ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ ఉపాధి మేళాలో ప్రధానమంత్రి ప్రసంగం


వివిధ ప్రభుత్వ శాఖలు.. సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మందికి నియామక పత్రాల పంపిణీ;

“యువతరంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఉపాధి మేళాల నిర్వహణే నిదర్శనం”;

“ఉద్యోగావకాశాల కల్పన దృష్టితో ప్రభుత్వ విధానాల రూపకల్పన”;

“గత 9 ఏళ్లలో మూలధన వ్యయం రూ.34 లక్షల కోట్లు...ఈ ఏడాది కూడా రూ.10 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం”;

“దేశంలో తయారీ ద్వారా ఉపాధి సృష్టి ప్రధానంగా స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం అమలు”;

Posted On: 16 MAY 2023 11:54AM by PIB Hyderabad

జాతీయ ఉపాధి కల్పన మేళా నిర్వహించిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సుమారు 71,000 నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్ర‌సంగిస్తూ- ఉద్యోగాలు పొందిన యువతకు, వారి కుటుంబాల‌కు ప్రధాని శుభాకాంక్ష‌లు తెలిపారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇటీవల పూర్తయిన వాటితోపాటు అస్సాంలో నిర్వహించబోయే ఉపాధి మేళా గురించి ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంసహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మేళాలు యువత పట్ల ప్రభుత్వానికిగల చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా గత 9 సంవత్సరాల్లో నియామక ప్రక్రియను వేగవంతం చేసేదిశగా పారదర్శకత, నిష్పాక్షికతలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని ప్రధానమంత్రి వెల్లడించారు. అంతకుముందు నియామకాలకు ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ- ఈ ప్రక్రియ నిర్వహణలో ‘సిబ్బంది నియామక సంస్థ’ (స్టాఫ్ సెలక్షన్ బోర్డ్-ఎస్‌ఎస్‌బి)కు దాదాపు 15-18 నెలలు పట్టేదని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు కేవలం 6-8 నెలల వ్యవధిలో మొత్తం పూర్తవుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు పొందడం నుంచి పోస్ట్ ద్వారా పంపేవరకూ దుర్భర పరిస్థితి ఉండేదని చెప్పారు. యువతకు ఈ దుస్థితిని తప్పిస్తూ ఈ ప్రక్రియ మొత్తాన్నీ ఆన్‌లైన్‌ చేయడం ద్వారా సరళీకరించామని తెలిపారు. దీంతోపాటు విద్యార్హతల వంటి పత్రాలకు స్వీయ-ధ్రువీకరణ వెసులుబాటు కల్పించడంతో గజిటెడ్‌ అధికారుల సంతకం కోసం కాళ్లరిగేలా తిరిగే అవస్థ కూడా తొలగిపోయిందని చెప్పారు. అలాగే గ్రూప్ సి, డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కూడా రద్దు చేశామని, నియామక ప్రక్రియలో ఆశ్రిత పక్షపాత ధోరణి నిర్మూలనే ఈ విధానం వల్ల ఒనగూడిన భారీ ప్రయోజనమని ప్రధాని వ్యాఖ్యానించారు.

దేశంలో 9 సంవత్సరాల కిందట ఇదే రోజున లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయని, ఆ మేరకు మే 16వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆనాటి ఆనందోత్సాహాలను గుర్తుచేసుకుంటూ ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్..’ స్ఫూర్తితో మొదలైన ప్రయాణం వికసిత భారతం దిశగా దిగ్విజయంగా కొనసాగుతున్నదని ప్రధాని అన్నారు. అంతేకాకుండా ఇవాళ సిక్కిం ఆవిర్భావ దినోత్సవమని ఆయన గుర్తుచేశారు. కాగా, గడచిన 9 ఏళ్లలో ఉపాధి అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తూ ప్రభుత్వ విధానాలు రూపొందించామని ప్రధాని చెప్పారు. ఆధునిక మౌలిక సదుపాయాల రంగాలలో కార్యక్రమాలు, గ్రామీణ ప్రగతికి ప్రాముఖ్యం లేదా ప్రాథమిక జీవన సదుపాయాల విస్తరణ వంటి కేంద్ర ప్రభుత్వం రూపొందించే ప్రతి విధానం యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. ఇక ఈ తొమ్మిదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన సహా ప్రభుత్వం మూలధన వ్యయం కింద దాదాపు రూ.34 ల‌క్ష‌ల కోట్లు వెచ్చించిందని ప్ర‌ధానమంత్రి తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా మూలధన వ్యయం కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ నిధులతో కొత్త రహదారులు, విమానాశ్రయాలు, రైలుమార్గాలు, వంతెనలు వగైరా ఆధునిక మౌలిక సదుపాయాలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. తద్వారా దేశంలో అనేక కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తున్నాయని ఆయన చెప్పారు.

