ప్రధాన మంత్రి కార్యాలయం
అగ్రదూత్ గ్రూప్ వార్తాపత్రికల స్వర్ణోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
“ సమాజానికి సరైన సమాచారం, మెరుగైన సమాచారం అందించడం మనందరి లక్ష్యం,ఇందుకోసం మనందరం కలసి కృషిచేద్దాం”
“ అగ్రదూత్ ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తోంది”
“అస్సాం వరదల సమయంలో ప్రజల కష్టాలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసిపనిచేస్తున్నాయి.”
“ భారతదేశ భాషా జర్నలిజం, భారతీయసంప్రదాయాలు, సంస్కృతి, స్వాతంత్ర పోరాటం, అభివృద్ధి ప్రయాణంలో కీలకపాత్ర పోషించింది.”
“ ప్రజా ఉద్యమం అస్సామీ సాంస్కృతిక వారసత్వం, అస్సాం ప్రతిష్ఠను కాపాడింది. ఇప్పుడు అస్సాం ప్రజల భాగస్వామ్యంతో సరికొత్త అభివృద్ధి చరిత్రను లిఖిస్తోంది”
“నిర్దిష్ట భాష తెలిసిన వ్యక్తుల మధ్య మేధోపరమైన ఆలోచనలు పరిమితంగా ఎలా ఉండగలవు?”
Posted On:
06 JUL 2022 5:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అగ్రదూత్‌గ్రూప్ పత్రికల స్వర్ణోత్సవాలను ఈరోజు వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. అగ్రదూత్ పత్రిక స్వర్ణోత్సవాల కమిటీకి ఛైర్మన్ గా ఉన్న అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వాస్‌శర్మ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి అస్సామీ భాషలో ఈశాన్య ప్రాంతంనుంచి బలమైన గొంతుక వినిపిస్తున్న దైనిక్ అగ్రదూత్‌ను ప్రధానమంత్రి అభినందించారు.అలాగే జర్నలిజం మాధ్యమం ద్వారా ఐక్యత, సామరస్యతా విలువలను కాపాడుకుంటూ వస్తున్నందుకు దైనిక్ అగ్రదూత్‌ను కొనియాడారు.
కనక్ సేన్‌దాస్ మార్గనిర్దేశకత్వంలో అగ్రదూత్ జాతీయప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ వస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఎమర్జెన్సీ రోజులలో, ప్రజాస్వామ్యంపై పెనుదాడి జరిగినప్పుడుకూడా, అగ్రదూత్ దినపత్రిక, దేకా జీ జర్నలిజం విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ప్రధానమంత్రి అన్నారు. విలువలతో కూడిన కొత్తతరం జర్నలిజాన్ని ఆయన పాదుకొల్పారని అన్నారు.
గత కొద్ది రోజులుగా అస్సాం వరదల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతోందని అన్నారు. ఈ వరదల వల్ల అస్సాంలోని ఎన్నో జిల్లాలలో సామాన్య జనజీవనం పై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి, ఆయన బృందం, సహాయ పునరావాస కార్యక్రమాల విషయంలో రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.వరదల వల్ల ప్రజలకు కలిగిన కష్టనష్టాలను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.
భారతీయ సంప్రదాయం, సంస్కృతతి, స్వాతంత్ర్యోద్యమానికి, ప్రగతి ప్రస్థానానికి భారతీయ భాషా జర్నలిజం అత్యద్భుతమైన కృషి చేసిందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశంలో ప్రాంతీయభాషా పత్రికల జర్నలిజంలో అస్సాం కీలకపాత్ర పోషించిందని ప్రధానమంత్రి చెప్పారు. జర్నలిజం విషయంలో అస్సాం అత్యంత చైతన్యవంతమైన రాష్ట్రమని ఆయన అన్నారు. అస్సామీ భాషలో జర్నలిజం ప్రారంభమై 150 సంవత్సరాలైందని తెలియజేస్తూ, కాలానుగుణంగా ఇది మరింత బలపడుతూ వస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
గత 50 సంవత్సరాలలో దైనిక్ అగ్రదూత్ ప్రయాణాన్ని గమనిస్తే , అస్సాంలో మార్పులను కళ్లకు కడుతుందని ప్రధానమంత్రి అన్నారు.ఈ మార్పు సాకారం కావడం వెనుక ప్రజాఉద్యమం కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాలు అస్సాం ప్రతిష్ఠను, అస్సాం సంస్కృతిని కాపాడాయని ఇప్పుడు అస్సాం కొత్త అభివృద్ధి చరిత్రను ప్రజల భాగస్వామ్యంతో లిఖిస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
చర్చలు ఉన్న చోట పరిష్కారం ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ చర్చల ద్వారానే అవకాశాలు విస్తృతమౌతాయన్నారు. అందువల్ల భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థలో జ్ఞానవిస్తృతి, సమాచార విస్తృతి నిరంతరం కొనసాగుతోందన్నారు. అగ్రదూత్ ఈ సంప్రదాయంలోనిదేనని ప్రధానమంత్రి అన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఒక నిర్దిష్ట భాష తెలిసిన కొద్ది మంది వ్యక్తుల్లో మేధోపరమైన ఆలోచనలు పరిమితం చేయడాన్ని ప్రధాని ప్రశ్నించారు. ఈ ప్రశ్న భావోద్వేగానికి సంబంధించినది మాత్రమే కాదు, శాస్త్రీయంగా తార్కికమైనది కూడా అని ఆయన అన్నారు. మూడు పారిశ్రామిక విప్లవాలపై పరిశోధనలో వెనుకబడటానికి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చన్నారు. సుదీర్ఘ కాలం వలసపాలన కారణంగా, భారతీయ భాషల విస్తరణ ఆగిపోయిందని, ఆధునిక శాస్త్రజ్ఞానంలో పరిశోధనలు కొన్ని భాషలకే పరిమితమయ్యాయని ప్రధాని అన్నారు.
