ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్యప్రదేశ్‌ లోని ష‌హ‌దోల్ లో జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ ను ప్రారంభించిన - ప్రధానమంత్రి


లబ్ధిదారులకు సికిల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డుల - పంపిణీ


మధ్యప్రదేశ్‌ లో దాదాపు 3.57 కోట్ల ఏ.బి-పి.ఎం.జే.ఏ.వై. కార్డుల పంపిణీ - ప్రారంభం


జాతీయ స్థాయిలో నిర్వహించనున్న - రాణి దుర్గావతి 500వ జయంతి


"అమృత్ కాల్ కీలక లక్ష్యం కానున్న - సికిల్ సెల్ అనీమియా నిర్మూలన ప్రచారం"


"ఆదివాసీ సమాజం మాకు కేవలం ఎన్నికల సంఖ్య మాత్రమే కాదు, గొప్ప సున్నితత్వం, భావోద్వేగానికి సంబంధించిన అంశం"


"నియత్ మే ఖోత్ ఔర్ గరీబ్ పర్ చోట్' (దుష్ట ఉద్దేశాలు, పేదలను బాధించే ధోరణి) తో ఇస్తున్న తప్పుడు హామీల పట్ల ప్రజలు జాగ్రత్త వహించండి"

Posted On: 01 JUL 2023 5:31PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మధ్యప్రదేశ్‌ లోని ష‌హ‌దోల్ లో జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్‌ ను ప్రారంభించారు.  లబ్ధిదారులకు సికిల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డులను పంపిణీ చేశారు.  మధ్యప్రదేశ్‌ లో దాదాపు 3.57 కోట్ల ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏ.బి-పి.ఎం.జే.ఏ.వై) కార్డుల పంపిణీని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.  16వ శతాబ్దం మధ్యలో గోండ్వానా ను పరిపాలించిన రాణి దుర్గావతిని ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో ప్రశంసించారు.

 

 

రాణి దుర్గావ‌తికి నివాళులు అర్పించిన అనంతరం స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధానమంత్రి మాట్లాడుతూ, ఆమె స్ఫూర్తితోనే ఈరోజు జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్ములన మిషన్‌ ను ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.  మధ్యప్రదేశ్ ప్రజలకు కోటి ఆయుష్మాన్ కార్డులు అందజేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.  రెండు ప్రధాన ప్రయత్నాల వల్ల అత్యధికంగా లబ్ధి పొందేది గోండు, భిల్ తో పాటు ఇతర ఆదివాసీ సమాజాల ప్రజలేనని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  మధ్యప్రదేశ్ ప్రజలతో పాటు, డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

 

 

ఆదివాసీ స‌ముదాయాల‌కు చెందిన ప్ర‌జ‌ల జీవితాల‌కు భ‌ద్ర‌త కల్పించి,  సికిల్ సెల్ ఎనీమియా నుండి విముక్తి తో పాటు ఈ వ్యాధి బారిన పడిన 2.5 లక్షల మంది పిల్లలు, కుటుంబాల జీవితాలను రక్షించాలని, ష‌హ‌దోల్ నుండి దేశం ఈరోజు ఒక పెద్ద ప్ర‌తిజ్ఞ‌ తీసుకుంటోంద‌ని ప్ర‌ధానమంత్రి పేర్కొన్నారు.  గిరిజన సమాజంతో తన వ్యక్తిగత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, సికిల్ సెల్ ఎనీమియా బాధాకర లక్షణాలు, జన్యుపరమైన మూలాల గురించి ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

 

 

ప్రపంచంలో 50 శాతానికి పైగా సికిల్ సెల్ ఎనీమియా కేసులు భారతదేశంలోనే తలెత్తుతున్నప్పటికీ, గత 70 ఏళ్లుగా సికిల్ సెల్ ఎనీమియా సమస్య పట్ల ఎవరూ శ్రద్ధ చూపలేదని, ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.  ఆదివాసీ వర్గాల పట్ల గత ప్రభుత్వాల ఉదాసీనతను ఎత్తిచూపిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వమే దీనికి పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు.  ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి, ఆదివాసీ స‌ముదాయం అనేది ఒక ఎన్నిక‌ల సంఖ్య మాత్రమే కాదని, ఎంతో సున్నిత‌త్వం, భావోద్వేగానికి సంబంధించిన అంశ‌మని ప్ర‌ధానమంత్రి పేర్కొన్నారు.  తాను గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాననీ, అప్పుడు తనతో పాటు, ప్రస్తుత మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ సి పటేల్ ఆదివాసీ వర్గాలను సందర్శించి సికిల్ సెల్ ఎనీమియా గురించి అవగాహన కల్పించామని, ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.   తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే, రాష్ట్రంలో వివిధ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.  భారత ప్రధానమంత్రి హోదాలో జపాన్ పర్యటనలో ఉన్న సమయంలో నోబెల్ బహుమతి పొందిన ఒక శాస్త్రవేత్త నుండి సహాయం కోరిన విషయాన్ని గురించి కూడా ఆయన వివరించారు. 

 

 

సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కోసం చేపట్టిన ఈ ప్రచారం అమృత్ కాల్ సమయంలో ఒక కీలక మిషన్ అవుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.   సికిల్ సెల్ అనీమియా అనే ముప్పు నుంచి గిరిజన సమాజాన్ని, దేశాన్ని 2047 నాటికి విముక్తం చేయాలని ఆయన సంకల్పించారు.  ఇందుకోసం, ప్రభుత్వం, ఆరోగ్య సిబ్బంది, గిరిజనులు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.  రోగుల కోసం రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ను మెరుగుపరుస్తున్నామని, సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగు ను పునరుద్ధరిస్తున్నామని, ఆయన తెలియజేశారు.  స్క్రీనింగ్‌ చేయించుకోడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని ఆయన కోరారు.

 

 

వ్యాధి కుటుంబాన్ని కష్టాల వలయంలోకి నెట్టివేయడంతో, వ్యాధి మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.   తన సొంత పేదరిక నేపథ్యాన్నిప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఈ బాధ ప్రభుత్వానికి తెలుసునని, రోగులకు సహాయం చేయడంలో సున్నితంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు.   ఇటువంటి ప్రయత్నాలే టి.బి. కేసులను తగ్గించాయనీ, దేశంలో 2025 నాటికి టి.బి. ని పూర్తిగా తొలగించడానికి కృషి కొనసాగుతోందని, ఆయన చెప్పారు.   వివిధ వ్యాధుల వివరాలను తెలియజేస్తూ, 2013లో కాలా అజర్ కేసులు 11,000 ఉన్నాయని, ఇప్పుడు వాటిని వెయ్యి కంటే తక్కువకు తగ్గించామని ప్రధానమంత్రి చెప్పారు.  2013 లో 10 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా, ఇప్పుడు 2022లో వాటి సంఖ్య 2 లక్షలకు తగ్గింది. అదేవిధంగా, కుష్టువ్యాధి కేసులు 1.25 లక్షల నుంచి 70-75 వేలకు తగ్గాయని, ఆయన తెలియజేశారు. 

 

 

వైద్య ఖర్చుల కారణంగా ప్రజలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొంటూ, "ప్రస్తుత ప్రభుత్వం అనారోగ్యాలను తగ్గించడంతో పాటు, ఏదైనా వ్యాధి చికిత్సకయ్యే ఖర్చులను తగ్గించడానికి కూడా కృషి చేస్తోంది", అని వ్యాఖ్యానించారు.  ఈ రోజు కోటి మంది లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను అందజేశామని, ఇది ఆసుపత్రికి వెళ్లాల్సిన పేదలకు ఐదు లక్షల రూపాయల విలువైన ఎ.టి.ఎం. కార్డుగా పని చేస్తుందని ఆయన తెలియజేశారు.  “భారతదేశంలో ఎక్కడైనా, మీరు ఈ కార్డు చూపించి, ఐదు లక్షల రూపాయల వరకు విలువైన చికిత్సను ఉచితంగా పొందవచ్చు” అని శ్రీ మోదీ నొక్కి చెప్పారు.

 

 

దేశవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మంది రోగులు ఆయుష్మాన్ పథకం కింద ఉచిత చికిత్స పొందారని, దీని వల్ల లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రజల వైద్య చికిత్స ఖర్చులు ఆదా అయినట్లేనని, ప్రధానమంత్రి తెలియజేశారు.  ఈ ఆయుష్మాన్ కార్డ్ పేదల అతిపెద్ద ఆందోళనను తొలగిస్తుంది.  ఈవిధంగా ఐదు లక్షల రూపాయల హామీని గతంలో ఎవరూ ఇవ్వలేదు, ఇది ఈ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం, ఈ హామీని ఇచ్చింది” అని ప్రధానమంత్రి అన్నారు.

 

 

తప్పుడు హామీలు ఇస్తున్న వారి గురించి అప్రమత్తంగా ఉండాలని, వారి లోపాలను గుర్తించాలని, ప్రధానమంత్రి ప్రజలను హెచ్చరించారు.  ఉచిత విద్యుత్తు హామీ గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో విద్యుత్ చార్జీల పెరుగుదలను ఇది సూచిస్తోందని పేర్కొన్నారు.  అదేవిధంగా, ఏదైనా ఒక ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తోందంటే, భవిష్యత్తులో ఆ రాష్ట్ర రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం కానునుందని అర్ధం చేసుకోవాలనీ, అధిక పింఛన్ల కోసం వాగ్దానాలు చేస్తే, ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతాయనడానికి అది ఒక స్పష్టమైన సూచనగా భావించాలనీ, ప్రధానమంత్రి హెచ్చరించారు.   చౌక ధరల్లో పెట్రోల్ సరఫరా గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఇది ప్రజలకు మరింత పన్ను భారం పెంచడానికేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.  ఉపాధి హామీపై కొత్తగా ప్రవేశపెట్టిన విధానాలు ఆయా రాష్ట్రాల్లోని పరిశ్రమలను నాశనం చేయడం ఖాయమని, ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.  విపక్షాలపై ప్రధానమంత్రి తీవ్రస్థాయిలో స్పందిస్తూ, “కొన్ని రాజకీయ పార్టీల అర్థం ‘నియత్ మే ఖోత్ ఔర్ గరీబ్ పర్ చోట్’ అంటే, దుష్ట ఉద్దేశాలు మరియు పేదలను దెబ్బతీసే ధోరణి,  గత 70 ఏళ్లలో, గత ప్రభుత్వాలు పేదలకు ఆహారం పెట్టలేకపోయాయి, కానీ ప్రస్తుత ప్రభుత్వం గరీబ్-కళ్యాణ్-యోజన ద్వారా 80 కోట్ల కుటుంబాలకు ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తోంది." అని వివరించారు.  ఆయుష్మాన్ యోజన ద్వారా 50 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్య భద్రత, ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల మంది మహిళా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ముద్రా యోజన ద్వారా 8.5 కోట్ల మంది లబ్ధిదారులకు రుణాలు అందించడం వంటి వివిధ పధకాల గురించి కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. 

 

 

గతంలో ఉన్న గిరిజన వ్యతిరేక విధానాల గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు. బాష విషయంలో గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్నసవాళ్ళను కొత్త జాతీయ విద్యా విధానం పరిష్కరించిందని ప్రధానమంత్రి చెప్పారు.  తప్పుడు హామీలు ఇచ్చిన వ్యక్తులు ఎన్‌.ఈ.పీ. ని వ్యతిరేకించడం శోచనీయని ఆయన విమర్శించారు.  గిరిజన పిల్లలకు రెసిడెన్షియల్ సౌకర్యాలతో విద్యను అందిస్తున్న 400 కంటే ఎక్కువ కొత్త ఏకలవ్య పాఠశాలల గురించి ఆయన తెలియజేశారు. ఒక్క మధ్యప్రదేశ్‌ లోనే 24,000 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు.

 

 

ఇంతకుముందు నిర్లక్ష్యానికి భిన్నంగా, ప్రస్తుత ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ ను మూడు రెట్లు పెంచడం ద్వారా గిరిజన సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధానమంత్రి అన్నారు.  అటవీ హక్కుల చట్టం కింద 20 లక్షల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది.  శ్రీ మోదీ తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ, మునుపటి దోపిడీకి భిన్నంగా, ఆది మహోత్సవ్ వంటి కార్యక్రమాల ద్వారా గిరిజన సంఘాలకు వారి హక్కులు, వారి సంప్రదాయాలు గౌరవించబడ్డాయని పేర్కొన్నారు. 

 

 

గిరిజనుల వారసత్వాన్ని గౌరవిస్తూ, గత 9 ఏళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రధానమంత్రి వివరించారు.   భగవాన్ బిర్సా ముండా జన్మదినమైన నవంబర్, 15వ తేదీని జనజాతీయ గౌరవ్ దివాస్‌ గా ప్రకటించడం, వివిధ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల కోసం మ్యూజియంలను అంకితం చేయడం వంటి చర్యలను ఆయన ఉదహరించారు.  భారత రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళ ఎన్నికపై అనేక రాజకీయ పార్టీల వైఖరిని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.  స్థానిక ఉదాహరణలను ప్రస్తావిస్తూ, ఆదివాసీ ప్రాంతాలలో కూడా సంస్థలకు ఒకే కుటుంబం పేరు పెట్టే పద్ధతిని ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఛిన్ద్వారా విశ్వవిద్యాలయానికి గొప్ప గోండు విప్లవకారుడు రాజా శంకర్ షా పేరు పెట్టడం, పాతాళపాణి స్టేషన్‌ కు తాంత్యా మామా పేరు పెట్టడం వంటి చర్యలను కూడా ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.  శ్రీ దల్వీర్ సింగ్ వంటి గోండు నాయకుల పట్ల గతంలో నెలకొన్న నిర్లక్ష్యం, అగౌరవాన్ని ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దిందని కూడా ఆయన పేర్కొన్నారు.

 

 

రాణి దుర్గావతి 500వ జయంతిని భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహిస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.  ఆమె జీవితంపై ఒక చలన చిత్రాన్ని రూపొందించడంతో పాటు, ఒక స్మారక నాణెం, ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తారు.

 

 

ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగిస్తూ, ఈ ప్రయత్నాలను మరింత కొనసాగించేందుకు ప్రజల సహకారం, ఆశీర్వాదం కావాలని కోరారు.  రాణి దుర్గావతి ఆశీస్సులు, స్ఫూర్తితో మధ్యప్రదేశ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించి, అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేయగలదని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

 

 

మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ సి. పటేల్,  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్,  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర సహాయ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 

 

నేపథ్యం

 

 

సికిల్ సెల్ వ్యాధి, ముఖ్యంగా గిరిజన జనాభాలో ఎదురవుతున్న ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం ఈ మిషన్ లక్ష్యం.  ప్రజారోగ్య సమస్యగా ఉన్న ఈ సికిల్ సెల్ వ్యాధిని 2047 నాటికి పూర్తిగా తొలగించాలానే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రయోగం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది.  జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్-2023 కేంద్ర వార్షిక బడ్జెట్‌ లో ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, ఉత్తరాఖండ్ వంటి 17 హై ఫోకస్ రాష్ట్రాల్లోని 278 జిల్లాల్లో ఈ పథకం అమలౌతోంది. 

 

 

మధ్యప్రదేశ్‌ లో దాదాపు 3.57 కోట్ల ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏ.బి-పి.ఎం.జే.ఏ.వై) కార్డుల పంపిణీని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.  కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణ సంస్థలు, గ్రామ పంచాయతీలు, డెవలప్‌మెంట్ బ్లాకుల్లో నిర్వహిస్తున్నారు.  ఈ సంక్షేమ పథకాలను ప్రతి లబ్దిదారునికి వంద శాతం చేరువ చేయాలనే ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసే దిశగా ఆయుష్మాన్ కార్డు పంపిణీ ప్రచారం ముందుకు సాగుతోంది.

 

 

ఈ కార్యక్రమంలో, 16వ శతాబ్దం మధ్యలో గోండ్వానా ను పరిపాలించిన రాణి దుర్గావతిని ప్రధానమంత్రి ప్రశంసించారు.  ఆమె మొఘల్‌ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసంనిర్భయంగా పోరాడిన  యోధురాలని పేర్కొన్నారు. 

 

 

*****



(Release ID: 1936918) Visitor Counter : 204