మంత్రిమండలి
బొగ్గు క్షేత్రాల (స్వాధీనం-అభివృద్ధి) చట్టం-1957 చట్టం కింద సేకరించిన భూముల వినియోగానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం
ఈ మార్పులతో తవ్వకం వీలుకాని భూముల్లో బొగ్గు-ఇంధన
సంబంధ రంగాల అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పనకు అవకాశాలు
Posted On:
13 APR 2022 3:26PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి బొగ్గు రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పూర్తిగా తవ్విన లేదా తవ్వకానికి ఆచరణాత్మకంగా పనికిరాని భూముల వినియోగ సౌలభ్యంసహా బొగ్గు రంగంలో పెట్టుబడులు పెంపు, ఉద్యోగాల కల్పన వంటి లక్ష్యాలతో కూడిన విధానానికి ఆమోదం తెలిపింది. తదనుగుణంగా బొగ్గు క్షేత్రాల (సేకరణ-అభివృద్ధి) చట్టం-1957 [సీబీఏ చట్టం] ప్రకారం ఇకపై అటువంటి భూములను బొగ్గు, ఇంధన సంబంధిత రంగాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు వాడుకునే వెసులుబాటు లభిస్తుంది.
ఎటువంటి భారం లేకుండా బొగ్గు క్షేత్రాల భూముల స్వాధీనం, వాటిని ప్రభుత్వ కంపెనీల పరిధిలో ఉంచడానికి సీబీఏ చట్టం అనుమతిస్తుంది. ఈ మేరకు సీబీకే చట్టం కింద సేకరించబడిన వివిధ రకాల భూముల వినియోగానికి ప్రస్తుతం ఆమోదించబడిన విధానం ఒక స్పష్టమైన చట్రాన్ని అందిస్తుంది:
ఎ. బొగ్గు తవ్వకానికి ఇక ఎంతమాత్రం పనికిరాని, గనుల తవ్వకం కార్యకలాపాలు ఆర్థికంగా గిట్టుబాటుకాని భూములు
లేదా
బి. బొగ్గు పూర్తిగా తవ్వితీసిన భూములు/తవ్వేసిన తర్వాత తిరిగి చక్కదిద్దిన భూములు
సీబీఏ చట్టం కింద సేకరించిన ఈ భూములు కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) వంటి ప్రభుత్వ బొగ్గు కంపెనీలు, దాని అనుబంధ సంస్థల యాజమాన్యంలో ఉంటాయి. ఆ మేరకు విధానంలో పేర్కొన్న ప్రయోజనాల నిమిత్తం మాత్రమే ఆ భూమి లీజుకు విధానం అనుమతిస్తుంది. తదనుగుణంగా బొగ్గు, ఇంధన సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన కార్యకలాపాల కోసం ప్రభుత్వ బొగ్గు కంపెనీలు ఉమ్మడి ప్రాజెక్టులలో ప్రైవేట్ మూలధనాన్ని కూడా సమీకరించుకోవచ్చు.
