ఆర్థిక మంత్రిత్వ శాఖ
యువతకు సాధికారత... ‘అమృత తరం’ కలల సాకారం లక్ష్యంగా రూపొందిన జాతీయ విద్యా విధానం
లక్షలాది యువతకు నైపుణ్య కల్పన కోసం ప్రారంభం
కానున్న ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం 4.0;
వివిధ రాష్ట్రాల్లో 30 ‘నిపుణ భారతం’ అంతర్జాతీయకేంద్రాల ఏర్పాటు;
రాబోయే మూడేళ్లలో 47 లక్షలమంది యువతకు‘ప్రత్యక్ష నగదు బదిలీ’ ద్వారా శిక్షణార్థి వేతనంచెల్లింపు;
నైపుణ్య శిక్షణకు డిజిటల్ పర్యావరణ వ్యవస్థ విస్తరణ లక్ష్యంగాప్రారంభం కానున్నఏకీకృత ‘నిపుణ భారతం’ డిజిటల్ వేదిక
Posted On:
01 FEB 2023 1:22PM by PIB Hyderabad
“దేశవ్యాప్తంగా మన యువతకు సాధికారత కల్పించడంతోపాటు 'అమృత తరం' తమ కలలను సాకారం చేసుకోవడానికి తోడ్పడటం లక్ష్యంగా ప్రభుత్వం జాతీయ విద్యా విధానం రూపొందించింది. దీంతోపాటు నైపుణ్య కల్పనపై దృష్టి సారించడమే కాకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల సృష్టి దిశగా ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నాం. అలాగే వ్యాపార అవకాశాలకు మద్దతిచ్చాం” అని కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటులో ఇవాళ కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ మేరకు వివరించారు. ఈ బడ్జెట్ ఏడు ప్రాథమ్యాంశాలను నిర్దేశించుకున్నదని, ‘సప్త రుషుల’ తరహాలో ఇవి పరస్పర పూరకాలుగా అమృత కాలంలో మనకు మార్గదర్శనం చేస్తాయని ఆమె ప్రకటించారు. వీటిలో నైపుణ్యాభివృద్ధి సహా యువశక్తి కూడా ఒక ప్రాథమ్యాంశమని తెలిపారు.
ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం 4.0
దేశవ్యాప్తంగా రాబోయే మూడేళ్లలో లక్షలాది యువతకు నైపుణ్య కల్పన కోసం ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం 4.0ను ప్రారంభించనున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఉద్యోగాంతర శిక్షణ, పరిశ్రమలతో భాగస్వామ్యం, పరిశ్రమ అనుగుణ కోర్సుల సంధానంపై ఈ పథకం దృష్టి పెడుతుందని చెప్పారు. అలాగే ఇండస్ట్రీ 4.0 కోసం కోడింగ్, ఎఐ, రోబోటిక్స్, మెకాట్రానిక్స్, ఐఒటి, 3డి ప్రింటింగ్, డ్రోన్లు, సాఫ్ట్ స్కిల్స్ వంటి నవతరం కోర్సులకూ ఈ పథకం ప్రాధాన్యమిస్తుందని ఆమె ప్రకటించారు. అంతేకాకుండా యువతకు అంతర్జాతీయ అవకాశాల సౌలభ్యం దిశగా నైపుణ్య కల్పన కోసం వివిధ రాష్ట్రాలలో 30 ‘నిపుణ భారతం’ అంతర్జాతీయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా శ్రీమతి సీతారామన్ ప్రతిపాదించారు.
జాతీయ శిక్షణ ప్రోత్సాహక పథకం
రాబోయే మూడేళ్లలో 47 లక్షలమంది యువతకు ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ ద్వారా శిక్షణార్థి వేతన మద్దతు కోసం దేశవ్యాప్త జాతీయ శిక్షణ ప్రోత్సాహక పథకం అమలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఏకీకృత ‘నిపుణ భారతం’ డిజిటల్ వేదిక
నైపుణ్య శిక్షణకు డిజిటల్ పర్యావరణ వ్యవస్థ విస్తరణ లక్ష్యంగా ఏకీకృత ‘నిపుణ భారతం’ డిజిటల్ వేదికను ప్రారంభిస్తున్నట్లు శ్రీమతి సీతారామన్ తెలిపారు. ఈ వేదిక గురించి వివరిస్తూ కింది అంశాలపైనా అది దృష్టి సారిస్తుందని ఆమె చెప్పారు:
- డిమాండ్-ఆధారిత వ్యవస్థీకృత నైపుణ్య శిక్షణ
- ‘ఎంఎస్‌ఎంఇ’లు సహా యాజమాన్యాలతో అనుసంధానం
- వ్యవస్థాపన పథకాల సౌలభ్యం కల్పన
******
(Release ID: 1895667)
Visitor Counter : 373