ప్రధాన మంత్రి కార్యాలయం

పావగఢ్ కొండపై పునరాభివృద్ధి చేసిన శ్రీ కాళికామాత ఆలయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి


“యుగాలు.. శతాబ్దాలెన్నో మారినా ఈ ‘శిఖర ధ్వజం’
శాశ్వత విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది”;

“నేడు నవ భారతం తన ఆధునిక ఆకాంక్షలతోపాటు
ప్రాచీన గుర్తింపుతో సగర్వంగా మనుగడ కొనసాగిస్తోంది”;

“మాతా! ప్రజాసేవకుడిగా నేను మరింత శక్తి.. త్యాగం.. అంకితభావంతో
ఈ దేశ ప్రజలకు నిరంతరం సేవ చేస్తూండేలా నన్ను ఆశీర్వదించు”;

“భారతదేశ కీర్తి ప్రతిష్టలకు పర్యాయపదమే సగర్వ గుజరాత్”;

“భారతదేశంలోని చారిత్రక వైవిధ్యంతో పావగడ
సార్వజనీన సామరస్య కేంద్రంగా నిలుస్తోంది”

Posted On: 18 JUN 2022 12:05PM by PIB Hyderabad

   పావ‌గ‌ఢ్ కొండపై పున‌రా‌భివృద్ధి చేసిన శ్రీ కాళికామాత ఆలయాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. ఇది ఈ ప్రాంతంలోని ప్రాచీన ఆలయాలలో ఒకటి కావడమేగాక భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆలయ పునర్నిర్మాణం రెండు దశల్లో సాగింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో తొలిదశ పనులను ప్రారంభించారు. అలాగే నేటి కార్యక్రమం కింద ప్రారంభించిన రెండో దశ పునరాభివృద్ధికి 2017లో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పనుల కింద ఆలయ పునాదులతోపాటు వీధి దీపాలు, సీసీటీవీ వ్యవస్థ సహా పరిసరాలను మూడు స్థాయిలలో విస్తరించారు.

   ఈ ఆలయ సందర్శనను తనకు లభించిన అదృష్టంగా పేర్కొంటూ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ధ్వజస్తంభంపై పవిత్ర పతాకాన్ని 5 శతాబ్దాల తర్వాత మాత్రమేగాక స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల అనంతరం ఎగురవేసిన క్షణాలకుగల ప్రాముఖ్యాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు. ఈ మేరకు “కొన్ని శతాబ్దాల తర్వాత ఇవాళ పావగడ ఆలయ పైభాగంలో మరోసారి జెండాను ఎగురవేశాం. ఈ ‘శిఖర ధ్వజం’ మన విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీక మాత్రమే కాదు… యుగాలు.. శతాబ్దాలు మారుతున్నా ఈ భక్తి విశ్వాసాలు నిరంతరం కొనసాగుతాయి” అని ఆయన పేర్కొన్నారు. ‘శక్తి’ ఎప్పటికీ మసకబారదు లేదా అదృశ్యం కాదనేందుకు రాబోయే 'గుప్త నవరాత్రి'కి ముందుగానే ఈ పునరాభివృద్ధి పనులు పూర్తికావడం నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు.

   అయోధ్యలోని రామ మందిరం, కాశీ విశ్వనాథ ధామ్‌, కేదార్ ధామ్ గురించి ప్రస్తావిస్తూ-  “నేడు భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం పునరుద్ధరణ జరుగుతోంది. అదేవిధంగా ఇవాళ నవ భారతం తన ఆధునిక ఆకాంక్షలతోపాటు ప్రాచీన గుర్తింపుతో సగర్వంగా మనుగడ కొనసాగిస్తోంది” అని పేర్కొన్నారు. భక్తివిశ్వాసాలకు కేంద్రాలైన ఈ ఆలయాలతోపాటు మన ప్రగతికి కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయని ఆయన అన్నారు. పావగడలోని ఈ మహా దేవాలయం ఆ ప్రగతి పయనంలో ఒక భాగమని స్పష్టం చేశారు. ఇది ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా విశ్వాస్… సబ్‌కా ప్రయాస్‌’లకూ ప్రతీక అని ఆయన ప్రకటించారు.

   స్వామి వివేకానంద కాళీమాత ఆశీస్సులు పొంది ప్రజాసేవకు ఎలా అంకితమయ్యారో ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ఆయన బాటలోనే ప్రజలకు సేవ చేసే శక్తిని తనకు ప్రసాదించాలని ఈ రోజు అమ్మవారిని వేడుకున్నానని ప్రధాని తెలిపారు. ఈ మేరకు “మాతా! ప్రజాసేవకుడిగా నేను మరింత శక్తి.. త్యాగం.. అంకితభావంతో ఈ దేశ ప్రజలకు నిరంతరం సేవ చేస్తూండేలా నన్ను ఆశీర్వదించు. నా జీవితంలో ఎంత శక్తి మిగిలి ఉందో, ఎలాంటి సద్గుణాలున్నాయో వాటన్నిటినీ  దేశ మాతసహా సోదరీమణుల సంక్షేమానికి అంకితం చేస్తూనే ఉంటాను” అని ప్రార్థించినట్లు వివరించారు.

   స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నేపథ్యంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ- స్వాతంత్య్ర పోరాటంతో పాటు దేశ ప్రగతి పయనంలో గుజరాత్ ఎనలేని కృషి చేసిందన్నారు. ఈ మేరకు ‘సగర్వ గుజరాత్’ భారతదేశ కీర్తి ప్రతిష్టలకు పర్యాయపదంగా మారిందని ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ అద్భుతమైన సంప్రదాయంలో భాగమైన పంచమహల్, పావగఢ్ మన వారసత్వ సంబంధిత ప్రతిష్టను సదా సమున్నతంగా నిలుపుతున్నాయని చెప్పారు. ఈ రోజున ఆలయ పునర్నిర్మాణం పూర్తిచేసి, ధ్వజస్తంభంపై పవిత్ర పతాకను ఎగురవేసే అవకాశం కల్పించడంద్వారా కాళీమాత తన భక్తులకు గొప్ప కానుకను అనుగ్రహించిందని ఆయన అభివర్ణించారు. ఈ పునరుద్ధరణ పనులలో ఆలయ ప్రాచీన మూలాలను యథాతథంగా ఉంచినట్లు తెలిపారు. అలాగే ఆలయ ప్రవేశం సౌలభ్యం గురించి కూడా ప్రధాని ప్రశంసించారు.

   “ఇంతకుముందు పావగడ ప్రయాణం ఎంత కష్టంతో కూడున్నదంటే- జీవితంలో ఒక్కసారైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలని భక్తులు ఆకాంక్షించేవారు. అయితే, నేడు ఇక్కడ

సౌకర్యాలు పెరుగుతుండటంతో కష్టతరంగా ఉంటూ వచ్చిన అమ్మవారి దర్శనం ఇప్పుడు సులభంగా మారింది” అని ఆయన అన్నారు. అయితే, మాతను దర్శించుకోవడంలో భక్తులు క్రమశిక్షణ పాటించాలని కోరారు. “పావగడలో ఆధ్యాత్మికత ఉంది.. చరిత్ర, ప్రకృతి, కళ, సంస్కృతి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకవైపు మహాకాళి మాత శక్తిపీఠం, మరోవైపు వారసత్వ జైన దేవాలయం కూడా ఉన్నాయి. అంటే.. పావ‌గ‌ఢ్ ఒకవిధంగా భార‌త‌దేశ చారిత్ర‌క వైవిధ్యంతో సార్వ‌జనీన సామరస్యానికి కేంద్రంగా నిలుస్తోంది” అని ప్ర‌ధానమంత్రి వ్యాఖ్యానించారు. మాత కొలువైన వివిధ ఆలయాల గురించి మాట్లాడుతూ- గుజరాత్‌ చుట్టూ  మాత ఆశీర్వాదాలతో కూడిన భద్రతా వలయం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   భక్తివిశ్వాసాలకు ఆలవాలమైన ప్రదేశాల అభివృద్ధితో ఈ ప్రాంతంలోని కళలు, హస్తకళలపై అవగాహన పెరగడంతో పర్యాటకం, ఉపాధి రూపంలో ప్రజానీకానికి కొత్త అవకాశాలు అందివస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పంచమహల్‌ దిగ్గజ సంగీత ఖని బైజూ బావ్‌రా జన్మభూమి అని గుర్తుచేసుకున్నారు. ఎక్కడ వారసత్వం, సంస్కృతి బలోపేతం అవుతాయో అక్కడ కళలు, ప్రతిభ కూడా వికసిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. కాగా, 2006లో ‘జ్యోతిర్‌గ్రామ్‌’ పథకాన్ని చంపానేర్‌లో ప్రారంభించడంతో ఈ దిశగా కృషి మొదలైందని ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారు.



(Release ID: 1835238) Visitor Counter : 166