ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిక్స్ 13వ సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు
Posted On:
09 SEP 2021 1:32PM by PIB Hyderabad
గౌరవనీయలు, అధ్యక్షుడు పుతిన్, అధ్యక్షుడు జి, అధ్యక్షుడు రమఫోసా, అధ్యక్షుడు బోల్సనారో
నమస్కారం,
ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి మీ అందరికీ స్వాగతం. బ్రిక్స్ 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించడం నాతో పాటు భారతదేశానికి చాలా సంతోషకరమైన విషయం. మీతో ఈరోజు జరుగుతోన్న శిఖరాగ్ర సమావేశానికి మాకు వివరణాత్మక ఎజెండా ఉంది. మీరందరూ అంగీకరిస్తే మనం ఈ ఎజెండాను స్వీకరించవచ్చు. ధన్యవాదాలు, ఎజెండా ఇప్పుడు స్వీకరించబడింది.
గౌరవనీయులారా!
ఈ ఎజెండా స్వీకరించబడిన తర్వాత మనమందరం మన ప్రారంభ వ్యాఖ్యలను సంక్షిప్తంగా ఇవ్వగలము. మొదట నా ప్రారంభ వ్యాఖ్యలను అందించడానికి నేను స్వేచ్ఛను తీసుకుంటాను. మీ ప్రారంభ వ్యాఖ్యల కోసం నేను మీ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను.
బ్రిక్స్ భాగ స్వాములందరి నుండి, ఈ అధ్యక్షత సమయంలో ప్రతి ఒక్కరి నుండి భారత దేశానికి పూర్తి సహకారం లభించింది. దీనికి మీ అందరికీ నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రిక్స్ వేదిక గత ఒకటిన్నర దశాబ్దాల్లో అనేక విజయాలను సాధించింది. నేడు మనం ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రభావవంతమైన స్వరం. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలపై కూడా దృష్టి సారించడానికి ఈ వేదిక ఉపయోగకరంగా ఉంది.
నూతన అభివృద్ధి బ్యాంకు, అత్యవసర రిజర్వ్ ఏర్పాటుతో సహా ఇంధన పరిశోధన సహకార వేదిక వంటి బలమైన సంస్థలను బ్రిక్స్ సృష్టించింది. ఇవన్నీ చాలా బలమైన సంస్థలు. మనం గర్వించదగినవి చాలా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే, మనం ఎక్కువగా సంతృప్తి చెందకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. రాబోయే 15 సంవత్సరాలలో బ్రిక్స్ మరింత ఫలితాల ఆధారితంగా ఉండేలా చూడాలి.
భారతదేశం తన అధ్యక్ష పదవికి ఎంచుకున్న ఇతివృత్తం ఖచ్చితంగా అదే ప్రాధాన్యతను సూచిస్తుంది- ‘బ్రిక్స్@15: కొనసాగింపు, ఏకీకరణ మరియు ఏకాభిప్రాయం కోసం బ్రిక్స్ లో సహకారం'. ఈ నాలుగు అంశాలు ఒక విధంగా మన బ్రిక్స్ భాగస్వామ్యానికి ప్రాథమిక సూత్రాలు.
ఈ ఏడాది, కోవిడ్ సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, 150 కి పైగా బ్రిక్స్ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి, వీటిలో 20 కి పైగా ప్రధాన స్థాయిలో ఉన్నాయి. సంప్రదాయ రంగాలలో సహకారాన్ని పెంపొందించడంతో పాటు, బ్రిక్స్ ఎజెండాను మరింత విస్తరించడానికి కూడా మనం ప్రయత్నాలు చేసాము. ఈ నేపథ్యంలో బ్రిక్స్ అనేక 'ప్రథమాలను ' సాధించింది అంటే మొదటిసారిగా అనేక పనులు జరిగాయి. ఇటీవల బ్రిక్స్ డిజిటల్ శిఖరాగ్ర సమావేశం జరగడం ఇదే మొదటిసారి. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆరోగ్య ప్రాప్తిని పెంచడానికి ఇది ఒక వినూత్న చర్య. నవంబర్ లో, మన నీటి వనరుల మంత్రులు బ్రిక్స్ ఏర్పాటు కింద మొదటిసారి సమావేశం కానున్నారు. 'బహుళపక్ష వ్యవస్థలను బలోపేతం చేయడం మరియు మెరుగుపరచడం'పై బ్రిక్స్ సమిష్టి వైఖరిని తీసుకోవడం కూడా ఇదే మొదటిసారి.
బ్రిక్స్ ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ ప్రణాళికను కూడా మనం స్వీకరించాం. మన అంతరిక్ష సంస్థల మధ్య రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ కూటమిపై ఒప్పందంతో కొత్త సహకార అధ్యాయం ప్రారంభమైంది. మన కస్టమ్స్ విభాగాల మధ్య సహకారం అంతర్గత బ్రిక్స్ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. వర్చువల్ బ్రిక్స్ వ్యాక్సినేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ఏకాభిప్రాయం కూడా ఉంది. పర్యావరణ హిత పర్యాటకం పై బ్రిక్స్ కూటమి నూతన ఆలోచనలు కొనసాగుతున్నాయి.
గౌరవనీయులారా,
ఈ కార్యక్రమాలు మన ప్రజలకు ప్రయోజనం కల్పిస్తాయనే కాకుండా రాబోయే సంవత్సరాలలో బ్రిక్స్ ఒక కీలక సంస్థగా అవతరించడానికి దారితీస్తుందని, బ్రిక్స్ ను మరింత సమర్థవంతంగా మార్చే సరైన దిశలో మనకు మార్గనిర్దేశం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
ముఖ్యమైన ప్రపంచ, ప్రాంతీయ విషయాలను కూడా మనం చర్చిస్తాము. మీ ప్రారంభ వ్యాఖ్యలకు నేను ఇప్పుడు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను.
****
(Release ID: 1871139)
Visitor Counter : 62