ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి చేతులమీదుగా డిసెంబరు 11న ‘వికసిత భారతం@2047: యువగళం’ ప్రారంభం
ఈ దార్శనికతకు యువత ఆలోచనలను జోడించే వేదిక సమకూర్చడమే దీని లక్ష్యం;
దేశంలోని రాజ్‌భవన్లలో కార్యశాలల నిర్వహణ సందర్భంగా విశ్వవిద్యాలయాల
ఉప-కులపతులు.. విద్యా సంస్థల అధిపతులను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
Posted On:
10 DEC 2023 1:02PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 డిసెంబర్ 11న ఉదయం 10:30 గంటలకు ‘వికసిత భారతం@2047: యువగళం’ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా ప్రారంభిస్తారు. కార్యక్రమ ప్రారంభ సూచికగా దేశంలోని రాజ్‌భవన్లలో నిర్వహించే కార్యశాలలకు హాజరయ్యే విశ్వవిద్యాలయాల ఉప-కులపతులు, విద్యా సంస్థల అధిపతులు, బోధకులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
దేశ ప్రగతికి సంబంధించి జాతీయ ప్రణాళికల రూపకల్పన, ప్రాధాన్యాలు, లక్ష్యాల విషయంలో యువతరం చురుగ్గా పాల్గొనాలన్న దూరదృష్టితో ప్రధానమంత్రి దీనికి శ్రీకారం చుడుతున్నారు. ఈ దృక్కోణానికి యువతీయువకులు తమ ఆలోచనలను జోడించడం కోసం ‘వికసిత భారతం@2047: యువగళం’ కార్యక్రమం ఒక వేదికను సమకూరుస్తుంది. ఈ వేదికను ఉపయోగించుకోవడంపై వారికి అవగాహన కల్పించడంతోపాటు వికసిత భారతం@2047 కోసం సూచనలు, సలహాల స్వీకరణలో కార్యశాలల నిర్వహణ కీలక దశగా ఉంటుంది.
మనం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి దేశాన్ని వికసిత భారతంగా రూపుదిద్దడమే ‘వికసిత భారతం@2047’ లక్ష్యం. ఇందులో ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలన సహా అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలు అంతర్భాగంగా ఉంటాయి.
***
(Release ID: 1984839)
Visitor Counter : 246
Read this release in:
Bengali
,
Assamese
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam