అహ్మదాబాద్ లో రాష్ర్టీయ రక్షా విశ్వవిద్యాలయంలోని ఒక భవనాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతో పాటు ఆ సంస్థ తొలి స్నాతకోత్సవంలో కూడా ప్రసంగించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మాగాంధీకి, దండి యాత్రలో పాల్గొన్న వారికి ఈ సందర్భంగా ప్రధానమంత్రి నివాళి అర్పించారు. ఆ మహాయాత్ర ఇదే రోజున ప్రారంభమయింది. “బ్రిటిష్ పాలకుల అన్యాయానికి వ్యతిరేకంగా గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం భారతీయుల సంఘటిత శక్తి ఏమిటో బ్రిటిషర్లు గుర్తించేలా చేసింది” అని ప్రధానమంత్రి అన్నారు.
వలసవాద పాలకుల ఆకాంక్షలకు అనుగుణంగా శాంతిని కాపాడడం అంటే ప్రజల్లో భయోత్పాతం సృష్టించడమే అన్నట్టు వలస పాలన కాలంలో అంతర్గత భద్రతా దళాల వైఖరి ఉండేది. అలాగే అప్పట్లో భద్రతా దళాలు సిద్ధం కావడానికి అధిక సమయం పట్టేది. కాని టెక్నాలజీ, రవాణా, కమ్యూనికేషన్ సదుపాయాల మెరుగుదలతో అప్పటితో పోల్చితే పరిస్థితి ఎంతో మెరుగుపడింది. నేటి పోలీసింగ్ కు ఎదుటి వారితో మాట్లాడే నైపుణ్యంతో పాటు ప్రజాస్వామ్య విధానంలో పని చేయడానికి అవసరమైన సాఫ్ట్ నైపుణ్యాలు కూడా ఉండాలని తేలిందని ప్రధానమంత్రి అన్నారు.
పోలీసులు, భద్రతా దళాల సిబ్బంది వైఖరి మారవలసిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. మహమ్మారి కాలంలో పోలీసు సిబ్బంది చేసిన మానవతాపూర్వకమైన పనుల గురించి ఆయన ప్రస్తావించారు. “స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ అంతర్గత భద్రతా యంత్రాంగాన్ని సంస్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూనిఫారం ధరించిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచనా ధోరణి అప్పట్లో ఉండేది.ఆ ధోరణి ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు యూనిఫారం ధరించిన వారు ఎదురైతే తమకు సహాయం లభిస్తుందన్న భరోసా ప్రజలు పొందగలుగుతున్నారు” అన్నారు.
ఉమ్మడి కుటుంబాల మద్దతు కుంచించుకుపోవడంతో పోలీసు సిబ్బంది పనిలో ఒత్తిడి ఏర్పడిందని ప్రధానమంత్రి అన్నారు. భద్రతా దళాల్లో ఒత్తిడిని తగ్గించాలంటే ఒత్తిడి తొలగింపు, విశ్రాంతి, యోగా వంటివి నేర్పగల నిపుణుల ప్రాధాన్యం ఏర్పడిందని ఆయన చెప్పారు. “దేశ భద్రతా యంత్రాంగాన్ని పటిష్ఠం చేయాలంటే వారికి ఒత్తిడికి తావు లేని శిక్షణ కార్యకలాపాలు అవసరం” అని ఆయన అన్నారు.
భద్రత, పోలీసింగ్ నెట్ వర్క్ లలో టెక్నాలజీ ప్రాధాన్యాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. నేరగాళ్లు టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు, అలాగే వారిని పట్టుకునేందుకు కూడా టెక్నాలజీని ఉపయోగించాలి అన్నారు. టెక్నాలజీ సహాయంతో దివ్యాంగులు కూడా ఈ రంగానికి సేవలందించగలుగుతున్నారని ఆయన చెప్పారు.
