ప్రధాన మంత్రి కార్యాలయం

జి20కి భారత్‌ అధ్యక్షతపై లోగో.. ఇతివృత్తం.. వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

Posted On: 08 NOV 2022 6:57PM by PIB Hyderabad

   భారతదేశం ‘జి20’ కూటమికి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్‌ మాధ్యమంద్వారా ఆవిష్కరించిన లోగో, ఇతివృత్తం, వెబ్‌సైట్‌ కింది విధంగా ఉన్నాయి:

లోగో – ఇతివృత్తాల వివరణ

   భారత జాతీయ పతాకంలోని ఉత్తేజపూరిత కాషాయ, తెలుపు, ఆకుపచ్చ, నీలం రంగుల స్ఫూర్తితో ‘జి20’ లోగో రూపొందించబడింది. ఇది సవాళ్ల నడుమ ప్రగతిని, వృద్ధిని ప్రతిబింబించే జాతీయ పుష్పమైన కమలంతో భూగోళాన్ని జోడించేదిగా ఉంటుంది. ప్రకృతితో సంపూర్ణ సామరస్యం నెరపే భారతీయ జీవన విధానాన్ని ఇందులోని భూగోళం ప్రతిబింబిస్తుంది. ‘జి20’ లోగో కింద దేవనాగరి లిపిలో “భారత్” అని రాయబడింది.

   లోగో రూపకల్పన కోసం నిర్వహించిన పోటీద్వారా వచ్చిన వివిధ నమూనాల నుంచి ఉత్తమ అంశాల సమాహారంగా ప్రస్తుత లోగో రూపొందింది. ఈ మేరకు ‘మైగవ్‌’ (MyGov) పోర్టల్‌లో నిర్వహించిన ఈ పోటీలో పాల్గొన్న ఔత్సాహికులు 2000కుపైగా నమూనాలు పంపారు. ఇవన్నీ ప్రజా భాగస్వామ్యంపై ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఉండటం గమనార్హం.

   భారత ‘జి20’ అధ్యక్షతతకు “వసుధైవ కుటుంబకం” లేదా “ఒకే భూగోళం-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు” అన్నది ఇతివృత్తంగా ఉంటుంది. ఇది ప్రాచీన సంస్కృత గ్రంథం ‘మహోపనిషత్’ నుంచి స్వీకరించబడింది. ముఖ్యంగా.. ఈ ఇతివృత్తం భూగోళంపై నివసించే సకల చరాచర ప్రాణికోటికీ సమానంగా విలువనిస్తుంది. ఆ మేరకు ఈ భూమిపైనా, విశ్వంలోనూ మానవాళి, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు... వీటన్నిటి నడుమ పరస్పర అనుసంధానానికి ప్రతీకగా ఉంటుంది.

   అదేవిధంగా వ్యక్తిగత జీవనశైలితోపాటు జాతీయాభివృద్ధి స్థాయిలో అనుసంధానిత, పర్యావరణపరంగా సుస్థిర, బాధ్యతాయుత ఎంపికలతో కూడిన ‘లైఫ్’ (పర్యావరణం కోసం జీవనశైలి)ను కూడా ఈ ఇతివృత్తం ప్రధానంగా సూచిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా పరివర్తనాత్మక చర్యలను ప్రేరేపిస్తూ పరిశుభ్రత, పచ్చదనం, నీలం వర్ణాలతో కూడిన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.

   విధంగా ‘జి20’కి భారత అధ్యక్షతపై సదరు లోగో.. ఇతివృత్తాలు శక్తిమంతమైన సందేశాన్నిస్తాయి. ఈ మేరకు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ న్యాయమైన, సమాన వృద్ధి కోసం కృషి కొనసాగుతుందని స్పష్టం చేస్తాయి. తదనుగుణంగా ప్రస్తుత కల్లోల సమయాన మనం అందరితో కలసి పయనించే సుస్థిర, సంపూర్ణ, బాధ్యతాయుత వైఖరిని అవలంబించాల్సిన అవసరాన్ని వివరిస్తాయి. ‘జి20’ అధ్యక్ష బాధ్యతల నిర్వహణ సందర్భంగా పరిసర పర్యావరణ వ్యవస్థతో భారతీయ సామరస్య జీవనశైలిని ప్రతిబింబించే ప్రత్యేక విధానాన్ని ఈ లోగో, ఇతివృత్తం ప్రస్ఫుటం చేస్తాయి.

   భారత్‌ విషయానికొస్తే- 2022 ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవంతో మొదలై, శతాబ్ది ఉత్సవాల వరకూగల 25 సంవత్సరాల ‘అమృత కాలం’ ప్రారంభ సమయంలో ‘జి20’ అధ్యక్ష బాధ్యతలు కలిసి రావడం విశేషం. మానవ కేంద్రక విధానాలు కీలకపాత్ర పోషిస్తూ సుసంపన్న, సార్వజనీన, ప్రగతిశీల సమాజం ఆశావహ భవిష్యత్తు దిశగా ఈ అమృత కాల ప్రగతి పయనం కొనసాగనుంది.

జి20 వెబ్‌సైట్‌

   జి20 భారతదేశ అధ్యక్షతకు సంబంధించిన వెబ్‌సైట్‌ (www.g20.in)ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది తన పని కొనసాగిస్తూ- భారత్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే  2022 డిసెంబరు 1వ తేదీనాటికి జి20 అధ్యక్ష వెబ్‌సైట్‌ (www.g20.org)గా రూపాంతరం చెందుతుంది. జి20 ఇతర సదుపాయాల ఏర్పాట్లపై కీలక సమాచారంసహా జి20పై సమాచార నిధి రూపకల్పన, ప్రదానాలకూ ఇది ఉపయోగపడుతుంది. పౌరులు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు వీలుగా ఈ వెబ్‌సైట్‌లో ప్రత్యేక విభాగం కూడా ఉంది.

జి20 యాప్‌

   ఈ వెబ్‌సైట్‌తోపాటు ‘జి20 ఇండియా’ (G20 India) పేరిట ఆవిష్కృతమైన మొబైల్‌  అనువర్తనం ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వేదికలుగల అన్ని ఫోన్లలోనూ పనిచేస్తుంది.(Release ID: 1874637) Visitor Counter : 283