ప్రధాన మంత్రి కార్యాలయం
అఖిలభారత జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థల తొలి జాతీయ మహాసభలో ప్రధానమంత్రి ప్రసంగం
“వాణిజ్య సౌలభ్యం.. జీవన సౌలభ్యం తరహాలో
దేశ అమృతయాత్రలో న్యాయ సౌలభ్యమూ ముఖ్యమే”;
“గత ఎనిమిదేళ్లలో దేశంలో న్యాయ మౌలిక వసతుల
పటిష్టానికి శరవేగంగా పనులు జరిగాయి”;
“మన న్యాయ వ్యవస్థ ప్రాచీన భారతీయ న్యాయ విలువలకు కట్టుబడింది..
అంతేకాకుండా 21వ శతాబ్దపు వాస్తవాల అనుసరణకూ సిద్ధంగా ఉంది”
Posted On:
30 JUL 2022 11:20AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అఖిలభారత జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థల తొలి మహాసభ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, కేంద్ర మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, శ్రీ ఎస్.పి. సింగ్ బాఘేల్, సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్ర న్యాయ సేవ ప్రాధికార సంస్థల (ఎస్‌ఎల్‌ఎస్‌ఎ) ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్లు, జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థల (డిఎస్‌ఎల్‌ఎ) చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఉచిత న్యాయ సహాయ హక్కు’ స్మారక తపాలాబిళ్లను కూడా ప్రధాని ఆవిష్కరించారు.
అనంతరం కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ- ఇది స్వాతంత్ర్య అమృత కాలమని, రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చే సంకల్పాలు పూనాల్సిన సమయమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మేరకు వాణిజ్య సౌలభ్యం.. జీవన సౌలభ్యం తరహాలో దేశ అమృత యాత్రలో న్యాయ సౌలభ్యం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ విధానంలోని ఆదేశిక సూత్రాలలో న్యాయ సహాయ ప్రక్రియకుగల స్థానం గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశ న్యాయవ్యవస్థపై పౌరుల విశ్వాసంలో ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. “ఏ సమాజంలోనైనా న్యాయ వ్యవస్థ లభ్యత ఎంత ప్రధానమో… న్యాయ ప్రదానం కూడా అంతే ప్రధానం. అలాగే న్యాయ మౌలిక సదుపాయాలకూ ఇందులో కీలక పాత్ర ఉంటుంది. కాబట్టే గత ఎనిమిదేళ్లలో దేశమంతటా న్యాయ మౌలిక వసతుల పటిష్టానికి శరవేగంగా పనులు జరిగాయి” అని ప్రధాని చెప్పారు.
సమాచార సాంకేతిక, సాంకేతికార్థిక రంగాల్లో దేశం అగ్రస్థానంలో ఉండటాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. న్యాయ ప్రదాన ప్రక్రియలలో సాంకేతిక పరిజ్ఞాన శక్తిని మరింతగా జోడించడానికి ఇంతకన్నా మెరుగైన అవకాశం మరొకటి రాదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో “ఇ-కోర్టుల కార్యక్రమం’ కింద వర్చువల్ న్యాయస్థానాలకు శ్రీకారం చుట్టాం. ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి నేరాలపై కోర్టులు 24 గంటలూ పనిచేయడం ప్రారంభించాయి. ప్రజల సౌకర్యార్థం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ కూడా సాగుతోంది” అని ప్రధాని పేర్కొన్నారు. “దీన్నిబట్టి మన న్యాయ వ్యవస్థ ప్రాచీన భారతీయ న్యాయ విలువలకు కట్టుబడటంతోపాటు 21వ శతాబ్దపు వాస్తవాల అనుసరణకూ సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే “రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతోపాటు అది నిర్దేశించిన బాధ్యతల గురించి కూడా సామాన్య పౌరులు తెలుసుకోవాలి. ఈ మేరకు రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలు, నిబంధనలు, పరిష్కారాలపైనా అవగాహన పెంచుకోవాలి. ఈ విషయంలోనూ సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించగలదు” అని ప్రధాని అన్నారు.
అమృత కాలమంటే ‘కర్తవ్య నిర్వహణ సమయం’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఇప్పటిదాకా నిర్లక్ష్యానికి గురైన రంగాల ప్రగతికి ఈ సమయంలో మనం కృషి చేయాలన్నారు. విచారణ ఖైదీల విషయంలో కరుణ గురించి శ్రీ మోదీ మరోసారి ప్రస్తావించారు. అలాంటి ఖైదీలకు న్యాయ సహాయం అందించే బాధ్యతను జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థలు స్వీకరించవచ్చునని సూచించారు. విచారణ ఖైదీల కేసులపై సమీక్ష కమిటీలకు చైర్‌పర్సన్ల హోదాలోగల జిల్లా జడ్జీలు కూడా వారి విడుదల ప్రక్రియను వేగిరపరచాలని కోరారు. ఈ అంశంపై ఉద్యమస్థాయి కార్యక్రమం చేపట్టిన జాతీయ న్యాయసేవ ప్రాధికార సంస్థ (నల్సా)ను ప్రధాని అభినందించారు. ఈ కార్యక్రమంలో మరింతమంది న్యాయవాదులు భాగస్వాములయ్యేలా ప్రోత్సహించాలని బార్ కౌన్సిల్‌ను ఆయన కోరారు.
జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థల (డిఎల్‌ఎస్‌ఎ) తొలి జాతీయ మహాసభలను జాతీయ న్యాయసేవ ప్రాధికార సంస్థ (నల్సా) విజ్ఞాన్ భవన్‌లో 2022 జూలై 30-31 తేదీల్లో నిర్వహిస్తోంది. ‘డిఎల్‌ఎస్‌ఎ’ల ఏకరూపతతోపాటు సమకాలీకరణ దిశగా ఒక సమీకృత విధానం రూపొందించడంపై ఈ మహాసభ చర్చిస్తుంది. దేశంలో మొత్తం 676 జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థలు ఉన్నాయి. వాటికి జిల్లా జడ్జీలు చైర్మన్లుగా వ్యవహరిస్తుంటారు. దేశంలోని ‘డిఎల్‌ఎస్‌ఎ’లు, రాష్ట్ర న్యాయసేవ ప్రాధికార సంస్థల (ఎస్‌ఎల్‌ఎస్‌ఎ) ద్వారా వివిధ న్యాయసహాయ, అవగాహన కార్యక్రమాలను ‘నల్సా’ నిర్వహిస్తూంటుంది. ‘నల్సా’ నిర్వహించే ‘లోక్ అదాలత్’లను క్రమబద్ధీకరించడం ద్వారా కోర్టులపై పని భారం తగ్గించడంలో ‘డిఎల్‌ఎస్‌ఎ’లు తమవంతు సహకారం అందిస్తాయి.
***
DS/AK
(Release ID: 1846697)
Visitor Counter : 299
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam