవ్యురాలు శ్రీమతి శశికిరణ్ బిర్జియా తమ కుటుంబంలో ఏడుగురు సభ్యులున్నారని తెలిపారు. స్వయం సహాయ సంఘంలో సభ్యురాలుగా ఫోటో కాపియర్, కుట్టు మిషన్ కొనుగోలు చేసుకుని పని చేసుకుంటున్నామని, వ్యవసాయ పనులకూ వెళ్తుంటామని ప్రధానికి చెప్పారు. తనకు అందిన ప్రయోజనాల గురించి తెలుపుతూ, కొళాయి/విద్యుత్ కనెక్షన్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటివాటిని ప్రస్తావించారు. అలాగే తన తల్లికి పిఎం-జన్మన్ కింద పిఎంఎవై(జి) కింద పక్కా ఇల్లు, కిసాన్ క్రెడిట్ కార్డు లభించిందని తెలిపారు. అంతేకాకుండా వన్-ధన్ కేంద్రాలతోనూ అనుబంధం ఉన్నట్లు వెల్లడించారు. స్వయం సహాయ సంఘం ద్వారా రుణం పొందడంపై ప్రధాని ప్రశ్నకు జవాబిస్తూ- తమ గ్రామంలో ఇప్పటిదాకా ఫోటో కాపియర్ యంత్రం లేదని, ఇటీవలే తాను కొనుగోలు చేసి, పని ప్రారంభించానని శ్రీమతి శశి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే 12 మంది సభ్యులుగల తమ స్వయం సహాయ సంఘం ‘ఏక్తా ఆజీవిక సఖి మండల్’ ద్వారా పిఎం నైపుణ్యాభివృద్ధి పథకం కింద పేపర్ ప్లేట్లు, గిన్నెల తయారీతోపాటు వివిధ రకాల ఊరగాయలు తయారీపై శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తులను వన్-ధన్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు లేదా పశుసంవర్ధకం వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలతో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న సానుకూల ప్రభావంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ‘పిఎం-జన్మన్’తో ఈ వేగం, స్థాయి అనేక రెట్లు పెరిగిందని ఆయన అన్నారు. ‘‘గడచిన పదేళ్లుగా మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులందరికీ సులభంగా, సకాలంలో చేర్చడానికి నిబద్ధతతో కృషి చేస్తోంది... ఇది మోదీ హామీ’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. పిఎం-జన్మన్ సహా ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రధానమంత్రికి గుమ్లా జిల్లా వాసులందరి తరపున శ్రీమతి శశి ధన్యవాదాలు తెలిపారు.

   అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దేశంలో పండుగ వాతావరణం, ప్రజల్లో ఉప్పొంగుతున్న ఆనందోత్సాహాల గురించి ప్రస్తావించారు. ఈ మేరకు ఉత్తరాయనం, మకర సంక్రాంతి, పొంగల్, బిహు వగైరా పండుగ సంబరాల నేపథ్యంలో వివిధ పథకాల లబ్ధిదారులతో మమేకం కావడంతో తన ఆనందం ఇనుమడించిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఒకవైపు అయోధ్యలో దీపావళి చేసుకుంటుంటే, అత్యంత వెనుకబడిన గిరిజన సమాజంలోని లక్ష మంది ప్రజలు కూడా పండుగ చేసుకుంటున్నారు’’ అన్నారు. ఈ మేరకు వారి బ్యాంకు ఖాతాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం కోసం సొమ్ము బదిలీ చేయడాన్ని ప్రస్తావిస్తూ- లబ్ధిదారులందర్నీ ప్రధాని అభినందించారు.

   ఈ ఏడాది దీపావళి పండుగను లబ్ధిదారులు తమ సొంత ఇంటిలో నిర్వహించుకోగలరని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన శుభ సందర్భాన్ని ప్రస్తావిస్తూ-  ఇలాంటి చారిత్రక కార్యక్రమంలో భాగస్వామిగా తనకు అవకాశం లభించడంపై ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రామ మందిర ప్రతిష్టాపన నేపథ్యంలో తాను చేపట్టిన 11 రోజుల ఉపవాస దీక్షలో భాగంగా శబరి మాతను సంస్మరించుకోవడం సహజమని చెబుతూ- ‘‘శబరిమాత లేని శ్రీరాముని కథను ఊహించలేం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. యువరాజుగా తన వద్దకు వచ్చిన శ్రీ రాముడిని మర్యాద పురుషోత్తమునిగా మార్చడంలో శబరిమాత పాత్ర ప్రాధాన్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. ‘‘గిరిజన మాత శబరి ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లు తిన్నప్పుడే దశరథ మహారాజు కుమారుడు దీనబంధు రాముడు కాగలడు’’ అని ఆయన అన్నారు. రామ్‌చరిత్ మానస్‌ని ఉటంకిస్తూ- భగవంతుడైన శ్రీరాముడితో భక్తికిగల సంబంధాన్ని అందులో గొప్పగా చెప్పారని ప్రధాని వివరించారు. ‘‘త్రేతాయుగంలో రాజారాముని కథ కావచ్చు... లేదా ప్రస్తుత కలియుగంలో పరిస్థితి కావచ్చు... పేదలు, అణగారినవర్గాలు, గిరిజనులు లేని సంక్షేమం సాధ్యం కాదు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గడచిన పదేళ్లలో పేదలకు 4 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ- ‘‘ఎవరికీ పట్టని పేదలను మోదీ అక్కున చేర్చుకున్నాడు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

   గిరిజన సమాజంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడమే పిఎం-జన్మన్ మహా అభియాన్ లక్ష్యమని ప్రధాని అన్నారు. పిఎం-జన్మన్ కలలోనైనా ఎవరూ ఊహించలేని ఫలితాలను కేవలం రెండు నెలల్లో సాధించిందని ఆయన తెలిపారు. భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం నాటికిగల సవాళ్లను గుర్తుచేస్తూ- గిరిజన సమజాలు నివసించే దేశంలోని సుదూర, మారుమూల, సరిహద్దు ప్రాంతాలకు ప్రయోజనాలను చేర్చడంలోగల ఇబ్బందులను ప్రధాని వివరించారు. కలుషిత నీరు, కరెంటు, గ్యాస్ కనెక్షన్లు, రోడ్లు, అనుసంధాన వంటివేవీ లేకపోవడం వంటి సంక్లిష్ట పరిస్థితిని ఎత్తిచూపుతూ- దాన్ని అధిగమించేందుకు అవిరళ కృషి చేసింది ప్రస్తుత ప్రభుత్వమేనని ఆయన ఉద్ఘాటించారు. ఈ పథకాన్ని ‘జన్మన్’గా ఎందుకు వ్యవహరిస్తున్నదీ వివరిస్తూ, ‘‘జన్’ అంటే ప్రజలు.. ‘మన్’ అంటే ‘మన్ కీ బాత్’ లేదా వారి మనోగతం” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ భారీ కార్యక్రమం కింద రూ.23,000 కోట్లకు పైగా ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నందున గిరిజన వర్గాల ఆకాంక్షలన్నీ ఇప్పుడు నెరవేరగలవని ఆయన పునరుద్ఘాటించారు.

   సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడకుండా పథకాల ప్రయోజనాలన్నీ అందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు పరిగణించగలమని ప్రధాని అన్నారు. కాగా, దేశంలోని దాదాపు 190 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలు నివసిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కేవలం రెండు నెలల్లోనే 80,000కుపైగా ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేసేలా ప్రభుత్వ అనుసరించిన విధానాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల్లోని సుమారు 30,000 మంది రైతులను ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధితో అనుసంధానించిందని తెలిపారు. బ్యాంకు ఖాతాల్లేని 40,000 మంది లబ్ధిదారులకు ఖాతాలు తెరిపించామని ప్రధాని చెప్పారు. మరో 30,000 మందికిపైగా నిరుపేదలకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని, అటవీ హక్కుల చట్టం కింద 11,000 మందికి భూమి లీజు పట్టాలిచ్చామని గుర్తుచేశారు. ఇదంతా కేవలం కొన్ని వారాల పురోగతి కాగా, నానాటికీ ఈ గణాంకాలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకం అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలకు వీలైనంత త్వరగా చేరేలా ప్రభుత్వం అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నదని తెలిపారు. ‘‘ఇది నేను మీకిస్తున్న హామీ... ఇది మోదీ హామీ... మోదీ హామీ అంటే కచ్చితంగా నెరవేరే హామీ అన్నది మీకూ తెలుసు’’ అని ఆయన అభివర్ణించారు.

   ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలకు (పివిటిజి) పక్కా గృహాలు మంజూరుకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బు బదిలీ చేయబడిందని ప్రధాని చెప్పారు. విద్యుత్, గ్యాస్, కొళాయి కనెక్షన్లతోపాటు మరుగుదొడ్డి సదుపాయం కల్పించడం ద్వారా గౌరవప్రదంగా జీవించే ఏర్పాటు చేశామన్నారు. ఇక పక్కా ఇంటి నిర్మాణం కోసం వారికి రూ.2.5 లక్షలు లభిస్తాయని, ప్రస్తుతం తొలివిడత కింద లక్షమందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఈ ప్రయోజనాలను చేరుస్తందని హామీ ఇచ్చారు. ఈ ప్రయోజనాల కోసం ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, అలాంటివారిని కచ్చితంగా దూరం పెట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ఆదివాసీ సముహాలతో తన దీర్ఘకాలిక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ - ప్రధానమంత్రి జన్మన్ మహా అభియాన్‌ తన వ్యక్తిగత అనుభవం ఆధారంగా రూపొందిన కార్యక్రమమని ప్రధాని చెప్పారు. దీనిపై తనకు మార్గనిర్దేశం చేసిన ఘనత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముదేనని కృతజ్ఞతలు తెలిపారు.

   ‘‘పథకాలు కాగితాలకు పరిమితమైతే వాటి ఉనికి అర్హులైన లబ్ధిదారులకు ఎన్నటికీ తెలియదు’’ అని వాటి ప్రయోజనాలు పొందడంలోని సవాళ్లను ఎత్తిచూపుతూ ప్రధాని వ్యాఖ్యానించారు. అడ్డగోలు నిబంధనల సంకెళ్లు తెంచుతూ ప్రభుత్వం పిఎం-జన్మన్ మహాభియాన్ కార్యక్రమానికి విస్పష్ట రూపమిచ్చిందని గుర్తుచేశారు. ఈ మేరకు వెనుకబడిన గిరిజన గ్రామాలకు రహదారుల సౌలభ్యం కల్పించిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, సంచార వైద్య కేంద్రాల సంబంధిత నిబంధనల్లో చేసిన మార్పులను ఆయన ఉదాహరించారు. ప్రతి గిరిజన నివాసానికీ విద్యుత్ సదుపాయం కల్పించేలా సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతోపాటు వందలాది కొత్త మొబైల్ టవర్ల  ఏర్పాటుతో ఇంటర్నెట్ కనెక్షన్‌ వేగం పెంచామని గుర్తుచేశారు.

   ఆహార భద్రత దిశగా ప్రస్తుత ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. మరోవైపు బలహీన గిరిజన వర్గాల కోసం టీకాలు వేయడంతోపాటు శిక్షణ, అంగన్‌వాడీ వంటి అన్ని సౌకర్యాలను ఒకే గొడుగు కిందుకు తెస్తూ 1000 కేంద్రాల ఏర్పాటు యోచన ఉందని ప్రధాని వెల్లడించారు. గిరిజన యువత కోసం హాస్టళ్ల ఏర్పాటుతోపాటు కొత్త వన్-ధన్ కేంద్రాలు కూడా రానున్నాయని ఆయన తెలిపారు. వికసిత భారతం సంకల్ప యాత్రలో భాగంగా ‘మోదీ హామీ వాహనాలు’ దేశంలోని ప్రతి గ్రామానికి చేరుతున్నాయని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలతో ప్రజల అనుసంధానం లక్ష్యంగా ఈ వాహనాలు వారివద్దకు వెళ్తున్నాయని తెలిపారు. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం గురించి మాట్లాడుతూ- వీటిద్వారా ఎక్కువగా లబ్ధి పొందింది గిరిజన సమాజాలేనని చెప్పారు. విద్యుత్ కనెక్షన్లు, ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు, ఆయుష్మాన్ భారత్ పథకాలను కూడా ఆయన ప్రస్తావించారు.

   సికిల్ సెల్ అనీమియా ముప్పు గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. తరతరాలుగా గిరిజన సమాజ సభ్యులు ఈ వ్యాధిబారిన పడ్డారని పేర్కొన్నారు. ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే ఈ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ‘‘వికసిత భారతం సంకల్ప యాత్రలో సికిల్ సెల్‌ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. గత 2 నెలల్లో 40 లక్షల మందికిపైగా వ్యాధి పీడితులు పరీక్షలు చేయించుకున్నారు’’ అని ఆయన తెలిపారు. గిరిజనం సంబంధిత పథకాలకు బడ్జెట్ కేటాయింపులను ప్రభుత్వం 5 రెట్లు పెంచిందని శ్రీ మోదీ తెలిపారు. గిరిజన బాలల చదువులకు ఉద్దేశించిన ఉపకారవేతనం బడ్జెట్ ఇప్పుడు రెండున్నర రెట్లు పెరిగిందని చెప్పారు. పదేళ్ల కిందటిదాకా దేశంలో గిరిజన బాలల కోసం కేవలం 90 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు మాత్రమే నిర్మితం కాగా, ప్రస్తుత ప్రభుత్వం గత పదేళ్లలో 500కుపైగా కొత్త పాఠశాలల నిర్మాణం ప్రారంభించిందని ప్రధానమంత్రి వెల్లడించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి పెద్ద కంపెనీల్లో పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ఇందుకోసం గిరిజన ప్రాంతాల్లో తరగతి గదుల ఆధునికీకరణ, ఉన్నత విద్యా కేంద్రాల పెంపు చేపట్టబడింది’’ అని వెల్లడించారు.

   దేశంలో 2014కు ముందు 10 అటవీ ఉత్పత్తులకు మాత్రమే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) నిర్ణయించబడిందని, ప్రస్తుత ప్రభుత్వం 90 అటవీ ఉత్పత్తులను దీని పరిధిలోకి తెచ్చిందని ప్రధానమంత్రి వివరించారు. ‘‘అటవీ ఉత్పత్తులకు అధిక ధరల పొందడం కోసం మేం వన్-ధన్ యోజనను రూపొందించాం’’ అని శ్రీ మోదీ తెలిపారు. లక్షలాది లబ్ధిదారులలో పెద్ద సంఖ్యలోగల మహిళల గురించి ప్రస్తావిస్తూ- ‘‘గత పదేళ్లలో గిరిజన కుటుంబాలకు 23 లక్షల పట్టాలు మంజూరు చేశాం. గిరిజన సమాజ హాత్ బజార్‌ను కూడా ప్రోత్సహిస్తున్నాం. మన గిరిజన సోదరులు ప్రాంతీయంగా విక్రయించే వస్తువులను దేశంలోని ఇతర మార్కెట్లలోనూ విక్రయించేలా అనేక కార్యక్రమాలు చేపట్టాం’’ అని ఆయన వెల్లడించారు. చివరగా- ‘‘నా గిరిజన సోదరసోదరీమణులు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నా... అద్భుత దూరదృష్టి కలిగినవారు. గిరిజన సమాజం, సంస్కృతి, వారి గౌరవం కోసం మా ప్రభుత్వం పనిచేస్తున్న తీరును వారంతా ప్రత్యక్షంగా గమనిస్తూ, అర్థం చేసుకుంటున్నారు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని గిరిజన ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల 10 పెద్ద ప్రదర్శనశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన సమాజానికి సముచిత గౌరవం, సౌకర్యాలు లభించే దిశగా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

   చిట్టచివరి అంచెలోని చివరి వ్యక్తికీ సాధికారత కల్పించే అంత్యోదయ దార్శనికత దిశగా ప్రధానమంత్రి చేపట్టిన కృషి మేరకు, ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల (పివిటిజి) సామాజిక-ఆర్థిక సంక్షేమం కోసం గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా 2023 నవంబరు 15న ‘పిఎం-జన్మన్’ కార్యక్రమం ప్రారంభించబడింది. కేంద్రంలోని 9 మంత్రిత్వ శాఖల ద్వారా 11 కీలక చర్యలు చేపట్టేలా రూ.24,000 కోట్ల మేర బడ్జెట్‌తో ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఇందులో భాగంగా ‘పివిటిజి’ల ఆవాసాల్లోని కుటుంబాలకు సురక్షిత గృహాలు, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాలను  సంతృప్తస్థాయిలో అమలు చేయడం, తద్వారా వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. అలాగే పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, విద్యుత్, రోడ్లు, టెలికాం అనుసంధాన సౌలభ్యం, సుస్థిర జీవనోపాధి అవకాశాల కల్పన కూడా ఇందులోఅంతర్భాగంగా ఉంటాయి.


(Release ID: 1996828) Visitor Counter : 218