ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉక్రెయిన్ అధ్యక్షుడుమాననీయ వోలోడిమిర్జెలెన్‌స్కీతోప్రధానమంత్రి ఫోన్‌ సంభాషణ

Posted On: 26 DEC 2022 8:42PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు మాననీయ వోలోడిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా జి20కి భారత్‌ అధ్యక్షతపై ఉక్రెయిన్ అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి స్పందిస్తూ- జి20కి అధ్యక్షత సమయంలో భారత్‌ ప్రాధాన్యాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఆహార, ఇంధన భద్రత వంటి అంశాల్లో వర్ధమాన దేశాల గళానికి ప్రాముఖ్యం ఇస్తామని ఆయన తెలిపారు. ద్వైపాక్షిక సహకారం బలోపేతానికిగల అవకాశాలై దేశాధినేతలిద్దరూ చర్చించారు. ఈ ఏడాది ఆరంభంలో ఉక్రెయిన్‌ నుంచి స్వదేశం వచ్చిన భారత విద్యార్థుల చదువు కొనసాగింపునకు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానమంత్రి ఉక్రెయిన్‌ అధికారవర్గాలను కోరారు.

ఉక్రెయిన్‌లో ప్రస్తుత ఘర్షణకు సంబంధించి వారిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. శత్రుత్వాలను తక్షణం విడనాడాలన్న తన పిలుపును ప్రధాని మోదీ గట్టిగా పునరుద్ఘాటించారు. అలాగే విభేదాలకు శాశ్వత పరిష్కారం అన్వేషించే దిశగా ఉభయ పక్షాలు మళ్లీ చర్చలు, దౌత్య మార్గం అనుసరించాలని కోరారు. ఏదేమైనప్పటికీ శాంతి ప్రయత్నాలకు భారత్‌ సదా మద్దతిస్తుందని కూడా ప్రధాని స్పష్టం చేశారు. బాధిత ఉక్రెయిన్‌ పౌరులకు మానవతా సహాయం కొనసాగించడంలో భారత్‌ నిబద్ధతకు హామీ ఇచ్చారు.

******


(Release ID: 1886814) Visitor Counter : 227