సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

9 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంపై జరిగిన జాతీయ సదస్సులో ‘దూసుకు పోతున్న భారతదేశం’ మీద విస్తృత చర్చ

వ్యాపారానికి నిర్ణయాత్మక నాయకత్వం కావాలి ; చాలా కాలం తరువాత మనకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనే పట్టుదల ఉన్న నాయకుడు దొరికారు: శ్రీ సునీల్ భారతీ మిట్టల్

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ యాజమాన్య ప్రతిభ కారణంగానే భారతదేశం కోవిడ్ సంక్షోభాన్ని పరిష్కరించగలిగింది: శ్రీమతి సంగీతారెడ్డి

అసాధ్యమని అనుకున్న దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా సాధించి చూపింది; ఇదే ఈ ప్రభుత్వ పనితీరుకు నిజమైన సూచిక: శ్రీ సుర్జిత్ భల్లా

జె ఎ ఎం త్రయం కార్యక్రమం మన బాంకింగ్ ను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లగలిగాం: శ్రీమతి దేవయాని ఘోష్

Posted On: 27 MAY 2023 6:26PM by PIB Hyderabad

కేడరం ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఒక జాతీయ సదస్సు నిర్వహించింది. “9 ఏళ్ల సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్” అనే అంశం మీద న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్  భవన్  లో ఈ సదస్సు ఏర్పాటైంది. సదస్సులో భాగంగా మూడు అంశాల మీద సమావేశాలు జరిగాయి. ప్రధాని  శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వంలో దేశం సాధించిన అనేక విజయాలను, ప్రజల అభ్యున్నతికి దేశం చేపడుతున్న వేగవంతమైన కార్యక్రమాలను కూడా వక్తలు ఈ సందర్భంగా  నిపుణులు చర్చించారు. ‘ముందుకు దూసుకు పోతున్న భారతదేశం’ అనే అంశం మీద మొదటి సమావేశం జరిగింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎంతగా మార్పు చెందిందో, ఎలా అంతర్జాతీయ నాయకత్వ స్థానానికి ఎదిగిందో ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశానికి సుప్రసిద్ధ జర్నలిస్ట్ శ్రీ నితిన్ గోఖలే సమన్వయ కర్తగా వ్యవహరించారు. భారతీ ఎంటర్ ప్రైజెస్ వ్యవస్థాపక ఛైర్మన్   శ్రీ సునీల్ భారతీ మిట్టల్, అపోలో ఆస్పత్రుల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సంగీతారెడ్డి, నాస్కామ్ అధ్యక్షురాలు శ్రీమతి దేవయాని ఘోష్, ఐఎం ఎఫ్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సుర్జిత్ భల్లా, స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు శ్రీ సౌమ్య కాంతి ఘోష్, ఇండియన్ విమెన్ ఇన్స్టిట్యూషనల్  లీగ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి దీపా సాయల్ సహా   వివిధ రంగాల ప్రముఖులు వక్తలుగా పాల్గొన్నారు.

ఈ సమావేశ నేపథ్యాన్ని వివరిస్తూ, దశాబ్దాల తరబడి కానరాని మార్పు దిశగా భారతదేశం  తన యాత్ర చేపట్టిందని ఆ విధంగా భారతదేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా పెరిగిందని శ్రీ గోఖలే అన్నారు. ఇది భారతదేశ దశాబ్దం కాబోతున్నదని 2022 నవంబర్ లొ మోర్గాన్ స్టాన్లీ చేసిన వ్యాఖ్యను ఆయన గుర్తు చేశారు. భారత దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని 2023 ఏప్రిల్ లో ఐ ఎం  ఎఫ్ చెప్పిందన్నారు. ప్రపంచంలో సమతుల్యత సాధించటానికి భారత దేశం కృషి చేస్తున్న సమయంలో ఈ సదస్సు జరగటం సహేతుకమన్నారు.

ప్రధాని శ్రీ  నరేంద్ర మోదీ సారధ్యంలో సుపరిపాలన దశాబ్దం నడుస్తోందని  శ్రీ సునీల్ భారతి మిట్టల్ వ్యాఖ్యానించారు. ఈ తేడాని మనం గడిచిన కొద్ది సంవత్సరాలలో అనుభూతి చెందామన్నారు. వ్యాపారానికి ఎప్పుడూ నిర్ణయాత్మకమైన నాయకత్వం అవసరమని, చాలా కాలం తరువాత మనకు ఇలాంటి అంతర్జాతీయ నాయకుడు దొరికారని  అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న తపనతో ఉన్న నాయకుడని ప్రధానిని అభినందించారు. టెలికాం రంగం గురించి మాట్లాడుతూ, భారతదేశంలో 5 జి చాలా వేగంగా దూసుకుపోతున్నదని, 2024 మార్చి నాటికి దేశంలోని మారుమూల ప్రాంతాలలో సైతం 5 జి సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ప్రభుత్వం ఈ శక్తిమంతమైన టెక్నాలజీని వాడుకుంటూ దేశ ప్రజాబాహుళ్యానికి ఫలితాలు అందించే సంస్కరణాలకు శ్రీకారం చుట్టటం గొప్ప విషయంగా అభివర్ణించారు. అద్భుతమైన 9 ఏళ్ల పాలన చూశామని, 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్నామని అన్నారు. కొద్ది సంవత్సరాల కిందట కనీసం  ఊహకు కూడా అందని ఈ లక్ష్యాన్ని 2027 నాటికి చేరుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  