భారతదేశంలోని ఎంతోమందికి ఆయా భాషలలో, అందులోని శాస్త్ర జ్ఞానంలో ప్రవేశం లేదు. దీనితో మేధో నైపుణ్యం .పరిధి తగ్గుతూ ఉందని ఆయన అన్నారు. దీని కారణంగా అధ్యయనాలు, ఆవిష్కరణలు తగ్గిపోయాయన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచానికి నాయకత్వం వహించే బృహత్తర అవకాశం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి అన్నారు. మన డేటా పవర్ . డిజిటల్ సమ్మిళితత్వం కారణంగా మనకు ఈ అవకాశం వచ్చిందని ఆయన అన్నారు కేవలం భాష కారణంగా అత్యద్భుత సమాచారం, అత్యుత్తమ విజ్ఞానం పొందే విషయంలో ఏ భారతీయుడూ అవకాశం కోల్పోరాదని, ఇది తమ సంకల్పమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. అందుకే జాతీయ విద్యావిధానంలో భారతీయ భాషలలో అధ్యయనాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. మాతృభాషలో విజ్ఞానం ప్రాధాన్యత గురించి ప్రధానమంత్రి చెప్తూ, భారతీయ భాషలలో ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ విజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలన్నది తమ సంకల్పమని ప్రధానమంత్రి అన్నారు. ఇందుకోసం తాము జాతీయ భాషా అనువాద మిషన్ పై పనిచేస్తున్నట్టు చెప్పారు.ఇంటర్నెట్ విజ్ఞాన భాండాగారమని , ఈ సమాచారాన్ని ప్రతి భారతీయుడు తమ స్వంత భాషలో వినియోగించుకోవచ్చని అన్నారు. భాషిణి ప్లాట్‌ఫారం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇటీవలే యూనిఫైడ్ లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్‌ను ప్రారంభించిన విషయాన్ని ప్రధానమంత్రి తెలియజేశారు. సామాజిక, ఆర్థిక తదితర రంగాలలో ప్రతి విషయంలోనూ ఇంటర్నెట్ను కోట్లాదిమంది భారతీయులకు తమ స్వంత భాషలో అందుబాటులో ఉండేట్టు చూడడం ముఖ్యమని ప్రధానమంత్రి అన్నారు.
అస్సాం, ఈశాన్య రాష్ట్రాల జీవవైవిధ్యత గొప్పదనాన్ని ,ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, సంగీతం లో అస్సాంకు గొప్ప వారసత్వం ఉందని ఇది పెద్ద ఎత్తున ప్రపంచానికి చేరాల్సి ఉందని అన్నారు.గత 8 సంవత్సరాలలో భౌతిక , డిజిటల్ అనుసంధానత ఈ ప్రాంతంలో పెంచేందుకు జరిగిన కృషి కారణంగా గిరిజన సంప్రదాయాలు , పర్యాటకరంగం, అస్సాం సంస్కృతికి గొప్ప మేలు జరిగిందని అన్నారు.
స్వచ్ఛభారత్ మిషన్ వంటి వాటి ప్రచారంలో మీడియా సాగించిన సానుకూల పాత్ర దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దీనిని అభినందిస్తున్నారని అన్నారు. “అలాగే దేశ అమృత మహోత్సవాల తీర్మానాలలో మీరుకూడా పాలుపంచుకోవచ్చ”ని ప్రజలకు ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
“ విస్తృత సమాచారం, మెరుగైన సమాచారం కలిగిన సమాజ నిర్మాణం మనందరి లక్ష్యం కావాలని , ఇందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేద్దా”మని ప్రధానమంత్రి అన్నారు.
(Release ID: 1839885)
Visitor Counter : 150
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam