ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2023వ‌న్ హెల్త్ - అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023 స‌ద‌స్సు 6వ ఎడిష‌న్ ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


“ప్ర‌పంచ స్థాయి మ‌హ‌మ్మారులు లేని స‌మ‌యంలోనే భార‌త ఆరోగ్య విజ‌న్ సార్వ‌జ‌నీనం”

“భౌతిక‌, మాన‌సిక‌, సామాజిక సంక్షేమం భార‌త‌దేశం ల‌క్ష్యం”

“భార‌త‌ సంస్కృతి, వాతావ‌ర‌ణం, సామాజిక వైవిధ్యం అద్భుతం”

“ప్ర‌జ‌లే ల‌క్ష్యంగా జ‌రిగేదే వాస్త‌వ పురోగ‌తి. వైద్య శాస్త్రం ఎంత పురోగ‌తి సాధించింది అన్న దానితో సంబంధం లేదు, వ‌రుస‌లో చివ‌రి వ్య‌క్తికి కూడా అందుబాటులో ఉండేలా హామీ ఇవ్వాలి”

“ప్రాచీన భార‌త‌దేశం ఆధునిక భార‌త‌దేశానికి అందించిన కానుక‌లే యోగా, మెడిటేష‌న్‌; అవి ఇప్పుడు ప్ర‌పంచ ఉద్య‌మాలుగా మారాయి”

“ఒత్తిడి, జీవ‌న‌శైలి వ్యాధుల‌కు భార‌త సాంప్ర‌దాయ ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల్లో ఎన్నో జ‌వాబులున్నాయి”

“ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను దేశ పౌరుల‌కే కాదు, ప్ర‌పంచంలో అంద‌రికీ స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అందుబాటులోకి తేవ‌డ‌మే భార‌త‌దేశ ల‌క్ష్యం”

Posted On: 26 APR 2023 3:54PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్  లో  వన్ ఎర్త్  వన్  హెల్త్  -  అడ్వాంటేజ్  హెల్త్  కేర్  ఇండియా 2023 స‌ద‌స్సును వీడియో కాన్ఫరెన్సింగ్   ద్వారా ప్రారంభించి ప్రసంగించారు.

సభనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచంలోని భిన్న దేశాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులు;  పశ్చిమాసియా, సార్క్, ఆసియాన్, ఆప్రికా దేశాలకు చెందిన ప్రతినిధులకు స్వాగతం పలికారు. భారత ప్రాచీన శాసనాల గురించి మాట్లాడుతూ  ‘‘ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతీ ఒక్కరూ వ్యాధులేవీ లేకుండా ఉండాలి, ప్రతీ ఒక్కరికీ ఆనందకరమైన అంశాలు జరగాలి, ఏ ఒక్కరూ ఎలాంటి విచారానికి లోను కాకూడదు’’ అని అవి చెబుతున్నాయన్నారు. భారతదేశం అనుసరిస్తున్న సమ్మిళిత విజన్  గురించి ప్రస్తావిస్తూ వేలాది సంవత్సరాల క్రితం ప్రపంచ మహమ్మారులేవీ  లేని సమయంలోనే భారతదేశం సార్వత్రిక ఆరోగ్యం గురించి కలలు కనేదని ప్రధానమంత్రి చెప్పారు. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం సూత్రం కూడా అదే విశ్వాసాలను పాటిస్తూ ఆలోచన కార్యాచరణకు ఒక ఉదాహరణగా నిలిచిందని ఆయన చెప్పారు. ‘‘మా విజన్  మానవాళికే పరిమితం కాదు, యావత్  పర్యావరణానికి విస్తరిస్తుంది. మొక్కల నుంచి జంతువులు;  భూమి నుంచి నదులు మన చుట్టూ ఉన్న అందరూ ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అని వివరిస్తుంది’’ అని ప్రధానమంత్రని అన్నారు.

అనారోగ్యం ఏదీ లేకుండా ఉంటే మంచి ఆరోగ్యం ఉన్నట్టే అన్న ప్రముఖ సూత్రాన్ని ప్రస్తావిస్తూ ఆరోగ్యంపై భారతదేశం ఆలోచన అనారోగ్యం లేకుండా ఉండడమే కాదు, మా లక్ష్యం అందరి బాగు, అందరి సంక్షేమం అని ఆయన చెప్పారు. ‘‘మా లక్ష్యం భౌతిక, మానసిక, సామాజిక సంక్షేమం’’ అన్నారు.

‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ సిద్ధాంతం ప్రాతిపదికగా భారతదేశ జి-20 ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ ఈ విజన్  సాకారం కావాలంటే ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకోగల ప్రపంచ ఆరోగ్య సంక్షేమ వ్యవస్థ అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. ఇందుకు విలువ ఆధారిత ప్రయాణం, ఆరోగ్య కార్యకర్తల కదలికలు ప్రధానమని తెలుపుతూ ఈ దిశగా ‘‘వన్  ఎర్త్, వన్  హెల్త్-అడ్వాంటేజ్  హెల్త్  కేర్  ఇండియా 2023’’ సదస్సు ఒక కీలకమైన అడుగు అని తెలిపారు. పలు దేశాలు పాల్గొంటున్న నేటి ఈ కార్యక్రమం జి-20 అధ్యక్షత థీమ్  ను ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ప్రపంచం అంతా ఒకటే అని  ‘‘వసుధైవ కుటుంబకం’’ అన్న భారతదేశ సిద్ధాంతం చెబుతుందని తెలియచేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రతినిధులు, వృత్తి నిపుణులు, విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు.

సమగ్ర ఆరోగ్య సంరక్షణ నుంచే భారతదేశానికి బలం లభిస్తోందంటూ భారతదేశ ప్రతిభ, టెక్నాలజీ, ట్రాక్  రికార్డు, సాంప్రదాయం అన్నింటికీ ఇదే మూలమని ప్రధానమంత్రి అన్నారు. భారత వైద్యులు, నర్సులు, సంరక్షకులు ఆరోగ్య వ్యవస్థపై ఎంత ప్రభావం కలిగి ఉంటారనే అంశం మహమ్మారి సమయంలో ప్రపంచం అంత వీక్షించిందని;  వారిలోని పోటీ సామర్థ్యం, కట్టుబాటు, ప్రతిభను ప్రపంచం అంతా గౌరవిస్తున్నదని ఆయన వివరించారు.  భారతీయ వృత్తి నిపుణుల ప్రతిభ ద్వారా ప్రపంచంలోని పలు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు లాభపడ్డాయని ఆయన తెలిపారు. ‘‘సంస్కృతి, వాతావరణం, సామాజిక డైనమిక్స్  లోని వైరుధ్యం అద్భుతమైనది’’ అని ప్రధానమంత్రి అన్నారు. భారత ఆరోగ్య రంగ వృత్తినిపుణుల శిక్షణ, విభిన్న అనుభవాల గురంచి ఆయన ప్రస్తావించారు. విభిన్న పరిస్థితులను  ఎదుర్కోగల వారిలోని అసాధారణ నైపుణ్యాల కారణంగానే భారత ఆరోగ్య సంరక్షణ రంగం ప్రతిభ ప్రపంచ గుర్తింపును, విశ్వాసాన్ని సాధించిందని ఆయన చెప్పారు.

శతాబ్దికి ఒక సారి మాత్రమే ఏర్పడే మహమ్మారి ప్రపంచం అంతటికీ ఎన్నో వాస్తవాలను గుర్తు చేసిందంటూ సన్నిహితంగా అనుసంధానమైన నేటి ప్రపంచంలో సరిహద్దులు ఆరోగ్యపరమైన ముప్పులను నిలువరించలేవన్నారు. మహమ్మారి సమయం వనరుల నిరాకరణ వల్ల దక్షిణాదిలోని దేశాలు అనేక ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొన్నాయని ఆయన నొక్కి చెప్పారు. ‘‘ప్రజలు కేంద్రీకరించి జరిగేదే అసలైన పురోగతి. వైద్య శాస్ర్తాల విభాగంలో ఎంత పురోగతి ఏర్పడింది అనే దానితో సంబంధం లేకుడా చివరి వరుసలోని చివరి వ్యక్తికి ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి రావాలి’’ అని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో అనేక దేశాలు విశ్వసనీయ భాగస్వాములన్నారు. మేడ్  ఇన్  ఇండియా వ్యాక్సిన్లు, ఔషధాలతో మహమ్మారి కాలంలో ప్రజల ఆరోగ్యాలు సంరక్షించడంలో పలు దేశాలతో భాగస్వామి అయినందుకు భారతదేశం గర్వపడుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్-19 వ్యాక్సినేషన్  కార్యక్రమం అమిత వేగంగా చేపట్టడం, 30 కోట్లకు పైగా వ్యాక్సిన్  డోస్  లు 100కి పైగా దేశాలకు అందించడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారతదేశ సామర్థ్యాలు, కట్టుబాటు ఎలాంటివో ప్రపంచానికి తెలిశాయని పునరుద్ఘాటిస్తూ పౌరులకు మంచి ఆరోగ్య సంరక్షణ వసతులు అందించాలనే ప్రతీ దేశానికి విశ్వసనీయ మిత్రునిగా కొనసాగుతుందని శ్రీ మోదీ చెప్పారు.