సదరు భూముల యజమానిగా ఉన్న ప్రభుత్వ కంపెనీ వాటిని విధాన నిర్దేశాల మేరకు నిర్దిష్ట కాలానికి లీజుకు ఇవ్వవచ్చు. గరిష్ఠ విలువ రాబట్టడంలో భాగంగా ఇందుకు అర్హతగల సంస్థలను పారదర్శక, సముచిత, స్పర్థాత్మక బిడ్డింగ్ ప్రక్రియసహా పటిష్ట యంత్రాంగం ద్వారా ఎంపిక చేస్తుంది. దిగువన పేర్కొన్న కార్యకలాపాల కోసం ఆ భూములను వినియోగించవచ్చు:
- బొగ్గు శుద్ధి యంత్రాగారాలు;
- కన్వేయర్ వ్యవస్థల ఏర్పాటు;
- బొగ్గు నిర్వహణ యంత్రాగారాలు;
- రైల్వే వ్యాగన్లు నిలిపే స్థలాలు;
- సీబీఏ చట్టం లేదా ఇతర భూ సేకరణ చట్టాల కింద భూ సేకరణవల్ల నిర్వాసితులైన కుటుంబాల తరలింపు, పునరావాస కల్పన;
- థర్మల్, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు;
- పరిహారాత్మక అటవీకరణ సహా బొగ్గు అభివృద్ధి సంబంధ మౌలిక సదుపాయాల ఏర్పాటు లేదా నిర్మాణం;
- రాకపోకల మార్గంగా వాడుకునే హక్కు కల్పన;
- బొగ్గు వాయువుగా మార్పు.. రసాయన కర్మాగారాలకు బొగ్గు సరఫరా;
- ఇంధన సంబంధ మౌలిక సదుపాయాల ఏర్పాటు లేదా కల్పన
పూర్తిగా తవ్విన లేదా బొగ్గు తవ్వకాలకు ఆచరణాత్మకంగా పనికిరాని భూములు ఆక్రమణలకు గురయ్యే ముప్పుంది. అంతేకాకుండా భద్రత-నిర్వహణపై కోసం అనవసర వ్యయం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆమోదిత విధానం మేరకు ప్రభుత్వ సంస్థల నుంచి యాజమాన్యం బదిలీ చేయకుండా వివిధ బొగ్గు, ఇంధన సంబంధ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రత్యక్షంగా-పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
ఈ విధంగా తవ్వకం సాధ్యంకాని భూములను ఇతర ప్రయోజనాల కోసం కేటాయిస్తే ‘సీఐఎల్’ కార్యకలాపాల వ్యయం తగ్గింపు సాధ్యమవుతుంది. ఎలాగంటే- ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో విభిన్న వ్యాపార నమూనాలను సీఐఎల్ అనుసరించవచ్చు. తద్వారా బొగ్గు సంబంధిత మౌలిక వసతులు, సౌరశక్తి ప్లాంట్లు వంటి ఇతరత్రా ప్రాజెక్టులను తన సొంత భూమిలో ఏర్పాటు చేయగలదు. అంతేకాకుండా సుదూర ప్రాంతాలకు బొగ్గు రవాణా అవసరం లేనందువల్ల బొగ్గును వాయువుగా మార్చే ప్రాజెక్టుల ఏర్పాటుకు వీలుంటుంది.
భూములను పునరావాసం నిమిత్తం వాడటంవల్ల సముచిత భూ వినియోగంతోపాటు ముఖ్యమైన అన్ని భూ వనరుల వృథాను అరికట్టవచ్చు. అలాగే నిర్వాసిత కుటుంబాల పునరావాస ప్రాజెక్టుల కోసం తాజా భూ సేకరణ అవసరం ఉండదు. అంతేగాక ప్రాజెక్టులపై అదనపు ఆర్థిక భారం తగ్గి, లాభాలు పెరుగుతాయి. తమ వాస్తవ ఆవాసాలకు సమీపంగా ఉండాలని కోరుకునే నిర్వాసిత కుటుంబాల డిమాండ్‌ను కూడా నెరవేర్చినట్లు కాగలదు. దీంతోపాటు బొగ్గు ప్రాజెక్టులకు స్థానిక మద్దతు పొందడంలో ఈ చర్య దోహదం చేస్తుంది. మరోవైపు బొగ్గు తవ్వకాలకు మళ్లించబడిన అటవీ భూమికి బదులుగా అడవుల పెంపకం కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి భూమి సమకూరుతుంది.
దేశీయ తయారీకి ప్రోత్సాహంతోపాటు దిగుమతులపై ఆధారపడే అవసరాన్ని తగ్గించడంసహా ఉద్యోగాల కల్పన తదితరలకు ఊపునివ్వడం ద్వారా స్వయం సమృద్ధ భారతం లక్ష్యసాధనకు ఈ విధానం తోడ్పడుతుంది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే వివిధ బొగ్గు, ఇంధన మౌలిక సౌకర్యల అభివృద్ధి కార్యకలాపాల కోసం భూమి లభ్యతకు వీలు కల్పిస్తుంది. ఇప్పటికే సేకరించిన భూమిని వినియోగించడం వల్ల తాజా భూ సేకరణ, తత్ఫలితంగా నిర్వాసితుల సమస్యకు తావుండదు. అంతేగాక స్థానిక తయారీ, పరిశ్రమలకు ఉత్సాహప్రోత్సాహాలు లభిస్తాయి.
***
(Release ID: 1816516)
Visitor Counter : 254
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada