ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశమైన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ , హర్ ఘర్ దస్తక్ 2.0 స్థాయి, ప్రగతిపై సమీక్ష.
పాఠశాలకు వెళ్లే విద్యార్థుల విషయంలో కోవిడ్ వాక్సినేషన్ కవరేజ్‌ను పెంచడంపైన, వయోధికులకు ప్రికాషన్ డోస్ పైన దృష్టిపెట్టాల్సిందిగా కోరిన మంత్రి,
కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదు, కొన్ని రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలి, కోవిడ్ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటంచాలి : డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ
జెనోమ్ సీక్వెన్సింగ్ పై దృష్టిపెట్టాలని, నిఘాకొనసాగిస్తూ, దానిని బలోపేతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన మంత్రి
Posted On:
13 JUN 2022 3:59PM by PIB Hyderabad
"కోవిడ్ ఇంకా తొలగిపోలేదు. కొన్ని రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో కోవిడ్ ముందస్తు జాగ్రత్త చర్యలు అంటే ముఖానికి మాస్కు ధరించడం, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడం ముఖ్యం" అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ నొక్కి చెప్పారు. కేంద్ర మంత్రి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులు , సీనియర్ అధికారులతో హర్ ఘర్ దస్తక్ 2.0 ప్రచార పురోగతికి సంబంధించి ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మాటలన్నారు.
కొన్ని రాష్ట్రాలు, కొన్ని జిల్లాలలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, కోవిడ్ పరీక్షలు తగ్గడం గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ మాండవీయ, కోవిడ్ పరీక్షల సంఖ్య పెంచడం, సకాలంలో పరీక్షలు నిర్వహించి కోవిడ్ కేసులను గుర్తించడం వల్ల కమ్యూనిటీలో కోవిడ్ వ్యాప్తి ని నియంత్రించడానికి వీలు కలుగుతుందని అన్నారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిఘా కొనసాగించాలని, దీనిని మరింత బలోపేతం చేయాలని , కొత్త వేరియంట్లు, మ్యుటెంట్లను దేశంలో గుర్తించడానికి జినొమ్ సీక్వెన్సింగ్ చేయాలని సూచించారుజ టెస్ట్, ట్రాక్, ట్రీట్, వాక్సినేషన్, కోవిడ్ ముందు జాగ్రత్తలు పాటించడాన్ని కొనసాగించడం, దీనిని పర్యవేక్షించడం రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు చేయాలని మంత్రి సూచించారు. కోవిడ్ 19 వ్యాప్తి నిరోధానికి సంబంధించి సవరించిన నిఘా వ్యూహం, నిర్వహణా మార్గదర్శకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇది వివిధ దేశాలనుంచి దేశంలోకి వస్తున్న ప్రయాణికుల పై దృష్టిపెడుతుందని, ఆరోగ్య సదుపాయాలు, ల్యాబ్‌లు, కమ్యూనిటీ ద్వారా నిఘా ఉంచుతుందని పేర్కొన్నారు.
కోవిడ్ సోకే అవకాశం ఉన్న వయసువారి విషయంలో వాక్సినేషన్ ప్రాధాన్యతను గుర్తించాలని, రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు వ్యక్తిగతంగా వాక్సినేషన్ స్థాయి, పురోగతిపై ,నెల రోజులపాటు సాగుతున్న హర్ ఘర్ దస్తక్ 2.0 పై దృష్టి పెట్టాలని కోరారు. ఈ ప్రచారం జూన్ 1న ప్రారంభమైంది. 12-17 సంవత్సరాల మధ్య వయస్కులైన వారికి మొదటి , రెండవ వాక్సిన్ డోస్‌లు వేయించేందుకు మన ప్రయత్నాలను ముమ్మరం చేద్దామని, ఇందుకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులందరినీ గుర్తించాలని మంత్రి కోరారు. దీనివల్ల వారు వాక్సిన్ రక్షణతో పాఠశాలకు హాజరుకావడానికి వీలు కలుగుతుందన్నారు. పాఠశాల స్థాయి కార్యక్రమాల లో ప్రచారం ద్వారా, ( ప్రభుత్వ, ప్రైవేటు, మదర్సాలు, డే కేర్ పాఠశాలలు) వేసవి సెలవుల కారణంగా పాఠశాలకు వెళ్లని విద్యార్దుల విషయంలోనూ దృష్టిపెట్టి వాక్సిన్ వేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
60 సంవత్సరాలకు పైబడిన వారు సులభంగా వ్యాధికి గురయ్యే కేటగిరీలో ఉన్నందున వారికి ప్రికాషన్ డోస్ ద్వారా వారిని రక్షించుకోవలసి ఉంది. మన ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కోవిడ్ బారిన పడేందుకు అవకాశం ఉన్న వయసువారని గుర్తించి వారికి ప్రికాషన్ డోస్ వేస్తున్నట్టు మంత్రి చెప్పారు. 18 నుంచి 59 సంత్సరాల వయసు వారిలో ప్రికాషన్ డోస్ వేయడంపై రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ప్రైవేటు ఆస్పత్రులలతో క్రమం తప్పకుండాసమీక్ష నిర్వహించాలని సూచించారు. తొలి హర్ ఘర్ దస్తక్ ప్రచారం నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాలను ఉపయోగించుకుని అర్హులైన వారికి నూరు శాతం వాక్సిన్ వేసి కోవిడ్ నుంచి రక్షణ కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా చాలినన్ని వాక్సిన్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయని, అందువల్ల హర్ ఘర్ దస్తక్ ప్రచారం రెండో విడతలో కోవిడ్ వాక్సిన్ కవరేజ్ ని మరింత వేగవంతం చేయాలని మాండవీయ సూచించారు.
కోవిడ్ 19 వాక్సిన్ ల విషయంలో ఎలాంటి వృధా జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించారు. తగిన పర్యవేక్షణ ద్వారా , ముందు గడువుతో కాలం చెల్లే మందును ముందుగా వాడాలని సూచించారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్,మాట్లాడుతూ రాష్ట్రాలలో హర్ ఘర్ దస్తక్ 2.0 ప్రచారం ద్వారా కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు డాక్టర్ సపమ్ రంజన్ సింగ్ (మణిపూర్) ,శ్రీ అలో లిబాంగ్ (అరుణాచల్ ప్రదేశ్ ), శ్రీ తన్నీరు హరీష్ రావు ( తెలంగాణ), శ్రీ అనిల్ విజ్ ( హర్యానా ) శ్రీ రుషికేష్ గణేష్‌భాయ్ పటేల్ ( గుజరాత్), శ్రీ బన్న గుప్త (జార్ఖండ్), శ్రీ మంగళ్ పాండే (బీహార్), డాక్టర్ రాజేష్ తోపె ( మహారాష్ట్ర), డాక్ర్ ప్రభురామ్ చౌదురి (మధ్యప్రదేశ్), డాక్టర్ కె సుధాకర్ ( కర్ణాటక) ఈ సమావేశంలో పాల్గొన్నారు.
డాక్టర్ మనోహర్ అగ్నాని, అడిషనల్ సెక్రటరీ, శ్రీమతి రోలి సింగ్ , అడిషనల్ సెక్రటరి, శ్రీ లవ్ అగర్వాల్ జాయింట్ సెక్రటరి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, ఎన్.హెచ్.ఎం మిషన్ డైరక్టర్లు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి అధికారులు ఈ వర్చువల్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1833689)
Visitor Counter : 141