సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

దిల్లీ-ధర్మశాల-దిల్లీ ఇండిగో విమానాన్ని జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రులు శ్రీ అనురాగ్ ఠాకూర్, శ్రీ జ్యోతిరాదిత్య సిందియా, సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్


ఇండిగో విమానాలు రాష్ట్ర జనాభాలో సగం మందికి ప్రయోజనం చేకూరుస్తాయన్న అనురాగ్ ఠాకూర్, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం కోసం విజ్ఞప్తి

రాబోయే 3-4 సంవత్సరాల్లో 200 విమానాశ్రయాలు, వాటర్‌డ్రోమ్‌లు, హెలీపోర్ట్‌ల ఏర్పాటు లక్ష్యం: జ్యోతిరాదిత్య సిందియా

ధర్మశాల విమానాశ్రయం విస్తరణ కోసం రెండు దశల ప్రణాళిక కొనసాగుతోంది, ఎయిర్‌బస్ ఏ320 రప్పించడమే లక్ష్యం: సిందియా

Posted On: 26 MAR 2023 11:20AM by PIB Hyderabad

దిల్లీ-ధర్మశాల-దిల్లీ మొదటి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సిందియా, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ జెండా ఊపి విమాన ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఇండిగో విమానం ద్వారా హిమాచల్‌ప్రదేశ్‌కు అనుసంధానాన్ని పెంచినందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు శ్రీ అనురాగ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు. పర్వత ప్రాంత రాష్ట్రానికి వెళ్లకపోతే ఇండిగో నిజమైన జాతీయ విమానయాన సంస్థగా నిలవదని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఠాకూర్ పెద్ద విమానాశ్రయం కోసం ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం భారతదేశం నలుమూలల నుంచి హిమాచల్‌కు వచ్చే ప్రయాణీకులు మొదట దిల్లీ వెళ్లి, అక్కడి నుంచి అనుసంధాన విమానం ఎక్కాల్సివస్తోందని చెప్పారు. ధర్మశాలలో ఒక పెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తే ప్రయాణీకులకు అంతరాయం లేని ప్రయాణం అందుతుందన్నారు.

దేశంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదేనని శ్రీ ఠాకూర్ చెప్పారు. తక్కువ కాలంలోనే ఈ సంఖ్య 74 నుంచి 140కి చేరిందని వెల్లడించారు. హవాయ్‌ చెప్పుల్లో తిరిగే ప్రజలు ఉడాన్ పథకం వల్ల హవాయి జహాజ్‌లో (విమానం) ప్రయాణించవచ్చని అన్నారు.

విమానాశ్రయం అందిస్తున్న సేవల గురించి మాట్లాడిన శ్రీ ఠాకూర్, ధర్మశాల విమానాశ్రయం ఐదు జిల్లాలను కలుపుతుందని, రాష్ట్రంలోని సగం జనాభాకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తోందని అన్నారు. ఈ ఒక్క ఇండిగో విమానం హిమాచల్‌ ప్రదేశ్‌లోని సగం ప్రాంతాలను, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్, ధర్మశాల విమానాశ్రయం 1990లో మొదటి విమానాన్ని చూసిందని, ఆ తర్వాత కార్యకలాపాలు పెరిగాయని, ఇప్పుడు 1376 మీటర్ల రన్‌వే ఉందని వెల్లడించారు. స్థలం అనుకూలిస్తే రన్‌వేను మరింత పొడిగించవచ్చని వివరించారు. దలైలామా ఉన్నందున విమానాశ్రయంలో రద్దీ పెరుగుతుంది, వాయవ్య హిమాచల్‌ప్రదేశ్‌కు వాయు అనుసంధానతను అందిస్తుంది, ఈ రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులను తీసుకువస్తుంది, తద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.