గాంధీనగర్ లో జాతీయ లా విశ్వవిద్యాలయం, రక్షా విశ్వవిద్యాలయం, ఫోరెన్సిక్ శాస్త్ర విశ్వవిద్యాలయం ఉన్నాయని ఆయన అన్నారు. ఒకే తరహా పోలికలుండే ఈ మూడు విద్యాసంస్థల్లోనూ విద్యాపరిపూర్ణత సాధించాలంటే మూడు సంస్థల మధ్య క్రమం తప్పకుండా గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. “దీన్ని పోలీసు విశ్వవిద్యాలయం అనుకుని పొరపాటు పడవద్దు. ఇది దేశ భద్రత అంతటినీ మొత్తంగా పరిరక్షించగల రక్షా విశ్వవిద్యాలయం అన్నారు. మూక మనస్తత్వం, చర్చలు, పోషకాహారం, టెక్నాలజీ వంటి కోర్సుల ప్రాధాన్యత ఎంతో ఉంది” అని ఆయన నొక్కి చెప్పారు.
మానవతా విలువలు తాము ధరించే యూనిఫారంలో అంతర్గతంగా ఉంటుందని గుర్తించాలని, వారి ప్రయత్నాల్లో సేవా నిరతికి లోటుండరాదని విద్యార్థులకు ప్రధానమంత్రి సూచించారు. భద్రతా విభాగాల్లో యువతులు, మహిళల సంఖ్య పెరగడం పట్ల ఆయన సంతృప్తి ప్రకటించారు. రక్షణ రంగంలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం పెరగడం మనం చూస్తున్నాం. “సైన్స్, శిక్ష లేదా సురక్ష విభాగాల్లో మహిళలు ముందు వరుసలో ఉంటున్నారు” అని చెప్పారు.
ఇలాంటి సంస్థలో మొదటి బ్యాచ్ లోని వారంటే సంస్థ విజన్ ను ముందుకు నడిపించే వారవుతారని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుజరాత్ లోని పాత ఫార్మసీ కళాశాల రాష్ర్టాన్ని ఫార్మాస్యూటికల్స్ రంగంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లిందన్న విషయం ఆయన గుర్తు చేశారు. అలాగే ఐఐఎం అహ్మదాబాద్ దేశంలో ఎంబిఏ విద్యావ్యవస్థ శక్తివంతమయ్యేలా విస్తరించిందని ఆయన చెప్పారు.
పోలీసింగ్, క్రిమినల్ న్యాయం, దిద్దుబాటు యంత్రాంగం వంటి విభిన్న విభాగాల్లో సుశిక్షితులైన అత్యున్నత నాణ్యత గల మానవ వనరుల అవసరాన్ని రాష్ర్టీయ రక్షా విశ్వవిద్యాలయం (ఆర్ఆర్ యు) తీరుస్తుంది. 2010 సంవత్సరంలో గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షా శక్తి విశ్వ విద్యాలయం హోదాను పెంచుతూ ప్రభుత్వం జాతీయ పోలీసు విశ్వవిద్యాలయం పేరును రాష్ర్టీయ రక్షా విశ్వవిద్యాలయంగా మార్చింది. జాతీయ ప్రాధాన్యత గల ఈ విశ్వవిద్యాలయం కార్యకలాపాలు 2020 అక్టోబర్ 1వ తేదీన ప్రారంభించింది. పారిశ్రామిక రంగం నుంచి పరిజ్ఞానాన్ని, వనరులను సమీకరించి ప్రైవేటు రంగంలోని విద్యాసంస్థల సహకారాన్ని కూడా ఈ విశ్వవిద్యాలయం పొందుతూ పోలీసు, భద్రతా విభాగాల్లో పలు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లు ఏర్పాటు చేస్తుంది.
పోలీసింగ్, అంతర్గత భద్రతకు చెందిన పోలీస్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్, క్రిమినల్ లా అండ్ జస్టిస్, సైబర్ మనస్తత్వ శాస్త్రం, ఐటి, కృత్రిమ మేథ, సైబర్ సెక్యూరిటీ, నేరాల దర్యాప్తు, వ్యూహాత్మక భాషలు; అంతర్గత భద్రత, వ్యూహాలు; ఫిజికల్ ఎడ్యుకేషన్, క్రీడలు; కోస్తా, తీర ప్రాంత భద్రత వంటి విభిన్న రంగాల్లో డిప్లొమా నుంచి డాక్టరేట్ వరకు వివిధ విద్యాకోర్సులు ఆర్ఆర్ యు అందిస్తుంది. ప్రస్తుతం 18 రాష్ర్టాలకు చెందిన 822 మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు.
***