ప్రధాన మంత్రి కార్యాలయం
అరుణాచల్ ప్రదేశ్ స్వర్ణోత్సవాలు రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
“అది ఆంగ్లో-అబోర్ యుద్ధం లేదా స్వాతంత్ర్యానంతర సరిహద్దు భద్రత కావచ్చు... అరుణాచల్ ప్రజల పరాక్రమ గాథలు ప్రతి భారతీయుడికీ అమూల్య వారసత్వమే”;
“సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్’
మార్గానుసరణతోనే అరుణాచల్ ప్రదేశ్ మెరుగైన భవిష్యత్తుకు భరోసా”;
“21వ శతాబ్దంలో దేశ ప్రగతికి తూర్పు భారతం...
ప్రత్యేకించి ఈశాన్య భారతమే చోదక శక్తి”;
“అరుణాచల్‌ను తూర్పు ఆసియా ముఖద్వారంగా
రూపొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం”;
“అరుణాచల్ ప్రదేశ్‌కుగల వ్యూహాత్మక పాత్ర దృష్ట్యా
రాష్ట్రంలో ఆధునిక వసతుల నిర్మాణం చేపట్టబడింది”
Posted On:
20 FEB 2022 12:03PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ స్వర్ణోత్సవాలు.. 36వ రాష్ట్ర అవతరణ దినోత్సవాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యోదయ భూమిగా 50 ఏళ్లనుంచీ తమకున్న గుర్తింపును మరింత బలోపేతం చేసుకున్నారంటూ ఆయన వారిని అభినందించారు. ప్రముఖ గాయకుడు... భారతరత్న... డాక్టర్ భూపేన్ హజారికా ఆలపించిన ప్రసిద్ధ గీతం 'అరుణాచల్ హమారా' నుంచి కొన్ని పంక్తులను కూడా ఉటంకించారు. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ స్వర్ణోత్సవాలు... 36వ రాష్ట్రావిర్భావ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగించారు.
దేశభక్తిని, సామాజిక సామరస్య భావనను ప్రోది చేయడం సహా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అరుణాచల్ ప్రదేశ్ పరిరక్షిస్తున్నదని ప్రధాని కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అరుణాచల్ ప్రదేశ్‌లోని అమరవీరులకు ఆయన నివాళి అలర్పించారు. “అది ఆంగ్లో-అబోర్ యుద్ధం కావచ్చు లేదా స్వాతంత్ర్యం తర్వాత సరిహద్దు భద్రత కావచ్చు.. అరుణాచల్ ప్రజల శౌర్య పరాక్రమ గాథలు ప్రతి భారతీయుడికీ అమూల్య వారసత్వం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో తాను పలుమార్లు పర్యటించడాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ నాయకత్వంలోని జంట ఇంజన్ల ప్రభుత్వ హయాంలో ప్రగతి వేగంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్” మార్గమే అరుణాచల్ ప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది” అన్నారు.
తూర్పు భారతదేశం... ప్రత్యేకించి ఈశాన్య భారతం 21 వ శతాబ్దంలో భారతదేశ ప్రగతికి చోదకశక్తి కాగలదన్న తన విశ్వాసాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఏడేళ్లుగా తాము చేపట్టిన చర్యల గురించి కూడా ఆయన వివరించారు. అనుసంధానం, విద్యుత్ మౌలిక సదుపాయాల రంగాల్లో విస్తృత కార్యక్రమాలు సాగుతున్నాయని చెప్పారు. తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌లో జీవన సౌలభ్యంతోపాటు వ్యాపార సౌలభ్యం సాధ్యం కాగలదన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని రాజధానులూ ప్రాధాన్యం ప్రాతిపదికన రైలు-సంధానం అవుతున్నాయని తెలిపారు. “తూర్పు ఆసియాకు ఒక ప్రధాన ముఖద్వారంగా అరుణాచల్‌ను తీర్చిదిద్దడానికి మేం శాయశక్తులా కృషి చేస్తున్నాం. అరుణాచల్‌కు గల వ్యూహాత్మక పాత్ర దృష్ట్యా రాష్ట్రంలో ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టబడింది” అని ప్రధాని చెప్పారు.
ప్రకృతి, సంస్కృతితో మమేకమై అరుణాచల్ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నదని ప్రధాని అన్నారు. “మీ కృషి, పట్టుదలతోనే జీవ వైవిధ్యపరంగా అరుణాచల్ అత్యంత ప్రముఖ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది” అని రాష్ట్ర ప్రజలను ప్రధాని అభినందించారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, స్వయం సహాయ సంఘాల ముందంజకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషిపై శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు కూడా రాష్ట్రాభిభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. పర్యాటకంపరంగా అంతర్జాతీయ స్థాయిలో అరుణాచల్‌కుగల అవకాశాల సద్వినియోగంపై తన నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు.
*****
DS
(Release ID: 1799931)
Visitor Counter : 177
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam