ప్రధాన మంత్రి కార్యాలయం
మార్చి 18నప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సును ప్రారంభించనున్న ప్రధాని
Posted On:
16 MAR 2023 6:57PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి 18వ తేదీ ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సును ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని పూసా రోడ్డులోగల ‘ఎన్‌ఎఎస్‌సి’ సముదాయంలోగల ‘ఐఎఆర్‌ఐ’ ప్రాంగణంలోని సుబ్రమణ్యం హాలులో ఉదయం 11:00 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. అనంతరం హాజరైన వారినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యుఎన్‌జిఎ) 2023ను అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం (ఐవైఎం)గా ప్రకటించింది. అలాగే ‘ఐవైఎం-2023’ వేడుకలను ‘ప్రజా ఉద్యమం’గా మలచాలన్న ప్రధానమంత్రి దార్శనికత మేరకు భారతదేశాన్ని ‘ప్రపంచ చిరుధాన్య కూడలి’గా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ కృషిలో అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, రైతులు, అంకుర సంస్థలు, ఎగుమతిదారులు, చిల్లర వ్యాపారులు, ఇతర భాగస్వాములు పాలు పంచుకుంటున్నారు. తదనుగుణంగా సాగుదారులు, వినియోగదారులతోపాటు వాతావరణం కోసం చిరుధాన్య (శ్రీ అన్న) వినియోగంపై అవగాహన కల్పన ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో భారత్ నిర్వహిస్తున్న ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సు ఓ కీలక కార్యక్రమం కానుంది.
రెండు రోజులపాటు నిర్వహించే ఈ సదస్సులో వివిధ ముఖ్యాంశాలపై చర్చా గోష్ఠులుంటాయి. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, ఇతర భాగస్వాములకు చిరుధాన్యాలపై ప్రోత్సాహంతోపాటు అవగాహన కల్పిస్తారు. చిరుధాన్య విలువ గొలుసు అభివృద్ధి; వాటిద్వారా ఆరోగ్యం-పోషక విలువలు; మార్కెట్ అనుసంధానం; పరిశోధన-అభివృద్ధి తదితరాలు ఈ గోష్ఠులలో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి. ఈ సదస్సుకు వివిధ దేశాల వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, పోషకాహార-ఆరోగ్య నిపుణులు, అంకుర సంస్థల సారథులు, ఇతర భాగస్వాములు కూడా హాజరవుతారు.
*****
(Release ID: 1907997)
Visitor Counter : 126
Read this release in:
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam