ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

2023 వ సంవత్సరం ఫిబ్రవరి 26 వ తేదీ న జరిగిన ‘ మన్ కీబాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం  98 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 26 FEB 2023 11:40AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క ఈ 98 వ భాగం లో మీ అందరిని కలుసుకొంటున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. వందో భాగం దిశ గా సాగుతున్న ఈ ప్రయాణం లో ప్రజల భాగస్వామ్యాన్ని వ్యక్తపరచేందుకు అద్భుతమైన వేదిక గా ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని మీరందరూ మార్చుకున్నారు. ప్రతి నెలా లక్షల సంఖ్య లో వచ్చే సందేశాల లో చాలా మంది మనసు లో మాట నాకు చేరుతుంది. మీ మనసు యొక్క శక్తి ఏమిటో మీకు తెలుసును. అదేవిధంగా సమాజ శక్తి తో దేశం శక్తి ఎలా పెరుగుతుందో మనం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లోని వివిధ భాగాలలో చూశాం. అర్థం చేసుకున్నాం. ఇది నేను అనుభవించాను. దీనిని నేను స్వీకరించాను. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో భారతీయ సంప్రదాయ క్రీడల ను ప్రోత్సహించే విషయం మాట్లాడిన రోజు నాకు గుర్తుంది. ఆ సమయం లో- వెంటనే- భారతీయ క్రీడల తో సంధానం అయ్యేందుకు, వాటిని ఆస్వాదించేందుకు, నేర్చుకునేందుకు దేశం లో ఒక చైతన్యం పెల్లుబుకింది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో భారతీయ బొమ్మల ను గురించి మాట్లాడినప్పుడు దేశ ప్రజలు దానిని కూడా ప్రోత్సహించారు. ఇప్పుడు భారతీయ బొమ్మల విషయం లో విదేశాల లో కూడా పెరుగుతున్న డిమాండ్ వాటిపై పెరుగుతోన్న వ్యామోహాన్ని తెలియజేస్తుంది. మనం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో భారతీయ కథా శైలి ని గురించి మాట్లాడినప్పుడు వాటి కీర్తి కూడా చాలా దూరం వెళ్ళింది. భారతీయ కథా కథనాల వైపు ప్రజలు మరింతగా ఆకర్షితులు అవుతున్నారు.

 

మిత్రులారా, సర్ దార్ పటేల్ జయంతి అంటే ‘ఏకత దినోత్సవం' సందర్భం లో మనం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మూడు పోటీల ను గురించి మాట్లాడుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది. దేశభక్తి గీతాల కు, లాలి పాటల కు మరియు ముగ్గుల కు సంబంధించిన పోటీ లు అవి. దేశం అంతటా 700 కు పైగా జిల్లాల నుండి 5 లక్షల మంది కి పైగా ప్రజలు ఉత్సాహం గా పాల్గొన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పిల్లలు, పెద్దలు, వృద్ధులు- అందరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొని 20కి పైగా భాషల లో తమ ఎంట్రీల ను పంపారు. ఈ పోటీల లో పాల్గొన్న వారందరికీ నా అభినందన లు. మీలో ప్రతి ఒక్కరూ ఒక విజేత, కళా సాధకులు. మన దేశం లోని వైవిధ్యం పట్ల, సంస్కృతి పట్ల ప్రేమ ను మీరందరూ నిరూపించారు.

 

మిత్రులారా, ఈ సందర్భం లో నాకు లత మంగేశ్ కర్ గారు- లత దీదీ గుర్తు కు రావడం చాలా స్వాభావికం. ఎందుకు అంటే ఈ పోటీ ప్రారంభమైన రోజు లత దీదీ ట్వీట్ చేసి, తప్పక ఈ పోటీల లో పాల్గొనండంటూ దేశ ప్రజల కు విజ్ఞ‌ప్తి చేశారు.

 

మిత్రులారా, లాలిపాట ల రచన పోటీ లో ప్రథమ బహుమతి ని కర్ణాటక లోని చామరాజనగర్ జిల్లా కు చెందిన శ్రీ బి.ఎమ్. మంజునాథ్‌ పొందారు. కన్నడం లో వ్రాసిన ‘మలగు కంద’ అనే లాలిపాట కు ఆయనకు ఈ పురస్కారం లభించింది. తన తల్లి, నానమ్మ లు పాడిన లాలి పాట ల నుండి ఆయన దీనిని వ్రాసేందుకు ప్రేరణ ను పొందారు. ఇది విని మీరు కూడా ఆనందిస్తారు.

 

(కన్నడ సౌండ్ క్లిప్ – 35 సెకన్లు- తెలుగు అనువాదం)

 

"నిదురపో.. నిదురపో.. నా చిట్టి పాపా!

నా తెలివైన ప్రియతమానిదురపో

రోజు గడచిపోయింది

చీకటై పోయింది

నిద్రాదేవి వస్తుంది-

నక్షత్రాల తోట నుండి,

కలల ను కోసుకు వస్తుంది

నిదురపో.. నిదురపో..

జోజో...జో..జో..

జోజో...జో..జో.."

 

అసమ్ లో కామరూప్ జిల్లా కు చెందిన దినేశ్ గోవాలా గారు ఈ పోటీ లో ద్వితీయ బహుమతి ని గెలుచుకున్నారు. ఆయన వ్రాసిన లాలిపాట లో స్థానికం గా మట్టి పాత్రల ను, లోహ పాత్రల ను తయారు చేసే కళాకారుల ప్రసిద్ధ చేతిపనుల ముద్ర ఉంది.

 

(అసమీస్ సౌండ్ క్లిప్ – 35 సెకన్లు- తెలుగు అనువాదం)

 

సంచి తెచ్చాడు కుమార్ దాదా

సంచి లో ఏముంది?

కుమ్మరి సంచి ని తెరిచి చూస్తే

సంచి లో ఉన్నది అందమైన గిన్నె!

మా బొమ్మ కుమ్మరి ని అడిగింది

ఈ చిన్న గిన్నె ఎలా ఉంది అని!

 

గీతాలు, లాలిపాటల వలె ముగ్గుల పోటీ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో పాల్గొన్న వారు ఒకరికి మించి మరొకరు అందమైన ముగ్గుల ను పంపించారు. ఇందులో పంజాబ్‌ కు చెందిన కమల్ కుమార్ గారు విజేత గా నిలచారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్, అమర వీరుడు భగత్ సింహ్ ల చాలా అందమైన రంగవల్లిక ను కమల్ కుమార్ గారు తయారు చేశారు. మహారాష్ట్ర లోని సాంగ్ లీ కి చెందిన సచిన్ నరేంద్ర అవ్ సారి గారు జలియాంవాలా బాగ్- అక్కడి నరసంహారం, శహీద్ ఉధమ్ సింహ్ ధైర్యాన్ని తన రంగోలీ లో ప్రదర్శించారు. గోవా నివాసి గురుదత్ వాన్టేకర్ గారు గాంధీజీ యొక్క రంగోలీ ని తయారుచేశారు. పుదుచెరి కి చెందిన మాలతిసెల్వమ్ గారు కూడా ఎందరో గొప్ప స్వాతంత్ర్య సమరయోధులపైన శ్రద్ధ తీసుకొన్నారు. దేశభక్తి గీతాల పోటీ విజేత టి. విజయ దుర్గ గారు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు. ఆమె తెలుగు లో తన ఎంట్రీ ని పంపించారు. ఆమె తన ప్రాంతంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డి గారి నుండి ఎంతో ప్రేరణ పొందారు. విజయ దుర్గ గారి ఎంట్రీ లోని ఈ భాగాన్ని కూడా మీరు వినండి.

 

(తెలుగు సౌండ్ క్లిప్ (27 సెకన్లు)

 

రేనాడు ప్రాంత సూరీడా!

ఓ వీర నరసింహా!

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామానికి నువ్వు అంకురానివి!

అంకుశానివి!

ఆంగ్లేయుల న్యాయరహితమైన

నిరంకుశ దమన కాండ ను చూసి

మీ రక్తం ఉడికిపోయింది మరి మంట ను చిమ్మింది

రేనాడు ప్రాంత సూరీడా!

ఓ వీర నరసింహా!

 

తెలుగు తరువాత, ఇప్పుడు నేను మీకు మైథిలి లో ఓ క్లిప్ ను వినిపిస్తాను. దీనిని దీపక్ వత్స్ గారు పంపించారు. ఆయన కూడాను ఈ పోటీ లో బహుమతి ని గెలుచుకొన్నారు.

 

(మైథిలి సౌండ్ క్లిప్ – 30 సెకన్లు- తెలుగు అనువాదం)

సోదరా!

ప్రపంచానికే గర్వకారణం భారతదేశం

మన దేశం మహోన్నతం

మూడు వైపులా సముద్రం

ఉత్తరాన బలంగా కైలాసం

గంగ, యమున, కృష్ణ, కావేరి,

జ్ఞానం, సంపత్తి రూపాలు

సోదరా!

మన దేశం గొప్పది

త్రివర్ణ పతాకం లో ప్రాణం నెలకొని ఉంది

 

మిత్రులారా, ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. పోటీ లో వచ్చిన ఎంట్రీ ల జాబితా చాలా పెద్దదిగా ఉంది. మీరు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ లోకి వెళ్లి, మీ కుటుంబం తో కలసి వాటిని చూడండి- వినండి. మీరు చాలా స్ఫూర్తి ని పొందుతారు.

 

ప్రియమైన నా దేశప్రజలారా, బనారస్ ను గురించి అయినా, శహ్ నాయి ని గురించి అయినా, ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్ ను గురించి అయినా మరి నా దృష్టి అటువైపు వెళ్ళడం స్వాభావికం. కొద్ది రోజుల కిందట ‘ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్ యువ పురస్కారాల’ను ఇవ్వడమైంది. సంగీతం, ప్రదర్శన కళల రంగం లో వర్ధమాన కళాకారుల కు, ప్రతిభావంతులైన కళాకారుల కు ఈ పురస్కారాల ను ఇస్తారు. ఈ కళాకారులు కళ కు, సంగీత ప్రపంచాని కి ఆదరణ పెంచడంతో పాటుగా వారు దాని అభ్యున్నతి కి కూడాను కృషి చేస్తున్నారు. కాలక్రమేణా జనాదరణ తగ్గుతున్న వాయిద్యాల కు కొత్త వైభవాన్ని ఇచ్చిన కళాకారులు కూడా వీరిలో ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఈ ట్యూన్ ను శ్రద్ధ గా వినండి..

 

(సౌండ్ క్లిప్ (21 సెకన్లు) వాయిద్యం- ‘సుర్ సింగార్’, కళాకారుడు -జాయ్‌దీప్ ముఖర్జీ)

 

ఇది ఏ వాయిద్యమో మీకు తెలుసా ? మీకు తెలియకపోవచ్చు కూడా! ఈ వాయిద్య మంత్రం పేరు ‘సుర్ సింగార్’. ఈ ట్యూన్‌ ను జాయ్‌దీప్ ముఖర్జీ గారు స్వరపరిచారు. ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్ పురస్కారం తో సన్మానితులైన యువత లో జాయ్‌దీప్ గారు కూడా ఉన్నారు. 50 వ,60 వ దశాబ్దాల నుండి ఈ వాయిద్యం ట్యూన్ లను వినడం చాలా అరుదు గా మారింది. అయితే ‘సుర్ సింగార్’ ను మళ్లీ జనాదరణ పాత్రం గా చేయడానికి జాయ్‌దీప్ తన సర్వ శక్తుల ను ఒడ్డుతున్నారు.

