పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
ఏప్రిల్11నుంచి 17 వరకూ విశేష వారోత్సవాలు!
పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ భారీ సన్నాహాలు
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికత్వంపై
భాగస్వామ్యవర్గాల జాతీయ సమ్మేళనానికి
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శ్రీకారం..
వారోత్సవాల్లో 7 జాతీయ సమ్మేళనాల నిర్వహణ
Posted On:
09 APR 2022 12:27PM by PIB Hyderabad
దేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలవుతున్న తరుణంలో నిర్వహించే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (అకమ్) కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ 2022 ఏప్రిల్ 11నుంచి 17వ తేదీ వరకూ విశేష వారోత్సవాలు నిర్వహించబోతోంది. జన భాగస్వామ్య స్ఫూర్తితో ఈ వారోత్సవాన్ని ప్రజా ఉత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ స్మారక సంఘటనను “సమాజ సంపూర్ణత్వం”, “ప్రభుత్వ సంపూర్ణత్వం” అన్న రీతిలో ఎంతో స్ఫూర్తిదాయంగా నిర్వహించేందుకు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ భారీగా సన్నాహాలు చేసింది. విశేష వారోత్సవంలో భాగంగా కొన్ని ఇతివృత్తాల పరంపరతో కూడిన జాతీయ సమ్మేళనాలకు కూడా రూపకల్పన చేశారు. “పంచాయతోఁ కే నవ నిర్మాణ్ కా సంకల్పోత్సవ్” అన్న శీర్షికన విశేష వారోత్సవాన్ని నిర్వహిస్తారు. పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు స్థానికత్వం కల్పించే అంశంపై భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలను, ఆలోచనలను, సన్నద్ధతను, సాంకేతిక పరిజ్ఞాన చర్యలను, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకునే విశేష వేదికగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఏప్రిల్ 11వ తేదీన జరిగే భాగస్వామ్య వర్గాల జాతీయ సమ్మేళనంతో ఈ విశేష వారోత్సవం మొదలవుతుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు స్థానికత్వం కల్పించడం అనే అంశంపై జరిగే ఈ జాతీయసమ్మేళనాన్ని న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ భాగస్వామ్యవర్గాల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నందున ఈ సమ్మేళనం ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు స్థానికత్వం కల్పించే అంశంపై రూపొందించిన ప్రత్యేకమైన లోగోను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికత్వం అమలులోకి తెచ్చే అంశంపై రాష్ట్రాలకు ఉమ్మడి సూచనల సారాశం, గ్రామ పంచాయతీల వినియోగం కోసం వివిధ ఇతివృత్తాలతో కూడిన కార్యక్రమాలు వంటి అంశాలతో ప్రారంభ సమ్మేళనం నిర్వహిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ సమ్మేళనానికి హాజరవుతారు. వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పంచాయతీ రాజ్ మంత్రులు, సీనియర్ అధికారులు జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.), రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులు, పంచాయతీల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులను కూడా ఈ సమ్మేళనానికి ఆహ్వానించారు. ఏడు రోజుల పాటు జరిగే వారోత్సవంలో వివిధ కార్యక్రమాల వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి.:
క్రమ సంఖ్య
|
తేదీ / వారం
|
జాతీయ సమావేశం
|
1.
|
ఏప్రిల్ 11 2022 (సోమవారం)
|
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు స్థానికత్వం కల్పించడంపై జాతీయ భాగస్వామ్య వర్గాల జాతీయ సమ్మేళనం
|
2.
|
ఏప్రిల్ 12 2022 (మంగళవారం)
|
సుపరిపాలనా ప్రక్రియపై జాతీయ సమ్మేళనం
|
3.
|
ఏప్రిల్ 13 2022 (బుధవారం)
|
చిన్నారుల సానుకూల గ్రామం, గ్రామాల్లో లైంగిక సమానత్వం అనే అంశంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికత్వంపై జాతీయ సమ్మేళనం.
|
4.
|
ఏప్రిల్ 14 2022 (గురువారం)
|
గ్రామీణ స్థానిక సంస్థల్లో సొంత ఆదాయ వనరుల బలోపేతంపై జాతీయ సమ్మేళనం
|
5.
|
ఏప్రిల్ 15 2022 (శుక్రవారం)
|
ఆరోగ్యకరమైన గ్రామం, సామాజిక సురక్షిత గ్రామం అనే అంశంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికత్వంపై జాతీయ సమ్మేళనం
|
6.
|
ఏప్రిల్ 16 2022 (శనివారం)
|
జల సమృద్ధి గ్రామం, పరిశుద్ధ, హరిత గ్రామం అనే అంశంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికత్వంపై జాతీయ సమ్మేళనం
|
7.
|
ఏప్రిల్ 17 2022 (ఆదివారం)
|
పేదరిక రహిత జీవనోపాధి గ్రామం, స్వయంసమృద్ధ మౌలిక వసతుల గ్రామం అనే అంశంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికత్వంపై జాతీయ సమ్మేళనం
|
విశేష వారోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ జాతీయ సమ్మేళనాల్లో పరస్పర చర్చా కార్యక్రమాలు క్రియాశీలకంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయిలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని, పరిపాలనా ప్రక్రియను బలోపేతం చేసేందుకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఈ జాతీయ సమ్మేళనాలను విభిన్నమైన రీతిలో నిర్వహిస్తోంది. పంచాయతీల పనితీరును అన్ని స్థాయిల్లో బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఎంతో కృషి చేస్తోంది. జాతీయ స్థాయిలో ప్రభావం చూపేలా, దీర్ఘకాలిక ఫలితాలు అందించేలా ఈ వారోత్సవాలను నిర్వహిస్తోంది. పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు స్థానికత్వం కల్పించే దిశగా అన్ని భాగస్వామ్య వర్గాల వారూ తమతమ అభిప్రాయాలను, ఆలోచనలను, పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేందుకు ఈ జాతీయ సమ్మేళనాలు చక్కని వేదికలుగా ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలసాధనకు పంచాయతీ రాజ్ సంస్థలు తీసుకోవలసిన చర్యలు, అందుకు దోహదపడే వనరుల సమీకరణ వంటి అంశాలపై ఈ సమ్మేళనాల్లో విస్తృతంగా చర్చిస్తారు. 2022, ఏప్రిల్ 11నుంచి 17వరకూ జరగనున్న ఈ జాతీయ సమ్మేళనాలు,.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనా ప్రక్రియను వేగవంతం చేసే దిశగా గట్టి చర్చలు, నిర్దిష్టమైన ఫలితాలు సాధించనున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి ఈ సమ్మేళనాలకు వచ్చే భాగస్వామ్య వర్గాలవారికి ఈ సమ్మేళనాలు సుసంపన్నమైన అనుభవాన్ని మిగిల్చనున్నాయి.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా భాగస్వామ్య వర్గాల ప్రతినిధులందరితో ఒక ఉద్యమాన్ని నిర్మించేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయి. సుస్థిర అభివృద్ధికి సంబంధించి మన దేశం విధించుకున్న లక్ష్యాలను పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా సకాలంలో సాధించుకునేందుకు కూడా సహాయపడతాయి. అభివృద్ధి లక్ష్యాల సాధనలో పంచాయతీల ప్రముఖ పాత్రను ప్రముఖంగా చిత్రించేందుకు, ఇందుకు సంబంధించి అవసరమైన సామాజిక అవగాహనను కల్పించేందుకు వారోత్సవాలు ఉపయోగపడతాయి. ఏడు రోజుల కార్యక్రమాల్లో పంచాయతీల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించడం వారు తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకోవడానికి వీలు కలుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పంచాయతీలు, ఇతర భాగస్వామ్య వర్గాలు అత్యధికంగా ప్రయోజనం పొందే రీతిలో ఈ ఏడు రోజుల కార్యక్రమాలకు ఎంతో పకడ్బందీగా రూపకల్పన చేశారు.
ఏడు రోజులపాటు జరిగే వారోత్సవాల్లో విభిన్న భాగస్వామ్యవర్గాలు అర్థవంతమైన రీతిలో పాల్గొనేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీరాజ్ సంస్థలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పరిపాలనా యంత్రాగాలు, పౌర సమాజం, ప్రజా సంఘాలు, ఐ.ఐ.టి.లు, ఐ.ఐ.ఎం.లు వంటి విద్యాసంస్థలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు (ఎన్.జి.ఒ.లు), అంతర్జాతీయ ఏజెన్సీలు తదితర సంస్థలు అర్థవంతమైన రీతిలో ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా తగిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇతివృత్తాలపై దృష్టిని కేంద్రీకరించేలా సన్నాహాలు చేశారు. : (1) పేదరిక రహితంగా, మెరుగైన జీవనోపాధి సహితంగా గ్రామాలు (మొదటి ఇతివృత్తం), (2) ఆరోగ్యకరమైన గ్రామం (2వ ఇతివృత్తం), (3) చిన్నారుల సానుకూల గ్రామం. (3వ ఇతివృత్తం), (4) జల సమృద్ధి గ్రామం (4వ ఇతివృత్తం), (5) పరిశుద్ధ, హరిత గ్రామం (5వ ఇతివృత్తం), (6) స్వయం సమృద్ధితో మౌలిక వసతుల గ్రామం (6వ ఇతివృత్తం), (7) సామాజిక సురక్షిత గ్రామం (7వ ఇతివృత్తం), (8) సుపరిపాలనా గ్రామం (8వ ఇతివృత్తం) (9) అభివృద్ధిని కలిగిన గ్రామం (9వ ఇతివృత్తం) అన్నవి ఈ తొమ్మిది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు.
భవిష్యత్తులో ప్రణాళికా రచనకు, తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఈ జాతీయ సమావేశాల్లో భాగస్వామ్య వర్గాల ప్రతినిధులు వ్యక్తం చేసే అభిప్రాయాలు, పంచుకునే ఆలోచనలు, భావనలకు డాక్యుమెంటు రూపం కల్పిస్తారు. కేంద్ర మంత్రులు, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు, ఇతర భాగస్వామ్యవర్గాల వారికి పటిష్టమైన వేదికలుగా ఈ సమ్మేళనాలు ఉపకరిస్తాయి. సుస్థిర అభివృద్ధి దిశగా 2030వ సంవత్సరంలోగా సాధించాల్సిన లక్ష్యాల సాధనకు తాము కట్టుబడి ఉన్నామంటూ కీలకమైన భాగస్వామ్య వర్గాల ప్రతినిధులందరూ మరోసారి ఈ సమ్మేళనాల సందర్భంగా స్పష్టం చేసే అవకాశం ఉంది.
జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమాలు, సమ్మేళనాలతో పాటుగా, ఈ వారోత్సవాల సమయంలోనే (ఏప్రిల్ 11నుంచి 17వరకూ) పంచాయతీలు కూడా సమావేశాలను నిర్వహించేలా గ్రామపంచాయతీలకు సూచించాలని వివిధ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం తరఫున విజ్ఞప్తి చేశారు. తొమ్మిది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై పంచాయతీ సమావేశాల్లో కూడా చర్చ జరిగేలా, వాటిలో ఒక్కటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలపై 2022-23 సంవత్సరంలో దృష్టిని కేంద్రీకరించేందుకు వీలుగా ఈ చర్య తీసుకున్నారు. ఇక, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను తగిన రీతిలో నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామ పంచాయతీల స్థాయిలో ఉత్సవాలను నిర్వహించేలా ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు.
నేపథ్యం:
2021వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అధికారికంగా ప్రారంభించినప్పటినుంచి,.. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వార్షికోత్సవాలకు గుర్తింపుగా 75 వారాల కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైనప్పటినుంచి, ఈ ఉత్సవాలు, వేడుకల గురించి గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. ఇందులో పంచాయతీ రాజ్ సంస్థలు చురుకుగా పాలు పంచుకునేలా చూడాలని వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పంచాయతీ రాజ్ శాఖలను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తూ వస్తోంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పంచాయతీల స్థాయిలో చేపట్టే వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాల ప్రగతిని తెలియజెప్పేందుకు, సంబంధిత సమాచారాన్ని (ఫొటోలు, వీడియోలు, క్లిప్పింగులు తదితరాలను) అప్ లోడ్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డు [https://IndiaAt75.nic.in/] ను ఏర్పాటు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపట్టే పంచాయతీరాజ్ సంస్థల క్రియాశీలక భాగస్వామ్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె ప్రజానీకానికి ఈ ఉత్సవాలను చేరువ చేసేందుకు, ఈ మహోత్సవాల ప్రాముఖ్యతను, లక్ష్యాలను గురించి వారికి అవగాహన కల్పించేందుకు వీలవుతోంది.
****
(Release ID: 1815214)
Visitor Counter : 340