అపోలో ఆస్పత్రుల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సంగీతా రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి భారతదేశం ఎంత విస్తృతమైన, సమర్థవంతమైన ప్రణాళిక రచించిందో గుర్తు చేసుకున్నారు. ఎన్నో దేశాలను తుడిచి పెట్టిన కరోనా సంక్షోభాన్ని పరిష్కరించటానికి సరైన ప్రణాళిక అనుసరించటంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ యాజమాన్య ప్రతిభ కనబడిందన్నారు. లాక్ డౌన్ విధించటం ద్వారా ఒక వైపు వ్యాధిని కట్టడి చేస్తూ, మరోవైపు సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుకోవటానికి జరిగిన కృషిని ఆమె కొనియాడారు. కోవిడ్  టీకాల గురించి మాట్లాడుతూ, అద్భుతమైన ప్రణాళికతో ఇది విజయవంతమైందని, ప్రధాని అంతర్జాతీయ ఆలోచనావిధానానికి ఇది అద్దం పట్టిందని అన్నారు. ప్రపంచపు టీకాలలో 50% భారతదేశంలో ఉత్పత్తి అయ్యాయని గుర్తు చేశారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో  టీకా దౌత్యానికి ఇది ఉపయోగపడిందన్నారు. ప్రభుత్వం అనుసరించిన వైఖరి, అద్భుతమైన సమన్వయం, ఆలోచనతో  కూడిన వ్యూహం, శక్తిమంతమైన ఆచరణ దీన్ని విజయవంతం చేశాయన్నారు. భారతదేశం తన ప్రజల బాగోగులు చూసుకోవటంతోబాటు  వైద్య పర్యాటకంలో కూడా ప్రపంచానికి గమ్య స్థానంగా మారుతోందన్నారు. ఈ విషయంలో ప్రస్తుతం 4 వ స్థానంలో ఉండగా, త్వరలోనే 2 వ స్థానానికి చేరగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువత యోగ, ఆయుష్  ను ఉపయోగించుకుంటూ  ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, భారతదేశానికి అద్భుతమైన భవిష్యత్ ఉండగా అది యువత చేతుల్లోనే ఉందని అన్నారు,

ఐఎంఎఫ్ ఇండియా పూర్వ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సుర్జిత్ భల్లా మాట్లాడుతూ, దిగ్భ్రాంతికరమైన కోవిడ్  సంక్షోభ సమయంలోనూ భారతదేశం ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థగా పేరు సంపాదించుకున్నదని  గుర్తు చేశారు.నేటికీ అదే స్థాయిలో ముందడుగు వేస్తున్నదన్నారు.  పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతూ, దేశంలో దిగువ సగం జనాభా కోవిడ్ కారణంగా సమస్యలు ఎదుర్కోకుండా చూడటానికి  యావత్ ప్రభుత్వ ప్రక్రియ సిద్ధమైందన్నారు. మౌలిక వసతుల కల్పనలో వచ్చిన పరివర్తన గురించి ఆయన మాట్లాడారు. గడిచిన 9 సంవత్సరాలలో మరేదైనా ఆర్థిక వ్యవస్థ ఈ తరహా పరివర్తన చెందిందో లేదో అధ్యయనం చేస్తున్నట్టు ప్రకటించారు. అసాధ్యమైనదాన్ని ఊహించి సమర్థవంతంగా అమలు చేసి చూపగలిగిందంటూ ప్రభుత్వాన్ని అభినందించారు. ఇదే ప్రభుత్వపు అసలైన పనితీరు సూచిగా అభివర్ణించారు.

నాస్కామ్ అధ్యక్షురాలు శ్రీమతి దేవయాని ఘోష్ మాట్లాడుతూ, 2008 లో 17% భారతీయులకు మాత్రమే బాంకు ఖాతాలు ఉండగా అదే లెక్కన చూస్తే 80% కు చేరుకోవటానికి 46 ఏళ్ళు పడుతుందని అంచనా వేశారని, అయితే భారతదేశం కేవలం 7 ఏళ్లలో దానిని సాధించిందని చెప్పారు. ఆలా చేయగలగటానికి టెక్నాలజీ, ఆధార్, డిజిటల్ చెల్లింపులు  ప్రధాన కారణాలుగా చెప్పారు.  వీటితోబాటు ఆర్థిక సమ్మిళితికి దారితీసిన జన్ ధన్ యోజనను ఆమె ప్రస్తావించారు. జెఎఎం త్రయం బాంకింగ్ ను  క్షేత్ర స్థాయికి తీసుకువెళ్ళిందన్నారు. టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ భారత ప్రజలు మార్పుకు సిద్ధం కావటం ఈ విజయానికి కారణమన్నారు. టెక్నాలజీ పరిశ్రమ సృష్టించే 245 బిలియన్ డాలర్ ఆదాయం కారణంగా మన ఎదుగుదల వేగానికి ప్రతిభ తోడై. నవకల్పనలతో భారతదేశం ఒక నవకల్పనల, అంకుర సంస్థల  కేంద్రంగా మారిందన్నారు. టెక్నాలజీ రంగంలో పనిచేసే 53 లక్షల మందిలో 36% మంది మహిళలేనని, వారే మార్పును, నవకల్పనలను ముందుకు నడిపిస్తున్నారని అన్నారు.