స్వతంత్ర భారత ప్రగతి చరిత్రలో నేటి వేగం, స్థాయి మునుపెన్నడూ లేవని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు 9 ఏళ్ల కాలంలో 40 వేల కిలోమీటర్ల రైలు మార్గాలను విద్యుదీకరించగా, అంతకుముందు 7 దశాబ్దాలలో ఇది 20 వేల కి.మీ.లకు మాత్రమే పరిమితమైందని గుర్తుచేశారు. అదేవిధంగా దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్ కింద 2014కు ముందు నెలకు కేవలం 600 మీటర్ల మెట్రో లైన్లు వేయగా, నేడు దాదాపు 6 కిలోమీటర్ల మేర వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే 2014కు గ్రామీణ రహదారులు 4 లక్షల కిలోమీటర్లకన్నా తక్కువ కాగా, నేడు 7.25 లక్షల కి.మీ.గా ఉన్నాయని తెలిపారు. దేశంలో 2014నాటికి 74 విమానాశ్రయాలు ఉండగా, నేడు దాదాపు 150కి పెరిగాయని చెప్పారు. ఇక గత 9 ఏళ్లలో పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేడు 5 లక్షలదాకా సార్వత్రిక సేవా కేంద్రాలు ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. గ్రామాల్లో 30 వేలకుపైగా పంచాయతీ భవనాలు నిర్మించామని, 9 కోట్ల ఇళ్లకు కొళాయిల ద్వారా నీటి సరఫరా కోసం పైపులైన్లు వేయబడ్డాయని గుర్తుచేశారు. ఇవన్నీ నేడు పెద్ద ఎత్తున ఉపాధినిస్తున్నాయని ప్రధాని అన్నారు. విదేశీ పెట్టుబ‌డులు లేదా భార‌త్‌ నుంచి ఎగుమతులు వంటివన్నీ దేశంలో ఉపాధి కల్పనకు, స్వ‌యం ఉపాధికి తగిన అనేక అవ‌కాశాల‌ను సృష్టిస్తున్నట్లు ప్ర‌ధాని తెలిపారు.

దేశంలో కొత్త రంగాల ఆవిర్భావంతో గత 9 సంవత్సరాల్లో ఉద్యోగాల స్వభావంలో అద్భుత మార్పులు వచ్చాయని ప్రధాని అన్నారు. ఈ కొత్త రంగాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి నిరంత‌రం స‌హ‌కారం లభిస్తున్నదని పేర్కొన్నారు. భారతదేశం వినూత్న అంకుర విప్లవాన్ని చూసిందని ప్రధాని నొక్కిచెప్పారు. దేశంలో 2014కు ముందు అంకుర సంస్థల సంఖ్య 100 మాత్రమే కాగా, ఇవాళ లక్షకుపైగా పెరిగి 10 లక్షల మందికిపైగా యువతకు ఉపాధినిస్తున్నాయని తెలిపారు. మునుపటితో పోలిస్తే జన జీవన సౌలభ్యం కల్పించిన సాంకేతిక ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. నగరాలకు జీవనాధారంగా మారిన అనువర్తన ఆధారిత టాక్సీ సేవలు, ఉపాధిని పెంచే సమర్థ ఆన్‌లైన్ సరఫరా వ్యవస్థలు, డ్రోన్ల రంగానికి ఊతమివ్వడంతో పొలాల్లో పురుగుమందు చల్లే ప్రక్రియకు తోడ్పడిందని పేర్కొన్నారు. అలాగే నగర గ్యాస్‌ పంపిణీ వ్యవస్థ 60 నుంచి 600 నగరాల స్థాయికి విస్తరించిందని తెలిపారు.

ప్రభుత్వం గడచిన 9 ఏళ్లలో ‘ముద్ర’ పథకం కింద అర్హులైన యువతకు రూ.23 లక్షల కోట్లకుపైగా రుణాలు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. పౌరులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, టాక్సీల కొనుగోలుకు లేదా వారి ప్రస్తుత వ్యాపార తదితర కార్యకలాపాల విస్తరణకు ఈ రుణాలు తోడ్పడ్డాయని పేర్కొన్నారు. ‘ముద్ర’ పథకం కింద రుణాలు పొందిన తర్వాత దాదాపు 8-9 కోట్ల మంది పౌరులు తొలిసారి వ్యవస్థాపకులుగా మారారని ప్రధాని గుర్తుచేశారు. “స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం దేశంలో తయారీ రంగం ద్వారా ఉపాధి కల్పనపై ఆధారపడి ఉంది” అని ఆయన చెప్పారు. ఇక ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకం కింద తయారీ రంగానికి కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లదాకా సహాయం అందిస్తున్నదని ప్రధాని వివరించారు.

న్నత విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి సంస్థలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, దేశవ్యాప్తంగా 2014-2022 మధ్య ఏటా ఓ కొత్త ‘ఐఐటీ’, కొత్త ‘ఐఐఎం’ ఏర్పాటయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే ప్రతి వారం ఒకటి వంతున విశ్వవిద్యాలయాలు మొదలు కాగా, తొమ్మిదేళ్ల వ్యవధిలో సగటున రోజూ రెండు చొప్పున కళాశాలలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఈ మేరకు 2014కు ముందు దేశంలో దాదాపు 720 విశ్వవిద్యాలయాలు ఉండగా, నేడు 1100కుపైగా ఉన్నాయని ప్రధాని గుర్తుచేశారు. ఇక వైద్య విద్యకు సంబంధించి 7 దశాబ్దాలలో దేశంలో కేవలం 7 ‘ఎయిమ్స్‌’ మాత్రమే ఏర్పాటవగా, గత 9 సంవత్సరాలలో ప్రభుత్వం 15 కొత్త ‘ఎయిమ్స్‌’లను నిర్మించిందని ప్రధాని పేర్కొన్నారు. వైద్య కళాశాలల సంఖ్య 400 నుంచి 700కు పెరగడంతోపాటు ఎంబీబీఎస్‌, ఎండీ సీట్ల సంఖ్య 80 వేల నుంచి దాదాపు లక్షా 70 వేలకు పెరిగిందని ఆయన తెలిపారు.

భివృద్ధిలో ‘ఐటీఐ’ల పాత్ర కూడా కీలకమైనదేనని ప్రధానమంత్రి వివరించారు. “గత 9 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా నిత్యం ఒక ‘ఐటీఐ’ ఏర్పాటవుతూ వచ్చింది” అన్నారు. దేశ అవసరాలకు తగినట్లు 15 వేల ‘ఐటీఐ’ల్లో కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నామని, ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం కింద 1.25 కోట్ల మందికిపైగా యువతకు నైపుణ్యం కల్పించామని తెలిపారు. ఇక 2018-19 తర్వాత అధికారిక ఉద్యోగాలలో సుస్థిర వృద్ధిని సూచిస్తూ ‘ఇపిఎఫ్‌ఒ’ గణాంకాలను ఆయన ఉదాహరించారు. ఈ మేరకు ‘ఇపిఎఫ్‌ఒ’ పరిధిలోని నికర జీతాల పట్టిక ప్రకారం 4.5 కోట్ల కొత్త అధికారిక ఉద్యోగాలు సృష్టించబడ్డాయన్నారు. మరోవైపు స్వయం ఉపాధి అవకాశాలు కూడా నిరంతరం పెరుగుతున్నాయని చెప్పారు.

భారత్‌లో పరిశ్రమల స్థాపన-పెట్టుబడులకు అంతర్జాతీయ స్థాయిలోగల అపార సానుకూలత ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వాల్‌మార్ట్ ‘సీఈవో’తో ఇటీవలి తన సమావేశాన్ని గుర్తుచేస్తూ- ఇక్కడి నుంచి రూ.80 వేల కోట్లకుపైగా విలువైన వస్తు ఎగుమతులు ఉంటాయంటూ భారత్‌పై ఆయన విశ్వాసం వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించారు. రవాణా మౌలిక సదుపాయాలు, సరఫరా ప్రక్రియ రంగాల్లో ఉపాధి పొందుతున్న యువతకు ఇది ఆనందం కలిగించే సమాచారమని ఆయన తెలిపారు. అలాగే ‘సిస్కో’ సీఈవోతో తన సమావేశం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. భారత్‌ నుంచి 8 వేల కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారని పేర్కొన్నారు. అదేవిధంగా ‘యాపిల్‌ సీఈవో'’భారత్‌లో మొబైల్ తయారీ పరిశ్రమపై విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మరోవైపు సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ రూపకల్పనలో భారత్‌ సామర్థ్యంపై సెమీకండక్టర్ కంపెనీ ‘ఎన్‌ఎక్స్‌పి' ఉన్నతాధికారి కూడా సానుకూలత ప్రకటించారని తెలిపారు. ఇక ‘ఫాక్స్‌కాన్‌’ కూడా రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. వచ్చేవారం ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ కంపెనీల ‘సీఈఓ’ల‌తో తాను సమావేశం కానున్నానని ప్రధాని తెలిపారు. భారత్‌లో పెట్టుబడులకు వారంతా ఎంతో ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాల సృష్టిని ఇవన్నీ ప్రస్ఫుటం చేస్తున్నాయని ఆయన వివరించారు.

చివరగా- ఉద్యోగావకాశాలు పొందిన యువతకు ప్రధానమంత్రి దిశానిర్దేశం చేశారు. రాబోయే 25 ఏళ్లలో వికసిత భారతం దిశగా మన సంకల్పాలను సాకారం చేసే అభివృద్ధి మహాయజ్ఞంలో వారి పాత్ర ఎంతో కీలకమని ఆయన నొక్కిచెప్పారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, ఆన్‌లైన్ అభ్యసన వేదిక ‘ఐగాట్‌ కర్మయోగి’ విభాగం ద్వారా ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని వివరిస్తూ ఆయన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో ఇవాళ ఉపాధి మేళా నిర్వహించగా, కేంద్ర/రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల శాఖలు, విభాగాలలో ఉద్యోగాలకు ఎంపికైన యువతకు నియామక పత్రాలు అందజేయబడ్డాయి. వీరంతా గ్రామీణ డాక్ సేవక్స్, పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్, కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి వివిధ ఉద్యోగాలు/స్థానాలలో చేరుతారు. లోయర్ డివిజన్ క్లర్క్, సబ్ డివిజనల్ ఆఫీసర్, టాక్స్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్లు, ఫైర్‌మెన్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డివిజనల్ అకౌంటెంట్, ఆడిటర్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ కమాండెంట్, ప్రిన్సిపాల్, శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పోస్టుల్లోనూ నియమితులైన వారున్నారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రధానమంత్రి హామీ నెరవేర్చే దిశగా ఉపాధి కల్పన మేళా దిశగా ఒక ముందడుగు. ఈ కార్యక్రమం ఉపాధి కల్పనకు ఉత్ప్రేరకం కాగలదని, యువతకు సాధికారతసహా దేశ ప్రగతిలో వారి భాగస్వామ్యం దిశగా అర్ధవంతమైన అవకాశాలను అందించాలన్నది ఆయన సంకల్పం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగా నియమితులైన వారు ఆయా ప్రభుత్వ శాఖల పరిధిలో ఆన్‌లైన్ పునశ్చరణ కోర్సు ‘కర్మయోగి ప్రారంభ్‌’ ద్వారా శిక్షణ పొందే అవకాశం కూడా ఉంటుంది.

*****

DS/TS



(Release ID: 1924540) Visitor Counter : 198