ప్రధాన మంత్రి కార్యాలయం
డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
కొత్తగా విద్యుదీకరించిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసి, ఉత్తరాఖండ్ ను 100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్ రాష్ట్రంగా ప్రకటించిన ప్రధాన మంత్రి
‘ఢిల్లీ-డెహ్రాడూన్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ 'ప్రయాణ సౌలభ్యం'తో పాటు పౌరులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తుంది‘
‘ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, పేదరికంపై పోరులో భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా మారింది‘
"ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ దశాబ్దం కాబోతోంది"
"ప్రపంచ ఆధ్యాత్మిక చైతన్యానికి దేవభూమి కేంద్రంగా ఉంటుంది"
‘ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం నవరత్నాలపై ప్రభుత్వం దృష్టి
సారించింది‘
‘రెండు ఇంజన్ల ప్రభుత్వం రెట్టింపు శక్తి, రెట్టింపు వేగంతో పని చేస్తోంది‘
‘21వ శతాబ్దపు భారతదేశం మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా అభివృద్ధిలో మరింత శిఖరాలకు చేరగలదు‘
‘రాబోయే రోజుల్లో పర్వత మాల ప్రాజెక్టు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతోంది‘
'సరైన ఉద్దేశం, విధానం, అంకితభావం అభివృద్ధిని నడిపిస్తున్నాయి'
‘దేశ పురోగమనం ఇప్పుడే ఆగిపోదు, దేశం ఇప్పుడే వేగం పుంజుకుంది, దేశం మొత్తం వందేభారత్ వేగంతో ముందుకు వెడుతోంది, ఇంకా ముందుకు సాగుతుంది‘
Posted On:
25 MAY 2023 12:21PM by PIB Hyderabad
డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.
డెహ్రాడూన్ - ఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభ శుభ సందర్భంగా ఉత్తరాఖండ్ కు చెందిన ప్రతి ఒక్కరినీ ప్రధాన మంత్రి అభినందించారు. ఈ రైలు దేశ రాజధానిని ఉత్తరాఖండ్ లోని దేవ్ భూమితో కలుపుతుందని అన్నారు. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని, ఆన్ బోర్డ్ సౌకర్యాలు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తాయని ఆయన తెలియజేశారు.
జపాన్, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా దేశాల్లో తన మూడు దేశాల పర్యటన గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచం భారత్ వైపు ఎన్నో ఆశలతో చూస్తోందని ప్రధాని ఉద్ఘాటించారు. "ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం , పేదరికంపై పోరాడటంలో భారతదేశం ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా మారింది" అని ప్రధాన మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
కరోనావైరస్ మహమ్మారిని భారతదేశం ఎదుర్కోవడం, దేశంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు భారత్ కు రావాలనుకుంటున్న ప్రస్తుత పరిస్థితులను ఉత్తరాఖండ్ వంటి అందమైన రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని అన్నారు. వందే భారత్ రైలు కూడా ఉత్తరాఖండ్ కు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దోహదపడుతుందని శ్రీ మోదీ చెప్పారు.
కేదార్ నాథ్ ను తాను సందర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ 'ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ దశాబ్దం కాబోతోంది' అని ఆ సందర్భంగా చేసిన ప్రకటనను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. శాంతిభద్రతలను పటిష్ఠంగా ఉంచుతూ రాష్ట్రం అభివృద్ధి బాటలో
పయనించడాన్ని ఆయన కొనియాడారు.
'ప్రపంచ ఆధ్యాత్మిక చైతన్యానికి దేవభూమి కేంద్రంగా ఉంటుంది' అని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సామర్థ్యాన్ని అందిపుచ్చుకునేందుకు కృషి చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చార్ ధామ్ యాత్రకు యాత్రికుల సంఖ్య పాత రికార్డులను బద్దలు కొడుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. బాబా కేదార్ దర్శనం, హరిద్వార్ లో కుంభమేళా/ అర్ధ కుంభమేళా, కన్వర్ యాత్రకు వచ్చే భక్తుల గురించి కూడా ఆయన మాట్లాడారు. చాలా రాష్ట్రాలకు ఇంతమంది భక్తులు రావడం లేదని, ఇది ఒక వరంతో పాటు బృహత్తర కార్యమని ఆయన అన్నారు.
ఈ 'భగీరథ' పనిని సులభతరం చేయడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెట్టింపు శక్తి, రెట్టింపు వేగంతో పనిచేస్తోందని ఆయన అన్నారు.
