హోం మంత్రిత్వ శాఖ

గుజరాత్ లోని ద్వారక లో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసింగ్ (ఎన్ ఎ సి పి) శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపనచేసిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తీరప్రాంత భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు 450 ఎకరాలకు పైగా భూమిలో నేషనల్ కోస్టల్ పోలీస్ అకాడమీ పనులను ఈ రోజు ప్రారంభించాం: శ్రీ అమిత్ షా

శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత, దేశ సరిహద్దుల భద్రతను బలోపేతం చేశారు; పౌరులు తాము సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నారు

‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ సరిహద్దు దళాల జీవన, పని సదుపాయాలను మెరుగు పరచడానికి, వారి కుటుంబాల ఆరోగ్య భద్రతకు, దేశ భద్రత కోసం అత్యాధునిక పరికరాలు అందించడానికి చేయని ప్రయత్నం లేదు‘.

గత ప్రభుత్వంలో తీరప్రాంత భద్రతకు సంబంధించి ఎటువంటి శిక్షణా విధానం లేదు; 2018లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేషనల్ కోస్టల్ పోలీస్ అకాడమీకి ఆమోదం తెలిపారు; శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత , సంకల్పం కారణంగా దేశ తీరప్రాంత భద్రతను పటిష్టం చేసే ఒక ముఖ్యమైన పని నేడు జరుగుతోంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారత నావికా దళం, భారత దేశ కోస్ట్ గార్డ్ , మెరైన్ పోలీస్ , కస్టమ్స్ , జాలర్ల తో కూడిన సుదర్శన చక్ర భద్రతా వలయాన్ని సృష్టించింది

Posted On: 20 MAY 2023 6:39PM by PIB Hyderabad

గుజరాత్ లోని ద్వారకలో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసింగ్ (ఎన్ ఎ సి పి ) శాశ్వత క్యాంపస్ కు కేంద్ర హోం,  సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తీరప్రాంత భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు 450 ఎకరాలకు పైగా భూమిలో నేషనల్ కోస్టల్ పోలీస్ అకాడమీ పనులను ఈ రోజు ప్రారంభించినట్లు శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో దేశ భద్రత, దేశ సరిహద్దులు పటిష్ఠం అయ్యాయని, దేశ పౌరులలో తాము సురక్షితంగా ఉన్నామన్న భావన ఏర్పడిందని ఆయన అన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి, మన సరిహద్దు గార్డుల జీవన , పని సౌకర్యాలు మెరుగు పరచడం,  వారికి అత్యాధునిక పరికరాలు ఇవ్వడం , వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని చూసుకోవడం చాలా అవసరం అని శ్రీ షా అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ మూడు రంగాలలో చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదని, మన భద్రతా దళాలకు అన్ని రకాల సౌకర్యాలు, అత్యాధునిక పరికరాలను అందించడానికి ప్రయత్నించిందని ఆయన అన్నారు.

 

ఇటీవల భారత నావికాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సి బి ) కలసి భారత నిఘా సంస్థల సహాయంతో కేరళ తీరంలో రూ.12,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయని కేంద్ర హోం మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో రూ.680 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడగా, ఇప్పుడు భారత భద్రతా సంస్థలు ఒకే దఫా  రూ.12,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం మన ఏజెన్సీల సంసిద్ధతకు నిదర్శనమన్నారు.

 

గొప్ప స్వాతంత్ర్య సమరయోధులయిన

లాల్-బాల్-పాల్ లలో ఒకరైన శ్రీ బిపిన్ చంద్ర పాల్ వర్ధంతి ఈ రోజు అని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ రోజు పరమవీర చక్ర పురస్కారం పొందిన అమరవీరుడు పీరు సింగ్ జయంతి కూడా అని గుర్తు చేశారు.శ్రీ పీరు సింగ్ అపారమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని కాపాడారని నివాళి అర్పించారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అండమాన్ నికోబార్ లోని ఒక ద్వీపానికి అమరవీరుడి జ్ఞాపకార్థం షహీద్ పిరు సింగ్ ద్వీపం అని నామకరణం చేశారని తెలియ చేశారు.

 

దేశ సరిహద్దులు సురక్షితంగా లేకపోతే అభివృద్ధికి అర్థం లేదని కేంద్ర హోంమంత్రి అన్నారు. సరిహద్దులను పకడ్బందీగా కాపాడుకోవడం ద్వారానే ఒక దేశం సురక్షితంగా ఉండగలదని ఆయన అన్నారు.

 

భారతదేశానికి 15,000 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దు, 7,516 కిలోమీటర్ల పొడవైన సముద్ర సరిహద్దు ఉందని శ్రీ షా చెప్పారు. 7,516 కిలోమీటర్ల పొడవైన సముద్ర సరిహద్దులో 5,422 కిలోమీటర్లు ప్రధాన భూభాగం, 2,000 కిలోమీటర్లకు పైగా ద్వీపాల సరిహద్దు అని ఆయన చెప్పారు. 1,382 ద్వీపాలు, 3,337 తీరప్రాంత గ్రామాలు, 11 ప్రధాన ఓడరేవులు, 241 నాన్ మేజర్ పోర్టులు, అంతరిక్షం, రక్షణ, అణుశక్తి, పెట్రోలియం, షిప్పింగ్ మొదలైన వాటితో సహా 135 సంస్థలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ భద్రతా సిబ్బందికి ప్రత్యేక శిక్షణా వ్యవస్థ లేదని, కానీ 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత ప్రతి తీరప్రాంత పోలీస్ స్టేషన్, సరిహద్దు భద్రత, కోస్ట్ గార్డ్ వద్ద జవాన్ల నుంచి సమన్వయంతో స్పందించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. తీరప్రాంత భద్రతకు సంబంధించిన శిక్షణ ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసినప్పుడే ఇది సాధ్యమని శ్రీ షా అన్నారు. 2018లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేషనల్ కోస్టల్ పోలీస్ అకాడమీకి ఆమోదం తెలిపారని, దీనిని శ్రీకృష్ణుడి నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ద్వారక అంటే దేశానికి ముఖద్వారం అని, ఆ సమయంలో శ్రీకృష్ణుడు మధుర నుంచి ఈ ప్రాంతానికి వచ్చి మన సముద్ర సరిహద్దులో ఒక పెద్ద వాణిజ్య కేంద్రాన్ని నిర్మించాడని ఆయన అన్నారు. ఈ రోజు ప్ర ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఊహతో, శ్రీ కృష్ణ భగవానుడి భూమి అయిన ఓఖా లో యావత్ దేశ తీరప్రాంత భద్రత కొరకు శిక్షణ ఇవ్వబడుతోందని పేర్కొన్నారు.

 

దేశవ్యాప్తంగా కోస్టల్ పోలీస్ సిబ్బంది సంఖ్య 12,000 వరకు ఉందని, ఈ అకాడమీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏడాదిలో 3,000 మందికి శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తామని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ విధంగా, 4 సంవత్సరాలలో, భారతదేశ తీర భద్రతలో నిమగ్నమైన సిబ్బందికి 100% శిక్షణ పూర్తవుతుంది. ప్రధాన మంత్రి శ్రీ న రేంద్ర మోదీ దార్శనికత, దృఢ సంకల్పం కారణంగా తీరప్రాంతాల భద్రతను పటిష్టం చేసే ఒక ముఖ్యమైన కార్యాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు.

 

సుమారు రూ.56 కోట్ల వ్యయంతో ఐదు వేర్వేరు బీఎస్ఎఫ్ కంపెనీ అవుట్ పోస్టులు , 18వ  కార్ప్స్ కు చెందిన ఒక అబ్జర్వేషన్ పోస్ట్ టవర్ ను ఈ రోజు ప్రారంభించామని, సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న మన అప్రమత్తమైన గార్డులు సౌకర్యవంతంగా ఇక్కడ నివసించి దేశ భద్రతకు భరోసా కల్పిస్తారని కేంద్ర హోం మంత్రి  తెలిపారు.

 

సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ మోహరించినందున దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని, దేశం సురక్షితంగా ఉందని ఆయన అన్నారు. బిఎస్ఎఫ్ కు ఘనమైన చరిత్ర ఉందని, చివరి రక్తపు బొట్టు చిందించే వరకు, బిఎస్ ఎఫ్ జవాన్లు దేశంలోని ప్రతి అంగుళం భూమి కోసం ధైర్యంగా పోరాడారని శ్రీ షా అన్నారు. యుద్ధ సమయంలో సైన్యం పగ్గాలు చేపట్టిన అనేక సందర్భాల్లో బీఎస్ఎఫ్ వెనక్కి వెళ్లాల్సి వస్తోందని, అయితే బీఎస్ఎఫ్ జవాన్లు వెనక్కి వెళ్లడం సముచితం కాదని భావించి సైన్యంతో భుజం భుజం కలిపి శత్రువులతో పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. బిఎస్ఎఫ్ ఈ వీరోచిత కథ దేశంలోని ప్రతి చిన్నారికి తెలుసునని శ్రీ షా అన్నారు.

 

భారత నావికాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, కస్టమ్స్ , మత్స్యకారులను భారతదేశానికి భద్రతా వలయ సంపూర్ణ సుదర్శన చక్రంగా మార్చడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సముద్ర భద్రత విధానాన్ని అవలంబించిందని శ్రీ అమిత్ షా చెప్పారు. బహిరంగ సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన నౌకలు, విమానాల ద్వారా భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. మధ్య సముద్రాల్లో, ప్రాదేశిక జలాల్లో భారత నావికాదళం, కోస్ట్ గార్డులు భద్రతను బీఎస్ఎఫ్ నీటి విభాగం నిర్వహిస్తుండగా, గ్రామంలోని దేశభక్తి కలిగిన మత్స్యకారులు సమాచార మార్గంగా వ్యవహరించడం ద్వారా దేశ భద్రతను నిర్ధారిస్తారని చెప్పారు. ఈ అన్ని కోణాల్లోనూ భారత ప్రభుత్వం చక్కటి సమన్వయ కోస్టల్ సెక్యూరిటీ పాలసీని అవలంబించిందని, సమీకృత విధానం ద్వారా దేశ తీరాలను సురక్షితంగా ఉంచడానికి కృషి చేసిందని శ్రీ షా అన్నారు. తీరప్రాంత భద్రతలో నిర్లక్ష్యం కారణంగా మన దేశం అనేక పర్యవసానాలను చవిచూసిందని ఆయన అన్నారు. 2008లో జరిగిన ముంబై దాడిలో చిన్న పొరపాటు కారణంగా 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఏ దేశభక్తుడు మరచిపోలేడనీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించిన తీరప్రాంత భద్రత విధానం తర్వాత శత్రువులు ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఇక్కడి నుంచి తగిన సమాధానం లభిస్తుందన్నారు. ఇందుకు ఈ శిక్షణ చాలా ముఖ్యమని శ్రీ షా అన్నారు.

 

ఈ కోస్టల్ సెక్యూరిటీ పాలసీ తీరప్రాంత భద్రత, ఇంటెలిజెన్స్ విషయంలో సమన్వయం, కమ్యూనికేషన్, నిర్ణీత సమయంలో గస్తీ కోసం ప్రోటోకాల్స్ ఏర్పాటు చేయడం, మత్స్యకారుల భద్రత, మత్స్యకారులకు క్యూఆర్ కోడ్ లతో కూడిన 10 లక్షలకు పైగా ఆధార్ కార్డులు ఇవ్వడం, 1537 ఫిష్ లీడింగ్ పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లు, బ్లూ ఎకానమీ కోసం నిర్మించిన అన్ని ఫిషింగ్ హార్బర్ల వద్ద భద్రత వంటి అనేక స్తంభాలపై ఆధారపడి ఉందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. వీటన్నిటినీ జోడించి తీరప్రాంత భద్రతకు తిరుగులేని కోటను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

 

గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత పోర్ బందర్ జైలును మూసివేయాల్సి వచ్చిందని, పోర్ బందర్ అన్ని రకాల దొంగతనాలకు కేంద్రంగా మారిందని అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మళ్లీ జైలు మొదలైందని, దొంగలు ఇక్కడి నుంచి పారిపోయారన్నారు. కచ్ భూ సరిహద్దు, సర్ క్రీక్, హరమినాలా లేదా పోర్ బందర్ సముద్ర తీరం లేదా ద్వారకా-ఓఖా-జామ్ నగర్-సలాయా సముద్ర తీరం ఏదైనా శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ను సురక్షితంగా ఉంచారని ఆయన అన్నారు. ఈ రోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఏకతాటిపై ఉంచడం ద్వారా దేశ ప్రధాన మంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ దేశ సముద్ర తీరాలను సురక్షితంగా ఉంచడానికి ఇక్కడ ఈ శిక్షణా అకాడమీని స్థాపించారని శ్రీ షా అన్నారు.

 

*****



(Release ID: 1926062) Visitor Counter : 144