ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

న్యూఢిల్లీలో ‘ప్రధానమంత్రి సంగ్రహాలయం’ ప్రారంభించిన ప్రధాని మోదీ


“ప్రతి ప్రభుత్వ భాగస్వామ్య వారసత్వానికీ ఈ ప్రదర్శనశాల ఓ సజీవ తార్కాణం”;

“స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ ఈ ప్రదర్శనశాల గొప్ప ప్రేరణతో వచ్చింది”;

“స్వతంత్ర భారతంలో ఏర్పడిన ప్రతి ప్రభుత్వమూ దేశాన్ని
నేటి ఉన్నత స్థితికి చేర్చడంలో తన వంతు కృషి చేసింది…
ఎర్రకోట పైనుంచి ఈ విషయాన్ని పలుమార్లు ప్రకటించాను”;

“సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరగలరనే విశ్వాసం దేశంలోని యువతకు ఉంది”

“ఒకటిరెండు మినహాయింపులు తప్ప ప్రజాస్వామ్య విధానంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భారతదేశం గర్వించదగిన సంప్రదాయం కలిగి ఉంది”;

“నేడు ఓ కొత్త ప్రపంచ క్రమం ఆవిష్కృతమవుతుండగా ప్రపంచమంతా ఓ కొత్త ఆశతో.. నమ్మకంతో భారత్‌వైపు చూస్తోంది; ఆ అంచనాలకు తగినట్లుగా రూపొందడానికి భారత్‌ మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉంది”

Posted On: 14 APR 2022 2:24PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ‘ప్రధానమంత్రి సంగ్రహాలయం’ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్రసంగిస్తూ- దేశవ్యాప్తంగా నేడు జ‌రుగుతున్న వివిధ పండుగ‌ల‌ను గుర్తుచేశారు. అలాగే బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు నివాళి అర్పిస్తూ.. “బాబాసాహెబ్ రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి కాగా, ఆ రాజ్యాంగమే మన పార్లమెంటరీ వ్యవస్థకు పునాదిగా ఉంది. ఈ పార్లమెంటరీ వ్యవస్థ నిర్వర్తించాల్సిన ప్రధాన బాధ్యత దేశ ప్రధానమంత్రి పదవిపై ఉంది. ఈ  నేపథ్యంలో ‘ప్రధానమంత్రి ప్రదర్శనశాల’ను జాతికి అంకితం చేసే అవకాశం ఇవాళ నాకు లభించడం నిజంగా నా అదృష్టం” అన్నారు. ఈ కార్యక్రమానికి  హాజరైన పూర్వ ప్రధాన మంత్రుల కుటుంబాలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అలాగే “దేశం స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో ఈ ప్రదర్శనశాల ఆవిర్భావం గొప్ప ప్రేరణగా నిలిచింది. ఈ 75 ఏళ్లలో దేశం ఎన్నో గర్వించదగిన క్షణాలను చూసింది. చరిత్ర గవాక్షం నుంచి చూసినపుడు ఈ క్షణాలకు సాటిలేని ప్రాముఖ్యం ఉన్నదనే వాస్తవం స్పష్టమవుతుంది” అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

   స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ పాలన సాగించిన అన్ని ప్రభుత్వాలూ దేశాభివృద్ధికి చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రశంసాపూర్వకంగా పునరుద్ఘాటించారు. “స్వతంత్ర భారతంలో ఏర్పడిన ప్రతి ప్రభుత్వమూ దేశాన్ని నేటి ఉన్నత స్థితికి చేర్చడంలో తన వంతు కృషి చేసింది. ఇదే విషయాన్ని నేను ఎర్రకోట పైనుంచి కూడా పలుమార్లు ప్రకటించాను” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాగే “ప్రతి ప్రభుత్వ భాగస్వామ్య వారసత్వానికీ ఈ ప్రదర్శనశాల ఓ సజీవ తార్కాణం” అని ఆయన అన్నారు. రాజ్యాంగ నిర్దేశిత ప్రజాస్వామ్య లక్ష్యాల సాధనలో దేశాన్ని పాలించిన ప్రతి ప్రధానమంత్రీ ఎనలేని సహకారం అందించారని ప్రధాని అన్నారు. “వారందర్నీ గుర్తుచేసుకోవడమంటే స్వతంత్ర భారత ప్రగతి పయనాన్ని అధ్యయనం చేయడమే. ఈ మేరకు ఈ ప్రదర్శనశాలకు వచ్చే ప్రజలకు దేశ మాజీ ప్రధానుల కృషి, వారి నేపథ్యం, వారి సంఘర్షణలు, సృజనాత్మకత గురించి తెలిసే ఉండవచ్చు” అని ఆయన పేర్కొన్నారు.