అభివృద్ధికి తొమ్మిది ఆణిముత్యాలు అయిన 'నవరత్నాలకు' ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. కేదార్ నాథ్ -బద్రీనాథ్ ధామ్ లో రూ.1300 కోట్లతో పునరుద్ధరణ ప్రాజెక్ట్ తొలి రత్న అని చెప్పారు. రెండోది, గౌరీకుండ్-కేదార్ నాథ్, గోవింద్ ఘాట్-హేమ్ కుంత్ సాహిబ్ వద్ద రూ.2500 కోట్లతో రోప్ వే ప్రాజెక్టు. మూడవది, మానస్ ఖండ్ మందిర్ మాల కార్యక్రమం కింద కుమావున్ లోని పురాతన దేవాలయాల పునరుద్ధరణ,
నాలుగవది, రాష్ట్రవ్యాప్తంగా హోమ్ స్టేను ప్రోత్సహించడం, రాష్ట్రంలో 4000కు పైగా హోమ్ స్టేలు నమోదయ్యాయి. ఐదవది, 16 ఎకోటూరిజం ప్రదేశాల అభివృద్ధి.
ఆరవది, ఉత్తరాఖండ్ లో ఆరోగ్య సేవల విస్తరణ. ఉధమ్ సింగ్ నగర్ లో త్వరలో ఎయిమ్స్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటు,
ఏడోది, రూ.2000 కోట్ల తెహ్రీ సరస్సు అభివృద్ధి ప్రాజెక్టు. ఎనిమిదవది, యోగా, అడ్వెంచర్ టూరిజం రాజధానిగా హరిద్వార్ రిషికేష్ అభివృద్ధి, ఇక తొమ్మిదవది, చివరిది తనక్ పూర్ బాగేశ్వర్ రైలు మార్గం.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కొత్త ఊపునిస్తూ ఈ నవరత్నాలను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. రూ.12 వేల కోట్లతో చార్ ధామ్ మహాపరియోజన పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఢిల్లీ - డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ వే ప్రయాణాన్ని వేగవంతంగా, సులభతరం చేస్తుంది. ఉత్తరాఖండ్ లో రోప్ వే కనెక్టివిటీ గురించి కూడా ఆయన మాట్లాడారు. "పర్వత మాల ప్రాజెక్టు రాబోయే రోజుల్లో రాష్ట్ర దశ, దిశ ను మార్చబోతోంది", అని ఆయన అన్నారు.
రూ.16,000 కోట్లతో రిషికేశ్- కర్ణప్రయాగ్ రైల్ ప్రాజెక్టును 2-3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఉత్తరాఖండ్ లో ఎక్కువ భాగాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో
ఉత్తరాఖండ్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, సినిమా షూటింగ్ డెస్టినేషన్ , వెడ్డింగ్ డెస్టినేషన్ ల హబ్ గా ఎదుగుతోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులను ఆకర్షిస్తున్నాయని, వందే భారత్ ఎక్స్ ప్రెస్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే వారికి రైలు ప్రయాణం మొదటి ఎంపికగా మారిందని, వందే భారత్ క్రమంగా రవాణా సాధనంగా మారుతోందని ప్రధాని పేర్కొన్నారు.
"21 వ శతాబ్దపు భారతదేశం మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా అభివృద్ధిలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించగలదు" అని ప్రధాన మంత్రి అన్నారు. గత ప్రభుత్వాలు అవినీతి , వారసత్వ రాజకీయాలలో మునిగితేలుతూ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేక పోయాయని ఆయన అన్నారు. భారతదేశంలో హైస్పీడ్ రైళ్లకు సంబంధించి గత ప్రభుత్వాలు భారీ వాగ్దానాలు చేసినప్పటికీ, కనీసం రైలు నెట్వర్క్ నుండి మానవరహిత గేట్లను తొలగించడంలో కూడా అవి విఫలమయ్యాయని, రైలు మార్గాల విద్యుదీకరణ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. 2014 నాటికి దేశంలోని రైలు నెట్ వర్క్ లో మూడింట ఒక వంతు మాత్రమే విద్యుదీకరణ జరిగిందని, అందువల్ల వేగంగా నడిచే రైలు గురించి ఆలోచించడం అసాధ్యమని ప్రధాన మంత్రి తెలియజేశారు. "2014 తరువాత రైల్వేలను మార్చడానికి సర్వతోముఖ కృషి ప్రారంభమైంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దేశంలో తొలి హైస్పీడ్ రైలు కలను సాకారం చేసే పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయని, సెమీ హైస్పీడ్ రైళ్ల కోసం మొత్తం నెట్ వర్క్ ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 2014కు ముందు సగటున ప్రతి సంవత్సరం 600 కిలోమీటర్ల రైలు మార్గాలు విద్యుదీకరణ అయ్యేవని, నేడు ప్రతి సంవత్సరం 6 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుదీకరణ జరుగుతోందని ప్రధాన మంత్రి తెలియజేశారు. ‘‘ప్రస్తుతం దేశంలోని రైల్వే ట్రాక్ నెట్ వర్క్ లో 90 శాతానికి పైగా విద్యుదీకరణ పూర్తయింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 100 శాతం విద్యుదీకరణ సాధించాం" అని ప్రధాన మంత్రి తెలియజేశారు.
సరైన ఉద్దేశం, విధానం, అంకితభావంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రధాని కొనియాడారు. 2014తో పోలిస్తే రైల్వే బడ్జెట్ లో ఇచ్చిన మద్దతు వల్ల ఉత్తరాఖండ్ కు నేరుగా లబ్ధి చేకూరిందన్నారు. 2014కు ఐదేళ్ల క్రితం రాష్ట్ర సగటు బడ్జెట్ రూ.200 కోట్లలోపే ఉండేదని, నేడు రైల్వే బడ్జెట్ ఒక్కటే రూ.5 వేల కోట్లుగా ఉందని, ఇది 25 రెట్లు పెరిగిందని అన్నారు. కనెక్టివిటీ లేకపోవడం వల్ల గ్రామాల ప్రజలు వలస వెళ్లిన కొండప్రాంత రాష్ట్రంలో కనెక్టివిటీ ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు . రాబోయే తరాలకు ఆ ఇబ్బందిని నివారించాలని ప్రభుత్వం కోరుకుంటోందని స్పష్టం చేశారు. మన సరిహద్దులను సులభంగా చేరుకోవడానికి ఆధునిక కనెక్టివిటీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని, దేశాన్ని రక్షించే సైనికులకు ఏ విధంగానూ అసౌకర్యం కలిగించరాదని ఆయన పేర్కొన్నారు.
ప్రసంగాన్ని ముగిస్తూ, ఉత్తరాఖండ్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉత్తరాఖండ్ వేగవంతమైన అభివృద్ధి భారతదేశ
శీఘ్రతర అభివృద్ధికి కూడా దోహద పడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. దేశ పురోగమనం ఇప్పుడే ఆగిపోదని, దేశం అభివృద్ధి ఇప్పుడే వేగం పుంజుకుందని అన్నారు. యావత్ దేశం వందేభారత్ వేగంతో ముందుకు
వెడుతోందని, ఇంకా ముందుకు సాగుతుందని ప్రధాన మంత్రి ముగించారు.
నేపథ్యం
ఉత్తరాఖండ్ లో ప్రవేశపెట్టిన తొలి వందేభారత్ ఇదే కావడం విశేషం. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో, ఇది ముఖ్యంగా రాష్ట్రానికి ప్రయాణించే పర్యాటకులకు. సౌకర్యవంతమైన ప్రయాణ సౌలభ్య అనుభవాల కొత్త శకానికి నాంది పలుకుతుంది, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు కవచ్ టెక్నాలజీతో సహా అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ డెహ్రాడూన్ నుండి ఢిల్లీ మధ్య దూరాన్ని 4.5 గంటల్లో చేరుకుంటుంది.
పరిశుభ్రమైన ప్రజా రవాణా సాధనాలను అందించాలనే ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా, భారతీయ రైల్వే దేశంలో రైలు మార్గాలను పూర్తిగా విద్యుదీకరణ చేయాలనే ప్రయత్నం లో ఉంది. ఈ దిశగా , ఉత్తరాఖండ్ లో కొత్తగా విద్యుదీకరించిన రైలు మార్గాలను ప్రధాని జాతికి అంకితం చేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం రైలు మార్గాల 100 శాతం విద్యుదీకరణ పూర్తి అయింది. విద్యుదీకరణ పూర్తయిన మార్గాలలో రైళ్ల వేగం పెరగడంతో పాటు వాణిజ్య రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది.
*****
DS/TS
(Release ID: 1927250)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam