ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ అధ్యక్షతన జీ- 20


జనవరి 18-20 నుంచి కేరళలోని తిరువనంతపురంలో జరగనున్న ఆరోగ్య రంగంపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం

Posted On: 16 JAN 2023 2:16PM by PIB Hyderabad

భారతదేశం అధ్యక్షత వహిస్తున్న జీ-20 లో ఆరోగ్య రంగంపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ తొలిసారిగా కేరళలోని తిరువనంతపురంలో 2023 జనవరి 18 నుంచి 20 వరకు  సమావేశం కానున్నది. 2022 డిసెంబర్ 1న భారతదేశం జీ-20  అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది.  ప్రస్తుతం ఇండోనేషియా, భారతదేశం మరియు బ్రెజిల్‌లతో కూడిన జీ-20 దేశాల బృందం ఉంది. మూడు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న దేశాలు ఒకే బృందంలో ఉండటం ఇదే మొదటిసారి.

 

భారతదేశం అధ్యక్షతన జీ-20 అందరినీ కలుపుకొని, కార్యాచరణ ఆధారితంగా మరియు నిర్ణయాత్మకంగా పనిచేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టంగా ప్రకటించారు. ఈ లక్ష్య సాధన దిశలో పనిచేయడానికి  ‘

ఒక  భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ విధానానికి ప్రధానమంత్రి రూపకల్పన చేశారు. భారతదేశం అనుసరిస్తున్న ‘వసుధైవ కుటుంబం’ విధానానికి అనుగుణంగా  ‘

ఒక  భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ఇతివృత్తం పనిచేస్తుంది. కోవిడ్ మహమ్మారి ప్రభావం తో దెబ్బతిన్న ప్రపంచ దేశాలను పటిష్టంగా తిరిగి నిర్మించేందుకు సమిష్టిగా కృషి జరగాలని భారతదేశం ఇచ్చిన పిలుపు సహకరిస్తుంది.  

భారతదేశం అధ్యక్షతన పనిచేసే జీ-20 ఆరోగ్య రంగం  వర్కింగ్ గ్రూప్  సమావేశాలు నాలుగు సార్లు , ఆరోగ్య మంత్రుల సమావేశం ఒకసారి జరుగుతాయి. ఈ సమావేశాలు తిరువనంతపురం (కేరళ), గోవా, హైదరాబాద్ (తెలంగాణ) మరియు గాంధీనగర్ (గుజరాత్) సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో జరుగుతాయి.  భారతదేశ  విభిన్న సంస్కృతులు ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్న లక్ష్యంతో దేశం వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని  ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. 

వర్కింగ్ గ్రూప్ సమావేశాలతో పాటు అనుబంధ అంశాలపై సమావేశాలు నిర్వహించి జీ-20 సమావేశాలు అర్ధవంతంగా జరిగి నిర్ణయాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని భారతదేశం నిర్ణయించింది. విలువ ఆధారిత వైద్య పర్యాటకం,  డిజిటల్ ఆరోగ్య రంగం అంశాలపై అనుబంధ సమావేశాలు నిర్వహించాలని భారతదేశం నిర్ణయించింది. ఔషధ అభివృద్ధి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సిన్‌లపై  పరిశోధనపై దేశాల మధ్య ఒక వర్క్‌షాప్, సాంప్రదాయ వైద్య అంశాలపై ప్రపంచ స్థాయి కేంద్రాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా అనుబంధ సమావేశాలు జరుగుతాయి. 2023 జనవరి 18-20 తేదీల్లో తిరువనంతపురంలోజరగనున్న వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం సందర్భంగా విలువ ఆధారిత వైద్య పర్యాటక అంశంపై అనుబంధ సమావేశం జరుగుతుంది. 

 

 ఆరోగ్య అంశాలకు ప్రాధాన్యతలను కొనసాగిస్తూ మునుపటి అధ్యక్షుల హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన కార్యక్రమాలను పూర్తి చేయడానికి జీ-20 అధ్యక్ష హోదాలో ప్రాధాన్యత ఇవ్వాలని భారతదేశం నిర్ణయించింది. ముఖ్యమైన క్లిష్టమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా భారతదేశం నిర్ణయించింది.  ఏకీకృత విధానం ద్వారా లక్ష్యం సాధించాలని భారతదేశం భావిస్తోంది.  ఆరోగ్య రంగంలో వివిధ దేశాల మధ్య సహకారం ,  వివిధ బహుపాక్షిక వేదికల మధ్య చర్చలు సాగించి సమీకృత సమగ్ర లక్ష్యం సాధించాలని భారతదేశం  లక్ష్యంగా పెట్టుకుంది.దీని కోసం జీ-20 ఆరోగ్య రంగంలో  ఈ క్రింది మూడు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భారతదేశం నిర్ణయించింది. 

 

ప్రాధాన్యత I: ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నివారణ, సంసిద్ధత మరియు ప్రతిస్పందన (ఒక ఆరోగ్యం & ఏఎంఆర్ పై ప్రత్యేక దృష్టి సారించడం )

 

 

ప్రాధాన్యత II: సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యమైన మరియు సరసమైన వైద్యపరమైన అంశాలు అందుబాటులోకి తెచ్చి  (వ్యాక్సిన్‌లు, థెరప్యూటిక్స్ మరియు డయాగ్నోస్టిక్స్) అవసరాల మేరకు సరఫరా చేయడం 

ప్రాధాన్యత III: సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించడానికి, ఆరోగ్య సేవలను  మెరుగుపరచడానికి డిజిటల్ ఆరోగ్య సేవల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు 

గుర్తించిన ప్రాధాన్యత రంగాలపై వర్కింగ్ గ్రూప్ సమావేశంలో  ప్రాథమిక చర్చలు జరుగుతాయి.   ఈ సమావేశానికి జీ-20 సభ్య దేశాల ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలు మరియు సంబంధిత అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. 

****



(Release ID: 1891597) Visitor Counter : 615