   దేశ ప్రధానులలో చాలామంది సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారే కావడం తనకెంతో గర్వకారణమని ప్రధానమంత్రి చెప్పారు. అత్యంత పేద, రైతు కుటుంబాలకు చెందిన ఇలాంటి నాయకులు ప్రధాని పదవిని అలంకరించడం భారత ప్రజాస్వామ్యం, దాని సంప్రదాయాలపైగల విశ్వాసానికి మరింత బలమిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు “సాధారణ కుటుంబికుడైన వ్యక్తి కూడా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరగలరనే విశ్వాసం దేశంలోని యువతలో ఉంది” అని శ్రీ మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రధానమంత్రి సంగ్రహాలయం’ యువతరం అనుభ‌వాన్ని ఇంకా విస్తృతం చేయగలదని ప్ర‌ధాని ఆకాంక్షించారు. స్వతంత్ర భారతావని కీలక సందర్భాల గురించి యువత ఎంత ఎక్కువ తెలుసుకుంటే, వారి నిర్ణయాలు అంత సాపేక్షంగా ఉంటాయన్నారు.

   ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భారతదేశానికిగల గుర్తింపు ప్రస్తావిస్తూ- “కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిరంతర పరిణామశీలమనది కావడమే భారత ప్రజాస్వామ్యం గొప్పదనం. ప్రతి శకంలో, ప్రతి తరంలో ప్రజాస్వామ్యాన్ని మరింత ఆధునికం, శక్తిమంతం చేయడానికి నిర్విరామ కృషి జరిగింది. ఒకటిరెండు మినహాయింపులు తప్ప ప్రజాస్వామ్య విధానంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం భారతదేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి  అన్నారు. “ఆ మేరకు మనవంతు కృషితో ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన కూడా ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిలోని సమగ్ర, అనుకూలాంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఆధునికతను, సరికొత్త ఆలోచనలను స్వీకరించే దిశగా మన ప్రజాస్వామ్యం మనకు ప్రేరణనిస్తుందని శ్రీ మోదీ అన్నారు.

   భారతదేశం ఉజ్వల చరిత్ర, సంపన్నశకాన్ని గుర్తుచేసుకుంటూ- భారతదేశ వారసత్వం,  వర్తమానం సంబంధిత ముఖచిత్రాన్ని సవ్యంగా ఆవిష్కరిస్తూ అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. దోపిడీకి గురైన వారసత్వ సంపదను విదేశాల నుంచి తిరిగి తీసుకురావడం, సముజ్వల వారసత్వ ప్రదేశాలకు గుర్తింపు, జలియన్‌వాలాబాగ్‌ స్మారకం, బాబాసాహెబ్ స్మారక పంచతీర్థం, స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శనశాల, గిరిజన చారిత్రక ప్రదర్శనశాల వంటివి స్వాతంత్య్ర సమరయోధుల జ్ఞాపకాలను భద్రపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనాలని ఆయన విశదీకరించారు.

   నేక హస్తాలు చక్రాన్ని పట్టుకున్నట్లున్న ప్రదర్శనశాల చిహ్నం (లోగో) గురించి ప్రధాని వ్యాఖ్యానిస్తూ- ఈ చక్రం 24 గంటల నిరంతర స్రవంతికి, ప్రజా శ్రేయస్సుపై దృఢసంకల్పానికి, అకుంఠిత దీక్షకు చిహ్నమని వివరించారు. ఈ దృఢ సంకల్పం, చైతన్యం, శక్తి రాబోయే 25 ఏళ్లలో భారతదేశ ప్రగతికి నిర్వచనంగా నిలుస్తాయని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. అలాగే మారుతున్న ప్రపంచ క్రమాన్ని, ఆ దిశగా భారతదేశానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి సుస్పష్టం చేశారు. “నేడు ఓ కొత్త ప్రపంచ క్రమం ఆవిష్కృతమవుతుండగా ప్రపంచమంతా ఆశతో.. నమ్మకంతో భారత్‌వైపు చూస్తోంది, ఈ అంచనాలకు తగినట్లుగా ఎదగడానికి భారత్ మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది” అని శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.



(Release ID: 1816970) Visitor Counter : 349