ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 సాంస్కృతిక మంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం


‘‘కాశీ జ్ఞానసంపద, విధినిర్వహణ, సత్యానికి ప్రతీక; అది భారత సాంస్కృతిక, ఆధ్యాత్మక రాజధాని’’

‘‘వైవిధ్యభరితమైన సంస్కృతి భారతీయులందరికీ గర్వకారణం. మా సాంస్కృతిక వారసత్వానికి మేం ఎనలేని విలువ ఇస్తాం’’

‘‘యుగే యుగే భారత్’’ జాతీయ మ్యూజియం పూర్తయినట్టయితే 5000 సంవత్సరాల విస్తృతి గత భారతీయ చరిత్ర, సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రపంచంలోని అతి పెద్ద మ్యూజియం అదే అవుతుంది’’

‘‘శాశ్వత వారసత్వానికి భౌతిక విలువ మాత్రమే కాదు, జాతీయ చరిత్ర, గుర్తింపు కూడా ఉంటుంది’’

‘‘ఆర్థిక వృద్ధికి, వైవిధ్యానికి వారసత్వం కీలక ఆస్తి మాత్రమే కాదు, ‘‘వికాస్ భీ, విరాసత్ భీ’’ అనే భారతదేశ మంత్రానికి కూడా బలంగా నిలుస్తుంది’’

‘‘భారతదేశ జాతీయ డిజిటల్ జిల్లా రిపోజిటరీ స్వాతంత్ర్య పోరాట కాలం నాటి కథనాలను కనుగొనేందుకు సహాయకారి అవుతుంది’’

‘‘ఈ కార్యాచరణ బృందం నాలుగు సిలను - కల్చర్ (సంస్కృతి), క్రియేటివిటీ (సృజనాత్మకత), కామర్స్ (వాణిజ్యం), కొలాబొరేషన్ (సహకారం) - ప్రతీక’’

Posted On: 26 AUG 2023 10:01AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్  లోని వారణాసిలో జరిగిన జి-20 సాంస్కృతిక మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియో లింక్  ద్వారా ప్రసంగించారు.

కాశీగా  ప్రసిద్ధి చెందిన వారణాసికి ప్రతినిధులను ఆహ్వానిస్తూ తన పార్లమెంటరీ నియోజకవర్గం కూడా అయిన ఈ నగరంలో జి-20 సాంస్కృతిక మంత్రుల సమావేశం జరగడం పట్ల ఆనందం ప్రకటించారు. పురాతన కాలం నుంచి సజీవంగా ఉన్న నగరాల్లో కాశీ ఒకటని పేర్కొంటూ ఈ నగరానికి సమీపంలోనే ఉన్న సారనాథ్  లో భగవాన్  బుద్ధుడు తన తొలి బోధ చేశాడని గుర్తు చేశారు. ‘‘కాశీ జ్ఞానసంపద, విధినిర్వహణ, సత్యానికి ప్రతీక;  అది అసలు సిసలైన భారత సాంస్కృతిక, ఆధ్యాత్మక రాజధాని’’ అన్నారు. నగరంలో జరిగే గంగా హారతిని వీక్షించాలని, సారనాథ్  సందర్శించడంతో పాటు కాశీలోని రుచికరమైన వంటలు రుచి చూడాలని ప్రధానమంత్రి అతిథులకు  సూచించారు.

వైవిధ్యభరితమైన నేపథ్యాలు, కోణాలన్నింటినీ ఐక్యం చేయగల సామర్థ్యం సంస్కృతికి మాత్రమే ఉన్నదంటూ ఈ దిశగా జి-20 సాంస్కృతిక మంత్రుల గ్రూప్  చేసిన కృషి యావత్  మానవాళి సంక్షేమం దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘వైవిధ్యభరితమైన సంస్కృతి భారతీయులకు గర్వకారణం. విడదీయలేని ఈ సాంస్కృతిక వైభవానికి మేం అత్యధిక విలువ ఇస్తాం’’ అని శ్రీ మోదీ చెబుతూ తాము వారసత్వ వైభవానికి చిహ్నం అయిన ప్రదేశాలను సంరక్షించుకుని పునరుజ్జీవింపచేస్తున్నట్టు వెల్లడించారు. జాతీయ స్థాయిలోను, గ్రామీణ స్థాయిలోను సాంస్కృతిక ఆస్తులు, కళాకారులను మ్యాపింగ్  చేస్తున్నట్టు చెప్పారు. భారత సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పలు కేంద్రాల గురించి ప్రస్తావిస్తూ దేశంలోని విభిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియంలు భారత గిరిజన తెగల సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తాయని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియం గురించి ప్రస్తావిస్తూ అది భారత ప్రజాస్వామ్య వారసత్వాన్ని తెలియచేసే ప్రయత్నమని తెలిపారు. ‘‘యుగే యుగే భారత్’’ పేరిట అభివృద్ధి చేస్తున్న జాతీయ మ్యూజియం 5000 సంవత్సరాల విస్తృతి గల భారత చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం కాగలదని ఆయన చెప్పారు.

