ప్రధాన మంత్రి కార్యాలయం

రెండో శిఖరాగ్ర ప్రజాస్వామ్య సదస్సులో భాగంగా దేశాధినేతల స్థాయి సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు

Posted On: 29 MAR 2023 4:40PM by PIB Hyderabad

నమస్కారం!

   భారతదేశంలోని 140 కోట్ల మంది తరఫున మీకందరికీ నా శుభాభినందనలు.

   నాయకులను ఎన్నుకోవడమనే యోచన రీత్యా ప్రపంచ దేశాలకన్నా ప్రాచీన భారతం చాలా ముందంజలో ఉంది. తమ నాయకుడిని ఎన్నుకోవడం పౌరుల ప్రథమ కర్తవ్యమని మా ఇతిహాసం ‘మహాభారతం’ ప్రబోధిస్తుంది.

   విస్తృతస్థాయి సంప్రదింపు సంఘాల ద్వారా రాజకీయాధికార వినియోగం గురించి మా పవిత్ర వేదాలు ఏనాడో ప్రవచించాయి. రాజ్యాధికారం వంశపారంపర్యం కాదని స్పష్టం చేసే గణతంత్ర రాజ్యాలెన్నో ప్రాచీన భారతంలో ఉండేవనడానికి అనేక చారిత్రక నిదర్శనాలున్నాయి. కాబట్టి నిస్సందేహంగా ప్రజాస్వామ్యానికి భారతదేశాన్ని తల్లిగా పరిగణించవచ్చు.

మాననీయులారా!

   ప్రజాస్వామ్యం అంటే- ఓ నిర్మాణం.. ఆత్మ! ప్రతి మానవుడి అవసరాలు, ఆకాంక్షలకు సమాన ప్రాధాన్యం ఉంటుందన్న విశ్వాసమే దీనికి పునాది. అందుకే “సమష్టి కృషితో సార్వజనీన వికాసం” (సబ్‌ కా ప్రయాస్‌.. సబ్‌కా వికాస్‌) అన్నది భారతదేశంలో మా తారకమంత్రం.

   జీవనశైలిలో మార్పులతో వాతావరణ మార్పు సమస్యపై పోరాటం, ఎక్కడికక్కడ నిల్వ ద్వారా జల సంరక్షణ లేదా ప్రతి ఇంటికీ పరిశుభ్ర వంట ఇంధనం సరఫరా... వంటి మా కార్యక్రమాల్లో ప్రతిదానికీ భారత పౌరుల సమష్టి కృషి శక్తి వనరుగా ఉంటుంది.

   కోవిడ్‌-19 సమయంలో భారత ప్రతిస్పందన ప్రజా సారథ్యం ఫలితమే. భారత తయారీ టీకాల కార్యక్రమంలో 200 కోట్ల డోసుల టీకాలు వేయడమనే బృహత్‌ కార్యక్రమ విజయాన్ని సుసాధ్యం చేసింది పౌరులే. అంతేకాదు.. మా ‘వ్యాక్సిన్‌ మైత్రి'’కార్యక్రమం ద్వారా ప్రపంచంలో లక్షలాది ప్రజలకు టీకాలు సరఫరా చేయబడ్డాయి.

   ఇందుకు దోహదం చేసింది కూడా ‘వసుధైవ కుటుంబకం’ లేదా ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ అనే ప్రజాస్వామ్య సూత్రమే.

మాననీయులారా!

   ప్రజాస్వామ్య విలువల గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి.. కానీ, నేను ఒక్క విషయం  చెప్పాలని భావిస్తున్నాను: అంతర్జాతీయ సవాళ్లు అనేకం ఉన్నప్పటికీ భారతదేశం నేడు శరవేగంగా పురోగమిస్తున్ని కీలక ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా అత్యుత్తమ ప్రకటన మరొకటి ఉండదు. ప్రజాస్వామ్యం ఎంతటి విజయాన్నైనా సాధించగలదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్‌ యూన్‌కు కృతజ్ఞతలు.

అలాగే ఈ భేటీలో పాల్గొన్న విశిష్ట నాయకులందరికీ కృతజ్ఞతలు.

అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతాభివందనాలు.

*****



(Release ID: 1912051) Visitor Counter : 111