ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2023 వ సంవత్సరం అక్టోబర్ 29 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం  106 వ భాగం లో  ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 29 OCT 2023 11:52AM by PIB Hyderabad

ప్రియమైన నా కుటుంబ సభ్యులారా, నమస్కారం. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి మరో సారి మీకు స్వాగతం. యావత్తు దేశాన్ని పండుగల తాలూకు ఉత్సాహం కమ్ముకొన్న తరుణంలో ఈ ఎపిసోడ్ జరుగుతోంది. మీ అందరికీ రాబోయే అన్ని పండుగల సందర్భం లో హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు.

మిత్రులారా, ఈ పండుగల ఉత్సాహం మధ్య దిల్లీ నుండి వచ్చిన ఒక వార్త తో ఈసారి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ నెల మొదట్లో గాంధీ జయంతి సందర్భం లో ఖాదీ అమ్మకాలు దిల్లీ లో రికార్డు స్థాయి లో జరిగాయి. ఇక్కడి కనాట్‌ ప్లేస్‌ లో ఒకే ఖాదీ విక్రయకేంద్రం లో ఒక్కరోజు లో ఒకటిన్నర కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన సామగ్రి ని ప్రజలు కొనుగోలు చేశారు. ఈ నెల లో జరుగుతున్న ఖాదీ మహోత్సవ్ పాత అమ్మకాల రికార్డు లు అన్నిటి ని మరో సారి బద్దలు కొట్టింది. మీరు ఇంకో విషయం తెలుసుకుంటే ఇంకా సంతోషిస్తారు.. పదేళ్ల కిందట దేశం లో ఖాదీ ఉత్పత్తుల విక్రయం దాదాపు ముప్ఫై వేల కోట్ల రూపాయల కంటే తక్కువ గా ఉండేది. ఇప్పుడు దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు కోట్ల రూపాయల కు చేరుతోంది. ఖాదీ అమ్మకాలు పెరగడం అంటే దాని ప్రయోజనాలు నగరం నుండి గ్రామం వరకు సమాజం లో వివిధ వర్గాలకు చేరుతున్నాయని అర్థం అన్నమాట. మన చేనేత కార్మికులు, హస్తకళా కళాకారులు, మన రైతులు, ఆయుర్వేద మొక్కలను పెంచే వారు, కుటీర పరిశ్రమల వారు - ఇలా అందరి కి లాభం కలుగుతోంది. ఇది ‘వోకల్ ఫార్ లోకల్’ ఉద్యమం యొక్క బలం గా ఉన్నది. మరి మీ దేశవాసులందరి సమర్థన కూడాను పెరుగుతూ పోతోంది.

మిత్రులారా, ఈ రోజు న మీ సమక్షం లో నేను నా మరో అభ్యర్థన ను పునరుద్ధాటించదలచుకొన్నాను. అది కూడా చాలా పట్టుదల తో పునరావృత్తం చేయాలనుకొంటున్నాను. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పర్యటన కు వెళ్తే, తీర్థయాత్రల కు వెళ్తే అక్కడి స్థానిక కళాకారులు తయారు చేసినటువంటి ఉత్పత్తుల ను తప్పక కొనుగోలు చేయండి. మీరు మీ ప్రయాణం తాలూకు మొత్తం బడ్జెటు లో స్థానిక ఉత్పత్తుల ను కొనుగోలు చేయడాన్ని అగ్ర ప్రాధాన్యం గా కొనసాగించండి. అది పది శాతం అయినా, ఇరవై శాతం అయినా - మీ బడ్జెటు అనుమతించినంత వరకు దానిని స్థానిక ఉత్పత్తుల కోసం మీరు ఖర్చు పెట్టండి, అక్కడే ఖర్చు పెట్టండి.

