ప్రధాన మంత్రి కార్యాలయం

రొమేనియా ప్రధాని గౌరవనీయ నికోలే లోనెల్‌ సియుకాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్‌ సంభాషణ

Posted On: 28 FEB 2022 10:11PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రొమేనియా ప్రధాని గౌరవనీయ నికోలే లోనెల్‌ సియుకాతో ఫోన్‌లో సంభాషించారు. ఉక్రెయిన్‌ నుంచి కొన్ని రోజులుగా భారత పౌరులను తరలించడంలో రొమేనియా సహకారంపై ఈ సందర్భంగా గౌరవనీయ నికోలే లోనెల్‌ సియుకాకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. భారత పౌరులను వీసాలు లేకుండా తమ దేశంలో ప్రవేశించేందుకు రొమేనియా ఉదారంగా అనుమతించడాన్ని ప్రశంసించారు. అంతేకాకుండా భారత్‌ నుంచి ప్రత్యేక తరలింపు విమానాలను అనుమతించడంలోనూ రొమేనియా చూపిన ఔదార్యాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.

   రాబోయే రోజులలో రొమేనియాలోని స్థానిక అధికారులతో సమన్వయంతో భారత పౌరుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు తన ప్రత్యేక ప్రతినిధిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం.సింధియాను నియమించినట్లు కూడా ప్రధాని శ్రీ సియుకాకు తెలియజేశారు.

   ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న హింస, మానవతా సంక్షోభంపై ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శత్రుభావాన్ని విడనాడి, చర్చలవైపు తిరిగి దృష్టి మళ్లించాలని పలుమార్లు  భారత్‌ చేసిన విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించడంలోగల ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ నొక్కిచెప్పారు.

 

***



(Release ID: 1801997) Visitor Counter : 127