పౌర విమానయాన రంగంలో గత 65 ఏళ్లలో సాధించని వృద్ధిని 48 విమానాశ్రయాలు, వాటర్‌డ్రోమ్, హెలీపోర్ట్‌ల ఏర్పాటు ద్వారా గత 9 ఏళ్లలో సాధించామని పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సిందియా చెప్పారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో ఈ సంఖ్యను 200 దాటించాలన్న లక్ష్యంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని వివరించారు. ఈ ప్రయత్నంలో భాగంగా, మెట్రో నగర విమానాశ్రయాలతో పాటు చివరి మైలును కూడా అనుసంధానించే చిన్న విమానాశ్రయాలకు కూడా సమాన ప్రాముఖ్యత ఇస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేస్తున్న కృషిని సిందియా కొనియాడారు. ఆయన కృషి ఫలితంగానే ధర్మశాల నేడు ప్రాంతీయ, జాతీయ క్రికెట్‌ మాత్రమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇస్తోందని అన్నారు. ధర్మశాల స్టేడియం ప్రపంచంలోనే అత్యుత్తమం అని అన్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో రాష్ట్రం పుంజుకునేలా క్రికెట్‌ చేసిందని, ఈ ఘనత కూడా అనురాగ్ ఠాకూర్‌కే చెందుతుందంటూ అభినందించారు.

ధర్మశాల విమానాశ్రయం విస్తరణ కోసం శ్రీ అనురాగ్ ఠాకూర్ చేసిన అభ్యర్థనను మంత్రి అంగీకరించారు, ఇందుకోసం రెండు-దశల ప్రణాళికపై తన మంత్రిత్వ శాఖ ఇప్పటికే పని చేస్తోందని చెప్పారు. రన్‌వేను 1900 మీటర్లకు పొడిగించడంతో పాటు టర్బోప్రాప్ విమానాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడపడానికి వీలు మొదటి దశ కల్పిస్తుంది. రెండో దశలో భాగంగా, బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ320లను విమానాశ్రయంలో దించాలన్న లక్ష్యంతో రన్‌వేను 3110 మీటర్లకు పొడిగించడం జరుగుతుందని వివరించారు.

తన మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో సాధించిన ఇతర విజయాల గురించి కూడా సిందియా వివరించారు. సిమ్లా విమానాశ్రయంలో రన్‌వే పునరుద్ధరణ పూర్తయిందని, మండి వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి స్థల అనుమతులు అందాయని చెప్పారు. రాష్ట్రంలో పౌర విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని సిందియా పునరుద్ఘాటించారు.

"పౌర విమానయాన రంగంలో ప్రజాస్వామ్యీకరణ పూర్తయింది, విమానాలు ఎగరడం మాత్రమే చూసినవాళ్లు నేడు వాటిలో ఎక్కి ఎగురుతున్నారు" అని చెప్పిన మంత్రి, ఉడాన్ పథకం రూపంలోని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత వల్ల ఒక కోటి 15 లక్షల మంది భారతీయ విమాన ప్రయాణికుల సంఖ్యకు జత కలిశారని చెప్పారు.

ఉడాన్‌ కింద హిమాచల్ రాష్ట్రానికి 44 మార్గాలకు అనుమతులు అందాయి, వాటిలో 22 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో, 2013-14లో వారానికి 40 విమాన రాకపోకల సంఖ్య ఇప్పుడు 110కి పెరిగిందని, 9 సంవత్సరాల్లో 175% వృద్ధి కనిపించిందని మంత్రి చెప్పారు. ధర్మశాలలో, 2013-14లో వారానికి 28గా ఉన్న విమానాల రాకపోకల సంఖ్య గత 9 ఏళ్లలో 110% పెరిగి నేడు 50కి చేరుకుందన్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా పార్లమెంటు సభ్యుడు శ్రీ కిషన్ కపూర్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు వాయు అనుసంధానతను అందించడంలో ఈ విమానం ఒక పెద్ద మైలురాయిగా అభివర్ణించారు. కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో రాష్ట్ర పర్యాటక రంగంలో కార్యకలాపాలు విపరీతంగా తగ్గాయని, ఇప్పుడు పునరుద్ధరణ కనిపిస్తోందని వెల్లడించారు. ధర్మశాలకు రాకపోకలు సాగించే విమానాల సంఖ్యను మరింత పెంచే అంశాన్ని పరిశీలించాలని శ్రీ కపూర్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్ దిల్లీ నుంచి ధర్మశాలకు ప్రతిరోజూ విమానాలను నడుపుతుంది. దీంతో, ఇండిగో రోజువారీ విమాన ప్రయాణాల సంఖ్య 1795కి పెరిగింది, ఈ ప్రాతిపదికన ప్రపంచంలోని ఏడో అతి పెద్ద విమానయాన సంస్థగా నిలిచింది.

 

********



(Release ID: 1910953) Visitor Counter : 135