సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కేన్స్ ఫిల్మ్ మార్కెట్‌లో భారతదేశానికి అరుదైన గౌరవం

మొట్టమొదటి గౌరవ దేశం గా భారతదేశం ఎంపిక

75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆర్. మాధవన్ నిర్మించిన రాకెట్రీ ప్రపంచ ప్రీమియర్

“ప్రపంచంలోని కంటెంట్ హబ్‌గా భారతదేశం” అనే అంశంపై ఇండియా పెవిలియన్ దృష్టి సారిస్తుంది: శ్రీ అనురాగ్ ఠాకూర్

కేన్స్ నెక్స్ట్‌లో కూడా గౌరవ దేశంగా భారతదేశం

Posted On: 04 MAY 2022 6:10PM by PIB Hyderabad

ఫ్రాన్స్ లో జరగనున్న 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో కలిసి నిర్వహించనున్న మార్చే' డు ఫిల్మ్‌లో  మొట్టమొదటి గౌరవ దేశం గా భారతదేశం ఎంపిక అయ్యిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు వెల్లడించారు. ' మార్చే' డు ఫిల్మ్‌  ఒక దేశానికి గౌరవ దేశంగా గుర్తించడం ఇదేతొలిసారి. భారతదేశానికి ఈసారి ఈ గౌరవం దక్కింది. ఇకపై ప్రతి  సంవత్సరం ఒక దేశాన్ని గౌరవ దేశంగా గుర్తిస్తారు. కార్యక్రమంలో గౌరవ దేశంగా గుర్తింపు పొందిన దేశానికి ప్రాధాన్యత లభిస్తుంది' అని శ్రీ అనురాగ్ ఠాకూర్ వివరించారు. గత 75 సంవత్సరాలుగా  ఫ్రాన్స్ తో భారతదేశం దౌత్య సంబంధాలను కలిగి ఉంది. ఫ్రాన్స్ దేశంలో పర్యటించిన ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో సమావేశం అయ్యారు. దీనితో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడ్డాయి. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, దౌత్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని   కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మార్చే డు ఫిల్మ్‌లో భారతదేశం 'కంట్రీ ఆఫ్ హానర్'గా ఎంపికైంది.

'కంట్రీ ఆఫ్ హానర్' ప్రాధాన్యతను శ్రీ అనురాగ్ ఠాకూర్ వివరించారు. 'కంట్రీ ఆఫ్ హానర్' గుర్తింపుతో మెజెస్టిక్ బీచ్‌లో జరిగే  'మార్చే డు ఫిల్మ్స్' ప్రారంభ కార్యక్రమంలో భారతదేశానికి గుర్తింపు లభిస్తుందని అన్నారు. భారతదేశం, భారతదేశ సంస్కృతి, వారసత్వం అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో భారతదేశానికి చెందిన జానపద, సంగీత ప్రదర్శనలతో పాటు బాణాసంచా ప్రదర్శనలు ఉంటాయని మంత్రి తెలిపారు.  ఫ్రెంచ్ భారతీయ వంటకాలు వడ్డిస్తారు.  

కేన్స్ నెక్స్ట్‌లో కూడా  భారతదేశం గౌరవప్రదమైన దేశంగా గుర్తింపు పొందిందని శ్రీ అనురాగ్ ఠాకూర్ వివరించారు.  దీని కింద 5 నూతన అంకుర సంస్థలకు  ఆడియో-విజువల్ రంగంలో తమ వివరాలు తెలియ చేసేందుకు  అవకాశం కలుగుతుందని  మంత్రి ప్రకటించారు. యానిమేషన్ డే నెట్‌వర్కింగ్‌లో పది మంది నిపుణులు పాల్గొంటారు.

75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో శ్రీ ఆర్. మాధవన్  నిర్మించిన  “రాకెట్రీ”  చిత్రాన్ని  ప్రపంచ ప్రీమియర్ గా ప్రదర్శిస్తారు. ఈ చిత్రం 19 మే 2022న మార్కెట్ స్క్రీనింగ్‌లోని పలైస్ డెస్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడుతుంది.

"గోస్ టు కేన్స్ సెక్షన్"లో ఎంపిక చేసిన 5 సినిమాలను ప్రదర్శించేందుకు  భారతదేశానికి అవకాశం లభించింది . ఈ చలనచిత్రాలు ఫిల్మ్ బజార్‌లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్‌లో భాగంగా ఉన్నాయి:

 

1. జైచెంగ్ జిక్సాయ్ దోహుటియా రచించిన బగ్జన్ - అస్సామీ, మోరన్ 

2. శైలేంద్ర సాహు రాసిన బైలాడిలా - హిందీ, ఛత్తీస్‌గర్హి  

3. ఏక్ తార కలెక్టివ్ ద్వారా ఏక్ జాగా  అప్ని (మన సొంత స్థలం) - హిందీ 

4. హర్షద్ నలవాడే అనుచరుడు - మరాఠీ, కన్నడ, హిందీ

5. జై శంకర్ ద్వారా శివమ్మ - కన్నడ

ఒలింపియా స్క్రీన్ పేరుతో  ఒక సినిమా హాల్ ని 22 మే 2022న “విడుదల చేయని చలనచిత్రాల” ప్రదర్శన కోసం భారతదేశానికి ప్రత్యేకంగా కేటాయించారు.ఈ తరగతి కింద 5 చిత్రాలను ఎంపిక చేశారు.  

సత్యజిత్ రే  శతాబ్ది ఉత్సవాలను  కేన్స్‌లో భారతదేశం నిర్వహిస్తుంది.   పునర్నిర్మించిన  సత్యజిత్ రే ప్రతిద్వాండి    కేన్స్ క్లాసిక్ విభాగం సినిమా డి లా ప్లేజ్‌లో ప్రదర్శించబడుతుంది. 

భారతదేశాన్ని "ప్రపంచ కంటెంట్ హబ్‌గా" అభివృద్ధి చేసేందుకు వినోద రంగానికి చెందిన ప్రముఖులతో   ఇండియా ఫోరమ్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ప్రధాన వేదిక వద్ద ఈ కార్యక్రమం 60 నిమిషాల పాటు జరుగుతుంది. ప్రత్యక్ష ప్రసారం అయ్యే ఈ కార్యక్రమానికి  వందలాది మంది అతిథులు హాజరవుతారు.  

భారతదేశాన్ని "కంటెంట్ హబ్ ఆఫ్ ది వరల్డ్" అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో  ఈసారి ఇండియా పెవిలియన్ కార్యక్రమాలు జరుగుతాయని శ్రీ అనురాగ్ ఠాకూర్ వివరించారు. భారతదేశ  పెవిలియన్ 18 మే, 2022 ఉదయం ప్రారంభమవుతుంది. వివిధ భాషల్లో నిర్మించిన చిత్రాలు, సాంస్కృతిక అంశాలు, వైవిధ్య భారతదేశం అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇండియన్ పెవిలియన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వివిధ దేశాలకు చెందిన సినీ రంగ ప్రముఖులకు భారతదేశ ప్రాధాన్యత, దేశంలో అందుబాటులో ఉండే సౌకర్యాలను వివరించి దేశంలో  సినిమా షూటింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, ఫిల్మ్ సేల్స్ మరియు సిండికేషన్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. 

 

***



(Release ID: 1822811) Visitor Counter : 194