ప్రధాన మంత్రి కార్యాలయం
44వ చెస్ ఒలింపియాడ్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి
చెస్ ఒలింపియాడ్ కు తొలిసారిగా భారత్ ఆతిథ్యం; చరిత్రలో అధిక సంఖ్యలో క్రీడాకారులను రంగంలోకి దింపిన భారత్
“చదరంగం జన్మస్థానం అయిన భారత్ కు వచ్చిన ప్రతిష్ఠాత్మక చెస్ టోర్నమెంట్”
“44వ చెస్ ఒలింపియాడ్ ఎన్నో తొలి సంఘటనలు, రికార్డులకు వేదిక”
“దేశంలో చెస్ పవర్ హౌస్ తమిళనాడు”
“అద్భుత మేథస్సు, చైతన్యవంతమైన సంస్కృతి, ప్రపంచంలోనే ప్రాచీన భాష - తమిళ నిలయం తమిళనాడు
భారతదేశంలో క్రీడలకు ప్రస్తుత సమయాన్ని మించిన ఉత్తమ సమయం లేదు”
“యువజన శక్తి, అనుకూల వాతావరణం సమ్మిళితం కావడంతో భారతదేశంలో క్రీడా సంస్కృతి శక్తివంతం అవుతోంది”
“క్రీడల్లో పరాజితులుండరు, విజేతలు, భవిష్యత్ విజేతలు ఉంటారు”
Posted On:
28 JUL 2022 8:22PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెన్నైలోని జెఎల్ఎన్ ఇండోర్ స్టేడియంలో 44వ చెస్ ఒలింపియాడ్ ను ప్రారంభించారు. తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, శ్రీ ఎల్.మురుగన్, అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ఆర్కడి ద్వోర్కోవిచ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడాకారులు, అభిమానులను భారతదేశానికి ఆహ్వానించారు. “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” సమయంలో ఈ క్రీడోత్సవం జరగడం ఒక విశిష్టత అని ఆయన అన్నారు. చదరంగానికి మాతృభూమి అయిన భారతదేశానికి ప్రతిష్ఠాత్మకమైన చెస్ టోర్నమెంట్ రావడం ఆనందదాయకమన్నారు.
ఈ 44వ చెస్ ఒలింపియాడ్ ఎన్నో తొలి సంఘటనలు, రికార్డుల వేదిక అని ప్రధానమంత్రి వర్ణించారు. చెస్ పుట్టుక స్థలం అయిన ప్రదేశంలో తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ ఒక సందర్భం కాగా 3 దశాబ్దాల కాలంలో ఆసియాకు చెస్ టోర్నమెంట్ రావడం కూడా ప్రథమమం. అలాగే ఈ టోర్నమెంట్ లో అధిక శాతంలో దేశాలు పాల్గొంటున్నాయి, అలాగే అధిక సంఖ్యలో టీమ్ లు భాగస్వాములవుతున్నాయి అన్నారు. మహిళా విభాగంలో భారతదేశం అత్యధిక సంఖ్యంలో ఎంట్రీలు నమోదు చేసిందని చెప్పారు. అలాగే చెస్ ఒలింపియాడ్ చరిత్రలోనే తొలిసారిగా కాగడా రిలే ప్రారంభమయిందని తెలిపారు.
తమిళనాడుకు చారిత్రకంగా చదరంగంతో బలమైన అనుబంధం ఉన్నదన్న విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు. అందుకే రాష్ర్టాన్ని భారతదేశానికే చెస్ పవర్ హౌస్ గా వ్యవహరించవచ్చునన్నారు. పలువురు చెస్ గ్రాండ్ మాస్టర్లను రాష్ట్రం తయారుచేసిందని ప్రశంసించారు. అద్భుతమైన ఆలోచనాపరులు, చైతన్యవంతమైన సంస్కృతి, ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం నిలయం తమిళనాడు అన్నారు.
అందరినీ ఐక్యం చేసే శక్తివంతమైన మాధ్యమం క్రీడలని ప్రధానమంత్రి అన్నారు. క్రీడలు ప్రజలను, సమాజాన్ని సన్నిహితం చేస్తాయని చెప్పారు. అలాగే క్రీడలు టీమ్ వర్క్ ను పెంచే సాధనమన్నారు. భారతదేశంలో క్రీడారంగానికి ప్రస్తుత కాలం అత్యుత్తమమైనదని చెప్పారు. “భారతదేశం ఒలింపిక్స్, పారాలింపిక్స్, డెఫ్లింపిక్స్ లో చరిత్రలోనే అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించింది. గతంలో మనం విజయం చవి చూడని క్రీడల్లో కూడా భారత్ ప్రకాశించింది” అన్నారు. రెండు కీలకమైన అంశాల మేలి కలయికతో భారతదేశంలో క్రీడా సంస్కృతి బలంగా మారుతున్నదని ఆయన చెప్పారు. యువతలోని శక్తి, సానుకూలమైన వాతావరణం ఆ రెండు ప్రధానాంశాలని ఆయన అన్నారు.
క్రీడల్లో పరాజితులు అనే వారే ఉండరు. విజేతలుంటారు, భవిష్యత్ విజేతలుంటారని చెప్పారు. 44వ చెస్ ఒలింపియాడ్ లో పాల్గొంటున్న టీమ్ లు, క్రీడాకారులకు శుభాభినందనలు అందిస్తూ వారికి విజయం చేకూరాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
నేపథ్యం
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 2022 జూలై 19వ తేదీన తొలి చెస్ ఒలింపియాడ్ కాగడా రిలేను ప్రధానమంత్రి ప్రారంభించారు. 40 రోజుల సమయంలో 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆ కాగడా 75 ప్రధాన ప్రాంతాలు సందర్శిస్తూ స్విట్జర్లాండ్ లోని ఫిడే ప్రధాన కార్యాలయానికి చేరడానికి ముందు మహాబలిపురంలో ముగిసింది.
ఈ 44వ చెస్ ఒలింపియాడ్ జూలై 28 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు చెన్నైలో జరుగుతోంది. 1927 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మకమైన టోర్నీకి భారతదేశం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. అలాగే 30 సంవత్సరాల విరామం అనంతరం తొలిసారి ఆసియాలో జరుగుతోంది. 187 దేశాలు పాల్గొంటున్న చెస్ ఈ ఒలింపియాడ్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసింది. 6 టీమ్ లు, 30 మంది క్రీడాకారులతో భారతదేశం తొలిసారిగా అది పెద్ద బృందాన్ని పోటీకి బరిలోకి దింపింది.
***
DS/AK
(Release ID: 1847039)
Visitor Counter : 110
Read this release in:
Tamil
,
Kannada
,
Malayalam
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati