హోం మంత్రిత్వ శాఖ
సరిహద్దులో పర్యాటక ఆకర్షణ -సీమా దర్శన్- ప్రారంభం!
గుజరాత్ రాష్ట్రం, బనస్కాంట జిల్లా, నడాబెట్ వద్ద
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా శ్రీకారం..
Posted On:
10 APR 2022 6:55PM by PIB Hyderabad
నడాబెట్ సైనిక స్థావరం వద్ద సైనిక సమ్మేళనంలో
హోమ్ మంత్రి అమిత్ షా ప్రసంగం...
సరిహద్దు భద్రతా దళం జవాన్లతో కలసి భోజనం, సంభాషణ...
దేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభా కాంక్షలు..
ప్రతి వ్యక్తీ తన జీవితంలో ఎన్ని పాత్రలు పోషించాలో తెలియజెప్పిన
మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడే మనకు ఆదర్శప్రాయుడు..
ఆదర్శ కుమారుడు, భర్త, రాజు, సైన్యాధిపతి కూడా రాముడే..
నడాబెట్ సరిహద్దు దర్శన్ పర్యాటక ప్రదేశానికి
ఈ రోజు నేను వచ్చాను.
ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఊహాశక్తి అభినందనీయం..
ఎవరైనా స్వయంగా వచ్చి చూస్తే తప్ప ప్రధానమంత్రి బహుముఖ
దార్శనిక ఊహాశక్తి గొప్పతనం ఎవరికీ అవగాహనకు రాదు...
కేంద్ర సాయుధ పోలీసు సిబ్బంది (సి.ఎ.పి.ఎఫ్.) జవాన్లకు,
వారి కుటుంబాలకు సదుపాయాలను పెంచేందుకు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో
ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది.
ఆరోగ్య పరీక్షలు, సంతృప్తస్థాయి గృహనిర్మాణం నుంచి
విధుల హేతుబద్ధీకరణ వరకూ అన్ని వసతలూ కల్పిస్తోంది...
సి.ఎ.పి.ఎఫ్. సిబ్బంది ఏదైనా అనారోగ్యంతో బాధపడితే
ఆయుష్మాన్ సి.ఎ.పి.ఎఫ్. కార్డు సహాయంతో చికిత్స పొందవచ్చు..
అన్ని రంగాల్లో దేశాన్ని ప్రపంచంలోనే
అగ్ర స్థానానికి తీసుకెళ్లేందుకు
నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టినుంచి
గట్టి కృషి జరుగుతూనే ఉంది...
సరిహద్దుల్లో బి.ఎస్.ఎఫ్. కఠోర శ్రమతో
విధులు నిర్వర్తిస్తున్నందునే ఇది సాధ్యమవుతోంది.
మీరు సరిహద్దులను రక్షిస్తున్నారు.
అందుకే సరిహద్దుల్లో అభివృద్ధి సాధ్యమవుతోంది.
ఇసుక తుపాన్లు, మండించే వేసవి, తీవ్రమైన చలిలో,
పూర్తి ప్రతికూల వాతావరణంలో కూడా
6,385కిలోమీటర్ల పొడవైన సరిహద్దును
బి.ఎస్.ఎఫ్. సిబ్బంది ప్రాణాలొడ్డి రక్షిస్తున్నారు.
తద్వారా తమ జీవితకాల విధినిర్వహణను
అంకిత భావంతో నెరవేరుస్తున్నారు.
25 బెటాలియన్లతో 1965లో మొదలైన బి.ఎస్.ఎఫ్.,
ఈ రోజు 193 బెటాలియన్లతో 2,65,000మంది సిబ్బందితో,
60 శతఘ్ని రెజిమెంట్లతో విధులు నిర్వర్తిస్తోంది..
దేశానికి, పౌరులకూ బి.ఎస్.ఎఫ్.పై అపారమైన విశ్వాసం.
2,65,000మందితో కూడిన బలగం దేశ భద్రతకే పూచీగా నిలుస్తోంది.
ఇంత కఠోర పరిస్థితుల మధ్య పనిచేసే
మరో సరిహద్దు రక్షణ బలగం లేనే లేదు.
కాశ్మీర్ లోయలో చొరబాట్లను నివారణకు, ఈశాన్యంలో,
వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో
అంతర్గత భద్రత రక్షణకు,
మోకాలు లోతు చిత్తడినేలలు, ఇరుకు లోయల ప్రాంతాల్లో కూడా
కఠోర శ్రమతో బి.ఎస్.ఎఫ్. అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తోంది..
సరిహద్దు రక్షణ విధుల్లోని సాయుధ బలగం పట్ల
చిన్నారులు గౌరవభావాన్ని అలవర్చుకోవాలి.
బి.ఎస్.ఎఫ్. సాహసాలను గురించి తెలుసుకున్న తర్వాత
జాతీయ భద్రతకోసం సేవలందించేందుకు
వారు కూడా తమంతట తాముగా కట్టుబడి ఉండాలి..
జీవితకాలం విధినిర్వహణ అన్న స్ఫూర్తికి కట్టుబడిన
బి.ఎస్.ఎఫ్. సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా..
వారి ధైర్యసాహసాలకు ప్రజల తరఫున వందనాలు చెబుతున్నా..
నడాబెట్ వద్ద బి.ఎస్.ఎఫ్. ప్రదర్శనా స్థలాన్ని, అక్కడనుంచి
సరిహద్దు వరకూ ప్రాంతాన్ని చూసినపుడు మాత్రమే
కఠోర పరిస్థితుల్లో సరిహద్దు రక్షకులు ఎలా పనిచేస్తున్నారో
మనం అర్థం చేసుకోగలం..
ఈ ప్రాంత సందర్శనతో చిన్నారుల్లో దేశభక్తి అలవడుతుంది.
సాయుధ బలగాలతో, మన సరిహద్దుల రక్షణతో
గట్టి బాంధవ్యాన్ని ఏర్పరుస్తుంది.
ఈ ప్రాజెక్టుతో పర్యాటకం ఊపందుకుంటుంది.
సరిహద్దులనుంచి ప్రజల వలసలు తగ్గుతాయి,.
స్థానికంగా ఉపాధి కల్పన జరుగుతుంది.
సరిహద్దులో చివరి గ్రామం కూడా మనకు చేరువయ్యే ప్రక్రియలో
ఇది కేవలం ఆరంభం మాత్రమే
నడాబెట్ ప్రాంతంలో సీమాదర్శన్ ప్రాజెక్టు పనులకోసం
గుజరాత్ ప్రభుత్వం రూ. 125కోట్లు ఖర్చుపెట్టింది.
పదేళ్లలో నడాబెట్ ఉపాధికల్పనకు ప్రధాన కేంద్రమవుతుంది.
బనస్కాంట జిల్లాలో కనీసం 5లక్షల మందికి
ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నాం.
నడాబెట్ ప్రాంతాన్ని చిన్నారులు సందర్శించాల్సిందే..
ఇక్కడికి వచ్చే జనం కనీసం ఒక రాత్రి అయినా
బనస్కాంటలో బసచేయాలి. బనస్కాంటలో
చిన్నారుల క్రీడా సదుపాయాలను సందర్శించాలి..
వంద అడుగుల ఎత్తులో రెపరెపలాడే జాతీయ త్రివర్ణ పతాకం
ఇక ప్రధాన ఆకర్షణ కాబోతోంది..
సరిహద్దుల్లో పరిస్థితిని మనందరికీ పరిచయం చేసే
ఆరు గ్యాలరీలు ఈ ప్రాజెక్టులో భాగం.
గుజరాత్ పర్యాటకం కోసం ఒక గ్యాలరీ,
నడాబెట్, బనస్కాంటకోసం మరో గ్యాలరీ ఉన్నాయి.
సరిహద్దు పర్యాటకం కోసం ప్రధానమంత్రి మోదీ కన్నకలలు
ఈ ప్రాజెక్టుతో సాకారమయ్యాయి.
బీటింగ్ రిట్రీట్ వేడుక ప్రధాన ఆకర్షణ కాబోతోంది.
