గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ శూన్య వ్యర్ధ దినోత్సవం సందర్భంగా చెత్త రహిత నగరాల కోసం ర్యాలీ
Posted On:
28 MAR 2023 12:58PM by PIB Hyderabad
అంతర్జాతీయ శూన్య వ్యర్ధ దినోత్సవం 2023 ని ఘనంగా నిర్వహించడానికి కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 'వ్యర్థాలను తగ్గించడం, నిర్వహించడానికి స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన పద్ధతులు సాధించడం' ఇతివృత్తంతో కార్యక్రమాలు జరుగుతాయి. అంతర్జాతీయ శూన్య వ్యర్ధ దినోత్సవం సందర్భంగా మంత్రిత్వ శాఖ ఢిల్లీలో స్వచ్ఛోత్సవ్ ప్రదర్శన నిర్వహిస్తుంది. కార్యక్రమానికి కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి మరియు ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కో-ఆర్డినేటర్ శ్రీ షోంబి షార్ప్ హాజరయ్యే కార్యక్రమంలో దేశం వివిధ ప్రాంతాలకు 350 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. నగర మేయర్లు, కమిషనర్లు, మిషన్ డైరెక్టర్లు, వ్యాపార,సాంకేతిక నిపుణులు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు నాయకత్వం వహిస్తున్న మహిళలు, యువకులు, సాంకేతిక సంస్థల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.
కాగడాల ప్రదర్శన తో మహిళల నాయకత్వంలో అమలు జరిగే స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా 2023 మార్చి 29,30,31 తేదీల్లో వ్యర్ధ రహిత నగరాల కోసం ప్రజల భాగస్వామ్యంతో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రదర్శన అనంతరం స్థానిక పట్టణ సంస్థ ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాలు, బహిరంగ స్థలాలు, రైల్వే మార్గాలు, ప్రజా మరుగుదొడ్లను శుభ్రం చేసే కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే 2000 కి పైగా నగరాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
స్వచ్ఛోత్సవం - అంతర్జాతీయ శూన్య వ్యర్ధ దినోత్సవం:
స్వచ్ఛోత్సవం - అంతర్జాతీయ శూన్య వ్యర్ధ దినోత్సవం సందర్భంగా ప్రదర్శనలు నిర్వహించడం తో పాటు వ్యర్ధ రహిత నగరాల అభివృద్ధికి అమలు చేయాల్సిన ఉత్తమ విధానాలు, వ్యర్ధ రహిత నగరాల నిర్మాణంలో మహిళలు, యువత పాత్ర అంశాలపై చర్చలు జరుగుతాయి. వ్యర్ధ రహిత నగరాల అభివృద్ధిపై సంబంధిత నగర మేయర్ వ్యాపార, సాంకేతిక అంశాలపై చర్చలు జరుపుతారు. న్యూక్లియర్ సేఫ్టీ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్, యూఎన్ఈపీ ఫెడరల్ మంత్రిత్వ శాఖ జీఐజెడ్ సహకారంతో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
పారిశుధ్య అంశాలపై ప్రజల ఆలోచన విధానం, ప్రవర్తన మారేలా చూడాలన్న లక్ష్యంతో 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి అమలు జరుగుతున్న కార్యక్రమాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ అతి పెద్ద కార్యక్రమంగా గుర్తింపు పొందింది. స్వచ్ఛ భారత్ మిషన్ ను మరింత పటిష్టంగా అమలు చేయడానికి శాస్త్రీయ విధానంలో ఘన వ్యర్థాలను నిర్వహించి వ్యర్థరహిత నగరాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా రూపొందిన స్వచ్ఛ భారత్ మిషన్- అర్బన్ 2.0 పధకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ ఒకటో తేదీన ప్రారంభించారు. పర్యావరణహిత జీవనశైలి (లైఫ్) విధానాన్ని శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 1న గ్లాస్గో లో జరిగిన కాప్ 26 సమావేశంలో ప్రతిపాదించారు. యూఎన్ఈపీ ప్రతిపాదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ విధానం సహకరిస్తుంది. అర్ధంలేని అవసరం లేని విధ్వంసానికి పాల్పడకుండా అవసరాల మేరకు ప్రణాళిక ప్రకారం సహజ వనరులను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని భారతదేశం ప్రతిపాదించిన 'లైఫ్' విధానం సూచిస్తుంది.
మహిళల నాయకత్వంలో మూడు వారాల పాటు అమలు జరిగే స్వచ్ఛోత్సవం కార్యక్రమాన్ని శ్రీ హర్దీప్ సింగ్ పూరి 2023 మార్చి 8న ప్రారంభించారు. మహిళల నుంచి మహిళల నాయకత్వంలో పారిశుధ్య కార్యక్రమాలు అమలు జరగాలన్న లక్ష్యంతో స్వచ్ఛోత్సవం అమలు జరుగుతుంది. అన్ని రంగాలకు చెందిన మహిళలు కార్యక్రమంలో పాల్గొనేలా చూసి, మహిళల నాయకత్వంలో వ్యర్ధ రహిత నగరాల నిర్మాణం జరిగే విధంగా స్వచ్ఛోత్సవం అమలు జరుగుతుంది.
మూడు వారాల పాటు అమలు జరిగిన స్వచ్ఛోత్సవం 2023 మార్చి 29న ముగుస్తుంది. 30 వ తేదీని అంతర్జాతీయ శూన్య వ్యర్ధ దినోత్సవంగా పాటిస్తారు.
పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛత కోసం పనిచేస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలు లేదా మహిళా నేతృత్వంలోని సంస్థలను గుర్తించడానికి ఉమెన్ ఐకాన్స్ లీడింగ్ స్వచ్చత (విన్స్) అవార్డులు 2023 ప్రకటించారు. స్వచ్ఛత అంశంపై అవగాహన కల్పించడానికి మంత్రిత్వ శాఖ స్వచ్ఛత యాత్ర నిర్వహించింది. వ్యర్థాల నిర్వహణ ద్వారా పారిశ్రామికవేత్తలుగా మారిన స్వయం సహాయక బృంద సభ్యులు వివిధ రాష్ట్రాలలో పర్యటించి అనుభవాలు పంచుకున్నారు. యాత్రలో స్వచ్ఛ దూతలుగా తొలిసారిగా పాల్గొన్న స్వయం సహాయక బృంద సభ్యులు వ్యర్థాల నిర్వహణపై అమలు జరుగుతున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసి చర్చల ద్వారా వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు.
***
(Release ID: 1911507)
Visitor Counter : 177