‘‘వేలాది సంవత్సరాలుగా భారతదేశం సంపూర్ణ ఆరోగ్య సంరక్షణే భారతదేశ లక్ష్యం’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. యోగా, మెడిటేషన్  ద్వారా నివారణీయ, ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణ చర్యలు భారతదేశ సమున్నత సంప్రదాయంలో భాగం, ఆధునిక ప్రపంచానికి ప్రాచీన భారతం అందించిన కానుక, అవి నేడు ప్రపంచ ఉద్యమాలుగా మారాయి అన్నారు. ఆయుర్వేదం సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విభాగం; భౌతిక, మానసిక ఆరోగ్య సంరక్షణ దాని ధ్యేయం అని ఆయన చెప్పారు. ‘‘ఒత్తిడి, జీవనశైలి వ్యాధులకు ప్రపంచం పరిష్కారాలు అన్వేషిస్తోంది. భారత సాంప్రదాయిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు దానికి సమాధానం అందిస్తాయి’’ అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. చిరుధాన్యాలు భారత సాంప్రదాయిక ఆహారమని;  ప్రపంచ ఆహార భద్రత, పోషకాహార సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం వాటికి ఉంది’’ అన్నారు.

ఆయుష్మాన్  భారత్  పథకం గురించి కూడా ప్రధానమంత్రి నొక్కి చెబుతూ అది ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా కవరేజి పథకం అన్నారు. 50 కోట్ల మంది పైగా భారతీయులకు అది వైద్య చికిత్స కవరేజి కల్పిస్తుంది, వారిలో 4 కోట్ల మంది ఇప్పటికే ఎలాంటి పత్రాలతో అవసరం లేని నగదురహిత ఆరోగ్య సేవలు అందుకున్నారు, తద్వారా పౌరులకు 700 కోట్ల డాలర్లు ఆదా అయ్యాయి అని ప్రధానమంత్రి తెలియచేశారు.

ఆరోగ్యపరమైన సవాళ్లకు ప్రపంచ స్పందన ఏకాకిగా ఉండకూడదు;  సమగ్ర, సమ్మిళి, సంస్థాగత స్పందన రావలసిన  సమయం ఇది అని ప్రసంగం ముగిస్తూ ప్రధానమంత్రి చెప్పారు. ‘‘భారతదేశ జి-20 అధ్యక్ష కాలంలో ఇదే ప్రధానం. మన పౌరులకే కాదు... యావత్  ప్రపంచానికి సరసమైన ధరలకు, అందరికీ అందుబాటులో ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంచడం మన లక్ష్యం కావాలి’’ అని ప్రధానమంత్రి అన్నారు. వ్యత్యాసాలు తొలగించడం భారతదేశ ప్రాధాన్యత, సేవలు అందుబాటులో లేని వారికి సేవలందించడం దేశ విశ్వాసానికి సంబంధించిన అధికరణం అని చెప్పారు.  ఈ దిశగా ప్రపంచ భాగస్వామ్యాలు పటిష్ఠం చేయడానికి ఈ సదస్సు వేదిక కాగలదన్న విశ్వాసం వ్యక్తం చేస్తూ ‘‘ఒకే భూమి-ఒకే ఆరోగ్యం’’ అనే ఉమ్మడి అజెండాపై ఈ భాగస్వామ్యాలు ఏర్పాటు కావాలన్న ఆకాంక్ష ప్రధానమంత్రి ప్రకటించారు.