మిత్రులారా, ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మన పండుగల లో మన ‘వోకల్ ఫార్ లోకల్’ ఉద్యమానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఆ కల ను మనం కలసి పండించుకొందాం. మన కల ‘ఆత్మనిర్భర భారతదేశం'. ఈ సారి, నా దేశవాసుల లో ఒకరి స్వేద సుగంధం, నా దేశ యువ ప్రతినిధి యొక్క ప్రతిభ మిళితం అయ్యి దాని తయారీ లో నా దేశవాసుల కు ఉపాధి కల్పించిన ఉత్పత్తి తోనే ఇంటి లో వెలుగుల ను నింపుదాం. నిత్య జీవనం లో అవసరమైనపుడల్లా మనం స్థానిక ఉత్పత్తుల నే కొనుగోలు చేయాలి. అయితే మరొక విషయాన్ని మీరు దృష్టి లో పెట్టుకోవాలి. ఈ ‘వోకల్ ఫార్ లోకల్’ భావన పండుగ శాపింగు కు మాత్రమే పరిమితం కాదు. కొందరు దీపావళి కి దీపాల ను కొని సామాజిక మాధ్యాల లో ‘వోకల్ ఫార్ లోకల్’ అని పోస్టు లు చేయడం నేను చూశాను. అది కేవలం ఆరంభం . మనం చాలా ముందుకు సాగవలసి ఉంది. జీవనం లో అవసరపడే అన్ని వస్తువులు ఇప్పుడు మన దేశం లో అందుబాటు లో ఉంటున్నాయి. ఈ దృష్టికోణం ఒక్క చిన్న దుకాణదారులు, వీధి వీధినా తిరుగుతూ వస్తుసామగ్రి ని అమ్ముతూ ఉండే వర్తకుల వద్ద నుండి కొనుగోళ్లు చేయడానికే పరిమితం కాదు. ఇప్పుడు భారతదేశం ప్రపంచం లో అతి పెద్ద తయారీ కేంద్రం గా అవతరిస్తున్నది. చాలా పెద్ద బ్రాండు లు వాటి ఉత్పత్తుల ను ఇక్కడ తయారు చేస్తున్నాయి. మనం ఆ ఉత్పత్తుల ను మనవిగా చేసుకొంటే మేక్ ఇన్ ఇండియా కు ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే, మనం ‘వోకల్ ఫార్ లోకల్’ గా ఉండాలి. అవును.. అటువంటి ఉత్పత్తుల ను కొనుగోలు చేసేటప్పుడు చెల్లింపుల ను మన దేశాని కి గర్వకారణం అయినటువంటి యూపీఐ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ద్వారా చేయాలి. దీనిని జీవనం లో అలవాటు చేసుకోండి. ఆ ఉత్పత్తి తో లేదా ఆ కళాకారుడి తో సెల్ఫీ దిగి నమో ఏప్ (NamoApp) లో నాతో పంచుకోండి - అది కూడా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ నుండి ఆ సెల్ఫీ ని శేర్ చేయండి. ఇతర వ్యక్తులు కూడా ‘వోకల్ ఫార్ లోకల్’ కు ప్రేరణ పొందేలా నేను ఆ పోస్టుల లో కొన్నిటిని సామాజిక మాధ్యాల్లో పంచుకుంటాను.

మిత్రులారా, భారతదేశం లో తయారు చేసిన, భారతీయులు తయారు చేసిన ఉత్పత్తుల తో దీపావళి కాంతులు తెచ్చుకుంటే; మీ కుటుంబ ప్రతి చిన్న అవసరాన్ని స్థానిక ఉత్పత్తుల తో తీర్చుకుంటే అప్పుడు దీపావళి వెలుగులు మరింత పెరుగుతాయి. ఆ కళాకారుల జీవనం లో ఒక క్రొత్త దీపావళి వస్తుంది. నూతన జీవనం ఉదయిస్తుంది. వారి జీవనం అద్భుతం గా మారుతుంది. భారతదేశాన్ని స్వావలంబనయుక్తమైంది గా మార్చండి. ‘మేక్ ఇన్ ఇండియా’ ఎంపిక ను కొనసాగించండి, అలా చేస్తే మీతో పాటు కోట్ల కొద్దీ దేశ ప్రజల దీపావళి అద్భుతంగాను, ఉల్లాసంగాను, ప్రకాశవంతంగాను, ఆసక్తికరంగాను మారిపోతుంది.

ప్రియమైన నా దేశవాసులారా, అక్టోబరు 31 వ తేదీ మనకు అందరికీ చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ రోజు న మనం మన ఉక్కు మనిషి సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి ని జరుపుకొంటాం. భారతీయులం అయిన మనం అనేక కారణాల వల్ల ఆయన ను స్మరించుకొంటాం. శ్రద్ధాంజలి ని సమర్పిస్తాం. అతి పెద్ద కారణం- దేశం లో 580 కంటే ఎక్కువగా ఉన్న సంస్థానాల ను జోడించడం లో ఆయన పాత్ర సాటి లేనటువంటిది. ప్రతి సంవత్సరం అక్టోబరు 31 వ తేదీ న గుజరాత్‌ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఏకతా దివస్ కు సంబంధించిన ప్రధాన కార్యక్రమం జరుగుతుంది అని మనకు తెలుసు. దీనితో పాటు ఈసారి దిల్లీ లోని కర్తవ్య పథ్ దగ్గర అత్యంత ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశం లోని ప్రతి గ్రామం నుండి, ప్రతి ఇంటి నుండి మట్టి ని సేకరించాలని నేను ఈమధ్య కోరిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ప్రతి ఇంటి నుండి మట్టి ని సేకరించి, కలశం లో ఉంచి, అనంతరం అమృత కలశ యాత్రల ను నిర్వహించారు. దేశం లోని నలుమూల ల నుండి సేకరించిన ఈ మట్టి తో వేల కొద్దీ అమృత కలశ యాత్ర లు ఇప్పుడు దిల్లీ కి చేరుకొంటున్నాయి. ఇక్కడ దిల్లీ లో ఆ మట్టి ని విశాల భారత కలశం లో వేసి, ఈ పవిత్ర మట్టి తో దిల్లీ లో ‘అమృత వాటిక’ ను నిర్మించడం జరుగుతుంది. ఇది దేశ రాజధాని నడిబొడ్డు న అమృత్ మహోత్సవ్ యొక్క భవ్యమైనటువంటి వారసత్వం వలె నిలచిపోనుంది. దేశవ్యాప్తం గా గత రెండున్నర సంవత్సరాలు గా జరుగుతున్న స్వాతంత్య్ర అమృత మహోత్సవం అక్టోబర్ 31 వ తేదీ న ముగియనుంది. మీరంతా కలసి దీనిని ప్రపంచం లో అత్యంత సుదీర్ఘమైన పండుగల లో ఒకటి గా మార్చివేశారు. సైనికుల ను సన్మానించడం అయినా, ప్రతి ఇంట్లో మువ్వన్నెల జెండా ను ఎగురవేయడం అయినా స్వాతంత్ర్య అమృత మహోత్సవం లో ప్రజలు వారి స్థానిక చరిత్ర కు కొత్త గుర్తింపు ను ఇచ్చారు. ఈ కాలం లో సమాజ సేవ కు అద్భుతమైన ఉదాహరణ లు కూడా కనిపించాయి.

మిత్రులారా, ఈ రోజు న మీకు మరో శుభవార్త ను నేను చెప్తున్నాను. ముఖ్యం గా దేశం కోసం ఏదైనా చేయాలి అనే అభిరుచి, కలలు, సంకల్పం ఉన్న నా యువ దేశవాసుల కు ఉద్దేశించింది ఈ ఈ శుభవార్త. ఈ శుభవార్త భారతదేశ ప్రజల కోసం కూడ. కానీ నా యువ మిత్రులారా, ఇది మీకు మాత్రం ప్రత్యేకమైనటువంటిది. కేవలం రెండు రోజుల అనంతరం- అక్టోబరు 31 వ తేదీ న చాలా పెద్ద దేశవ్యాప్త సంస్థ కు పునాది పడుతున్నది. అది కూడ సర్ దార్ సాహబ్ జయంతి రోజు న. ఆ సంస్థ పేరు - మేరా యువ భారత్... అంటే MYBharat. MYBharat సంస్థ భారతదేశం లోని యువతకు వివిధ దేశ నిర్మాణ కార్యక్రమాల లో చురుకైన పాత్ర ను పోషించే అవకాశాన్ని కల్పిస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం లో భారతదేశం యువశక్తి ని ఏకం చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గం. మేరా యువ భారత్ వెబ్‌సైట్ MYBharat కూడా మొదలవుతుంది. నేను యువత ను కోరుతున్నాను, పదే పదే కోరుతున్నాను. నా దేశ నవ యువతీ యువకులారా, MYBharat.Gov.in లో నమోదు చేసుకోండి. వివిధ కార్యక్రమాల కోసం సైన్ అప్ చేయండి. అక్టోబర్ 31 వ తేదీ న పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి పుణ్య తిథి కూడా ను. ఆమె కు కూడ భావోద్వేగభరిత శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను.

నా కుటుంబ సభ్యులారా, మన సాహిత్యం, ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’ భావన ను మరింత గా పెంచే ఉత్తమ మాధ్యమాల లో ఒకటి. తమిళ నాడు కు చెందిన అద్భుతమైన వారసత్వాని కి సంబంధించి రెండు ఉత్తేజకరమైన ప్రయత్నాల ను మీతో పంచుకోవాలి అనుకొంటున్నాను. ప్రముఖ తమిళ రచయిత్రి, సోదరి శివశంకరి గారి ని గురించి తెలుసుకొనే అవకాశం నాకు లభించింది. ఆమె ‘నిట్ ఇండియా- త్రూ లిటరేచర్’ (Knit India, Through Literature) అనే ఒక ప్రాజెక్టు ను చేశారు. దాని అర్థం సాహిత్యం ద్వారా దేశాన్ని అల్లడం, అనుసంధానించడం. ఆమె గత 16 సంవత్సరాలు గా ఈ ప్రాజెక్టు పై పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆమె 18 భారతీయ భాషల లో వ్రాసిన సాహిత్యాన్ని అనువదించారు. వివిధ రాష్ట్రాల రచయితల ను, కవుల ను ఇంటర్వ్యూ చేసేందుకు వీలయ్యేలా కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు, ఇంఫాల్ నుండి జైసల్ మేర్ వరకు దేశవ్యాప్తం గా అనేక సారు లు పర్యటించారు. శివశంకరి గారు వివిధ ప్రాంతాల కు వెళ్లి వాటిని ప్రయాణ వ్యాఖ్యానం తో పాటు గా ప్రచురించారు. ఇది తమిళం, ఇంగ్లిషు భాషల లో ఉంది. ఈ ప్రాజెక్టు లో నాలుగు పెద్ద సంపుటాలు ఉన్నాయి. ప్రతి సంపుటి ని భారతదేశం లోని వేరువేరు ప్రాంతాల కు అంకితం ఇచ్చారు. ఆమె సంకల్ప శక్తి కి నేను గర్వపడుతున్నాను.

మిత్రులారా, కన్యాకుమారి కి చెందిన తిరు ఎ. పెరుమాళ్ గారి పని కూడా చాలా స్ఫూర్తిదాయకమైంది గా ఉంది. తమిళ నాడు కథాకథన సంప్రదాయాన్ని పరిరక్షించడం లో ఆయన ప్రశంసనీయం అయినటువంటి పని ని చేశారు. గత 40 సంవత్సరాలు గా ఈ పని లో ఆయన తలమునుకలు గా ఉన్నారు. ఇందుకోసం తమిళ నాడు లోని వివిధ ప్రాంతాల కు వెళ్తారు. అక్కడి జానపద కళారూపాల ను అన్వేషిస్తారు. వాటిని తన పుస్తకం లో భాగం చేసుకుంటారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 100 పుస్తకాలు వ్రాశారన్న సంగతి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది కాకుండా పెరుమాళ్ గారి కి మరో అభిరుచి కూడ ఉంది. తమిళ నాడు లోని ఆలయ సంస్కృతి పై పరిశోధన చేయడం ఆయనకు చాలా ఇష్టం. అక్కడి స్థానిక జానపద కళాకారుల కు ప్రయోజనం కలిగిస్తున్న తోలుబొమ్మల పై కూడా ఆయన ఎన్నో పరిశోధనల ను చేశారు. శివశంకర్ గారు, ఎ.కె. పెరుమాళ్ గారు లు చేస్తున్న కృషి అందరికీ ఆదర్శం. భారతదేశం తన సంస్కృతి ని కాపాడుకోవడానికి జరిగే ఇటువంటి ప్రతి ప్రయత్నం పట్ల గర్వపడుతుంది, ఇది మన జాతీయ ఐక్యత ను బలోపేతం చేయడమే కాకుండా దేశం పేరు ను, దేశ గౌరవాన్ని పెంచుతుంది.

నా కుటుంబ సభ్యులారా, దేశం యావత్తు నవంబరు 15 వ తేదీ న ఆదివాసీ గౌరవ దినాన్ని జరుపుకొంటుంది. ఈ దినం భగవాన్ బిర్ సా ముండా జన్మదినాన్ని సూచిస్తుంది. భగవాన్ బిర్సా ముండా మన అందరి హృదయాలలో ఉన్నారు. అసలైన ధైర్యం అంటే ఏమిటో, సంకల్ప శక్తి విషయంలో స్థిరంగా ఉండడం అంటే ఏమిటో మనం ఆయన జీవనం నుండి నేర్చుకోవచ్చును. ఆయన ఎప్పుడూ పరాయి పాలన ను అంగీకరించ లేదు. అన్యాయాని కి ఆస్కారం లేనటువంటి సమాజాన్ని ఆయన కోరుకొన్నారు. ప్రతి వ్యక్తి గౌరవం తో, సమానత్వం తో కూడిన జీవనాన్ని గడపాలన్నారు. భగవాన్ బిర్ సా ముండా ఎల్లప్పుడూ ప్రకృతి తో సామరస్యం గా జీవించాలి అని స్పష్టం చేశారు. ఈనాటికీ మన ఆదివాసీ సోదరీమణులు, ఆదివాసీ సోదరులు ప్రకృతి పట్ల బాధ్యత గా నడుచుకొంటూ, ప్రకృతి పరిరక్షణ కు అన్ని విధాలుగాను అంకితభావం తో ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చును. ఆదివాసీ సోదరీమణుల, ఆదివాసీ సోదరుల ఈ వైఖరి మనకు అందరికీ చాలా స్ఫూర్తి ని ఇచ్చేదే.

మిత్రులారా. రేపటి రోజు న, అంటే అక్టోబర్ 30 వ తేదీ నాడు, గోవింద్ గురు గారి పుణ్యతిథి కూడాను. గుజరాత్, రాజస్థాన్‌ ల లోని ఆదివాసులు, ఆదరణ కు నోచుకోకుండా ఉండిపోయినటువంటి వర్గాల వారి జీవనం లో గోవింద్ గురు జీ కి చాలా ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. గోవింద్ గురు జీ కి కూడ నా శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. నవంబరు లో మనం మాన్ గఢ్ జనసంహారం యొక్క వార్షికోత్సవాన్ని కూడ జరుపుకొంటాం. ఆ సామూహిక హత్య ఘటన లో అమరులు అయినటువంటి భారత మాత బిడ్డలు అందరికీ నేను వందనాన్ని ఆచరిస్తున్నాను.

మిత్రులారా, భారతదేశ ఆదివాసీ యోధుల ది గొప్ప చరిత్ర. అన్యాయాని కి వ్యతిరేకం గా తిల్ కా మాంఝీ గారు శంఖారావం చేసింది ఈ భారత భూమి పై నుండే. ఈ భూమి నుండే సిద్ధో-కాన్హూ లు సమానత్వం వాణి ని వినిపించారు. ప్రజా యోధుడు టంట్యా భీల్ గారు మన గడ్డ పైన జన్మించినందుకు గర్వపడుతున్నాం. అమరవీరుడు వీర్‌ నారాయణ్‌ సింహ్ గారి ని భక్తి తో స్మరించుకొంటాం. వారు క్లిష్ట పరిస్థితుల లో ప్రజల కు అండ గా నిలచారు. వీర్ రామ్‌జీ గోండ్‌ గారు గాని, లేదా వీర్ గుండాధుర్‌ గారు గాని, లేదా భీమా నాయక్‌ గారు గాని.. వారి యొక్క సాహసం ఇప్పటికీ మనకు స్ఫూర్తి ని ఇస్తున్నది. ఆదివాసీ సోదరీమణులు మరియు ఆదివాసీ సోదరుల లో అల్లూరి సీతారామరాజు గారు నింపినటువంటి స్ఫూర్తి ని దేశం ఇప్పటికీ గుర్తు పెట్టుకొంటుంది. ఈశాన్య ప్రాంతాల కు చెందిన కియాంగ్ నోబాంగ్ గారు, రాణి గైదిన్‌ ల్యూ గారు ల వంటి స్వాతంత్ర్య సమరయోధుల నుండి కూడా మనకు చాలా ప్రేరణ లభిస్తుంది. రాజమోహినీ దేవి గారు, రాణి కమలపాటి గారు ల వంటి వీరాంగన లు దేశాని కి లభించింది ఆదివాసీ సమాజం నుండే. ఆదివాసీ సమాజాని కి స్ఫూర్తి ని ఇచ్చిన రాణి దుర్గావతి గారి 500 వ జయంతి ని దేశం ప్రస్తుతం జరుపుకొంటున్నది. దేశం లోని మరింత మంది యువత తమ ప్రాంతం లోని ఆదివాసీ వీరుల ను గురించి, ఆదివాసీ వీరాంగనల ను గురించి తెలుసుకొని వారి ని స్ఫూర్తి గా తీసుకొంటారు అని ఆశిస్తున్నాను. దేశం యొక్క ఆత్మగౌరవాన్ని, దేశం యొక్క ప్రగతి ని ఎల్లప్పుడూ సర్వ ప్రధానమైందిగా భావించినటువంటి తన ఆదివాసీ సమాజం పట్ల దేశం కృతజ్ఞురాలు గా ఉంది.

ప్రియమైన నా దేశప్రజలారా, ఈ పండుగ ల కాలం లో దేశం లో క్రీడల పతాకం కూడ రెపరెపలాడుతోంది. ఇటీవల ఏశియాన్ గేమ్స్ లో, అనంతరం జరిగిన పారా ఏశియాన్ గేమ్స్ లో సైతం భారతదేశం యొక్క క్రీడాకారిణులు, క్రీడాకారులు అద్భుతమైనటువంటి విజయాల ను సాధించారు. ఈ క్రీడల లో భారతదేశం 111 పతకాల ను సాధించి సరిక్రొత్త చరిత్ర ను లిఖించింది. పారా ఏశియాన్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారిణులను, క్రీడాకారుల ను అందరినీ నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా, నేను మీ దృష్టి ని స్పెశల్ ఒలింపిక్స్ వరల్డ్ సమర్ గేమ్స్ వైపు తీసుకుపోదలుస్తున్నాను. ఈ క్రీడ లు బెర్లిన్‌ లో జరిగాయి. ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ ఉన్న మన క్రీడాకారుల లోని సామర్థ్యాన్ని బయటకు తెచ్చేందుకు ఈ పోటీ ఒక అద్భుతమైన అవకాశం. ఈ పోటీ లో భారతదేశం దళం 75 బంగారు పతకాల తో సహా 200 పతకాల ను సాధించింది. రోలర్‌ స్కేటింగ్‌ కావచ్చు, లేదా బీచ్‌ వాలీబాల్‌ కావచ్చు, లేదా ఫుట్‌బాల్‌ కావచ్చు, లాన్ టెన్నిస్‌ కావచ్చు.. ఆయా క్రీడల లో భారతదేశం క్రీడాకారిణులు, క్రీడాకారులు పతకాల ను ఒడిసిపట్టారు. ఈ పతకాల విజేత ల జీవనయానం చాలా స్ఫూర్తిదాయకం గా ఉంది. గోల్ఫ్‌లో హరియాణా కు చెందిన శ్రీ రణవీర్ సైనీ స్వర్ణ పతకం సాధించారు. చిన్నప్పటి నుండి ఆటిజమ్ తో బాధపడుతున్న శ్రీ రణ్‌వీర్‌ కు గోల్ఫ్‌పై ఉన్న మక్కువ ను ఏ సవాలు కూడా తగ్గించలేకపోయింది. వారి కుటుంబం లో అందరూ ప్రస్తుతం గోల్ఫ్ క్రీడాకారులు గా మారారని ఆయన తల్లి గారు చెప్పారు. పుదుచ్చేరి కి చెందిన 16 ఏళ్ల శ్రీ టి.విశాల్ నాలుగు పతకాలు సాధించాడు. గోవా కు చెందిన సియా సరోదే గారు పవర్‌లిఫ్టింగ్‌ లో 2 పసిడి పతకాల తో సహా నాలుగు పతకాల ను సాధించారు. 9 ఏళ్ల వయసు లో తల్లి ని కోల్పోయినప్పటికీ, ఆమె అధైర్యపడలేదు. ఛత్తీస్‌ గఢ్‌ లో దుర్గ్‌కు చెందిన శ్రీ అనురాగ్ ప్రసాద్ పవర్‌లిఫ్టింగ్‌ లో మూడు స్వర్ణపతకాల ను, ఒక రజత పతకాన్ని సాధించారు. సైక్లింగ్‌ లో రెండు పతకాల ను సాధించిన ఝార్ ఖండ్‌ కు చెందిన శ్రీ ఇందు ప్రకాశ్ ది కూడా స్ఫూర్తిదాయకం అయినటువంటి జీవనం. సాధారణ కుటుంబం నుండి వచ్చినప్పటికీ శ్రీ ఇందు ప్రకాశ్ తన విజయాని కి పేదరికాన్ని అడ్డు గోడ ను కానివ్వ లేదు. ఈ క్రీడల లో భారతీయ క్రీడాకారులు సాధించిన విజయం ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ సమస్య ను ఎదుర్కొంటున్న ఇతర బాలల కు, కుటుంబాల కు కూడా స్ఫూర్తి ని ఇస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఈ క్రీడల లో పాల్గొని విజేతలు గా నిలచిన మీ ఊరిలోని, మీ ఊరి పొరుగు ప్రాంతాలలోని పిల్లల వద్దకు మీ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లవలసిందని మీ అందరినీ నేను కోరుతున్నాను. వారితో భేటీ అయ్యి వారిని అభినందించండి. ఆ పిల్లల తో కొన్ని క్షణాలు గడపండి. మీకు క్రొత్త అనుభవం కలుగుతుంది. మీరు కూడా వారిని చూసే అవకాశం పొందేంత శక్తి ని దేవుడు వారిలో నింపాడు. తప్పకుండా వెళ్ళి వారిని కలుసుకోండి.

నా కుటుంబ సభ్యులారా, మీరందరూ గుజరాత్‌ లోని పుణ్యక్షేత్రమైన అంబాజీ మందిరాన్ని గురించి తప్పక విని ఉంటారు. ఇది ఒక మహిమ గల శక్తిపీఠం. అంబే మాత దర్శనం చేసుకోవడానికి దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్య లో భక్తజనులు వెళ్తారు. అక్కడి గబ్బర్ పర్వతానికి వెళ్లే మార్గం లో వివిధ రకాల యోగా భంగిమ లు, ఆసనాల ప్రతిమ లు మీకు కనిపిస్తాయి. ఈ విగ్రహాల ప్రత్యేకత ఏమిటో తెలుసా? నిజాని కి వాటి ని చెత్త తో తయారు చేస్తారు. చెత్త తో రూపొందించినటువంటి ఆ శిల్పాలు చాలా అద్భుతం గా ఉన్నాయి. అంటే ఈ ప్రతిమల ను చెత్త లో పడేసిన పాత వస్తువుల తో తయారయ్యాయి అన్నమాట. అంబాజీ శక్తి పీఠం లో అమ్మవారి దర్శనం తో పాటు గా ఈ విగ్రహాలు కూడ భక్తుల కు ఆకర్షణ కేంద్రాలు గా మారాయి. ఈ ప్రయత్నం విజయం పొందడం చూసి నా మనసు లో ఒక ఆలోచన కూడా వస్తోంది. వ్యర్థ పదార్థాల తో ఇటువంటి కళాఖండాల ను తయారు చేసే వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి గుజరాత్ ప్రభుత్వం ఒక పోటీ ని ప్రారంభించి, అటువంటి వారి ని ఆహ్వానించవలసింది గా నేను అభ్యర్థిస్తున్నాను. ఈ ప్రయత్నం గబ్బర్ పర్వతం ఆకర్షణ ను పెంచడం తో పాటు గా దేశం అంతటా చెత్త నుండి సంపద (‘వేస్ట్ టు వెల్థ్’) ప్రచారాని కి ప్రజల ను ప్రేరేపించగలదు.

మిత్రులారా, స్వచ్ఛ్ భారత్, ‘వేస్ట్ టు వెల్థ్’ విషయాల కు వస్తే దేశం లోని ప్రతి మూల నుండి మనకు లెక్కలేనన్ని ఉదాహరణ లు కనిపిస్తాయి. అసమ్ లో కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లా లో అక్షర్ ఫోరమ్ అనే పాఠశాల బాలల్లో స్థిరమైన అభివృద్ధి భావనల ను పెంపొందించే పని ని నిరంతరం చేస్తున్నది. అక్కడ చదువుకుంటున్న బాలలు ప్రతి వారం ప్లాస్టిక్ వ్యర్థాల ను సేకరిస్తుంటారు; వాటిని ఇటుకలు, కీ చైన్ ల వంటి పర్యావరణ అనుకూల వస్తువుల ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ విద్యార్థుల కు రీసైక్లింగ్ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఉత్పత్తుల ను తయారు చేయడాన్ని కూడా నేర్పిస్తారు. చిన్న వయస్సులోనే పర్యావరణం పట్ల ఈ అవగాహన ఈ పిల్లల ను దేశం పట్ల కర్తవ్య నిష్ట ఉన్న పౌరులు గా మార్చడం లో చాలా దోహదపడుతుంది.

నా కుటుంబ సభ్యులారా, ప్రస్తుతం మనం మహిళా శక్తి ని చూడలేని ప్రాంతమంటూ లేదు. వారు సాధించిన విజయాల కు సర్వత్రా ప్రశంస లు వెల్లువెత్తుతున్న ఈ కాలం లో- చరిత్ర లోని బంగారు పుటల లో నిలచిపోయిన - భక్తి యొక్క శక్తి ని చాటిన ఓ మహిళా సాధువు ను కూడా మనం స్మరించుకోవాలి. ఈ సంవత్సరం దేశం సంత్ మీరాబాయి 525 వ జయంతి వేడుకల ను జరుపుకొంటున్నది. ఆమె అనేక కారణాల వల్ల దేశవ్యాప్తం గా ప్రజలకు స్ఫూర్తిదాయకమైనటువంటి శక్తి గా ఉంది. ఎవరికైనా సంగీతం పట్ల ఆసక్తి ఉంటే సంగీతం పట్ల అంకితభావాని కి ఆమె గొప్ప ఉదాహరణ. ఎవరైనా కవితా ప్రియులు అయితే, భక్తిరసం లో ముంచే మీరాబాయి భజనలు అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. ఎవరైనా దైవిక శక్తి ని విశ్వసిస్తే అప్పుడు శ్రీ కృష్ణుని లో మీరాబాయి లీనం కావడం వారికి గొప్ప ప్రేరణ గా మారుతుంది. సంత్ రవిదాస్‌ ని గురువు గా మీరాబాయి భావించారు. ఆమె కూడా చెప్పే వారు-

గురు మిలియా రైదాస్,

దీన్హీ జ్ఞాన్ కీ గుట్కీ అని.

మీరాబాయి ఇప్పటికీ దేశం లోని మాతృమూర్తుల కు, సోదరీమణుల కు, కుమార్తెల కు స్ఫూర్తిదాయకం గా ఉంది. ఆ కాలం లో కూడ ఆమె తన అంతర్గత స్వరాన్ని విని, మూస పద్ధతుల కు వ్యతిరేకం గా నిలబడ్డారు. సాధువు గా కూడ ఆమె మనకు అందరికీ స్ఫూర్తి ని ఇస్తున్నారు. దేశం అనేక రకాల దాడుల ను ఎదుర్కొంటున్నప్పుడు ఆమె భారతీయ సమాజాన్ని, సంస్కృతి ని బలోపేతం చేయడాని కి ముందుకు వచ్చింది. సరళత్వం, సాధారణ జీవన విధానం లో ఎంత శక్తి ఉన్నదీ మీరాబాయి గారి జీవన కాలం నుండి మనకు తెలుసును. నేను సంత్ మీరాబాయి కి ప్రణామాన్ని ఆచరిస్తున్నాను.

నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, ఈసారి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఇంతే! మీ అందరి తో చేసే ఈ సంభాషణ నా లో ఒక క్రొత్త శక్తి ని నింపుతుంది. మీ సందేశాల లో ఆశాభావాని కి, సానుకూలత కు సంబంధించిన వందలాది కథనాలు నాకు చేరుతున్నాయి. ఆత్మనిర్భర భారతదేశం ప్రచారాన్ని నొక్కి చెప్పవలసింది గా మిమ్మల్ని నేను మరోసారి అభ్యర్థిస్తున్నాను. స్థానిక ఉత్పాదనల ను కొనుగోలు చేయండి. స్థానిక ఉత్పత్తుల గురించి మాట్లాడండి. మీరు మీ ఇళ్ల ను శుభ్రం గా ఉంచుకొన్న విధం గానే మీ ప్రాంతాన్ని, మీ నగరాన్ని శుభ్రం గా ఉంచండి. మీకు తెలుసా- అక్టోబర్ 31 వ తేదీన సర్ దార్ సాహబ్ జయంతి ని దేశం ఏకతా దివస్ గా జరుపుకొంటుందని; దేశం లోని అనేక ప్రదేశాల లో ఐక్యత కోసం పరుగు (‘రన్ ఫర్ యూనిటీ’) కార్యక్రమం జరుగుతుంది. మీరు కూడా అక్టోబర్ 31 వ తేదీన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించండి. మీరు సైతం పెద్ద సంఖ్య లో సంఘటితంగా ఉండి ఐక్యత తాలూకు సంకల్పాన్ని బలోపేతం చేయాలి. మరో సారి రాబోయే పండుగల కు చాలా చాలా శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను. మీరందరూ మీ కుటుంబం తో ఆనందం గా పండుగల ను జరుపుకోవాలి, ఆరోగ్యం గా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటూ నేను కోరుకొంటున్నాను. ఇదే నా ఆకాంక్ష. దీపావళి తరుణం లో అగ్నిప్రమాదాల కు తావు ఇచ్చేటట్టు ఎటువంటి పొరపాటు లు అయినా జరగనే కూడదు. ఒకరి ప్రాణం ప్రమాదం లో ఉంది అంటే వారి ని కాపాడేందుకు తప్పనిసరిగా మీరు ప్రయత్నాన్ని చేయండి. మిమ్మల్ని కూడ మీరు జాగ్రత గా చూసుకోగలరు. మొత్తం ప్రాంతాన్ని కూడా జాగ్రత గా చూసుకోవలసింది.

అనేకానేక శుభాకాంక్షలు.

చాలా చాలా ధన్యవాదాలు.

 

***


(Release ID: 1972834) Visitor Counter : 252