దేశ రక్షణలో సరిహద్దు భద్రతా దళం వీరోచిత కార్యకలాపాలను, ధైర్యసాహసాలను ప్రజలకు సవివరంగా తెలియజెప్పే లక్ష్యంతో -సరిహద్దు దర్శనం (సీమా దర్శన్)- పేరిట చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా గుజరాత్ మారుమూలన బనస్కాంఠా జిల్లాలోని నడాబెట్ ఔట్ పోస్టు వద్ద కొత్తగా నిర్మించిన పర్యాటక వసతి సదుపాయాలను కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నడాబెట్ ఔట్ పోస్ట్ వద్ద జరిగిన సైనిక సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. అక్కడి సైనిక జవాన్లతో ముచ్చటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్.ఎఫ్.) డైరెక్టర్ జనరల్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, సరిహద్దు భద్రతా దళంతో పాటుగా సరిహద్దు రక్షణకోసం పనిచేసే ఏ సంస్థకైనా కఠోర వాతావరణ పరిస్థితుల మధ్య జటిలమైన విధులను నిర్వర్తించవలసి ఉంటుందని అన్నారు. 6,385కిలోమీటర్ల నిడివితో ఉన్న దేశ సరిహద్దును బి.ఎస్.ఎఫ్. సిబ్బంది నిర్విరామంగా కాపాడుతూ వస్తున్నారని అన్నారు. ఇసుక తుపాన్లు, మండుటెండలు, అతి శీతల వాతావరణం మధ్య వారు జీవితాంతం సరిహద్దు భద్రతా విధుల్లో ఉంటున్నారని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి దేశాన్ని ప్రతి రంగంలోనూ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చేర్చేందుకు ఒక క్రమ పద్ధతిలో కృషి జరుగుతూ వస్తోందని అన్నారు. సరిహద్దు భద్రతా దళం సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా దేశ సరిహద్దులను సంరక్షిస్తున్నందున ఈ ప్రయత్నాలన్నీ ఫలించి ఆశించిన అభివృద్ధిని కూడా సాధించవచ్చని అన్నారు. బి.ఎస్.ఎఫ్., సాయుధ బలగాలు అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సరిహద్దు ఇదేనని అన్నారు. యుద్ధంలో సరిహద్దు భద్రతా దళం వెయ్యి చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్తాన్.నుంచి చేజిక్కించుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుందని అన్నారు. చాలా కాలంగా అంటే ఒక ఒప్పందం కుదిరే వరకూ పరిపాలనా, నిర్వహణా కార్యకలాపాల్లో బి.ఎస్.ఎఫ్. పాలు పంచుకుంటూ వచ్చిందని అన్నారు. 1965లో 25 బెటాలియన్లతో మొదలైన బి.ఎస్.ఎఫ్. ఈ రోజు 193 బెటాలియన్లతో 2,65,000 మంది స్థాయికి చేరుకుందని, ఇంత భారీ స్థాయి బలగాలు మన దేశ భద్రతకు, సరిహద్దుల రక్షణకు పూచీగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.
కాశ్మీర్ లోయ ప్రాతంలో చొరబాటును భగ్నం చేయాల్సి ఉందని, ఈశాన్యంలో వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం ఉన్న చోట్ల అంతర్గత భద్రతను రక్షించాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. మరో వైపు భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ఉభయదేశాల మధ్య సామరస్య సంబంధాలు కొనసాగేలా చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉందన్నారు. మోకాలి లోతు చిత్తడి నేలలు, ఇరుకైన లోయలు వంటి దుర్గమ ప్రాంతాల్లో కఠోర వాతావరణ పరిస్థితులలో కూడా దేశ భద్రతను కాపాడుకోవాలని, ఎందుకంటే అక్కడ బి.ఎస్.ఎఫ్. మినహా మరో సరిహద్దు భద్రతా బలగాలేవీ ఉండవని అమిత్ షా అన్నారు.
నడాబెట్ ప్రాంతంలో సీమాదర్శన్ కార్యక్రమం కోసం గుజరాత్ ప్రభుత్వం రూ. 125కోట్లు ఖర్చు చేసిందని అమిత్ షా అన్నారు. మన సరిహద్దులను కాపుకాసే బలగాలపట్ల చిన్నారులంతా గౌరవ భావం అలవరుచుకోవాలని అన్నారు. బి.ఎస్.ఎఫ్. సిబ్బంది ధైర్య సాహసాల ప్రదర్శనను, వారు సాధించి విజయాలను గురించి ఇక్కడ తెలుసుకున్నతర్వాత, దేశ రక్షణకు తామూ సేలవదించేందుకు వారు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఐదవ తరగతినుంచి 8వ తరగతి వరకూ చదువుకొనే ప్రతి విద్యార్థికీ నడాబెట్ సరిహద్దు స్థావరమే పర్యాటక గమ్యంగా మారేలా చర్యలు తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వం సంకల్పించినట్టు చెప్పారు. దీనితో బి.ఎస్.ఎఫ్. త్యాగశీలత, అంకిత భావం, ధైర్య సాహసాలు గురించి పౌరసమాజానికి తెలుస్తుందని, చిన్నారులంతా పెరిగి పెద్దవారైన తర్వాత ఈ గౌరవభావాన్ని వారు జీవితాంతం గుర్తుపెట్టుకోగలుగుతారని అన్నారు. ఈ సరిహద్దు ఔట్ పోస్టు పరిసరాల్లో సందర్శకులు బస చేయడానికి వీలుగా తగిన వసతులను కల్పించడానికి గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి వ్యక్తీ కనీసం 2రోజులైనా బనస్కాంట శివార్లలో బస చేయాలని, సరిహద్దులో ఎదురయ్యే కష్టాల గురించి, సరిహద్దు ప్రాంతాల గురించి అప్పుడే వారికి అవగాహన ఏర్పడుతుందని ఆయన చెప్పారు.
తొలుత, నడాబెట్ ప్రాంతంలో సీమా దర్శన్ పేరిట కొత్తగా నిర్మించిన పర్యాటక వసతి సదుపాయాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. చైత్య నవరాత్రి ముగిసిన సందర్భంగా రామ నవమి పర్వదినం జరుపుకుంటామని, పౌరాణిక పురుషుడైన శ్రీరాముడి జన్మదినం కూడా ఇదేనని, కోట్లాది మంది శ్రీరామ నవమిని తమ ఇళ్లవద్ద జరుపుకుంటారని అన్నారు. ఆదర్శ పురుషుడు, మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు,.. జీవితంలో నిర్వహించాల్సిన ప్రతి పాత్రకూ ఆదర్శప్రాయుడుగా నిలిచాడని అన్నారు. ఆదర్శ కుమారుడుగా, భర్తగా, రాజుగా, చివరకు ఆదర్శ సైన్యాధిపతిగా ప్రతి పాత్రనూ ఆదర్శవంతంగా నిర్వహించిన భగవాన్ శ్రీరాముడు మానవుడుగా పరిపూర్ణ జీవితం గడిపాడని, ఎన్నో కాలాలుగా ప్రజలు కూడా అలాగే జీవించేలా రాముడు ఆదర్శంగా నిలిచాడని అన్నారు. అందువల్లనే ఆయన మనకు ఆరాధ్య దైవంగా నిలిచాడని, ఆయన్ను భగవంతుడుగా పూజిస్తున్నామని, ఆయన జీవితాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
బి.ఎస్.ఎఫ్. జవాన్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, అత్యంత జటిలమైన విధులను నిర్వర్తిస్తూ, ప్రతికూల పరిస్థితుల మధ్య సరిహద్దులను కాపాడుతున్నారని అమిత్ షా అన్నారు. సరిహద్దు రక్షణలో ప్రాణత్యాగం చేసిన వారందరికీ భరతజాతి తరఫున తాను నివాళులర్పిస్తున్నానని అమిత్ షా అన్నారు. జీవితకాల విధి నిర్వహణ అనే నినాదాన్ని సంపూర్ణంగా పాటిస్తున్నందుకు బి.ఎస్.ఎఫ్. జవాను నుంచి, డైరెక్టర్ జనరల్ వరకూ అందరికీ ప్రజలందరి తరఫునా కృతజ్ఞతలు తెలుపురున్నానని, వారి ధైర్యసాహసాలకు నమస్కరిస్తున్నానని అన్నారు. దేశంలో ఎప్పుడు ఏ సంక్షోభం ఎదురైనా, బి.ఎస్.ఎఫ్. తన ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ వచ్చిందని అన్నారు. ఒక మహావీర చక్ర, నాలుగు కీర్తి చక్రలు, 13 వీర చక్రలు, 13 శౌర్య చక్ర అవార్జులను తమ ధైర్యసాహసాలకు పురస్కారాలుగా బి.ఎస్.ఎఫ్. సాధించిందని, మరెన్నో త్యాగాలు చేసిందని, బి.ఎస్.ఎఫ్. సిబ్బంది ధైర్య సాహసాలు దేశమంతటికీ గర్వకారణమేనని ఆయన అన్నారు.
నడాబెట్ సీమాదర్శన్ ప్రాజెక్టును నెలకొల్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిన దార్శనికతను తాను గౌరవిస్తున్నానని, అభినందిస్తున్నానని అన్నారు. నడాబెట్ పర్యాటక వసతులను స్వయంగా సందర్శించినపుడే ప్రధాని దార్శనికత అంటే ఏమిటో ఎవరికైనా అవగాహనకు వస్తుందని ఆయన అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, నడాబెట్ ప్రదర్శనను పూర్తిగా తిలకించినపుడు, ఇక్కడి నుంచి సరిహద్దు వరకూ వెళ్లినపుడు, మాత్రమే,.. సరిహద్దు భద్రతకోసం మన రక్షణకోసం ప్రతికూల పరిస్థితుల్లో కూడా గార్డులు చేస్తున్న కృషి మనందరికీ అవగాహనకు వస్తుందని అన్నారు. ఇక్కడికి రావడం వల్ల చిన్నారుల్లో దేశభక్తి భావం అలవడుతుందని, సాయుధ బలగాలతో, సరిహద్దు భద్రతా బలగంతో సంబంధ బాధ్యవ్య భావన ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ ప్రాంతానికి పర్యాటకుల సందర్శన మొదలైతే పర్యాటక కార్యకలాపాలకు గట్టి ఊపు లభిస్తుందని, సరిహద్దు గ్రామాలనుంచి ఇతర ప్రాంతాలకు ప్రజల వలసలు కూడా తగ్గిపోతాయని, స్థానికంగా ఉపాధి కల్పన పెరుగుతుందని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, దేశంలో జరిగే అభివృద్ధి సరిహద్దు ప్రాంతపు చివరి గ్రామానికి చేరడానికి ఈ ప్రాజెక్టుతోనే అవకాశం ఏర్పడుతుందని అమిత్ షా అన్నారు. పదేళ్ల తర్వాత నడాబెట్ ప్రాంతం బనస్కాంట జిల్లాలోని ఐదు లక్షల మందికి ఉపాధి కల్పనా కేంద్రంగా ఎదుగుతుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.
పర్యాటకులకోసం ఇక్కడ 3 ఆగమన వసతి సదుపాయాలను, విశ్రాంతి వసతులను, 500 మంది కూర్చున గలిగే ఒక ఆడిటోరియంను, దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారని, 22 దుకాణాలను, రెస్టారెంట్లను కూడా నిర్మించారని అలంకరణకోసం విద్యుద్దీపాలతో ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ వినియోగించే విద్యుత్తులో 30శాతం సౌరశక్తి ద్వారానే ఉత్పత్తి అవుతోందని అన్నారు. చిన్నారులకు ఆట స్థలం, వంద అడుగుల ఎత్తున రెపరెపలాడే త్రివర్ణ జాతీయ పతాకం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయన్నారు. సరిహద్దు గురించి సందర్శకులకు వివరించే ఆరు గ్యాలరీలను ఇక్కడ నిర్మించారన్నారు. గుజరాత్ పర్యాటకం కోసం ఒక గ్యాలరీని, నడాబెట్ గురించి వివరించే ఒక గ్యాలరీని, బనస్కాంటా ప్రాంతాన్ని గురించి తెలియజెప్పే మరో గ్యాలరీని కూడా నిర్మించారు. బి.ఎస్.ఎఫ్. 3 విభాగాలైన, సుముద్రయాన దళం, వైమానిక, శతఘ్ని దళాలను గురించి వివరించేందుకు మరో గ్యాలరీని నిర్మించారన్నారు.
సరిహద్దు పర్యాటకం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్నారని, అవి ఇపుడు ఆయన చొరవతోనే సాకారమయ్యాయని, ఇక్కడ నిర్వహించే బీటింగ్ రిట్రీట్ వేడుక ఒక ప్రధాన ఆకర్షణగా నిలువబోతోందని అమిత్ షా అన్నారు. సరిహద్దు పర్యాటకం, సరిహద్దు రక్షకుల ద్వారా ప్రజలకు సమాచారం సౌలభ్యం, సరిహద్దు రక్షకుల పట్ల ప్రజల్లో ఆకర్షణ భావం.. ఈ మూడు లక్ష్యాలు తాజా ప్రాజెక్టుతో నెరవేరగలవని ఆయన అన్నారు. మన సరిహద్దు భద్రతకు, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నరేంద్ర మోదీ ఎంతో చొరవ తీసుకున్నారని, ఈ సందర్భంగా ప్రజలందరికీ ప్రత్యేకించి బనస్కాంట వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అమిత్ షా అన్నారు. ఇపుడు నడాబెట్ పర్యాటక స్థలంతో బనస్కాంట ప్రాంతం గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే కాక, దేశ ప్రజలందరికీ ఆకర్షణగా నిలవగలదని అన్నారు. బి.ఎస్.ఎఫ్. ధైర్య సాహసాలను గురించి అతి సన్నిహితంగా తెలుసుకునేందుకు దేశంలోని ప్రజలందరికీ ఒక అవకాశం సీమాదర్శన్ ప్రాజెక్టు రూపంలో అందుబాటులోకి వచ్చిందని అమిత్ షా అన్నారు.
***
(Release ID: 1815606)
Visitor Counter : 218