సాంస్కృతిక పునరుద్ధరణ ప్రాధాన్యం గురించి ప్రస్తావిస్తూ కార్యాచరణ బృందం ఈ దిశగా తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి ఆహ్వానించారు. సమున్నతమైన ఆ వారసత్వానికి అద్భుతమైన విలువ ఉండడమే కాకుండా అది జాతీయ గుర్తింపు, చరిత్రకు దర్పణమని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘సాంస్కృతిక వారసత్వాన్ని అందుకుని, ఆనందించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నదని శ్రీ మోదీ చెప్పారు. 2014 సంవత్సరం నుంచి భారతదేశం ప్రాచీన నాగరికతకు చిహ్నం అయిన వందలాది కళాఖండాలను తిరిగి దేశానికి తీసుకువచ్చిందన్నారు. సజీవ వారసత్వాన్ని, ‘‘సాంస్కృతిక జీవనాన్ని’’ కాపాడేందుకు ఆ గ్రూప్  చేసిన సేవలను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు.  సాంస్కృతిక వారసత్వం అంటే కేవలం శిలలకే పరిమితం కాదని, కాలానుక్రమణికలో ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతున్న సాంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు అని ప్రధానమంత్రి వివరించారు. ఈ సాంస్కృతిక బృందం చేసిన కృషి సుస్థిర ఆచరణలు, జీవనశైలులను ప్రోత్సహిస్తుందన్న విశ్వాసం ప్రకటించారు.

ఆర్థిక వృద్ధికి, వైవిధ్యానికి వారసత్వం కీలక ఆస్తి అని ప్రధానమంత్రి అన్నారు. ‘‘వికాస్  భీ విరాసత్  భీ’’ అన్న భారతదేశ మంత్రం అర్ధం వారసత్వంతో కూడిన అభివృద్ధి అని చెప్పారు. ‘‘2000 సంవత్సరాల కళా వారసత్వం భారతదేశానికి గర్వకారణమన్నారు. ‘‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’’ పథకం భారతదేశ కళావారసత్వానికి పట్టం కడుతుందని, అదే సమయంలో స్వయం-సమృద్ధిని ప్రోత్సహిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. జి-20 దేశాల ప్రయత్నాలు సంస్కృతిని, సమ్మిళిత వృద్ధిని  ప్రోత్సహించడంలోను;  సృజనాత్మకత, ఇన్నోవేషన్  కు మద్దతు ఇవ్వడంలోను కీలక పాత్ర పోషించగలవని ఆయన నొక్కి చెప్పారు. రాబోయే నెలల్లో భారతదేశం పిఎం విశ్వకర్మ యోజనను 180 కోట్ల డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించబోతున్నదని ప్రధానమంత్రి తెలిపారు. సాంప్రదాయిక కళాకారులకు మద్దతు ఇచ్చి వారి కళల్లో మరింత వికసించేందుకు సహాయకారిగా ఉంటుందని, సమున్నతమైన భారత సంస్కృతికి పట్టం కడుతుందని ప్రధానమంత్రి చెప్పారు.

సాంస్కృతిక వైభవానికి పట్టం కట్టడంతో టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ భారతదేశం చేపట్టిన నేషనల్  డిజిటల్ జిల్లా రిపోజిటరీ స్వాతంత్ర్య పోరాటం నాటి కథనాలను ప్రాచుర్యంలోకి తేవడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. భారతదేశం సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రదేశాలను పరిరక్షించుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తీరు వల్ల అవి పర్యాటక మిత్రంగా కూడా మారుతున్నట్టు చెప్పారు.

జి-20 సాంస్కృతిక మంత్రుల కార్యాచరణ బృందం ‘‘సంస్కృతి అందరినీ ఏకం చేస్తుంది’’ అనే ప్రచారం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే మంత్రానికి మూలమైన వసుధైవ కుటుంబకం స్ఫూర్తిని నిలబెట్టేదిగానే ఉంటుందని ప్రధానమంత్రి తన ప్రసంగం ముగిస్తూ అన్నారు. శాశ్వతమైన ఫలితాలనిచ్చే విధంగా జి-20 కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో మంత్రుల కార్యాచరణ బృందం కృషి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ప్రశంసించారు. ‘‘మీ కృషి నాలుగు సిల - కల్చర్ (సంస్కృతి), క్రియేటివిటీ (సృజనాత్మకత), కామర్స్ (వాణిజ్యం), కొలాబొరేషన్ (సహకారం) -  పరిరక్షణ కీలక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. సామరస్యపూర్వకమైన, సమ్మిళిత, శాంతియుత భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన శక్తిని ఇస్తుంది’’ అంటూ ప్రధానమంత్రి ప్రసంగం ముగించారు.

***



(Release ID: 1952639) Visitor Counter : 95