వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌, కేంద్రీయ భాండార్, రాష్ట్ర సహకార సంఘాల ద్వారా కిలో ఉల్లిని రూ.25 చొప్పున విక్రయిస్తున్న కేంద్రం


ఈ-సేల్స్‌, ఈ-నామ్ వేలం, గంపగుత్త అమ్మకాల ద్వారా విక్రయాల కోసం 5.06 ఎల్‌ఎంటీ ఉల్లిపాయలు సేకరించిన కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ

Posted On: 04 NOV 2023 2:04PM by PIB Hyderabad

ఖరీఫ్ పంట ఆలస్యం కావడంతో దేశంలో పెరిగిన ఉల్లి ధరల నుంచి ప్రజలకు ఊరట కల్పించేందుకు, కేంద్ర ప్రభుత్వం తన నిల్వల నుంచి కిలోకు 25 రూపాయల రాయితీ ధరతో ఉల్లి రిటైల్‌ విక్రయాలను ప్రారంభించింది. దేశ ప్రజలకు ఉల్లి అందుబాటు ధరకే లభించేలా చూసేందుకు ఇప్పటికే తీసుకున్న చర్యలకు ఇది అదనపు చర్య. 29 అక్టోబర్ 2023 నుంచి మెట్రిక్‌ టన్నుకు కనీస ఎగుమతి ధరగా 800 డాలర్లను నిర్ణయించడం, నిల్వల సేకరణను మరో 2 లక్షల టన్నులకు పెంచడం, ఇప్పటికే 5.06 లక్షల టన్నులకు పైగా సేకరించడం, రిటైల్‌ అమ్మకాల ద్వారా ఉల్లిని నిరంతరం అందుబాటులో ఉంచడం, ఇ-నామ్ వేలం, ఆగస్టు రెండో వారం నుంచి టోకు మార్కెట్లలో గంపగుత్త అమ్మకాలు వంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది.

కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ, ఎన్‌సీసీఎఫ్‌ & నాఫెడ్‌ నిర్వహిస్తున్న రిటైల్‌ ఔట్‌లెట్లు, సంచార వాహనాలు, కేంద్రీయ భాండార్, ఇతర రాష్ట్ర-నియంత్రిత సహకార సంస్థల ద్వారా కిలో ఉల్లిని రూ.25కే అందించడం ప్రారంభించింది. నవంబర్ 2వ తేదీ వరకు, నాఫెడ్‌ 21 రాష్ట్రాల్లోని 55 నగరాల్లో విక్రయ కేంద్రాలు, సంచార వాహనాల ద్వారా 329 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా, ఎన్‌సీసీఎఫ్‌ 20 రాష్ట్రాల్లోని 54 నగరాల్లో 457 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్రీయ భాండార్ కూడా, 3 నవంబర్ 2023 నుంచి దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని రిటైల్ కేంద్రాల ద్వారా ఉల్లిపాయలను విక్రయిస్తోంది. సఫల్ మదర్ డైరీ ఈ వారాంతం నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోని వినియోగదార్లకు ఉల్లిపాయల విక్రయాన్ని హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం (హాకా) చేపడుతోంది.

రబీ, ఖరీఫ్ పంటల మధ్య కాలానుగుణ ధరల అస్థిరతను నియంత్రించడానికి, కేంద్ర ప్రభుత్వం రబీ ఉల్లి పంటను సేకరించి నిల్వలను నిర్వహిస్తుంది. నిల్వల పరిమాణాన్ని 2022-23లోని 2.5 ఎల్‌ఎంటీ నుంచి ఈ సంవత్సరం 7 ఎల్‌ఎంటీకి పెంచింది. ఈ రోజు వరకు, 5.06 ఎల్‌ఎంటీ ఉల్లిపంటను సేకరించింది, మిగిలిన 2 ఎల్‌ఎంటీ సేకరణ కొనసాగుతోంది.

ప్రామాణిక లాసల్‌గావ్ మార్కెట్‌లో, 28 అక్టోబర్ 2023న క్వింటాల్‌కు రూ.4,800గా ఉన్న ఉల్లి ధర 03 నవంబర్‌ 2023న రూ.3,650కు తగ్గింది, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాన్ని చూపించడం ప్రారంభించాయి. వారం వ్యవధిలో ధర 24% క్షీణించింది. వచ్చే వారంలో రిటైల్ ధరలు ఇంకా తగ్గుతాయని అంచనా.

రుతుపవన వర్షాలు, పురుగుల బెడద కారణంగా టమాటా సరఫరా తగ్గి జూన్ 2023 చివరి వారం నుంచి ధరలు పెరిగినప్పుడు; కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌ ద్వారా టమోటాలు కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాన నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు అధిక రాయితీ ధరకు అందించిన విషయం గుర్తుంచుకోవాలి. సేకరించిన టమోటాలను వినియోగదార్లకు కిలోకు రూ.90 నుంచి ప్రారంభించి రూ.40 వరకు రాయితీ ధరలకు అందించింది. ఈ చర్యతో, టమాటా సగటు ధర ఆగస్టు మొదటి వారంలో కిలోకు రూ.140 నుంచి సెప్టెంబర్ మొదటి వారం నాటికి రూ.40కి తగ్గింది.

దేశంలోని ఎక్కువ కుటుంబాలకు పప్పుధాన్యాలు పోషకాహార మూలాలు. సాధారణ ప్రజలకు పప్పులు అందుబాటు ధరల్లో దొరికేలా చూసేందుకు, కేంద్ర ప్రభుత్వం భారత్ దాల్‌ను రాయితీ ధరకు అందుబాటులోకి తెచ్చింది. 1 కిలో ప్యాకెట్‌ను రూ.60 చొప్పున, 30 కిలోల ప్యాకెట్‌ను కిలోకు రూ.55 చొప్పున విక్రయించింది. భారత్ దాల్‌ను నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రీయ భాండార్, సఫల్, తెలంగాణ & మహారాష్ట్రలోని రాష్ట్ర-నియంత్రిత సహకార సంస్థల ద్వారా ప్రజలు, సైన్యం, సీఏపీఎఫ్‌, సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

ఈ రోజు వరకు 3.2 ఎల్‌ఎంటీ పచ్చిపప్పును కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 75,269 మెట్రిక్‌ టన్నులను మిల్లులకు పంపింది, 59,183 మెట్రిక్‌ టన్నులను 282 నగరాల్లోని 3,010 రిటైల్ కేంద్రాల (స్టేషనరీ ఔట్‌లెట్‌ సంచార వాహనాలు) ద్వారా అందుబాటులో ఉంచింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 4 లక్షల టన్నులకు పైగా భారత్ దాల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సరఫరాను పెంచుతోంది.

***



(Release ID: 1974918) Visitor Counter : 59