ప్రధాన మంత్రి కార్యాలయం
జి-20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగం
“భవిష్యత్ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ‘నివారణ.. సన్నద్ధత..
ప్రతిస్పందన’కు మనం సదా సన్నద్ధులమై ఉండాలి”;
“సంపూర్ణ ఆరోగ్యంపై సార్వజనీన ఆకాంక్షకు
అంతర్జాతీయ యోగా దినోత్సవ విజయమే తార్కాణం”;
“ప్రపంచవ్యాప్తంగా 2030కల్లా క్షయ వ్యాధి నిర్మూలనకు గడువు
నిర్దేశించినప్పటికీ భారత్ ఎంతో ముందుగానే లక్ష్యం సాధించనుంది”;
“మన ఆవిష్కరణలను ప్రజా శ్రేయస్సుకు వినియోగిద్దాం.. నిధుల
నకలును నివారిస్తూ సాంకేతిక పరిజ్ఞాన సమాన లభ్యతకు కృషి చేద్దాం”
Posted On:
18 AUG 2023 3:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన జి-20 కూటమి ఆరోగ్య మంత్రుల సమావేశాన్నుద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా భారత ఆరోగ్య సంరక్షణ రంగంలోని 21 లక్షల మంది డాక్టర్లు, 35 లక్షల మంది నర్సులు, 1.3 లక్షల మంది పాక్షికవైద్య నిపుణులు, 16 లక్షల మంది ఫార్మాసిస్టులతోపాటు లక్షలాది ఇతరత్రా సిబ్బంది తరఫున కూటమి దేశాల ప్రతినిధులు, ప్రముఖులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యంపై జాతిపిత దృక్పథాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు గాంధీజీ ఆరోగ్యాన్ని చాలా ముఖ్యమైన అంశంగా భావించారని, దీనిపై ‘కీ టు హెల్త్’ పేరిట పుస్తకం రాశారని ప్రధాని గుర్తుచేశారు. మనోశరీరాల సమతూకమే ఆరోగ్యమని, జీవితానికి పునాది అటువంటి ఆరోగ్యమేనని ఆయన అన్నారు.
ఆరోగ్యం గురించి ఒక సంస్కృత శ్లోకాన్ని ఉటంకిస్తూ- “ఆరోగ్యమే మహాభాగ్యం.. చక్కని ఆరోగ్యంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు” అని ప్రధాని వివరించారు. విధాన నిర్ణయాలు ఆరోగ్య కేంద్రకంగా ఉండాలని కోవిడ్-19 మహమ్మారి మనకు పాఠం నేర్పిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఔషధం, టీకాలను సకాలంలో అందుబాటులోకి తేవడంతోపాటు విదేశాల్లో చిక్కుకుపోయిన భారత పౌరుల తరలింపులో అంతర్జాతీయ సహకారం ఎంత అమూల్యమో కూడా రుజువు చేసిందని ఆయన అన్నారు.
ప్రపంచానికి కోవిడ్-19 టీకాను అందించడంలో భారత ప్రభుత్వం చూపిన మానవతాపూర్వక చొరవను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం కింద దక్షిణార్థ గోళంలోని అనేక దేశాలుసహా 100కుపైగా ఇతర దేశాలకు 300 మిలియన్ల టీకాలను పంపిణీ చేసిందని ప్రధాని గుర్తుచేశారు.
మహమ్మారి సంక్షోభం నుంచి పుంజుకోవడంపై మనం నేర్చుకున్న అతిపెద్ద పాఠమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థలు ఎలాంటి స్థితినైనా ఎదుర్కొనేలా ఉండాలన్నారు. భవిష్యత్ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ‘నివారణ, సన్నద్ధత, ప్రతిస్పందన’కు మనం సదా సన్నద్ధులమై ఉండాలని ఉద్బోధించారు. నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో ఇదెంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏదో ఒక మూల తలెత్తే ఆరోగ్య విపత్తు అత్యంత స్వల్పకాలంలోనే అన్ని దేశాలనూ ఆవరించగలదని మహమ్మారి మనకు ప్రత్యక్షంగా చూపిందన్నారు.
భారత్‌లో పరిస్థితి గురించి ప్రధానమంత్రి వివరిస్తూ- “భారత్‌లో మేమొక సమగ్ర, సార్వజనీన విధానాన్ని అనుసరిస్తున్నాం” అని చెప్పారు. ఇందులో భాగంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నాం. సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహిస్తున్నాం.. అందరికీ సరసమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నాం.. అని ఆయన వివరించారు. సంపూర్ణ ఆరోగ్యంపై సార్వజనీన ఆకాంక్షకు అంతర్జాతీయ యోగా దినోత్సవ విజయమే తార్కాణమని ప్రధాని వ్యాఖ్యానించారు. అలాగే 2023కు అంతర్జాతీయ చిరుధాన్యం సంవత్సరంగా గుర్తింపు లభించిందని, భారతదేశంలో ‘శ్రీ అన్న’గా వ్యవహరించే చిరుధాన్యాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు.
సంపూర్ణ ఆరోగ్యం-శ్రేయస్సు ప్రతి ఒక్కరిలో స్థైర్యాన్ని పెంపొందించగలవని విశ్వసిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈ దిశగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం ఏర్పాటు ఒక ముఖ్యమైన ముందడుగని చెప్పారు. అలాగే జి-20 ఆరోగ్య మంత్రుల సమావేశంతోపాటు సంప్రదాయ వైద్యంపై ‘డబ్ల్యుహెచ్‌ఒ’ అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం ఈ విధాన సామర్థ్యాన్ని మరింతగా వాడుకునే వీలు కల్పిస్తుందన్నారు. ఇందుకు అనుగుణంగా సంప్రదాయ వైద్యవిధాన అంతర్జాతీయ భాండాగారాన్ని రూపొందించేందుకు మనం ఉమ్మడిగా కృషి చేయాల్సి ఉందని చెప్పారు.
ఆరోగ్యం, పర్యావరణం సహజ అనుసంధానితాలని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు, స్వచ్ఛమైన గాలి, సురక్షిత తాగునీరు, తగినంత పోషకాహారం, భ్రదమైన ఆశ్రయం ఆరోగ్యానికి ప్రధాన కారకాలని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో వాతావరణ, ఆరోగ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు చర్యలు చేపట్టడంపై వివిధ దేశాల ప్రముఖులను అభినందించారు. సూక్ష్మజీవ ఔషధ నిరోధకత (ఎఎంఆర్) ముప్పును ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలు కూడా అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రపంచ ప్రజారోగ్యానికి, ఇప్పటిదాకా అన్ని ఔషధాల పురోగతికి ‘ఎంఎఆర్’ తీవ్ర ముప్పుగా పరిణమించిందని ప్రధానమంత్రి అన్నారు. జి-20 ఆరోగ్య కార్యాచరణ బృందం ‘సార్వత్రిక ఆరోగ్యం’ (ఒన్ హెల్త్)కు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం సంబంధిత ప్రకృతి పర్యావరణ వ్యవస్థ హితం దిశగా “ఒకే భూమి-ఒకే ఆరోగ్యం” దృక్కోణంతో తాము ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. ఏ ఒక్కరూ వెనుకబడరాదన్న గాంధీజీ ప్రబోధానికి ఈ సమగ్ర దృక్పథం అనుగుణమైనదని ఆయన అన్నారు.
ఆరోగ్య కార్యక్రమాల విజయానికి ముఖ్య కారణం ప్రజా భాగస్వామ్యమేనని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. భారత్ చేపట్టిన కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదపడిన ముఖ్య కారకం ఇదేనన్నారు. క్షయవ్యాధి నిర్మూలనపై తాము అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజా భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ‘ని-క్షయ్ మిత్ర’ లేదా టీబీ నిర్మూలన బృందం’ కింద దాదాపు 10 లక్షల మంది క్షయవ్యాధి పీడితులను పౌరులు దత్తత తీసుకునేలా పిలుపునిచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో “ప్రపంచవ్యాప్తంగా 2030కల్లా క్షయ వ్యాధి నిర్మూలనకు గడువు నిర్దేశించుకున్నప్పటికీ భారత్ ఎంతో ముందుగానే ఈ లక్ష్యాన్ని సాధించనుంది” అని ప్రధానమంత్రి ఆత్మవిశ్వాసం ప్రకటించారు.
అందరికీ ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం కల్పించడంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల పాత్రను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాల్లోని అనారోగ్య పీడితులకు దూర-వైద్యం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ లభించేలా కృషి ప్రారంభించామన్నారు. ఈ దిశగా ప్రభుత్వ ప్రయత్నాల్లో అందరినీ భాగస్వాములను చేసేలా ఈ పరిష్కారాలు ప్రయోజనకర ఉపకరణాలు కాగలవని తెలిపారు. ఈ మేరకు భారత జాతీయ ఆరోగ్య వేదిక ‘ఇ-సంజీవని’ ఇప్పటిదాకా 140 మిలియన్ల దూర-వైద్య సంప్రదింపు సేవలు అందించిందంటూ ఆయన ప్రశంసించారు.
భారత అమలు చేసిన ‘కో-విన్’ వేదిక మానవాళి చరిత్రలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని ప్రధానమంత్రి అన్నారు. దీనికింద 2.2 కోట్లకుపైగా టీకా డోసులు ఇవ్వబడ్డాయని, దీంతోపాటు ప్రపంచవ్యాప్త గుర్తింపుగల టీకాల ధ్రువీకరణ కూడా నిర్వహించబడిందని తెలిపారు. డిజిటల్ ఆరోగ్యంపై అంతర్జాతీయ చర్యలు వివిధ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలను ఉమ్మడి వేదికపైకి తెస్తాయన్నారు. ఇటువంటి పరిస్థితుల నడుమ “మన ఆవిష్కరణలను ప్రజా శ్రేయస్సుకు వినియోగిద్దాం.. నిధుల నకలును నివారిస్తూ సాంకేతిక పరిజ్ఞాన సమాన లభ్యతకు కృషి చేద్దాం” అని ప్రధానమంత్రి అంతర్జాతీయ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ చొరవతో దక్షిణార్థ గోళ దేశాల ఆరోగ్య సంరక్షణ సేవలలో అంతరం భర్తీకాగలదని, సార్వత్రిక ఆరోగ్యం సంరక్షణ దిశగా తమ లక్ష్యసాధనలో అడుగు ముందుకు వేయగలమని ఆయన స్పష్టం చేశారు.
చివరగా మానవాళి ఆరోగ్యం-శ్రేయస్సును కాంక్షించే “అందరూ సంతోషంగా ఉండాలి... అందరూ అనారోగ్యం నుంచి విముక్తులు కావాలి” అని చాటే భారత ప్రాచీన శ్లోకాన్ని ప్రధాని ఉటంకించారు. ఈ సమావేశంలో భాగంగా ప్రతినిధుల మధ్య చర్చలు ఫలప్రదం కావాలని శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రసంగం ముగించారు.
*****
(Release ID: 1950381)
Visitor Counter : 157
Read this release in:
Odia
,
Kannada
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam