ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తుర్కియే.. సిరియాలలో ‘ఆపరేషన్‌ దోస్త్‌’లోపాల్గొంటున్నఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో ప్రధానిసంభాషణ


“భూకంపంపైభారత్‌ సత్వర స్పందన ప్రపంచం దృష్టినిఆకర్షించింది..ఇది మన రక్షణ-సహాయబృందాల సర్వ సన్నద్ధతకు ప్రతిబింబం”;

“భారతదేశం తన స్వయంసమృద్ధితోపాటు నిస్వార్థ గుణాన్ని పెంపొందించుకుంది”;“ప్రపంచంలో ఎక్కడవిపత్తు సంభవించినా తొలి స్పందనకు భారత్‌ సదా సిద్ధం”;

“త్రివర్ణంతోమనం ఎక్కడ అడుగుపెట్టినా.. భారత బృందంరాగానే పరిస్థితి చక్కబడగలదన్నభరోసా లభిస్తుంది”;“దేశ ప్రజల్లో ‘ఎన్డీఆర్‌ఎఫ్‌’కు మంచి పేరుంది.. జనం మిమ్మల్ని విశ్వసిస్తున్నారు”;

“ప్రపంచంలోనేఅత్యుత్తమ రక్షణ-సహాయ బృందంగా మన గుర్తింపును బలోపేతంచేసుకోవాలి... మనమెంతగా సంసిద్ధులమైతే అంతగా ప్రపంచానికి సేవ చేయగలం”

Posted On: 20 FEB 2023 7:48PM by PIB Hyderabad

తుర్కియే, సిరియాలలో భూకంప బాధితుల రక్షణ-సహాయ కార్యక్రమాల్లో భాగంగా ‘ఆపరేషన్‌ దోస్త్’లో పాల్గొంటున్న భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌)తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. రెండు దేశాల్లో భూకంప బాధితులను ఆదుకోవడంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారని వారితో మాట్లాడిన సందర్భంగా ప్రధాని కొనియాడారు. ఈ నేపథ్యంలో వసుధైవ కుటుంబకం భావన గురించి ప్రధాని విశదీకరించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ స్ఫూర్తిని తుర్కియే, సిరియాల్లో భారత బృందం సేవలు ప్రతిబింబించాయని ఆయన వివరించారు.

దైనా ప్రకృతి విపత్తు సంభవించినపుడు వేగంగా స్పందించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆపన్నులను కాపాడటంలో తొలి గంట (గోల్డెన్‌ అవర్‌) వ్యవధి ఎంతో కీలకమని ప్రధాని పేర్కొన్నారు. ఆ మేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం తక్షణం తుర్కియే చేరుకున్న తీరు యావత్‌ ప్రపంచం దృష్టినీ ఆకర్షించిందని వ్యాఖ్యానించారు. ఇది మన రక్షణ-సహాయ బృందాల సర్వ సన్నద్ధతకు, శిక్షణ నైపుణ్యాలకు ప్రతిబింబమని ఆయన అభివర్ణించారు. తుర్కియేలోని బృందంలో స‌భ్యుల కృషికి ముగ్ధురాలై వారిని ఆశీర్వ‌దించిన ఓ త‌ల్లి ఫొటోల గురించి ప్ర‌ధానమంత్రి గుర్తుచేశారు. బాధిత ప్రాంతాల్లో రక్షణ-స‌హాయ‌ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ప్ర‌తి చిత్రం చూసి, భారతీయులందరూ గర్విస్తున్నారని ప్ర‌ధానమంత్రి పేర్కొన్నారు. సాటిలేని వృత్తి నైపుణ్యం, మానవీయ స్పర్శను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినప్పుడు, సర్వం కోల్పోయినప్పుడు వారిపట్ల సానుభూతే కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ మేరకు సానుభూతితో కూడిన సేవలందించడంలో మన బృందం చూపిన చొరవను కూడా ప్రధాని ప్రశంసించారు.

గుజరాత్‌లో 2001నాటి భూకంపం సందర్భంగా తానొక స్వచ్ఛంద కార్యకర్తగా ఉన్నానని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. విధ్వంసం చోటుచేసుకున్న ప్రాంతంలో కాంక్రీట్‌, మట్టిగుట్టల తొలగింపు, క్షతగాత్రులను కనుగొనడం అంత సులువు కాదని పేర్కొన్నారు. భుజ్‌లో వైద్య రంగం కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని, దీంతో క్షతగాత్రులకు చికిత్స అందించడం కూడా కష్టమైపోయిందని ఆయన గుర్తుచేశారు. అలాగే 1979నాటి మచ్చు డ్యామ్‌ విషాద ఉదంతం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. “ఈ విపత్తులలో నా అనుభవాల ఆధారంగా మీరు కఠోర శ్రమను, స్ఫూర్తిని, భావోద్వేగాలను నేను అర్థం చేసుకోగలను. అందుకే, ఇవాళ మీకు వందనం చేస్తున్నాను” అని పేర్కొన్నారు.

మనుతాము కాపాడుకోగలిగే సమర్థులను స్వయం సమృద్ధి గలవారుగా వ్యవహరిస్తారు. అయితే, ఆపత్సమయంలో ఇతరులకు సాయంచేసే సమర్థులను నిస్వార్థపరులు అంటారని ఆయన నొక్కిచెప్పారు. ఇది వ్యక్తులకే కాకుండా దేశాలకూ వర్తిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే, కొన్నేళ్లుగా భారతదేశం తన స్వయం సమృద్ధితోపాటు నిస్వార్థాన్ని కూడా పెంచుకున్నదని చెప్పారు. “త్రివర్ణ పతాకంతో మనమెక్కడ పాదం మోపినా- భారత బృందం రాగానే పరిస్థితి చక్కబడగలదన్న భరోసా ఆపన్నులలో కలుగుతుంది” అని ప్రధాని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం సందర్భంగా త్రివర్ణ పతాకం ఎన్ని ప్రాణాలను రక్షించిందో, ఎంతగా స్థానికుల అభిమానం చూరగొన్నదో గుర్తుచేసుకోవాలని ప్రధాని అన్నారు. అలాగే మనం ‘ఆపరేషన్‌ గంగా' నిర్వహించినపుడు మన పతాకం ఓ కవచంలా రక్షణ కల్పించడాన్ని ప్రధాని గుర్తుచేశారు. అలాగే ఆఫ్ఘానిస్థాన్‌లో ప్రతికూల పరిస్థితుల నడుమ ‘ఆపరేషన్‌ దేవీశక్తి' తదితర ఉదంతాలను ఆయన ఉదాహరించారు. కరోనా మహమ్మారి సమయంలో మనం ఇదే నిబద్ధతను చాటామని చెప్పారు. ఆపదలో చిక్కుకున్న విదేశీయులతోపాటు ప్రతి భారత పౌరుణ్నీ తిరిగి స్వదేశానికి చేర్చగలిగామని గుర్తుచేశారు.

“తుర్కియే, సిరియాలను భూకంపం కుదిపేసిన సమయంలో మొట్టమొదట స్పందించిన దేశాల్లో భారత్‌ ఒకటి” అని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మేరకు ‘ఆపరేషన్‌ దోస్త్‌’ ద్వారా మానవతా దృక్పథంపై భారత్‌ తన నిబద్ధతను చాటుకున్నదని వివరించారు. అదేవిధంగా నేపాల్‌ భూకంపాలతోపాటు మాల్దీవ్స్‌, శ్రీలంకలో సంక్షోభం తదితరాలను ఉదాహరించారు. ఆయా ఉదంతాల్లో చేయూతనివ్వడానికి తొలుత ముందుకొచ్చింది భారతదేశమేనని పేర్కొన్నారు. భారత బలగాలతోపాటు ‘ఎన్డీఆర్‌ఎఫ్‌’పైనా ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం ఇనుమడిస్తున్నదని గుర్తుచేశారు. ఏళ్ల తరబడి దేశ ప్రజలలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు మంచి గుర్తింపు లభించిందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఇక దేశ ప్రజానీకంలో ‘ఎన్డీఆర్‌ఎఫ్‌’పై ఎనలేని నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఈ బలగం రంగంలోకి దిగితే చాలు... ప్రజల విశ్వాసం, ఆశలు చిగురిస్తామని ఇది గొప్ప విజయమని ఆయన వివరించారు. నైపుణ్యంతో కూడిన శక్తిసామర్థ్యాలకు సున్నితత్వాన్ని జోడిస్తే ఆ శక్తి అనేక రెట్ల బలం పుంజుకుంటుందని ప్రధానమంత్రి అన్నారు.

విపత్తుల వేళ రక్షణ-సహాయ చర్యలలో భారత శక్తిసామర్థ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. చివరగా “ప్రపంచంలో అత్యుత్తమ రక్షణ-సహాయ బృందంగా మన గుర్తింపును మనం మరింత దృఢం చేసుకోవాలి. మనమెంతగా సంసిద్ధులమైతే అంతగా ప్రపంచానికి సేవ చేయగలం” అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం కృషిని, అనుభవాలను ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో వారు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, గత 10 రోజులుగా తన హృదయం, మనస్సు సదా వారితో ముడిపడి ఉందంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

*****


(Release ID: 1901089) Visitor Counter : 208