గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పరిశుభ్రమైన నగరాలకు అవార్డులు ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి అతిపెద్ద పట్టణ పారిశుద్ధ్య ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

Posted On: 30 SEP 2022 1:07PM by PIB Hyderabad

అతిపెద్ద పట్టణ పారిశుద్ధ్య ఉత్సవ నిర్వహణకు  ఏర్పాట్లు పూర్తయ్యాయి.  న్యూఢిల్లీలోని తాల్కటోర స్టేడియంలో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రాష్ట్రపతి శ్రీమతి.ద్రౌపది ముర్ము 1 అక్టోబర్ 2022న దేశంలో పరిశుభ్రమైన రాష్ట్రాలు, నగరాలకు అవార్డులు అందించి సత్కరిస్తారు. 2021 అక్టోబర్ 1వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన  స్వచ్ఛ భారత్ మిషన్ – అర్బన్ 2.0 మొదటి వార్షికోత్సవం సందర్భంగా  కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో నగరాలను చెత్త రహిత నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో స్వచ్ఛ భారత్ మిషన్ – అర్బన్ 2.0  అమలు జరుగుతున్నది. 

ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర గృహనిర్మాణ,  పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి,  కేంద్ర గృహనిర్మాణ,  పట్టణ వ్యవహారాల  శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్, వివిధ రాష్ట్రాల  పట్టణాభివృద్ధి మంత్రులు మరియు మేయర్‌లతో సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కార్యక్రమంలో వివిధ కేటగిరీలలో 160కి పైగా అవార్డులు అందజేయడం జరుగుతుంది.  రాష్ట్ర మరియు నగర సంస్థల పరిపాలకులు, పారిశుధ్య  రంగ భాగస్వాములు,  నిపుణులు,  యువజన సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, పరిశ్రమల ప్రతినిధులు, పారిశుద్ధ్యం మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో పనిచేస్తున్న  స్టార్టప్‌లు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజా సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారు. సమావేశానికి  దాదాపు 1,800 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. తమ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కార్యక్రమ  ప్రత్యక్ష వేడుకలను వీక్షించడానికి వీలుగా ప్రముఖ ప్రదేశాలలో స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. 

స్వచ్ఛ సర్వేక్షణ్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నది. దీనిలో పాల్గొంటున్న నగరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.  2016 లో 73 ప్రధాన నగరాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరిగింది.   2017లో 434  నగరాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరిగింది.  4,355 నగరాలు సర్వేలో పాల్గొన్నాయి.   స్వచ్ఛ సర్వేక్షణ్ 7 వ  ఎడిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వే గా గుర్తింపు పొందింది. "ప్రజలు ముఖ్యం " ప్రధాన ఇతివృత్తంగా ఈ సంవత్సరం సర్వే జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 కోట్లకు పైగా ప్రజల నుంచి వారి అభిప్రాయాలు సేకరించారు.  గత సంవత్సరం 5 కోట్ల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది సర్వే పరిమాణం గణనీయంగా పెరిగింది. 


స్వచ్ఛ సర్వేక్షణ్  2022 లో కొన్ని కీలకమైన కొత్త అంశాలు ప్రవేశపెట్టబడ్డాయి.గత  సంవత్సరాల్లో 40% వార్డులను నమూనాగా తీసుకుని సర్వే నిర్వహించడం జరిగింది. యితే, ఈ ఏడాది  నమూనా  సర్వే పరిధిని విస్తరించి   100% వార్డుల పరిధిలో సర్వే చేయడం జరిగింది.  అభిప్రాయసేకరణ  ప్రక్రియలో సీనియర్ సిటిజన్‌లు మరియు యువకుల అభిప్రాయాలకు  ప్రాధాన్యత ఇవ్వబడింది.  చిన్న నగరాలను ప్రోత్సహించే లక్ష్యంతో  అవార్డుల కోసం మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ్   2022 సర్వే ఫలితాల ఆధారంగా ప్రజల కోసం 'సిటీ రిపోర్ట్ కార్డ్' రూపొందించబడింది. దీనిలో ప్రజలు తాము నివసిస్తున్న  నగరాల పారిశుధ్య స్థితి తెలుసుకోవచ్చు.  'సఫాయి మిత్ర సురక్ష' అమలు అన్ని నగరాలకు తప్పనిసరి చేయబడింది. స్వాతంత్ర్య ఉద్యమం తో సంబంధం ఉన్న స్మారక చిహ్నాలు/పార్కుల శుభ్రత ప్రజల నేతృత్వంలో నిర్వహించి  ఆజాదీ ఉద్యమానికి గౌరవం ఇవ్వడం జరిగింది. 

 ఎనిమిది సంవత్సరాలుగా   స్వచ్ఛ భారత్ మిషన్ -అర్బన్ విజయవంతంగా అమలు జరుగుతున్న  17  సెప్టెంబర్ 2022 నుంచి  2  అక్టోబర్  2022 వరకు   కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న  స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించబడుతోంది . పక్షం రోజుల పాటు జరిగే వేడుకల్లో స్వచ్ఛ భారత్ మిషన్ -అర్బన్   2.0 మొత్తం లక్ష్యాలకు అనుగుణంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు సెప్టెంబర్ 17 వ తేదీన  తొలిసారిగా నిర్వహించిన   ఇండియన్ స్వచ్ఛతా లీగ్‌తో ప్రారంభమయ్యాయి.  కార్యక్రమంలో 1,850 పైగా  నగరాల్లో దాదాపు అయిదు లక్షల  మంది యువకులు,ప్రజలు  బృందాలుగా ఏర్పడి సముద్ర తీర ప్రాంతాలు , కొండలు మరియు బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో మొదటి  70 స్థానాల్లో నిలిచిన వారిని సెప్టెంబర్ 30న   కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ  సత్కరిస్తుంది. పారిశుధ్యం మరియు వ్యర్థాల నిర్వహణలో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న వివిధ  సవాళ్లను పరిష్కరించడంలో నగరాలకు సహాయపడటానికి  కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ ఒక వినూత్న స్టార్టప్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని   సెప్టెంబర్ 20న నిర్వహించింది.  కార్యక్రమంలో  వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో 30 అగ్ర స్టార్టప్‌లను గుర్తించింది.  ఈ ప్రయత్నాలను కొనసాగించి  నగరాల ప్రయోజనాల కోసం స్టార్టప్‌లు తమ పరిష్కారాలను తెలియజేయడానికి ఆన్‌లైన్ స్టార్టప్ గేట్‌వే కూడా   కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ ప్రారంభించింది.  సెప్టెంబర్ 26న మరో  వినూత్న కార్యక్రమాన్ని  కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించింది. 'వ్యర్థాల నుంచి సంపద సృష్టి ' లక్ష్యంగా  వ్యర్థాల నుంచి  బొమ్మలు తయారుచేయడానికి 'స్వచ్ఛ టాయ్‌కాథాన్' పోటీని నిర్వహించింది. కార్యక్రమానికి  రెండు రోజులు ముందు సామర్థ్యం పెంపుదల కోసం  “ స్వచ్ఛ షెహర్ – సంవాద్  టెక్ ఎగ్జిబిషన్” పేరిట కార్యక్రమం జరిగింది.  మున్సిపల్ ఘన వ్యర్థాలు మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై  సాంకేతిక,  పరిపాలనా పరమైన అంశాలపై  చర్చలు జరిగాయి. చెత్త రహిత స్థాయి సాధించేందుకు రాష్ట్రాలు, నగరాలు తమ వ్యూహాలు సిద్ధం చేసుకుని  ఉత్తమ పద్ధతులు అమలు చేసి  సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన విధానాలకు  “ స్వచ్ఛ షెహర్ – సంవాద్  టెక్ ఎగ్జిబిషన్” రూపకల్పన చేసింది. 


గత ఎనిమిదేళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్  దేశంలోని అన్ని ప్రాంతాలలో అమలు జరిగింది.   'ప్రజలు మొదట' అన్న అంశానికి ప్రాధాన్యత ఇచ్చి అమలు జరిగిన కార్యక్రమం  అసంఖ్యాక ప్రజల జీవన  విధానంలో గణనీయమైన మార్పులు తీసుకు రావడంలో విజయం సాధించింది. 70 లక్షల  గృహాలు, కమ్యూనిటీ మరియు ప్రజా మరుగుదొడ్లు మిషన్ లో భాగంగా నిర్మించడం జరిగింది. దీనివల్ల  భారతదేశ పట్టణ ప్రాంతాల్లో  పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగు పడ్డాయి. అందరికీ సురక్షితమైన మరియు గౌరవప్రదమైన పారిశుద్ధ్య పరిష్కారాలను అందిస్తుంది.    మహిళలు, లింగమార్పిడి సంఘాలు మరియు వికలాంగుల (దివ్యాంగులు) అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ -యూ అమలు జరిగింది. భారతదేశంలో వ్యర్థాలను  శాస్త్రీయ విధానాల ద్వారా  నిర్వహణ ప్రాసెసింగ్ చేయడం పెరిగింది.  2014లో 18% ఉన్న వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ ప్రస్తుతం  73%కి నాలుగు రెట్లు పెరగడం తో ఈ రంగంలో వచ్చిన మార్పు  స్పష్టంగా కనిపిస్తోంది. 98% వార్డులలో 100% ఇంటింటికి చెత్త సేకరణ మరియు 89% వార్డులలో పౌరులు స్వయంగా  వ్యర్థాలను మూలం నుంచి  వేరు చేయడం ద్వారా ఇది సాధ్యమయ్యింది. పారిశుధ్య కార్మికుల జీవన విధానాలను మార్చడంలో మిషన్ విజయవంతం అయ్యింది. కాలువలు,సెప్టిక్ ట్యాంక్ లు  శుభ్రం చేస్తున్న పారిశుధ్య సిబ్బందికి  స్వచ్ఛ భారత్ మిషన్ సంస్థాపరమైన భద్రత, సంరక్షణ కల్పించింది. 

సుస్థిర పరిశుభ్రత, స్వచ్ఛత సాధన లక్ష్యంగా  2021 అక్టోబర్ 1 వ తేదీన స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 ప్రారంభమయ్యింది.  పారిశుద్ధ్య నిర్వహణ,ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశాలకు స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 లో ప్రాధాన్యత లభించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి పారిశుద్ధ్య సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించుకుని స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 అమలు జరుగుతున్నది. వ్యర్థాలను సురక్షితంగా తొలగించడానికి  1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల్లో పూర్తి ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని అమలు చేయాలని స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0  నిర్ణయించింది.  మురుగునీటిని సురక్షితంగా ఉంచడం, సేకరించడం, రవాణా చేయడం మరియు శుద్ధి చేయడం వంటి కార్యక్రమాల  ద్వారా  నీటి వనరులను కలుషితం చేయకుండా ఉండేలా చర్యలు అమలు జరుగుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి   వ్యర్థాల నుంచి గరిష్టంగా సంపదను సృష్టించడానికి వ్యర్థాలను వేరు చేయడం,   మెటీరియల్ రికవరీ, వ్యర్థాల ప్రోసెసింగ్ సౌకర్యాల ఏర్పాటు కోసం ప్రత్యేక కార్యక్రమాలు  స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద అమలు జరుగుతున్నాయి.  నిర్మాణం,కూల్చివేత సమయంలో వెలువడే  వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్ కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయడం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద  నగరాల్లో మెకానికల్ స్వీపర్‌ల విస్తరణ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.  నగరాలను చెత్త రహితం గా మార్చే లక్ష్యంతో అమలు జరుగుతున్న  స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద గతంలో పని చేసిన చెత్త నిల్వ కేంద్రాలను పూర్తిగా తొలగించడం  భారత్ మిషన్-అర్బన్ 2.0 లో  మరొక కీలకమైన అంశంగా ఉంది.సమగ్ర సమాచారం ,విద్యా  సమాచారం వ్యాప్తి,  ప్రవర్తన మార్పు కార్యకలాపాల ద్వారా   'జన్ ఆందోళన' లేదా ప్రజల ఉద్యమానికి పర్యాయపదంగా మారిన స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరింత పటిష్టంగా సమర్థంగా అమలు జరుగుతున్నది. 

ఈ అవార్డు ప్రదానోత్సవం స్వచ్ఛత పట్ల నగరాల అచంచలమైన అంకితభావానికి తగిన గుర్తింపు గా మాత్రమే కాకుండా  పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు మరింత సమగ్రమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తమ వంతు సహకారం అందించాలని పట్టణ ప్రాంత ప్రజలకు ఒక స్పష్టమైన పిలుపుగా కూడా పని చేస్తుందని భావిస్తున్నారు.

 

***



(Release ID: 1863826) Visitor Counter : 158