 ఇండియన్ విమెన్ ఇన్ స్టిట్యూషనల్ లీగ్ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు అయిన శ్రీమతి దీపా సాయల్ మాట్లాడుతూ, దేశం అత్యంత వేగంగా, పెద్ద స్థాయిలో మార్పు చెందటం చూసి గర్వపడుతున్నానన్నారు.  “మన జీడీపీ రెట్టింపై ఈ దశాబ్దం చివరికల్లా 7.5 ట్రిలియన్  డాలర్లకు చేరుకుంటుందని మోర్గాన్ స్టాన్లీ చెప్పింది. ఇది చాలా పెద్ద విషయం” అన్నారు అనేక రాష్ట్రాలు తిరుగుతూ అక్కడి అంకుర సంస్థలతో  అనుసంధానం కావటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మహిళలు  ఉత్సాహంగా స్వయం ఉపాధికి మొగ్గు చూపటం  పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారు. 2016 లో 450 మాత్రమే ఉన్న అంకుర సంస్థలు 2023 నాటికి 90 ,000 కు చేరినందుకి ప్రధాని మోదీని అభినందించాల్సిందేనన్నారు.

భారతీయ స్టేట్ బాంక్ గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు శ్రీ సౌమ్యకాంతి ఘోష్ మాట్లాడుతూ, మానవాళిని అడ్డుకున్న అతిపెద్ద సంక్షోభమైన కోవిడ్  కూడా భారత  జీడీపీ విస్తరణను పెద్దగా అడ్డుకోలేకపోయిందని, 2014-20 ఆర్థిక సణవత్సరాల సగటు 14.5 ట్రిలియన్ ఉండటాన్ని బట్టి గత ఆరేళ్లలో 2.5 రెట్లు ఎక్కువ సాధించినట్టు స్పష్టమైందని అన్నారు. ఆ విధంగా వేగంగా కోలుకున్నట్టు ఋజువైందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం గురించి మాట్లాడుతూ, 1 ట్రిలియన్ చేరటానికి భారతదేశానికి 57 ఏళ్ళు పట్టిందని, ప్రతి 7 ఏళ్ళకు  ఒక్కో ట్రిలియన్ వంతున జోడించామని కానీ గత రెండేళ్లలో 750 బిలియన్లు జోడించటంతో 2022 లో మనం 5 వ స్థానానికీ చేరామని, 2026 లో 4 వ స్థానానికి చేరతామని ధీమా వ్యక్తం చేశారు.

మొత్తంగా, అందరూ  వచ్చే 5-10 ఏళ్లలో భారతదేశం ఎలా ఉండబోతున్నదో సూచన ప్రాయంగా చెప్పారు.  ఉద్యోగావకాశాల గురించి శ్రీమతి దీపా సాయల్ ప్రస్తావిస్తూ, నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. యువత ప్రతిభను వాడుకోవటం మీద, నవకల్పనల మీద దృష్టి సారించటం మీద శ్రీమతి దేవయాని ఘోష్ మాట్లాడారు. గత తొమ్మవదేళ్లలో వేసిన పునాదుల మీద ఉజ్జ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని భారతీ మిట్టల్ సూచించారు. గడిచిన 9 ఏళ్లలో  వారానికొకటి చొప్పున 468 వారాలలో 500 పథకాలు ప్రారంభించటాన్ని శ్రీమతి సంగీతారెడ్డి గుర్తు చేశారు. అభివృద్ధిలో  మహిళలను ముందుంచిన ప్రధానిని అభినందించారు.భారతదేశం ఎంతో  సాధించిందని,  అయితే, ప్రత్యక్ష పన్నులలో ఒక ప్రధానమైన సంస్కరణ రావాల్సి ఉందని శ్రీ సుర్జిత్ భల్లా సూచించారు. ప్రపంచంలో ఎక్కువ పన్ను విధిస్తున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని, తక్కువ పన్ను విధింపు ద్వారా ఎక్కువ జీడీపీ సాధించే అవకాశముందని అభిప్రాయపడ్డారు.  

 

******

 


(Release ID: 1928050) Visitor Counter : 139