ప్రధాన మంత్రి కార్యాలయం

పూణే లోని సింబయాసిస్ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలను ప్రారంభించిన - ప్రధానమంత్రి


సింబయాసిస్ ఆరోగ్య ధామ్‌ ను కూడా ప్రారంభించిన - ప్రధానమంత్రి

“జ్ఞానం చాలా దూరం విస్తరించాలి, ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబం గా అనుసంధానించడానికి జ్ఞానం ఒక మాధ్యమంగా మారాలి, ఇది మన సంస్కృతి. ఈ సంప్రదాయం మన దేశంలో ఇంకా సజీవంగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను"

“స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాలు మీ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. నేటి భారతదేశం మొత్తం ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది, మెరుగుపరుస్తోంది, ప్రభావితం చేస్తోంది”

"మీ తరం అదృష్టవంతులు, ఇది మునుపటి రక్షణాత్మకమైన, ఆధారపడిన మనస్తత్వశాస్త్రం యొక్క హానికరమైన ప్రభావాన్ని చవిచూడలేదు. ఆ గౌరవం మీ అందరికీ, మన యువతకు చెందుతుంది. ”

“ఈ రోజు దేశంలోని ప్రభుత్వం దేశంలోని యువత బలాన్ని విశ్వసిస్తోంది. అందుకే మీ కోసం ఒకదాని తర్వాత ఒకటి రంగాలను తెరుస్తున్నాం”

"ఉక్రెయిన్ నుండి వేలాది మంది విద్యార్థులను మన స్వదేశానికి తిరిగి తీసుకురావడం భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావం"

Posted On: 06 MAR 2022 3:22PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పూణే లోని సింబ‌యోసిస్ విశ్వవిద్యాలయ స్వ‌ర్ణోత్సవ వేడుక‌ను ప్రారంభించారు.  సింబ‌యోసిస్ ఆరోగ్య ధామ్‌ ను కూడా ఆయన ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోషియారీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సింబ‌యోసిస్ విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులను ప్రధానమంత్రి అభినందిస్తూ,   ‘వసుధైవ కుటుంబం’ అనే ఈ సంస్థ యొక్క నినాదాన్ని ఆయన ప్రస్తావించారు. వివిధ దేశాల నుండి వచ్చిన విద్యార్థుల రూపంలో ఈ ఆధునిక సంస్థ భారతదేశ ప్రాచీన సంప్రదాయానికి ప్రాతినిధ్యం వహిస్తోందని, ఆయన పేర్కొన్నారు.  “జ్ఞానం చాలా దూరం వ్యాపించాలి, ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా అనుసంధానించడానికి జ్ఞానం ఒక మాధ్యమంగా మారాలి, ఇది మన సంస్కృతి.  ఈ సంప్రదాయం మన దేశంలో ఇంకా సజీవంగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను” అని ప్రధానమంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి నవ భారతదేశం యొక్క విశ్వాసాన్ని నొక్కిచెప్పారు మరియు భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి మరియు ప్రపంచంలోని మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్వహిస్తోందని పేర్కొన్నారు.  “స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాలు మీ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.  నేటి భారతదేశం మొత్తం ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది, మెరుగుపరుస్తోంది, ప్రభావితం చేస్తోంది” అని ప్రధానమంత్రి వివరించారు.  క‌రోనా వ్యాక్సినేష‌న్ సంద‌ర్భంగా ప్ర‌పంచానికి భార‌త‌దేశం ఎలా త‌న నైపుణ్యాన్ని చూపించిందో పుణేక‌ర్ల‌కు బాగా తెలుసు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో ఆపరేషన్ గంగా ద్వారా భారతదేశం తన పౌరులను యుద్ధ ప్రాంతం నుండి సురక్షితంగా బయటకు తీసుకువస్తోందని ఆయన భారతదేశ ప్రభావం గురించి, ప్రత్యేకంగా పేర్కొన్నారు.  “ప్రపంచంలోని పెద్ద దేశాలు సైతం అలా చేయడాన్ని కష్టంగా భావించాయి.  అయితే, భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావం వల్ల మనం వేలాది మంది విద్యార్థులను మన స్వదేశానికి తిరిగి తీసుకురాగలిగాము.”అని ప్రధానమంత్రి చెప్పారు. 

దేశంలో మారిన పరిస్థితులను ప్రధానమంత్రి ప్రత్యేకంగా వివరించారు.  "మీ తరం అదృష్టవంతులు, ఇది మునుపటి రక్షణాత్మకమైన, ఆధారపడిన మనస్తత్వశాస్త్రం యొక్క హానికరమైన ప్రభావాన్ని చవిచూడలేదు.  దేశంలో ఈ మార్పు వచ్చినట్లయితే, ఆ విషయంలో మొదటి  గౌరవం మీ అందరికీ, మన యువతకు దక్కుతుంది." అని ప్రధానమంత్రి చెప్పారు. 

అంతకుముందు అందుబాటులో లేని రంగాలలో, భారతదేశం, ఇప్పుడు ప్రపంచ అగ్రగామిగా ఎదిగిందని ప్రధానమంత్రి అన్నారు.  భారతదేశం, ఇప్పుడు, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారుగా అవతరించింది.  ఏడేళ్ల క్రితం భారతదేశంలో కేవలం 2 మొబైల్ తయారీ కంపెనీలు ఉండేవని, అయితే, ఈ రోజున, 200 కు పైగా తయారీ యూనిట్లు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయని, ఆయన చెప్పారు.  రక్షణ రంగంలో కూడా, ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారు దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం, ఇప్పుడు రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా మారుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.   ఈ రోజు, రెండు ప్రధాన రక్షణ కారిడార్లు రాబోతున్నాయనీ, దేశంలోని రక్షణ అవసరాలను తీర్చడానికి అతిపెద్ద ఆధునిక ఆయుధాలు తయారు కానున్నాయనీ, ఆయన తెలియజేశారు.

దేశంలో కొత్తగా ప్రారంభమౌతున్న వివిధ రంగాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, ప్రధానమంత్రి విద్యార్థులకు పిలుపునిచ్చారు.  భౌగోళిక వ్యవస్థలు, డ్రోన్లు, సెమీకండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో ఇటీవలి సంస్కరణల గురించి, ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ,  “ఈ రోజు దేశంలోని ప్రభుత్వం దేశంలోని యువత బలాన్ని విశ్వసిస్తోంది.  అందుకే మీ కోసం ఒకదాని తర్వాత ఒకటిగా వివిధ రంగాలను అందుబాటులోకి తెస్తున్నాము.”, అని పేర్కొన్నారు. 

“మీరు ఏ రంగంలో ఉన్నా, మీ వృత్తి పరంగా మీరు ఏ విధంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారో, అదే విధంగా మీరు దేశం కోసం కొన్ని లక్ష్యాలను కలిగి ఉండాలి” అని శ్రీ మోదీ అభ్యర్థించారు.  స్థానిక సమస్యలకు పరిష్కారం చూపాలని, ఆయన వారిని కోరారు.  తమ యోగ్యతను కాపాడుకోవాలని, సంతోషంగా, ఉత్సాహంగా ఉండాలని, ఆయన, వారిని కోరారు.  "మన లక్ష్యాలు వ్యక్తిగత ఎదుగుదల నుండి దేశాభివృద్ధికి ఎప్పుడైతే వెళతాయో, అప్పుడు దేశ నిర్మాణంలో భాగస్వామ్యమన్న భావన కలుగుతుంది" అని శ్రీ మోదీ వివరించారు. 

జాతీయ, ప్రపంచ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం పని చేయడానికి వీలుగా, తగిన ఇతివృత్తాన్ని ఎంచుకోవాలని ప్రధానమంత్రి విద్యార్థులను కోరారు.  ఫలితాలు, ఆలోచనలను ప్రధానమంత్రి కార్యాలయంతో కూడా పంచుకోవచ్చని ఆయన అన్నారు.

 

 

 

 



(Release ID: 1803493) Visitor Counter : 152