ప్రధాన మంత్రి కార్యాలయం

హిమాచల్ ప్రదేశ్‌లోని లుహ్ను, బిలాస్‌పూర్‌లలో రూ.3650 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన… జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

బిలాస్‌పూర్‌ ‘ఎయిమ్స్’ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి;

బాంద్లాలో ప్రభుత్వ హైడ్రో ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించిన ప్రధాని;

నలగఢ్‌లో వైద్య పరికరాల పార్కుకు ప్రధానమంత్రి శంకుస్థాపన;
జాతీయ రహదారిలో రూ.1690 కోట్ల విలువైన నాలుగు

వరుసల విస్తరణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన;

“హిమాచల్ ప్రదేశ్ ప్రగతి పయనంలో భాగస్వామిని కావడం నా అదృష్టం”;

“మేం శంకుస్థాపన చేసే ప్రాజెక్టును మా ప్రభుత్వం కచ్చితంగా అంకితం చేస్తుంది”;

“దేశ రక్షణ'లో హిమాచల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది… బిలాస్‌పూర్‌లో కొత్తగా ప్రారంభించిన ‘ఎయిమ్స్‌’తో ఇకపై ‘ప్రాణరక్షణ’లోనూ కీలక పాత్ర పోషిస్తుంది";

“అందరూ ఆత్మగౌరవంతో జీవించాలన్నదే మా ప్రభుత్వ ప్రాధాన్యం”;

“మహిళల ఆనందం.. సౌలభ్యం.. గౌరవం.. భద్రతలే
ద్వంద్వ చోదక ప్రభుత్వ కీలక ప్రాథమ్యాలు”;

“మేడ్ ఇన్ ఇండియా 5జి సేవలు మొదలయ్యాయి… త్వరలోనే
హిమాచల్‌లోనూ దీని ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి”

Posted On: 05 OCT 2022 2:33PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ రహదారి నం.105పై పింజోర్ నుంచి నలగఢ్ మధ్య 31 కిలోమీటర్ల మేర రూ.1,690 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే బిలాస్‌పూర్లో నిర్మించిన ‘ఎయిమ్స్‌’ను ప్రధాని జాతికి అంకితం చేయడంతోపాటు నలగఢ్‌లో రూ.350 కోట్ల‌తో నిర్మించే వైద్య పరికరాల పార్కుకు శంకుస్థాప‌న చేశారు. మరోవైపు బాంద్లాలో ప్రభుత్వ హైడ్రో ఇంజినీరింగ్ కళాశాలను ప్రధాని ప్రారంభించారు.

   ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ- విజయదశమి పర్వదినం నేపథ్యంలో తొలుత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మనం ప్రతినబూనిన ‘పంచ ప్రాణ’ మార్గంలో పయనించడంలో ప్రతి అవరోధాన్ని అధిగమిస్తూ ముందుకు సాగేవిధంగా ఈ పర్వదినం కొత్త శక్తినిస్తుందని ఆయన అన్నారు. విజయదశమికి హిమాచల్‌లో ఉండగలగడం భవిష్యత్తులో లభించబోయే ప్రతి విజయానికీ శుభసూచకమని ఆయన అన్నారు. కాగా, నేడు  బిలాస్‌పూర్‌కు ఆరోగ్యం, విద్య రూపంలో ఒకేసారి ద్వంద్వ బహుమతి లభించిందని ప్రధాని వ్యాఖ్యానించారు. కులు దసరా వేడుకలలో పాల్గొనే అవకాశం లభించడంపై ధన్యవాదాలర్పిస్తూ దేశ సంక్షేమం కోసం భగవాన్ రఘునాథ్ను ప్రార్థిస్తానని పేర్కొన్నారు. లోగడ తనతోపాటు కొందరు సహచరులు కూడా ఈ ప్రాంతంలో ఉంటూ పనిచేశామని నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. “హిమాచల్ ప్రదేశ్ ప్రగతి పయనంలో భాగస్వామిని కావడం నా అదృష్టం” అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

   హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌ను ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ- వీటన్నింటికీ ప్ర‌జ‌ల ఓటే కార‌ణమని స్పష్టం చేశారు. హిమాచల్‌లో అభివృద్ధి ఘనత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై  అపార నమ్మకం ఉంచిన ప్రజలకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. విద్య, రోడ్లు, పరిశ్రమలు, ఆస్పత్తులు వంటి సౌకర్యాలు పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమనే భావన చాలాకాలం కొనసాగిందని ఆయన అన్నారు. కొండ ప్రాంతాల విషయంలో కనీస సౌకర్యాలు కూడా చిట్టచివరన మాత్రమే వచ్చేవని గుర్తుచేశారు. పర్యవసానంగా దేశ ప్రగతిలో తీవ్ర అసమతౌల్యం ఏర్పడిందని ప్రధాని అన్నారు. హిమాచల్‌ ప్రజలు ప్రతి చిన్న అవసరానికీ అటు చండీగఢ్ లేదా ఇటు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేదని పేర్కొన్నారు. అయితే, గత 8 ఏళ్లలో ద్వంద్వ చోదక ప్రభుత్వం పరిస్థితులను సమూలంగా మార్చేసిందని చెప్పారు. ఇవాళ ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కూడా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ స‌మ‌కూర్చుకున్నద‌ని ప్ర‌ధానమంత్రి అన్నారు. దేశంలో వైద్య విద్యకు సంబంధించి అగ్రస్థానంలోగల ‘ఎయిమ్స్‌’ ఇక బిలాస్‌పూర్‌ కీర్తిని మరింత ఉజ్వలం చేస్తుందని శ్రీ మోదీ అన్నారు. “గత ఎనిమిదేళ్లలో హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించింది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   ప్రభుత్వం పనిచేసే ధోరణి పూర్తిగా మారడాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే నిర్దిష్ట వ్యవధితో నేడు వాటికి పునాది పడుతుండటమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. దేశ ప్రగతిలో హిమాచల్‌ ప్రదేశ్‌ పాత్రను వివరిస్తూ- ‘దేశ రక్షణ'లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో కొత్తగా ప్రారంభించిన ‘ఎయిమ్స్’తో ఇకపై ‘ప్రాణరక్షణ’లోనూ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి సవాలు విసిరినప్పటికీ ‘ఎయిమ్స్‌’ నిర్మాణం సకాలంలో పూర్తి కావడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటుకు ఎంపికైన మూడు రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి కావడం గర్వించదగిన తరుణమని ప్రధాని పేర్కొన్నారు. అలాగే వైద్య పరికరాల తయారీ పార్కు కోసం ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాల్లో హిమాచల్‌లో ఒకటి కాగా, ఇందులో భాగంగా  నలగఢ్‌లో పార్కుకు శంకుస్థాపన పూర్తయిందన్నారు. “ఇది సాహస వీరుల పుట్టినిల్లు.. దీనికి నేనెంతో రుణపడి ఉంటాను” అని ప్రధానమంత్రి అన్నారు.

   వైద్య పర్యాటక అభివృద్ధికి సంబంధించి హిమాచల్‌ ప్రదేశ్‌కు అపార అవకాశాలున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఇక్కడి గాలి, పర్యావరణం, ఔషధ మొక్కల లభ్యత వగైరాలన్నీ  రాష్ట్ర ఇతోధిక ప్రయోజనాలకు వనరులు కాగలవన్నారు. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల జీవన సౌలభ్యం దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాల్లో ఆస్పత్రుల ఏర్పాటు, తద్వారా వైద్య ఖర్చుల తగ్గింపు ప్రయత్నాల గురించి వివరించారు. ఈ మేరకు ‘ఎయిమ్స్‌’ నుంచి జిల్లా ఆస్పత్రులలో ప్రాణరక్షక చికిత్స, గ్రామాల్లో శ్రేయో కేంద్రాలకు నిరంతర సంధానం కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం రాష్ట్రంలోని చాలా కుటుంబాలకు ఏటా రూ.5 లక్షలదాకా ఉచిత చికిత్స సదుపాయం అందిస్తోందని తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా చికిత్స పొందిన 3 కోట్ల మందిలో హిమాచల్‌ వాసులు 1.5 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా ప్రభుత్వం రూ.45,000 కోట్లకుపైగా ఖర్చు చేయడంతో రోగులకు రూ.90,000 కోట్లదాకా ఆదా అయిందని పేర్కొన్నారు.

   న తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు ఆనందం, సౌలభ్యం, గౌరవం, రక్షణ, ఆరోగ్యాన్ని అందించే దిశగా ద్వంద్వ చోదక ప్రభుత్వానికి పునాదులు వేయబడ్డాయని ప్రధానమంత్రి అన్నారు. “అందరూ ఆత్మగౌరవంతో జీవించాలన్నదే మా ప్రభుత్వ ప్రాధాన్యం” అని ఆయన వ్యాఖ్యానించారు. తల్లులు, సోదరీమణుల సాధికారత కల్పన దిశగా ‘ఇంటింటికీ నీరు’ కార్యక్రమంసహా ప్రభుత్వం అమలుచేసిన మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత గ్యాస్ కనెక్షన్, శానిటరీ ప్యాడ్ పంపిణీ పథకం, మాతృ వందన యోజన వంటి పథకాల గురించి ఆయన ఏకరవుపెట్టారు. కేంద్ర ప‌థ‌కాల‌ను స్పూర్తిమంతంగా, వేగంగా అమ‌లు చేయ‌డమే  కాకుండా వాటి ప‌రిధిని విస్త‌రించడంపై ముఖ్య‌మంత్రిని, ఆయ‌న బృందాన్ని ప్ర‌ధాని అభినందించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ నీరు, పెన్షన్‌ వంటి సామాజిక భద్రత పథకాల అమలులోనూ వేగం పుంజుకున్నదని కొనియాడారు. అలాగే ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్‌ పథకంతో హిమాచల్‌లోని అనేక కుటుంబాలు ఎంతో ప్రయోజనం పొందాయని గుర్తుచేశారు. ఇక కరోనా టీకాల కార్యక్రమాన్ని వంద శాతం పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్‌ ఘనత సాధించిందని ఆయన ప్రశంసించారు.

   “హిమాచల్‌ ప్రదేశ్‌ అపార అవకాశాల గడ్డ” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రం విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నదని, సారవంతమైన భూమి ఈ రాష్ట్రం సొంతమని, అలాగే పర్యాటక ప్రాధాన్యం ఉన్నందున అపార అవకాశాలు అందివస్తాయని ఆయన వివరించారు. అయితే, మెరుగైన అనుసంధానం లేకపోవడమే ఈ అవకాశాలకు అతిపెద్ద అవరోధంగా ఉన్నదని గుర్తుచేశారు. “హిమాచల్ ప్రదేశ్‌లో గ్రామం నుంచి గ్రామానికి అత్యుత్తమ మౌలిక సౌకర్యాల కల్పనకు 2014 నుంచి కృషి సాగుతోంది” అని ఆయన తెలిపారు. హిమాచ‌ల్‌లో అన్నివైపులా రోడ్ల‌ విస్త‌రణ ప‌నులు కూడా కొనసాగుతున్నాయ‌ని ప్ర‌ధాని సూచించారు. “ప్రస్తుతం  హిమాచల్‌లో అనుసంధానం దిశగా దాదాపు రూ.50 వేల కోట్లతో పనులు చేస్తున్నారు” అని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా “పింజోర్ నుంచి నాలాగఢ్ హైవే దాకా నాలుగు వరుసల విస్తరణ పూర్తయితే పారిశ్రామిక ప్రాంతాలైన నాలాగఢ్, బడ్డీ మాత్రమే ప్రయోజనం పరిమిత కాదు. చండీగఢ్, అంబాలా నుంచి బిలాస్‌పూర్‌, మండీ, మనాలివైపు వెళ్లే ప్రయాణికులకూ ప్రయోజనం ఉంటుంది” అన్నారు. అంతేకాదు “వంకరటింకర రోడ్ల బాధనుంచి హిమాచల్ ప్రజలకు విముక్తి దిశగా సొరంగాల నెట్‌వర్క్ కూడా వేయబడుతోంది” అని ప్రధాని తెలిపారు.

