వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
నాణ్యమైన సరకులనే అడగండి
వస్తుసేవల్లో భారతదేశాన్ని
అగ్రగామిగా నిలపండి...
వినియోగదారులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విజ్ఞ్తప్తి
వినియోగదారుల హక్కుల దినోత్సవంలో ప్రసంగం.
వినియోగదారుల ప్రయోజనాలకు
రక్షణ కల్పించాల్సిందే....
అయితే, చట్టం పేరిట చిన్నవ్యాపారులను
వేదించవద్దు..
వినియోగదారుల హక్కుల రక్షణ చర్యలపై ప్రశంసల జల్లు
Posted On:
15 MAR 2022 6:33PM by PIB Hyderabad
వినియోగదారుడి ప్రయోజనాన్ని పరిరక్షించి, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పాదనలను ప్రోత్సహించేందుకు సంబంధిత చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని, అయితే చట్టంలోని నిబంధనలను చిన్న, చిన్న వ్యాపారులపై వేధింపులకోసం వాడరాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జవుళి, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా "సక్రమ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ" అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చిన్న వ్యాపారుల స్థితి గతుల గురించి ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు: “చట్టం పేరిట చిన్న వ్యాపారులను వేధించే పనులకు ఇకపై స్వస్తి చెప్పవలసిన అవసరం ఉంది.” అని ఆయన అన్నారు.
కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి గోయల్ మాట్లాడుతూ, వేధింపులకు స్వస్తి చెప్పాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తూనికలు, కొలతల చట్టంలోని కొన్ని నిబంధనలను నేరాలకు ఉపయోగించుకోవడానికి వీలులేకుండా చేయాలని అన్నారు. వినియోగదారుల ప్రయోజనాలు, హక్కుల రక్షణకు వివిధ అధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయమని ఆయన అన్నారు. సులభతర వాణిజ్య నిర్వహణ, వినియోగదారుల రక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని భాగస్వామ్య వర్గాలన్నీ తగిన విధంగా వ్యవహించాలని ఆయన సూచించారు.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, పర్యావవరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖల సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల సహాయమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి, జాతీయ వినియోగ దారుల వ్యవహారాల వివాద పరిష్కార కమిషన్ (ఎన్.సి.డి.ఆర్.సి.) అధ్యక్షుడు జస్టిస్ ఆర్.కె. అగర్వాల్, ఇన్ఫోసిస్ సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకనీ, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు..
.
కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, 2009వ సంవత్సరపు తూనికల, కొలతల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద దాదాపు 90,000మందిపై తొలి నేరం కింద కేసులు నమోదైనట్టు, వాటిల్లో 90శాతం కేసులు చట్టంలోని 33, 36, 36(1) సెక్షన్ల కిందనే నమోదైనట్టు ఆయన చెప్పారు. ప్రమాణబద్ధంగా నిర్ధారించని తూనికలను వాడినందుకు, తక్కువ ప్రమాణాల ఉత్పాదనలను అమ్మినందుకు, తగిన ప్రమాణాల తూనికలు, కొలతలను వాడనందుకు ఈ కేసులను నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.
తూనికలు, కొలతలకు సంబంధించి ఒక్క సంవత్సర కాలంలో తొలిసారి నేరానికి పాల్పడిన వారి సమాచారాన్ని ఆయన సభలో పేర్కొన్నారు. ఈ విషయంలో రెండవ సారి నేరానికి పాల్పడినట్టుగా కేసులు నమోదైన పక్షంలో తూనికలు, కొలతల చట్టం కింద వారికి కారాగార శిక్ష పడుతుందని చెప్పారు. 2018-19 సవంత్సరంలో తొలి నేరం కింద 89,724 కేసులు నమోదు కాగా, రెండవ నేరం కింద 11కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. 2019-20వ సంవత్సరంలో తొలినేరం కేసులు 91,818 నమోదు కాగా, రెండవ నేరం కింద 2 కేసులు మాత్రమే నమోదైనట్టు తెలిపారు. 2020-21వ సంవత్సరంలో తొలి నేరం కింద 84,824 కేసులు నమోదు కాగా, రెండవ నేరం కింద అసలు కేసులే నమోదు కాలేదన్నారు.
“పెద్ద సంఖ్యలో తొలినేరం కేసులు నమోదు కావడం, రెండవ నేరం కేసులు అసలు నమోదు కాకపోవడంపై మనమంతా ఆత్మశోధన చేసుకోవాలి. చట్టం దుర్వినియోగం ద్వారా చిన్న చిన్న వ్యాపారులు వేధింపులకు గురికాకుండా చూడటం చాలా అవసరం” అని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది వినియోగదారుల హక్కుల దినోత్సవం నాటికల్లా, తూనికలు, కొలతల చట్టంలోని కొన్ని నిబంధననలు నేరమయం కాకుండా నివారించేందుకు తుది చర్యలు తీసుకోగలమని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. భాగస్వామ్య వర్గాలవారంతా ఈ అంశంపై చర్చించాలన్నారు.
ప్రజలను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్న వాణిజ్య ప్రకటనలపై వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు తీసుకున్న అనేక సందర్భాలను కేంద్రమంత్రి గోయెల్ ప్రస్తావించారు. తామే ప్రపంచంలో నెంబర్ వన్ అంటూ ప్రకటించుకున్న ఒక టూత్ పేస్ట్ కంపెనీపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. తమ సరకుల నిల్వలన్నీ చిటికెలోనే విక్రయించినట్టు చెప్పుకున్న మరో కంపెనీపై కూడా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
“ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పాదనలకోసం క్రియాశీలక వినియోగదారులనుంచి ఎదురయ్యే డిమాండును బట్టి వినియోగదారులకు ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవచ్చు. తద్వారా భారతీయ కంపెనీలు కూడా మరింత మెరుగ్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.” అని ఆయన అన్నారు.
ఈ రోజు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవమని, హక్కులతో బాటుగా, అధికారుల, వినియోగదారుల బాధ్యతలను గూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. “వినియోగదారులకోసం, కోర్టులు వర్చువల్ పద్ధతిలో విచారణ సదుపాయాన్ని కల్పించాలని నేను సూచించాను.” అని పీయూష్ గోయల్ అన్నారు.
సరకుల నాణ్యతను ప్రమాణబద్ధం చేసేందుకు భారతీయ ప్రమాణాల సంస్థ (బి.ఐ.ఎస్.) చేస్తున్న కృషిని కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రమాణాలను నిర్దారించే హాల్ మార్కింగ్ ప్రక్రియ ద్వారా వినియోగదారులకు నాణ్యత, స్వచ్ఛత, పారదర్శకతపై దీర్ఘకాలం హక్కు లభిస్తుందని ఆయన అన్నారు. 2021వ సంవత్సరం డిసెంబరు నెల వరకూ, లక్షా 30వేలమందికి పైగా ఆభరణాల వర్తకులు బి.ఐ.ఎస్. రిజిస్ట్రేషన్ పొందారని, తద్వారా, బంగారు హాల్ మార్కు కలిగిన ఆభరణాలను విక్రయించేందుకు వారికి అనుమతి లభించిందని అన్నారు బి.ఐ.ఎస్. గుర్తింపు ఉన్న హాల్ మార్కింగ్ కేంద్రాలు దేశవ్యాప్తంగా 987కు పైగానే ఉన్నాయని గోయెల్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్’ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ, పారిశ్రామిక సంఘాలూ, ఇతర భాగస్వామ్యవర్గాలవారూ పనిచేయాలని ఆయన సూచించారు. నిఖార్సయిన వాణిజ్య అవకాశాలు కల్పించడానికి, చట్టవిరుద్ధమైన వాణిజ్య కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి మధ్య సమతూకం పాటించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల హక్కులను దెబ్బతీసే చర్యలను నివారించాలన్నారు. వాణిజ్య వ్యవస్థ కొత్త విధాన నిర్ణయాలకు మద్దతుఇచ్చేదిగా, వినియోగదారులకు మరింత రక్షణ కల్పించేందిగా ఉండాలని అన్నారు. వాణిజ్యాభివృద్ధికీ, అలాగే వినియోగదారుల రక్షణకు తగిన సంపూర్ణ సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు భాగస్వామ్య వర్గాలన్నీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని సూచించారు.
వినియోగదారులంతా మరింత అవగాహనతో ఉండాలని, నాణ్యతా ప్రమాణాలతో కూడిన సరుకులను డిమాండ్ చేస్తూ, తద్వారా ఉన్నత స్థాయి ప్రమాణాల ఉత్పాదనలను, సేవలందించేలా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని కేంద్రమంత్రి గోయల్ సూచించారు.
వినియోగదారుల ఫిర్యాదులను ఆన్ లైన్ ద్వారా దాఖలు చేసేందుకు అవకాశం కల్పించే ఈ-దాఖిల్ (e-daakhil) పోర్టల్ సాధించిన ప్రగతి అభినందనీయమని కేంద్రమంత్రి అన్నారు. అన్ని కేసుల్లో వర్చువల్ విచారణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ‘ఆలస్యంగా అందిన న్యాయం, అన్యాయంతో సమానం’ అని పేర్కొంటూ, రాష్ట్రస్థాయి, జిల్లాల స్థాయి వినియోగదారుల వ్యవహారాల కమిషన్లలో ఎక్కువ ఉద్యోగాలు ఖాళీగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ముఖ్యఅతిథి నందన్ నీలేకనీ వర్చువల్ పద్ధతిలో ఈ నాటి కార్యక్రమానికి స హాజరయ్యారు. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ, మారుతున్న డిజిటల్ వేదికలకు అనుగుణంగా మనం కూడా మారవలసిన అవసరం ఉందన్నారు. డిజిటల్ ప్రొటోకాల్స్ ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో మరింత సంక్లిష్టమైన పద్ధతులకు అందరూ సన్నద్దం కావాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం మరింత సంపూర్ణ స్థాయిలో కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేథో పరిజ్ఞానం, స్పీచ్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, వినియోగదారుల వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని తదుగుణంగా పునర్ నిర్మించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఆన్ లైన్ ద్వారా వివాదాలను పరిష్కరించే యంత్రాంగాన్ని బహుళ భాషల ఫార్మాట్.లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇపుడు జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో అనేక మంది వ్యక్తుల ప్రమేయం ఉంటోందని, అలాంటి వివాదాల పరిష్కారానికి కూడా బహుళ వ్యక్తుల ప్రమేయమే అవసరమవుతుందని ఆయన అన్నారు. అభివృద్ధి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వేగం గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో లేదని, అందువల్ల వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో భారతదేశం కొత్త యుగానికి నాంది పలకాలని, వినియోగదారుల వివాద పరిష్కారం ప్రతి భారతీయుడికీ సులభంగా అందుబాటులో ఉండాలని నీలేకనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ప్రధానోపన్యాసం చేశారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య నమూనాల కారణంగా, పేదల వద్దకు చేరువయ్యే మన సామర్థ్యాలు పూర్తిగా మారిపోతున్నాయని, ఇంటింటికీ ఆర్థిక సేవలు ప్రత్యేకంగా మారుతున్నాయని అన్నారు. మరింత ఆర్థిక సమ్మిళిత వ్యవస్థకోసం ప్రభుత్వం ఎల్లపుడూ ప్రయత్నిస్తూనే ఉందని అన్నారు. 2017 మార్చినుంచి 2021 మార్చి నెల వరకూ ఆర్థిక సమ్మిళిత వ్యవస్థలో 24శాతం మెరుగుదల నమోదైందని, 2022 ఫిబ్రవరి నాటికి దేశంలో 8బిలియన్ల మేర యు.పి.ఐ. పద్ధతిలో లావాదేవీలు జరిగాయని అన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ రూపాల్లో సహాయం అందుకున్న 42.8కోట్ల మంది లబ్ధిదారులకు చెల్లింపులు కూడా యు.పి.ఐ. పద్ధతిలోనే జరిగాయని అన్నారు. వినియోగదారుల ప్రయోజనాల కోసం డిజిటల్ ఫైనాన్స్ వ్యవస్థను మరింత బలోపేతంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ఉమ్మడిగా కృషి జరగాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