అదేవిధంగా కర్నాటక వాద్య సంగీత విభాగం లోని మాండలిన్‌ లో ఈ పురస్కారాన్ని పొందిన సోదరి ఉప్పలపు నాగమణి గారి కృషి కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఇందులో సంగ్రామ్ సింహ్ సుహాస్ భండారే గారు వార్ కరీ కీర్తన కు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ జాబితా లో సంగీత కళాకారులు మాత్రమే కాదు - వి. దుర్గా దేవి గారు 'కరకట్టమ్' అనే ప్రాచీన నృత్య రూపాని కి ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ పురస్కారాన్ని పొందిన మరో విజేత రాజ్ కుమార్ నాయక్ గారు తెలంగాణ లోని 31 జిల్లాల్లో 101 రోజుల పాటు పేరిణి ఒడిసీ ని నిర్వహించారు. పేరిణి రాజ్‌కుమార్‌ అనే పేరు తో ప్రజల కు సుపరిచితులు అయ్యారు. కాకతీయ రాజుల కాలం లో శివుని కి అంకితమిచ్చిన పేరిణి నాట్యం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రాజవంశం యొక్క మూలాలు నేటి తెలంగాణ తో ముడిపడ్డాయి. మరో పురస్కార విజేత సాయిఖౌమ్ సుర్ చంద్రా సింహ్ గారు. మైతేయి పుంగ్ వాద్యాన్ని తయారు చేయడం లో సుప్రసిద్ధులు. ఈ పరికరం మణిపుర్‌ కు చెందింది. పూరణ్ సింహ్ ఒక దివ్యాంగ కళాకారుడు. రాజూలా-మలుశాహీ, న్యౌలీ, హుడ్ కా బోల్, జాగర్ వంటి వివిధ సంగీత రూపాల ను లోకప్రియత్వానికి నోచుకొనేటట్టు గా కృషి చేస్తున్నారు. వాటికి సంబంధించిన పలు ఆడియో రికార్డింగుల ను కూడా సిద్ధం చేశారు. పూరణ్ సింహ్ గారు ఉత్తరాఖండ్ జానపద సంగీతం లో తన ప్రతిభ ను కనబరచి అనేక పురస్కారాల ను కూడా గెలుచుకొన్నారు. కాల పరిమితి కారణం గా పురస్కార గ్రహీత లు అందరి ని గురించి నేను ఇక్కడ మాట్లాడలేకపోవచ్చు. అయితే మీరు తప్పక వారి ని గురించి చదువుతారు అనే విశ్వాసం నాలో ఉంది. ప్రదర్శన కళల కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ కళాకారులంతా క్షేత్రస్థాయి లో ప్రతి ఒక్కరి ని ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను.

 

ప్రియమైన నా దేశ వాసులారా, వేగం గా పురోగమిస్తున్న మన దేశం లోడిజిటల్ ఇండియా శక్తి ప్రతి మూల లో కనిపిస్తుంది. డిజిటల్ ఇండియా శక్తి ని ప్రతి ఇంటి కి తీసుకుపోవడం లో వివిధ ఏప్‌ లు పెద్ద పాత్ర ను పోషిస్తున్నాయి. అటువంటి ఒక ఏప్ యే ‘ఇ-సంజీవని’ (E-Sanjeevani). ఈ ఏప్ నుండి టెలి-కన్సల్టేశన్ చేయవచ్చు. అంటే దూరం గా కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా మీరు మీ అనారోగ్యానికి సంబంధించి వైద్యుడి ని సంప్రదించవచ్చును. ఇప్పటి వరకు ఈ ఏప్‌ ను ఉపయోగిస్తున్న టెలి-కన్సల్టెంట్ ల సంఖ్య 10 కోట్లు మించింది. మీరు ఊహించవచ్చు.. వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా 10 కోట్ల సంప్రదింపులు అంటే ఎంత పెద్ద గెలుపో ! రోగి కి- వైద్యునికి మధ్య అద్భుతమైన సంబంధం - ఇది ఒక పెద్ద విజయం. ఈ విజయానికి గాను వైద్యుల ను, ఈ సదుపాయాన్ని వినియోగించుకున్న రోగులు అందరి ని నేను అభినందిస్తున్నాను. భారతదేశం లోని ప్రజలు సాంకేతికత ను వారి జీవనం లో ఎలా భాగం చేసుకున్నారో చెప్పేందుకు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ.

 

కరోనా కాలం లో ‘ఇ-సంజీవని’ ఏప్ ద్వారా టెలి-కన్సల్టేశన్ ప్రజల కు గొప్ప వరం అని నిరూపణ అయింది. దీని ని గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో డాక్టర్ తో, రోగి తో మాట్లాడి, చర్చించి, విషయాన్ని మీకు తెలియజేయాలి అని నేను కూడా ఆలోచించాను. టెలి-కన్సల్టేశన్ ప్రజల కు ఎంత ప్రభావవంతం గా ఉందనేది తెలుసుకొనేందుకు మనం ప్రయత్నిద్దాం. సిక్కిమ్ కు చెందిన డాక్టర్ మదన్ మణి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ మదన్ మణి సిక్కిమ్ కు చెందిన వారు అయినప్పటికీ ధన్‌బాద్‌ లో ఎంబీబీఎస్ చేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో ఎండీ చేశారు. గ్రామీణ ప్రాంతాల లో వందల కొద్దీ మంది కి టెలి-కన్సల్టేశన్ ఇచ్చారు.

 

ప్రధాన మంత్రి: నమస్కారం.. నమస్కారం మదన్ మణి గారు..

డాక్టర్ మదన్ మణి: నమస్కారం సర్.

‘ప్రధాన మంత్రి: నేను నరేంద్ర మోదీ ని మాట్లాడుతున్నాను.

డాక్టర్ మదన్ మణి: సర్.. సర్.

ప్రధాన మంత్రి: మీరు బనారస్‌ లో చదువుకున్నారు కదా.

డాక్టర్ మదన్ మణి: అవును సర్.. నేను బనారస్‌ లో చదువుకున్నాను సర్.

ప్రధాన మంత్రి: మీ వైద్య విద్యాభ్యాసం అక్కడే జరిగింది.

డాక్టర్ మదన్ మణి: అవును సర్.. అవును.

ప్రధాన మంత్రి: కాబట్టి మీరు బనారస్‌ లో ఉన్నప్పటి బనారస్ ను, ఇప్పుడు మారిన బనారస్ తో పోల్చి చూసేందుకు ఎప్పుడైనా వెళ్లారా ?

డాక్టర్ మదన్ మణి: ప్రధాన మంత్రి సర్.. సిక్కిమ్ కు తిరిగి వచ్చినప్పటి నుండి నేను వెళ్లలేకపోయాను. కానీ చాలా మార్పు వచ్చింది అని నేను విన్నాను.

ప్రధాన మంత్రి: మీరు బనారస్ ను వదలిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ?

డాక్టర్ మదన్ మణి: నేను 2006 లో బనారస్ ను వదలి వెళ్ళాను సర్.

ప్రధాన మంత్రి: ఓహ్... ఐతే మీరు తప్పకుండా వెళ్లాలి.

డాక్టర్ మదన్ మణి: అవును సర్... అవును.

ప్రధాన మంత్రి: సరే, మీరు సుదూర పర్వతాల లో నివసిస్తూ సిక్కిమ్ ప్రజలకు టెలి-కన్సల్టేశన్స్ యొక్క గొప్ప సేవల ను అందిస్తున్నందుకు మీకు నేను ఫోన్ చేశాను.

డాక్టర్ మదన్ మణి: సర్..

ప్రధాన మంత్రి: నేను మీ అనుభవాన్ని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోతల కు వెల్లడించాలని అని నేను అనుకొంటున్నాను.

డాక్టర్ మదన్ మణి: సర్.

ప్రధాన మంత్రి: కొంచెం నాకు చెప్పండి.. మీ అనుభవం ఎలా ఉంది ?

డాక్టర్ మదన్ మణి: అనుభవం.. చాలా గొప్ప అనుభవం ప్రధాన మంత్రి గారు. సిక్కిమ్ లోని సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని కి వెళ్లడానికి కూడా ప్రజలు వాహనాన్ని ఎక్కి కనీసం ఒకవంద రూపాలయ నుండి రెండు వందల రూపాయల వరకు ఖర్చు పెట్టేందుకు తీసుకుపోళ్లాలి. అక్కడ డాక్టర్ ఉండవచ్చు.. ఉండకపోవచ్చు. ఇది కూడా ఒక సమస్య. టెలి కన్సల్టేశన్ ద్వారా ప్రజలు మాతో, సుదూర ప్రాంతాల కు చెందిన వ్యక్తుల తో నేరు గా సంధానం అవుతారు. ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల కమ్యూనిటీ హెల్థ్ ఆఫీసర్ (సి హెచ్ ఒ స్) వారి ని మాతో కనెక్ట్ చేస్తారు. వారు వారి పాత వ్యాధుల రిపోర్టులు, ప్రస్తుత పరిస్థితి- ఇలా ప్రతిదీ మాకు చెప్తారు.

ప్రధాన మంత్రి: అంటే డాక్యుమెంట్స్ ను బదలాయిస్తారన్నమాట.

డాక్టర్ మదన్ మణి: అవును సర్.. అవును. వారు డాక్యుమెంట్స్ ను బదలాయిస్తారు. ఒక వేళ బదలాయించలేకపోయారు అంటే వాటిని చదివి మాకు తెలియజేస్తారు.

ప్రధాన మంత్రి: అక్కడి వెల్‌నెస్‌ సెంటర్‌ డాక్టర్‌ చెప్తారా.

డాక్టర్ మదన్ మణి: అవును సర్. వెల్ నెస్ సెంటర్‌ లో ఉండే కమ్యూనిటీ హెల్థ్ ఆఫీసర్ (సి హెచ్ ఒ) మాకు చెప్తారు.

ప్రధాన మంత్రి: రోగులు వారి సమస్యల ను మీకు నేరు గా చెప్తారు కదా.

డాక్టర్ మదన్ మణి: అవును... పేషెంట్ తన సమస్యల గురించి కూడా చెప్తాడు. ఆ తరువాత పాత రికార్డు లు చూసిన తర్వాత ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే- ఉదాహరణకు కాళ్ల వాపు ఉందో లేదో చూడడానికి అతని ఛాతీ ని ఆస్కల్టేట్ చేయాలి. సిహెచ్ఒ గారు అప్పటివరకు చూడకపోతే వాపు ఉందో లేదో చూడండి అని, కళ్ల ను చూడండి అని, రక్తహీనత ఉందో లేదో చూడండి అని కోరతాం. దగ్గు ఉంటే ఛాతీ ని ఆస్కల్టేట్ చేయండని చెప్తాం. అంటే- అక్కడ ధ్వనులు వినిపిస్తాయో, లేదో చూడమంటాం అన్న మాట.

ప్రధాన మంత్రి: మీరు వాయిస్ కాల్ ద్వారా మాట్లాడతారా, లేక వీడియో కాల్‌ ని కూడా ఉపయోగిస్తున్నారా ?

డాక్టర్ మదన్ మణి: అవును సర్.. మేం వీడియో కాల్ ను ఉపయోగిస్తాం.

ప్రధాన మంత్రి: అంటే మీరు కూడా రోగి ని చూస్తారు.

డాక్టర్ మదన్ మణి: రోగి ని కూడా చూడగలం సర్.

ప్రధాన మంత్రి: రోగి కి ఎటువంటి అనుభూతి కలుగుతుంది ?

డాక్టర్ మదన్ మణి: రోగి డాక్టర్‌ ను దగ్గరగా చూడగలడు కాబట్టి రోగి కి అది నచ్చుతుంది. సిక్కిమ్ లో మధుమేహం, రక్తపోటు ఉన్న రోగులు చాలా మంది ఉంటారు. మందు పరిమాణాన్ని తగ్గించాలా, పెంచాలా అనే విషయం లో వారు సందిగ్ధం లో ఉంటారు. మధుమేహాని కి, రక్తపోటు కు మందు మార్చడానికి డాక్టర్ ను సంప్రదించేందుకు ఎంతో దూరం వెళ్లవలసి వస్తుంది. అయితే టెలి-కన్సల్టేశన్ ద్వారా అక్కడే డాక్టర్ సలహా సంప్రదింపులు లభిస్తాయి. ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల లో ఉచిత మందుల పథకం ద్వారా ఔషధం కూడా అందుబాటు లో ఉంటుంది. అందుకని అక్కడి నుండే మందు తీసుకుంటారు.

ప్రధాన మంత్రి: సరే మదన్ మణి గారు.. మీకు తెలుసు.. డాక్టర్ వచ్చేంత వరకు, డాక్టర్ తనను చూసేంత వరకు పేషెంట్ సంతృప్తి చెందడు. రోగి ని చూడవలసి ఉంటుందని డాక్టర్ కూడా భావిస్తాడు. ఇప్పుడు అక్కడ అన్ని సంప్రదింపులు ఆన్ లైన్ లో జరుగుతాయి కాబట్టి వైద్యుడి కి ఏమనిపిస్తుంది, రోగికి ఏమనిపిస్తుంది ?

డాక్టర్ మదన్ మణి: అవును సర్. రోగి కి డాక్టర్‌ ను చూడాలి అని అనిపిస్తే రోగి ని చూడాలని మాకు కూడా అనిపిస్తుంటుంది. మేం చూడాలి అనుకున్నవి ఏవైనా సిహెచ్ఒ గారికి చెప్పడం ద్వారా వీడియో లో చూస్తాం. మరి కొన్ని సార్లు వీడియో లోనే పేషెంట్ మాకు దగ్గర గా వచ్చి చూపిస్తారు. ఉదాహరణ కు ఎవరికైనా చర్మ సంబంధి సమస్య లు ఉంటే మాకు వీడియో ద్వారా చూపిస్తారు. కాబట్టి వారు సంతృప్తి గా ఉంటారు.

ప్రధాన మంత్రి: వారికి చికిత్స చేసిన తరువాత వారు సంతృప్తి చెందుతారా ? వారు ఎటువంటి అనుభూతి ని పొందుతారు ? పేషెంట్స్ కు నయమవుతుందా ?

డాక్టర్ మదన్ మణి: అవును సర్.. చాలా సంతోషం కలుగుతుంది. మాకు కూడా ఆనందం గా ఉంటుంది సర్. నేను ప్రస్తుతం ఆరోగ్య శాఖ లో ఉన్నాను. ఏకకాలం లో టెలి-కన్సల్టేశన్ చేస్తూ ఫైల్‌ తో పాటు రోగి ని చూడడం నాకు చాలా మంచిది అయినటువంటి అనుభవం.

ప్రధాన మంత్రి: సగటు న మీకు టెలి-కన్సల్టేశన్ కేసు లు ఎన్ని వస్తాయి ?

డాక్టర్ మదన్ మణి: నేను ఇప్పటివరకు 536 మంది రోగుల ను చూశాను.

ప్రధాన మంత్రి: ఓ.. అంటే మీరు చాలా పట్టు సాధించారు అన్నమాట.

డాక్టర్ మదన్ మణి: అవును సర్. (పేషెంట్ లను) చూడడం బాగుంటుంది.

ప్రధాన మంత్రి: సరే.. మీకు శుభాకాంక్ష లు. ఈ సాంకేతికత ను ఉపయోగించడం ద్వారా మీరు సిక్కిమ్ లోని మారుమూల అడవుల లో, పర్వతాల లో నివసించే ప్రజల కు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. మన దేశం లోని సుదూర ప్రాంతాల లో కూడా సాంకేతికత ను ఇంత చక్కగా వినియోగించుకోవడం సంతోషించదగ్గ విషయం. మీకు చాలా చాలా అభినందన లు.

డాక్టర్ మదన్ మణి: ధన్యవాదాలు సర్.

 

మిత్రులారా, ఇ-సంజీవని ఏప్ ఎలా సహకరిస్తుందో డాక్టర్ మదన్ మణి గారి మాటల ను బట్టి అర్థం అవుతుంది. డాక్టర్ మదన్ గారి తరువాత ఇప్పుడు మనం మరో మదన్ గారి ని కలుద్దాం. ఆయన ఉత్తర్ ప్రదేశ్‌ లోని చందౌలీ జిల్లా నివాసి మదన్ మోహన్ లాల్ గారు. చందౌలీ కూడా బనారస్ పక్కనే ఉండడం కూడా కాకతాళీయమే. ఇ-సంజీవని ని గురించి రోగి గా ఆయన అనుభవం ఏమిటో మదన్ మోహన్ గారి ని అడిగి తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి గారు: మదన్ మోహన్ గారు.. ప్రణామం.

మదన్ మోహన్ గారు: నమస్కారం.. నమస్కారం సాహబ్.

ప్రధాన మంత్రి గారు: నమస్కారం. మంచిది, నా దృష్టి కి తీసుకురావడం జరిగింది. అది మీరు డయాబెటిక్ రోగి అనే సంగతి.

మదన్ మోహన్ గారు: అవును సర్.

ప్రధాన మంత్రి గారు: మరి మీరు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి టెలి-కన్సల్టేశన్ ల ద్వారా మీ అనారోగ్యాని కి సంబంధించి సహాయం తీసుకుంటున్నారు.

మదన్ మోహన్ గారు: అవునండి.

ప్రధాన మంత్రి: ఒక రోగి గా మీ అనుభవాల ను వినాలని అనుకొంటున్నాను. తద్ద్వారా మన గ్రామాల లో నివసించే ప్రజలు నేటి సాంకేతిక విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించవచ్చో దేశ ప్రజలకు తెలియజేయాలని అనుకొంటున్నాను. మీరు చెప్పండి..

మదన్ మోహన్ గారు: చాలా ఇబ్బందిగా ఉండేది సర్.. ఆసుపత్రులు చాలా దూరం గా ఉన్నాయి. డయాబెటిస్ వచ్చినప్పుడు చికిత్స చేయించుకోవడానికి ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వచ్చేది. అక్కడ చూపించుకోవలసి వచ్చేది. మీరు ఏర్పాటు చేసిన కొత్త పద్ధతి లో మమ్మల్ని బయటి డాక్టర్ లతో మాట్లాడిస్తారు. మందులు కూడా ఇస్తారు. దీని వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుంది. అందరూ దీని వల్ల ప్రయోజనం పొందుతారు.

ప్రధాన మంత్రి: మిమ్మల్నిప్రతిసారీ ఒకే డాక్టర్ చూస్తారా, లేక డాక్టర్ లు మారుతూ ఉంటారా ?

మదన్ మోహన్ గారు: వారికి తెలియకపోతే మరో డాక్టర్ కు చూపిస్తారు. వాళ్ళే మాట్లాడి, మరొక వైద్యుడి తో మాట్లాడేలా చేస్తారు.

ప్రధాన మంత్రి: అయితే వైద్యులు మీకు అందించే మార్గదర్శకత్వం నుండి మీరు పూర్తి ప్రయోజనం పొందుతారన్నమాట.

మదన్ మోహన్ గారు: మాకు లాభం కలుగుతుంది సర్. దాని వల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉంది. గ్రామ ప్రజలు కూడా దీని నుండి ప్రయోజనం పొందుతారు. అక్కడ అందరు అడుగుతారు- మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, టెస్ట్ చేయండి, చెక్ చేయండి, మందు చెప్పండి- అని. మరి ఇంతకుముందు ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లే వారు. పొడవాటి వరస లు, పేథాలజీ లో కూడా వరస లు ఉండేవి. రోజు మొత్తం సమయం వృథా అవుతూ ఉండేది.

ప్రధాన మంత్రి: అంటే మీకు కాలం కూడా ఆదా అవుతుంది.

మదన్ మోహన్ గారు: అప్పుడు డబ్బు కూడా ఖర్చు అయ్యేది. ఇక్కడ అన్ని సేవల ను ఉచితం గా చేస్తున్నారు.

ప్రధాన మంత్రి: సరే.. ముందు డాక్టర్‌ ను చూడగానే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ‘‘డాక్టర్ నా నాడి ని పరీక్షించాడు.. నా కళ్ళు, నా నాలుక కూడా చెక్ చేశాడు” అనే అనుభూతి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు టెలి-కన్సల్టేశన్ చేసినా మీకు అంతే సంతృప్తి వస్తుందా ?

మదన్ మోహన్ గారు: అవును సర్. సంతోషం గా ఉంటుంది. వాళ్ళు మన నాడి ని పట్టుకుంటున్నట్టు, సముచితమైన ఏర్పాటుల ను చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మాకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఇంత మంచి ఏర్పాటు ను మీరు చేసినందుకు చాలా సంతోషంగా ఉంటున్నాం. కష్టపడి వెళ్ళవలసి వచ్చేది. వాహనం చార్జీల ను ఇవ్వవలసి వచ్చేది. అక్కడ వరస లో నిలడవలసి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని అన్ని సౌకర్యాల ను పొందుతున్నాం.

ప్రధాన మంత్రి: సరే.. మదన్ మోహన్ గారు.. నేను మీకు శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను. ఈ వయసు లో కూడా మీరు సాంకేతికత ను నేర్చుకొన్నారు. సాంకేతికత ను ఉపయోగించుకొంటున్నారు. ఇతరుల కు కూడా చెప్పండి. దాని ద్వారా ప్రజల కాలం ఆదా అవుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. వారికి మార్గదర్శకత్వం లభించడం తో మందుల ను కూడా సరి అయిన విధం గా ఉపయోగించుకోవచ్చు.

మదన్ మోహన్ గారు: అవును సర్ మరి.

ప్రధాన మంత్రి: సరే.. మదన్ మోహన్ గారు.. మీకు చాలా చాలా శుభాకాంక్ష లు.

మదన్ మోహన్ గారు: సర్.. మీరు బనారస్ ను కాశీ విశ్వనాథ్ స్టేశన్‌ గా మార్చారు. దానిని అభివృద్ధి చేశారు. మీకు మా అభినందన లు.

ప్రధాన మంత్రి: మీకు ధన్యవాదాలు. మనం ఏం చేశాం.. బనారస్ ప్రజలు బనారస్ ను అభివృద్ధి చేశారు. లేకుంటే గంగామాత కు సేవ చేయండని గంగామాత పిలిచింది. అంతేతప్ప మరేమీ కాదు. సరే.. మీకు చాలా చాలా శుభాకాంక్ష లు. నమస్కారం.

మదన్ మోహన్ గారు: నమస్కారం సర్.

ప్రధాన మంత్రి: నమస్కారం.

 

మిత్రులారా, దేశం లోని సామాన్యుల కు, మధ్య తరగతి వారికి, కొండ ప్రాంతాల లో నివసించే వారి కి ప్రాణాల ను రక్షించే ఏప్‌ గా ఇ-సంజీవని మారుతోంది. భారతదేశ డిజిటల్ విప్లవ శక్తి ఇది. మనం ప్రతి రంగం లో దీని ప్రభావాన్ని చూస్తున్నాం. భారతదేశం యూపీఐ శక్తి ఏమిటన్నది కూడా మీకు తెలుసు. ప్రపంచం లోని అనేక దేశాలు దీని వైపు ఆకర్షితులవుతున్నాయి.

 

కొన్ని రోజుల కిందట భారతదేశం, సింగపూర్ మధ్య యుపిఐ- పే నౌ లింకు ప్రారంభం అయింది. ఇప్పుడు సింగపూర్, భారతదేశం లోని ప్రజలు వారి మధ్య వారి దేశాల లో చేసే విధంగానే వారి మొబైల్ ఫోన్ ల నుండి డబ్బు ను బదిలీ చేస్తున్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతదేశ ఇ-సంజీవని ఏప్ అయినా, యుపిఐ అయినా జీవన సౌలభ్యాన్ని పెంచడం లో చాలా సహాయకారి గా నిరూపణ అయ్యాయి.

 

ప్రియమైన నా దేశప్రజలారా, ఒక దేశం లో అంతరించిపోతున్న ఒక జాతి పక్షి ని గాని, లేదా పశువు ను గాని రక్షించినప్పుడు అది ప్రపంచవ్యాప్తం గా చర్చనీయాంశం అవుతుంది. మన దేశం లో కనుమరుగైపోయి ప్రజల మనసుల లో నుండి, హృదయాల లో నుండి దూరం అయిన గొప్ప సంప్రదాయాలు అనేకం ఉన్నాయి. వాటిని పునరుద్ధరించేందుకు ప్రజా భాగస్వామ్య శక్తి తో ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాల ను చర్చించేందుకు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి మించిన వేదిక మరేది ఉంటుంది ?

 

ఇప్పుడు నేను మీకు ఏమి చెప్పబోతున్నానో తెలుసుకుంటే మీరు నిజంగా సంతోషిస్తారు. మీ వారసత్వ సంపద ను గురించి గర్వపడతారు. అమెరికా లో నివసిస్తున్న కంచన్ బెనర్జీ గారు వారసత్వ పరిరక్షణ కు సంబంధించిన అటువంటి ప్రచారం ద్వారా నా దృష్టి ని ఆకర్షించారు. ఆయన ను నేను అభినందిస్తున్నాను. మిత్రులారా, ఈ నెలలో పశ్చిమ బంగాల్‌ లోని హుగ్ లీ జిల్లా బాంస్ బేరియా లో ‘త్రిబేణీ కుంభో మొహోత్సవ్’ ను నిర్వహించారు. ఇందులో ఎనిమిది లక్షల మంది కి పైగా భక్తులు పాల్గొన్నారు. ఇంత విశిష్టత ఎందుకో తెలుసా ? ముఖ్యం గా ఈ ఆచారాన్ని 700 సంవత్సరాల అనంతరం పునరుద్ధరించడమైంది. ఈ సంప్రదాయం వేల సంవత్సరాల నాటిది అయినప్పటికీ, దురదృష్టవశాత్తు బంగాల్‌ లోని త్రిబేణి లో జరిగే ఈ పండుగ ను 700 సంవత్సరాల కిందట నిలిపివేశారు. స్వాతంత్య్రానంతరం ప్రారంభించవలసింది. కానీ అది కూడా కుదరలేదు. రెండేళ్ల కిందట ఈ పండుగ స్థానిక ప్రజల ద్వారా, ‘త్రిబేణి కుంభో పారిచాలోనా శామితి’ మాధ్యం ద్వారా మళ్లీ ఆరంభం అయింది. దీనితో అనుబంధం ఉన్న వ్యక్తులు అందరిని నేను అభినందిస్తున్నాను. మీరు సంప్రదాయాన్ని సజీవం గా ఉంచడమే కాదు- భారతదేశం సాంస్కృతిక వారసత్వాన్ని కూడా కాపాడుతున్నారు.

 

మిత్రులారా, పశ్చిమ బంగాల్‌ లోని త్రిబేణి శతాబ్దాలు గా పవిత్ర ప్రదేశం గా ప్రసిద్ధి చెందింది. వివిధ మంగళకావ్యాల్లోనూ, వైష్ణవ సాహిత్యం లోనూ, శాక్త సాహిత్యం లోనూ, ఇతర బెంగాలీ సాహిత్య రచనల్లోనూ దీని ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు సంస్కృతం, విద్య , భారతీయ సంస్కృతి కి కేంద్రంగా ఉండేది అని వివిధ చారిత్రక పత్రాల ద్వారా తెలుస్తోంది. మాఘ సంక్రాంతి లో కుంభ స్నానానికి పవిత్ర స్థలం గా దీనిని చాలా మంది సాధువులు భావిస్తారు. త్రిబేణి లో అనేక గంగా ఘాట్‌ల ను, శివాలయాల ను, టెర్రకోట వాస్తు కళ తో అలంకృతమైన పురాతన భవనాల ను చూడవచ్చును. త్రిబేణి వారసత్వ పునఃస్థాపన కు, కుంభ సంప్రదాయ వైభవ పునరుద్ధరణ కు గత ఏడాది ఇక్కడ కుంభమేళా ను నిర్వహించారు. ఏడు శతాబ్దాల తరువాత మూడు రోజుల కుంభ మహాస్నానాలు, జాతర ఈ ప్రాంతం లో కొత్త శక్తి ని నింపాయి. మూడు రోజుల పాటు ప్రతి రోజూ జరిగే గంగా హారతి, రుద్రాభిషేకం, యజ్ఞంలో పెద్ద సంఖ్య లో ప్రజలు పాల్గొన్నారు. వివిధ ఆశ్రమాలు, మఠాలు, అఖాడాలు కూడా ఈసారి ఉత్సవం లో పాల్గొన్నాయి. బెంగాలీ సంప్రదాయాలకు సంబంధించిన కీర్తన, బౌల్, గోడియో నృత్యాలు, స్త్రీ-ఖోల్, పోటేర్ గానం, ఛోవూ నాట్యం ల వంటి వివిధ కళా ప్రక్రియ లు, సాయంసంధ్య వేళ జరిగే కార్యక్రమాల లో ఆకర్షణ గా నిలచాయి. దేశం లోని స్వర్ణ గతం తో మన యువత ను జతపరచడానికి ఇది చాలా అభినందనీయమైనటువంటి ప్రయాస గా ఉంది. భారతదేశం లో ఇటువంటి అనేక ఇతర పద్ధతులు ఉన్నాయి. వీటిని పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. వాటి గురించి చర్చ తప్పక ఈ దిశ లో ప్రజల ను ప్రేరేపించగలదని నేను ఆశిస్తున్నాను.

 

ప్రియమైన నా దేశవాసులారా, మన దేశం లో స్వచ్ఛ భారత్ అభియాన్‌ లో ప్రజల భాగస్వామ్యం అనే అర్థమే మారిపోయింది. దేశం లో ఎక్కడైనా పరిశుభ్రత కు సంబంధించిన అంశం ఏదైనా ఉంటే ప్రజలు దాని గురించి నాకు తప్పక తెలియ జేస్తారు. ఇలాగే హరియాణా యువత స్వచ్ఛత ప్రచారం నా దృష్టి ని ఆకర్షించింది. హరియాణా లో దుల్హేడి అనే ఒక పల్లె ఉంది. పరిశుభ్రత విషయం లో భివానీ పట్టణాన్ని ఆదర్శం గా తీర్చిదిద్దాలి అని ఇక్కడి యువకులు నిర్ణయించారు. యువ స్వచ్ఛత ఏవం జన్ సేవా సమితి అనే సంస్థ ను ఏర్పాటు చేసుకొన్నారు. ఈ కమిటీ తో సంబంధం ఉన్న యువకులు తెల్లవారు జామున 4 గంటల కు భివానీ కి చేరుకొంటారు. వారంతా కలసి పట్టణం లోని వివిధ ప్రాంతాల లో క్లీన్‌ డ్రైవ్‌ల ను నిర్వహిస్తున్నారు. వీరందరూ ఇప్పటివరకు పట్టణం లోని వివిధ ప్రాంతాల నుండి టన్నుల కొద్దీ చెత్త ను తొలగించారు.

 

మిత్రులారా, స్వచ్ఛ భారత్ అభియాన్‌ లో వ్యర్థాల నుండి సంపద (‘వేస్ట్ టు వెల్థ్’) కూడా ఒక ముఖ్యమైన అంశం. ఒడిశా లోని కేంద్రపాడా జిల్లా లో కమలా మోహ్ రాణా అనే సోదరి స్వయంసహాయక సమూహాన్ని నిర్వహిస్తోంది. ఈ సమూహం లోని మహిళ లు పాల సంచులు, ఇతర ప్లాస్టిక్ ప్యాకింగ్‌లతో బుట్టలు, మొబైల్ స్టాండ్‌ ల వంటి అనేక వస్తువుల ను తయారు చేస్తారు. పరిశుభ్రత తో పాటు వారికి మంచి ఆదాయ వనరు గా కూడా ఇది మారుతోంది. మనం దృఢ సంకల్పం తో ఉంటే స్వచ్ఛ భారత్‌ కు పెద్దపీట ను వేయగలం. కనీసం ప్లాస్టిక్ బ్యాగుల స్థానం లో బట్ట తో చేసిన సంచుల ను వాడుతాం అని ప్రతిజ్ఞ చేయాలి. మీ ఈ తీర్మానం మీకు ఎంత సంతృప్తి ని ఇస్తుందో, ఇతర వ్యక్తుల కు ఎంత స్ఫూర్తి ని ఇస్తుందో మీరే చూస్తారు.

 

ప్రియమైన నా దేశప్రజలారా, ఈ రోజు న మీరు, నేను కలసి అనేక ప్రేరణాత్మక అంశాల ను గురించి మరో సారి మాట్లాడుకున్నాం. మీరు కుటుంబం తో కూర్చొని విన్నారు. ఇప్పుడు రోజంతా ఈ ధ్యానం లోనే ఉంటారు. దేశం కృషి ని గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత శక్తి వస్తుంది. ఈ శక్తి ప్రవాహం తో కదులుతూ కదులుతూ ఈ రోజు న మనం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో 98 వ భాగం దశ కు చేరుకొన్నాం. హోలీ పండుగ మరి కొన్ని రోజులే ఉంది. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానిక ఉత్పాదనల నే సమర్ధించుదాం) అనే తీర్మానం తో మన పండుగల ను జరుపుకోవాలి. మీ అనుభవాల ను నాకు వెల్లడి చేయడాన్ని మరచిపోవద్దు. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. వచ్చే సారి కొత్త అంశాల తో మళ్ళీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

***(Release ID: 1902507) Visitor Counter : 162