కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఐసీటీ వినియోగంలో దేశం సాధించిన ప్రగతికి గుర్తు గా కార్యక్రమాన్ని నిర్వహించిన భారత టెలికాం శాఖ మరియు కామన్వెల్త్ టెలికమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్
Posted On:
18 MAR 2022 9:40AM by PIB Hyderabad
సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం (ఐసీటీ )వినియోగంలో దేశం సాధించిన ప్రగతి పై భారత టెలికాం శాఖ మరియు కామన్వెల్త్ టెలికమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్ (సిటీఓ) ' డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెంటర్ స్టేజ్ (డీటీసీఎస్ ) - ఇండియా'' పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించాయి. కామన్వెల్త్ టెలికమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్ (సిటీఓ) సభ్య దేశాలు సమస్యల పరిష్కారానికి డిజిటల్ రూపంలో లభిస్తున్న అవకాశాలను అమలు చేసేలా ప్రోత్సహించి, ఈ అంశంలో భారతదేశం సాధించిన ప్రగతిని వివరిస్తూ ' డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెంటర్ స్టేజ్ (డీటీసీఎస్ ) - ఇండియా'' కార్యక్రమం జరిగింది. 33 దేశాలు సభ్యులుగా ఉన్న కామన్వెల్త్ టెలికమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్ లో భారతదేశం సభ్యత్వం కలిగి ఉంది.
కామన్వెల్త్ టెలికమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులకు ఈ కార్యక్రమంలో డిజిటల్ రంగంలో కీలకమైన ఆధార్ (ప్రత్యేకమైన డిజిటల్ ఐడెంటిఫైయర్) మరియు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అంశాలలో భారతదేశం సాధించిన విజయాలను వివరించడం జరిగింది. ఆధార్ వినియోగం, ప్రమాణీకరణ పై యుఐడీఏఐ వివరణాత్మక ప్రదర్శన నిర్వహించింది. దేశంలో వినియోగంలో ఉన్న 1.29 బిలియన్ పైగా ఆధార్ కార్డులు, 68 బిలియన్లకు పైబడి నిర్ణయించిన ప్రామాణీకరణలు, ఆర్థిక వ్యవస్థకు ఆధార్ అందిస్తున్న సహకారం , ఆధార్ ఆధారిత చెల్లింపులు (డీబీటీ ) మరియు ఆధార్ వల్ల కలుగుతున్న ఇతర ప్రయోజనాలను ప్రదర్శనలో వివరించారు. వినియోగదారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యాపారులకు యూపీఐ వ్యవస్థ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను
)నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తన ప్రదర్శనలో వివరించింది. ఒక్క 2022 ఫిబ్రవరి నెలలో ఈ వ్యవస్థ ద్వారా 4.52 బిలియన్ కార్యకలాపాలు జరిగాయని ఎన్పీసీఐ పేర్కొంది. దీనివల్ల కలుగుతున్న ఇతర ప్రయోజనాలను కూడా ఎన్పీసీఐ వివరించింది.
కార్యక్రమంలో పాల్గొన్న సిటీఓ, దాని సభ్యులకు టెలీకమ్యూనికేషన్ల శాఖ కృతజ్ఞతలు తెలిపింది. ప్రజలకు సాధికారత కల్పించే కార్యక్రమాల అమలుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సభ్య దేశాలకు హామీ ఇచ్చింది. తాను సాధించిన విజయాల వివరాలు అందించిన భారతదేశానికి సిటీఓ కృతజ్ఞతలు తెలిపింది.
***
(Release ID: 1807195)
Visitor Counter : 177