మరో సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే మాట్లాడుతూ, వినియోగదారుల రక్షణకు, సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు సృజనాత్మక నియంత్రణ చర్యలు, డిజిటల్ ఫైనాన్సియల్ సేవలు, ఉత్పాదనలను చేపట్టవలసి ఉందని అన్నారు. డిజిటల్ ఫైనాన్స్ వ్యవస్థ, వినియోగదారులకు మరింత అందుబాటుయోగ్యంగా సేవలందించగలదని, వైరస్ మహమ్మారి ప్రబలిన సమయంలో వాణిజ్యం క్రియాశీలంగా ఉండేందుకు ఇది ఎంతగానో తోడ్పడిందని అన్నారు. అయితే, వినియోగదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేయగలిగే కొత్తతరహా ముప్పులను, ఆర్థిక మార్కెట్లను అస్థిరపరిచే పరిణామాలను వినియోగదారులకు పరిచయం చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణలో వినియోగదార్లకు మరింత మెరుగైన రక్షణ కల్పించేందుకు వ్యూహాత్మక నియంత్రణ, సకాలంలో జోక్యం తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.
కాగా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహాహాల శాఖ నిర్వహించిన వర్చువల్ ఎగ్జిబిషన్.ను సహాయమంత్రులు సాధ్వీ నిరంజన్ జ్యోతి, అశ్వినీ కుమార్ చౌబే లాంఛనంగా ప్రారంభించారు.
ఎన్.సి.ఆర్.సి. అధ్యక్షుడు జస్టిస్ ఆర్.కె. అగర్వాల్ ప్రధానోపన్యాసం చేస్తూ, ప్రస్తుత ప్రపంచ డిజిటలీకరణ యుగంలో సాంకేతిక పరిజ్ఞాన ప్రగతిలో పెనుమార్పులను గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ఆర్థిక సమ్మిళితానికి, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి డిజిటల్ ఆర్థిక సేవలు ఎంతో కీలకమవుతున్నాయని అన్నారు. వ్యక్తులకు, కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే కాకుండా మొత్తం దేశానికే డిజిటల్ ఆర్థిక సేవలు ఎంతో కీలకంగా మారాయన్నారు.
2022వ సంవత్సరపు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలిచిన విజేతలను కేంద్ర మంత్రులు అభినందించారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వ్యాస రచన పోటీలు నిర్వహించింది. ఇక భారతీయ వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫిక్కీ)కి చెందిన స్మగ్లింగ్ నిరోధక, నకిలీ నోట్ల కార్యకలాపాల నిరోధక కమిటీ,.. ఆన్ లైన్ పెయింటింగ్ పోటీలను నిర్వహించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖతో కలసి ఉమ్మడిగా ఈ పోటీలను నిర్వహించారు.
అనంతరం,..కేంద్రమంత్రి పీయూష్ గోయల్, తదితర ప్రముఖులు ఈ కింది పుస్తకాలను ఆవిష్కరించారు.:
Øసుప్రీంకోర్టు, ఎన్.సి.డి.ఆర్.సి., ఎస్.సి.డి.ఆర్.సి. తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలపై త్రైమాసిక సంక్షిప్తీకరణ. (ఢిల్లీకి చెందిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తయారీ)
Øఉత్పాదనలో లోపాలకు తయారీదారు బాధ్యత, తరచూ తలెత్తే ప్రశ్నలపై వినియోగదారుల కరదీపిక.
Ø2019వ సంవత్సరపు వినియోగదారుల రక్షణ చట్టంపై కరదీపిక.
Øవినియోగదారుడే రాజు (5వ ఎడిషన్).
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్, అదనపు కార్యదర్శి నిధీ ఖరే, తదితర ప్రముఖులు ఈ నాటి కార్యక్రమానికి హాజరయ్యారు.
****
(Release ID: 1806805)
Visitor Counter : 316