 

పూర్వాప‌రాలు

భార‌త వాణిజ్య‌, పారిశ్రామిక మండ‌లుల స‌మాఖ్య (ఫిక్కి) ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స‌హ‌కారంతో వ‌న్  హెల్త్, అడ్వాంటేజ్  హెల్త్  కేర్   ఇండియా 2023 స‌ద‌స్సు 6వ ఎడిష‌న్   ను భార‌త‌దేశ జి-20 అధ్య‌క్ష‌త‌తో కో బ్రాండ్   చేసింది.  2023 ఏప్రిల్ 26, 27 తేదీల్లో న్యూఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదాన్  లో ఈ స‌ద‌స్సు జ‌రుగుతోంది.

ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా త‌ట్టుకోగ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ నిర్మాణానికి ప్ర‌పంచ స్థాయి స‌హ‌కారాలు, భాగ‌స్వామ్య‌ల ప్రాధాన్య‌త‌ను అంద‌రికీ తెలియ‌చేయ‌డం, విలువ ఆధారిత ఆరోగ్య సంర‌క్ష‌ణ ద్వారాసార్వ‌త్రిక ఆరోగ్య సంర‌క్ష‌ణను సాధించ‌డం రెండు రోజుల పాటు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం. విలువ ఆధారిత వైద్య సేవ‌లందించే శ‌క్తిగా; ప్ర‌పంచ శ్రేణి ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, వెల్   నెస్  సేవ‌లందించే దేశంగా  వైద్య విలువ ఆధారిత ప్ర‌యాణంలో భార‌త‌దేశం బ‌లాల‌ను కూడా అది ప్ర‌పంచానికి చూపుతుంది. జి-20కి భార‌త‌దేశ అధ్య‌క్ష‌త థీమ్  ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భ‌విష్య‌త్తుకు అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. దీనికి ఒకే భూమి, ఒకే ఆరోగ్యం -అడ్వాంటేజ్  హెల్త్   కేర్  ఇండియా 2023గా పేరు పెట్ట‌డం కూడా సంద‌ర్భానికి దీటుగా ఉంది. ఈ రంగంలో జ్ఞానాన్ని మార్పిడి చేసుకునేందుకు ప్ర‌పంచ ఎంవిటి నిపుణులు, ప్ర‌ముఖ అధికారులు, విధాన నిర్ణేత‌లు, పారిశ్రామిక వాటాదారులు, నిపుణులు, వృత్తి నిపుణులు పాల్గొంటున్న‌ ఈ స‌ద‌స్సు ఒక వేదిక‌గా నిలుస్తుంది. ప్ర‌పంచంలో అగ్ర‌గామి దేశాల‌తో నెట్  వ‌ర్క్  ఏర్పాటు చేసుకునేందుకు, అభిప్రాయాల మార్పిడికి, ప‌ర‌స్ప‌ర అనుబంధం ఏర్ప‌ర‌చుకునేందుకు, బ‌ల‌మైన విదేశ భాగ‌స్వామ్యాలు కుదుర్చుకునేందుకు ఇది అవ‌కాశం క‌ల్పిస్తుంది.

70 దేశాలకు చెందిన 125 మంది ఎగ్జిబిటర్లు, 500 మంది విదేశీ ప్రతినిధులు ఈ సదస్సును వీక్షిస్తున్నారు. ఆఫ్రికా, పశ్చిమాసియా, కామన్వెల్త్, సార్క్, ఆసియాన్  సహా 70కి పైగా దేశాలకు చెందిన ఆరోగ్య సంరక్షణ సేవలందించే సంస్థలు, విదేశీ భాగస్వాములను ఒకే వేదిక పైకి తెచ్చి వారందరి అనుసంధానానికి దోహదపడుతుంది. ఆయా దేశాల ప్రతినిధులతో కొనుగోలుదారులు, అమ్మకందారుల సమావేశాలు, బి2బి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ;  పర్యాటక మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ;  వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆయుష్  మంత్రిత్వ శాఖ సహా పలు పారిశ్రామిక సంఘాలు, స్టార్టప్  లకు చెందిన ప్రముఖులు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భాగస్వాములందరితోనూ పరస్పర చర్చా వేదికలు నిర్వహించారు.  

 


(Release ID: 1920588) Visitor Counter : 184