   డిజిటల్ భారతంలో తాజా పరిణామాలను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ అనుసంధానానికి సంబంధించి హిమాచల్‌లో కూడా అద్భుత కృషి జరిగిందని అన్నారు. “గత 8 సంవత్సరాలలో మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్లు కూడా చౌకగా లభిస్తున్నాయి... అలాగే గ్రామాలకు నెట్‌వర్కును కూడా తీసుకొచ్చాయి” అని ఆయన గుర్తుచేశారు. మెరుగైన 4జి సంధానం వల్ల హిమాచల్ ప్రదేశ్ కూడా డిజిటల్ లావాదేవీలలో చాలా వేగంగా ముందంజ వేస్తోందన్నారు. “డిజిటల్ భారతం నుంచి అధిక ప్రయోజనం పొందుతున్న వారు ఎవరైనా ఉన్నారంటే- అది హిమాచల్ ప్రజలైన మీరే” అని ఆయన అన్నారు. ఈ డిజిటల్ సంధానంతో బిల్లులు చెల్లింపు, బ్యాంకు పనులు, ప్రవేశాలు-దరఖాస్తులు తదితరాలు అతి తక్కువ సమయంలో పూర్తవుతున్నాయని ప్రధాని తెలిపారు.

   దేశంలో 5జి పరిణామాలను వివరిస్తూ- “ఇప్పుడు దేశంలోనే తొలిసారి ‘మేడ్ ఇన్ ఇండియా’ 5జి సేవలు మొదలయ్యాయి. దీని ప్రయోజనాలు అతి త్వరలోనే హిమాచల్‌కూ అందుబాటులోకి వస్తాయి” అని ప్రధానమంత్రి వెల్లడించారు. భారతదేశంలో డ్రోన్ నిబంధనలను మార్చిన తర్వాత వస్తు రవాణాలో వాటి వినియోగం పెరగనున్నదని చెప్పారు. అలాగే విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యాటక రంగాలు కూడా దీనిద్వారా ఎనలేని ప్రయోజనాలు పొందగలవని ఆయన తెలిపారు. డ్రోన్ విధానం ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కావడంపై ఆయన ప్రశంసించారు. “ప్రతి పౌరుడికీ సౌకర్యం పెంచగల అభివృద్ధి కోసం మేం కృషి చేస్తున్నాం. ఆ మేరకు ప్రతి పౌరుడూ శ్రేయస్సుతో అనుసంధానమవుతాడు. అభివృద్ధి చెందిన భారతదేశం, హిమాచల్ ప్రదేశ్ల సంకల్పానికి ఇదే నిదర్శనంగా నిలుస్తుంది” అని ప్రధానమంత్రి ముగించారు.

   హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్,  కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, పార్లమెంటు సభ్యుడు-బీజేపీ అధ్యక్షుడు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటు సభ్యుడు-బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సురేష్ కుమార్ కశ్యప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం – హిమాచల్‌ ప్రదేశ్‌లో బహుళ ప్రాజెక్టులు

   జాతీయ రహదారి నం.105లో పింజోర్ నుంచి నాలాగఢ్ మధ్య 31 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు ఇవాళ శంకుస్థాపన చేయబడింది. దీని విలువ రూ.1,690 కోట్లు... ఇది అంబాలా, చండీగఢ్, పంచకుల, సోలన్/సిమ్లా నుంచి బిలాస్‌పూర్, మండీ, మనాలి వైపు వెళ్లే వాహనాలకు ప్రధాన అనుసంధాన మార్గం. ఈ నాలుగు వరుసల జాతీయ రహదారిలో దాదాపు 18 కిలోమీటర్ల మేర హిమాచల్ ప్రదేశ్ పరిధిలోనిది కాగా, మిగిలిన భాగం హర్యానాలో ఉంటుంది. ఈ రహదారి హిమాచల్ ప్రదేశ్ పారిశ్రామిక కేంద్రమైన నలగఢ్‌-బడ్డీలో మెరుగైన రవాణా సౌకర్యాలకు భరోసా ఇస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి మరింతగా దోహదం చేస్తుంది. అలాగే రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధినీ ప్రోత్సహిస్తుంది.

‘ఎయిమ్స్‌’ – బిలాస్‌పూర్‌

   బిలాస్‌పూర్‌లో ‘ఎయిమ్స్‌’ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల బలోపేతంపై ఆయన దూరదృష్టి, అంకితభావం ప్రస్ఫుటం అవుతున్నాయి. ఈ ఆస్పత్రికి 2017 అక్టోబరులో ప్రధానమంత్రి స్వయంగా శంకుస్థాపన చేశారు. కాగా, దీన్ని కేంద్ర పథకం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద నిర్మించారు. బిలాస్‌పూర్‌లో రూ.1,470 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో ‘ఎయిమ్స్‌’ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ 18 ప్రత్యేక, 17 అత్యాధునిక వైద్య విభాగాలతోపాటు 750 పడకలు, 64 ఐసీయూ పడకలు, 18 మాడ్యులర్‌ శస్త్రచికిత్స గదులున్నాయి. మొత్తం 247 ఎకరాల్లో నిర్మితమైన ఈ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స, డయాలసిస్‌ సదుపాయాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అల్ట్రాసోనోగ్రఫీ, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ వగైరా అత్యాధునిక రోగనిర్ధారణ యంత్రపరికరాలున్నాయి. అలాగే అమృత్ ఫార్మసీ, జనౌషధి కేంద్రం, 30 పడకల ఆయుష్ వైద్యవిధాన భవనం కూడా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలకు, మారుమూల గిరిజన పల్లెలకు ఆరోగ్య సేవల లభ్యత దిశగా ఈ హాస్పిటల్లో డిజిటల్ ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటైంది. అలాగే, కాజా, సలూని, కీలాంగ్ వంటి దుర్గమ గిరిజన, ఎత్తయిన హిమాలయ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలతో ఈ ఆస్పత్రి ద్వారా ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడతాయి. ఏటా ఇక్కడ 100 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌, 60 మంది విద్యార్థులను నర్సింగ్ కోర్సులు అభ్యసిస్తారు.

ప్రభుత్వ హైడ్రో ఇంజనీరింగ్‌ కళాశాల, బాంద్లా

   ప్రధానమంత్రి బాంద్లాలో రూ.140 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ హైడ్రో ఇంజనీరింగ్‌ కళాశాలను ప్రారంభించారు. జలవిద్యుత్‌ ఉత్పాదనలో అగ్రస్థానంలోగల రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్‌ ప్రదేశ్‌లో జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు అవసరమైన మానవశక్తికి ఈ కళాశాల శిక్షణ ఇస్తుంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికి పునశ్చరణ శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా జల విద్యుదుత్పాదన రంగంలో మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టిస్తుంది.

వైద్య పరికరాల పార్కు, నలగఢ్‌

   ల‌గ‌ఢ్‌లో దాదాపు రూ.350 కోట్ల‌తో నిర్మించే వైద్య పరికరాల పార్కుకు ప్ర‌ధానమంత్రి శంకుస్థాప‌న చేశారు. ఈ పార్కులో రూ.800 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు కోసం ఇప్పటికే అవగాహన ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. దీనిద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

*****

DS/TS



(Release ID: 1865440) Visitor Counter : 221