ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘భారత యూట్యూబ్‌ అభిమానుల వేడుక-2023’ సందర్భంగా యూట్యూబర్లను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం


“నా యూట్యూబ్ ఛానెల్ ద్వారా దేశంతో.. ప్రపంచంతో నేను సంధానంలో
ఉన్నాను... నన్ను అనుసరించేవారు గణనీయ సంఖ్యలో ఉన్నారు”;

“మన సమష్టి కృషితో దేశ విస్తృత జనాభా జీవితాల్లో పరివర్తన తేగలం”;

“ప్రజానీకంలో చైతన్యం తేవడానికి ఉద్యమం ప్రారంభించండి”;

“నా తాజా సమాచారం కోసం నా ఛానెల్‌ చందాదారులై.. గంట గుర్తు నొక్కండి!”

Posted On: 27 SEP 2023 9:27PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ‘యూట్యూబ్ ఫ్యాన్‌ఫెస్ట్ ఇండియా-2023’ కార్యక్రమంలో ‘యూట్యూబర్ల’నుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా యూట్యూబ్‌తో తన అనుబంధానికి 15 ఏళ్లు పూర్తయ్యాయని, ఈ మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్త ప్రభావం సృష్టించడంలో తన అనుభవాన్ని పంచుకున్నారు.

   యూట్యూబ్‌లో తన 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఈ నేపథ్యంలో ఇవాళ వేడుకలలో పాల్గొంటున్న యూట్యూబర్ల సమాజంలో్ తానూ ఒకడిగా ఉన్నానని చెప్పారు. “గడచిన 15 సంవత్సరాలుగా నేను కూడా నా యూట్యూబ్ ఛానెల్ ద్వారా దేశంతో, ప్రపంచంతో సంధానంలో ఉన్నాను” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాగే “నా ఛానెల్‌కు చందాదారులు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు” అని పేర్కొన్నారు.

   యూట్యూబర్లదీ ఒక ముఖ్యమైన సమాజమని, ఇందులో 5,000 మంది సృష్టికర్తలు, భారీ సంఖ్యలో ఔత్సాహికులు ఉండటాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సమాజంలో “గేమింగ్, టెక్నాలజీ, ఫుడ్ బ్లాగింగ్, ట్రావెల్ బ్లాగర్లుసహా లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ల” వంటి విభిన్న సారాంశ సృష్టికర్తలున్నారని ప్రధాని వివరించారు. దేశ ప్రజానీకంపై వీరి ప్రభావాన్ని వివరిస్తూ- తమ సారాంశ సృష్టిద్వారా సమాజాన్ని మరింత మంచిమార్గంలో ప్రభావితం చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. “మన సమష్టి కృషితో దేశ విస్తృత జనాభా జీవితాల్లో పరివర్తన తేగలం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఏ అంశం మీదనైనా కోట్లాది జనానికి సులువుగా అవగాహన కల్పించగలమని, ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకునేలా వారిలో చైతన్యం పెంచగలమని సూచించారు. తద్వారా ప్రపంచంలోని అనేక విషయాలపై వారి పరిజ్ఞానాన్ని పెంచవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఆ విధంగా “మనం వారిని చేయిపట్టి నడిపించవచ్చు” అన్నారు.

   ప్రధానమంత్రి తన వ్యక్తిగత యూట్యూబ్‌ ఛానెల్‌ గురించి చెబుతూ- ఇందులో వేలాది వీడియోలు ఉన్నాయని పేర్కొన్నారు. పరీక్షల ఒత్తిడి, సామర్థ్య అంచనాల నిర్వహణ, ఉత్పాదకత వంటి అంశాలపై దేశంలోని లక్షలాది విద్యార్థులనుద్దేశించి తాను చేసిన ప్రసంగాలు ఈ వీడియోలలో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ తనకెంతో సంతృప్తినిచ్చాయని ఆయన చెప్పారు.

   సామాజిక ఉద్యమాలతో ముడిపడిన అంశాలపై మాట్లాడుతూ- వాటి విజయం ప్రజాశక్తి మీదనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమమే ఇందుకు నిదర్శనమని ప్రధానమంత్రి ఉదాహరించారు. గత తొమ్మిదేళ్లలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం ద్వారానే ఇదొక భారీ ఉద్యమంగా మారిందన్నారు. “బాలబాలికలు దీనికి భావోద్వేగ శక్తినివ్వగా, ప్రముఖులు దీనికో ఉన్నత స్థాయిని తెచ్చిపెట్టారు. దేశం నలుమూలల ప్రజలు దీన్నో విప్లవంగా మార్చారు. ఇక మీలాంటి యూట్యూబర్లు పరిశుభ్రతను మరింత విస్తృతం చేశారు”  అని వ్యాఖ్యానించారు. ఈ వేగం తగ్గరాదని, పరిశుభ్రతకు భారత్‌ మారుపేరుగా పరివర్తన చెందేదాకా ఉద్యమాన్ని ఆపవద్దని ప్రధాని సూచించారు. “మీలో ప్రతి ఒక్కరికీ పరిశుభ్రత ఓ ప్రాధాన్యాంశం కావాలి. ఇది నా మొదటి అభ్యర్థన” అని నొక్కిచెప్పారు.

   రెండో అభ్యర్థనగా- డిజిటల్ చెల్లింపులను ప్రధాని ప్రస్తావించారు. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) విజయం నేపథ్యంలో ప్రపంచ లావాదేవీలలో భారత్‌ వాటా 46 శాతంగా ఉందని ప్రధాని వెల్లడించారు. ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఈ దిశగా డిజిటల్ చెల్లింపులు చేయడం ఎలాగో స్థానిక భాషలలో వీడియోల ద్వారా ప్రజలకు నేర్పేందుకు కృషి చేయాలని యూట్యూబర్ల సమాజాన్ని కోరారు.

   మూడో అభ్యర్థనగా- ‘స్థానికత కోసం స్వగళం’ నినాదాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. మన దేశంలో ఎన్నో ఉత్పత్తులు స్థానికంగానే తయారవుతున్నాయని, వీటి తయారీదారుల నైపుణ్యం అద్భుతమని పేర్కొన్నారు. యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ చేతి వృత్తుల నిపుణులను, హస్తకళాకారులను ప్రోత్సహించాలని, తద్వారా స్థానికాన్ని ప్రపంచవ్యాప్తంగా చేడయంలో్ సహకరించాలని కోరారు. మన మట్టి సుగంధం, స్వేదం చిందించే దేశ శ్రామికుల కష్టంతో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు “ఖాదీ, హస్తకళలు, చేనేత లేదా మరేదైనా సరే... దేశాన్ని మేల్కొలిపే ఉద్యమానికి శ్రీకారం చుట్టండి” అని పిలుపునిచ్చారు.

   ప్రతి సందేశం చివరన ఒక నిర్దిష్ట ప్రశ్న సంధించి, తదనుగుణంగా ఏదైనా కార్యాచరణ చేపట్టేలా సూచనలు అందించాలని కూడా ప్రధాని కోరారు. “మీరు చెప్పినట్లు చేసే వ్యక్తులు తమ అనుభవాన్ని మీతో పంచుకుంటారు. ఆ విధంగా మీకూ ప్రాచుర్యం పెరుగుతుంది. అప్పుడు ప్రజలు మీరు చెప్పేది వినడమేగాక చేయడానికీ సిద్ధంగా ఉంటారు” అని ఆయన ఉద్బోధించారు. యూట్యూబర్ల సమాజాన్ని ఉద్దేశించే ప్రసంగించే అవకాశం లభించడంపై ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. కాగా, ప్రతి యూట్యూబర్ తమ వీడియోల చివర చెప్పే తరహాలో- “నా నుంచి తాజా సమాచారం కోసం నా ఛానెల్‌ చందాదారులు కండి.. అలాగే గంట గుర్తును నొక్కండి” అంటూ తన ప్రసంగం ముగించారు.


(Release ID: 1961690) Visitor Counter : 155