ప్రధాన మంత్రి కార్యాలయం
ఐదు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
Posted On:
27 JUN 2023 10:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లో ఐదు వందేభారత్ ఎక్స్’ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలోని భోపాల్‌లో రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి భోపాల్-ఇండోర్; భోపాల్-జబల్పూర్ మార్గాలతోపాటు రాంచీ-పట్నా; ధార్వాడ్-బెంగళూరు; గోవా (మడ్గావ్)-ముంబై మార్గాల్లో మరో మూడు వందేభారత్ ఎక్స్’ప్రెస్‌లను ఆయన సాగనంపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాణి కమలాపతి స్టేషన్‌లో భోపాల-ఇండోర్ వందేభారత్ రైలులో తొలి బోగీని ప్రధాని పరిశీలించారు. అలాగే ఆ పెట్టలోని పిల్లలతోపాటు రైలు చోదక సిబ్బందితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.
ఈ అనుభవాన్ని ప్రజలతో పంచుకుంటూ ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“భోపాల్ నగరంలో ఇవాళ ఒకే రోజున ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించడం నాకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నాను. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల సత్వరాభివృద్ధి, అనుసంధానం కల్పనపై ప్రగతి దిశగా మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ప్రారంభోత్సవం ఒక నిదర్శనం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
భోపాల్-ఇండోర్ వందే భారత్ రైలులో ప్రయాణించిన ఇండోర్ ఎంపీ శ్రీ శంకర్ లాల్వానీ ట్వీట్‌కు స్పందనగా మధ్యప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఉజ్జయిని వెళ్లే యాత్రికులకు ఈ రైలు చక్కని ప్రయాణానుభవం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ-
“ఇండోర్-భోపాల్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభంపై మధ్యప్రదేశ్ ప్రజలకు అనేకానేక అభినందనలు. ఇది వారికి సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం ఇస్తుంది. ముఖ్యంగా పవిత్ర ఉజ్జయిని నగరానికి వెళ్లే యాత్రికులకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది” అని ప్రధాని పేర్కొన్నారు.
అదేవిధంగా భోపాల్-జబల్పూర్ వందే భారత్ రైలు ప్రారంభంపై జబల్పూర్ ఎంపీ శ్రీ రాకేష్ సింగ్ ట్వీట్‌కు స్పందిస్తూ- రాష్ట్ర రాజధాని భోపాల్, సాంస్కృతిక రాజధాని జబల్‌పూర్ నగరాల మధ్య అనుసంధానాన్ని ఈ రైలు మెరుగుపరుస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు. అంతేకాకుండా యాత్రికులకు ప్రయాణ సౌలభ్యం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ మేరకు పంపిన సందేశంలో:
“వందే భారత్ రైళ్లు మన దేశానికి గర్వకారణం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సాంస్కృతిక రాజధాని జబల్‌పూర్-రాష్ట్ర రాజధాని భోపాల్ మధ్య నడిచే ఈ రైలు ఒకవైపు అనుసంధానాన్ని పెంచుతూ మరోవైపు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాల సత్వర అభివృద్ధికి దోహదం చేస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు.
ఇక రాంచీ-పట్నా నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభంపై రాంచీ ఎంపీ శ్రీ సంజయ్ సేఠ్ ట్వీట్‌కు స్పందనగా- ఖనిజ సమృద్ధ జార్ఖండ్‌తోపాటు బీహార్ రాష్ట్ర సౌభాగ్యానికి ఈ రైలు ఎంతగానో తోడ్పడుతుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“రాంచీ-పట్నా మధ్య నడిచే వందే భారత్ రైలు ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కల్పించడమేగాక ఖనిజ సమృద్ధ రాష్ట్రం జార్ఖండ్ సహా బీహార్ రాష్ట్ర ఆర్థిక పురోగమనానికి దోహదం చేస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు.
అదేవిధంగా గోవా (మడ్గావ్)-ముంబై వందే భారత్ రైలు ప్రారంభంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ట్వీట్‌కు స్పందనగా ట్వీట్ చేస్తూ- “పర్యాటకులు మరింత పెద్ద సంఖ్యలో గోవా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఈ వందే భారత్ రైలు తనవంతు పాత్ర పోషిస్తుంది. అంతేగాక కొంకణ్ తీర ప్రాంత అనుసంధానానికి తోడ్పడుతుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
కాగా, ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ రైలు ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్‌చంద్ గెహ్లాత్ ఈ రైలులో ప్రయాణించారు. దీనిపై తమ అనుభవాన్ని వివరిస్తూ శ్రీ జోషి చేసిన ట్వీట్‌కు ప్రధానమంత్రి స్పందిస్తూ-
“ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ రైలు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అనుసంధానం పెంచుతుంది. రాష్ట్రంలో వాణిజ్య-పర్యాటక రంగాల పురోగమనానికీ ఇది ఎంతగానో తోడ్పడుతుంది” అని పేర్కొన్నారు.
*****
(Release ID: 1935813)
Visitor Counter : 131
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam