ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర బ్యాంక్ డిజిటల్ కరెన్సీ “డిజిటల్ రూపాయి’ ప్రవేశపెడుతున్నట్టు ప్రకటన


75 జిల్లాల్లో 75 డిజిటల్ బాంకింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

2022 లో 100 శాతం కోర్ బాంకింగ్ వ్యవస్థలోకి 1.5 లక్షల పోస్టాఫీసులు
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు ఆర్థిక సహాయం కొనసాగింపు

Posted On: 01 FEB 2022 1:11PM by PIB Hyderabad

2022-23 మొదలుకొని భారత రిజర్వ్ బ్యాక్ డిజిటల్ రూపాయిని ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ విధమైన సెంట్రల్ బాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) వలన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందన్నారు.  డిజిటల్ కరెన్సీ వలన మరింత సమర్థవంతమైన, చౌక అయిన కరెన్సీ యాజమాన్య వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.  ఈ డిజిటల్ కరెన్సీ బ్లాక్ చెయిన్ తదితర సాంకేతిక పరిజ్ఞానాలు వినియోగించుకుంటుంది.

డిజిటల్ బాంకింగ్ :

ఇటీవలి సంవత్సరాలలో డిజిటల్ బాంకింగ్,  డిజిటల్ చెల్లింపులు, ఫిన్ టెక్ నవకల్పనలు దేశంలో అనూహ్యమైన వేగంతో పెరిగాయని ఆర్థికమంత్రి గుర్తుచేశారు. ఈ రంగాలను ప్రభుత్వం ప్రోత్సాహిస్తూనే వస్తోందన్నారు. ఈ విధంగా  డిజిటల్ బాంకింగ్ ప్రయోజనాలు వినియోగదారులకు సులువుగా ఉంటూ దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ఎజెండాను మరింత ముందుకు తీసుకుపోతూ, మన 75 ఏళ్ల స్వాతంత్ర్య వార్షిక సందర్భాన్ని పురస్కరించుకొని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బాంకింగ్ యూనిట్లను షెడ్యూల్డ్ వాణిజ్య బాంకులు ప్రారంభిస్తాయని మంత్రి చెప్పారు.   

ఎప్పుడైనా, ఎక్కడైనా పోస్టాఫీస్ మదుపు :

2022 లో చేపట్టబోతున్న మరో ముఖ్యమైన సంస్కరణను కూడా మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశంలోని లక్షన్నర పోస్టాఫీసులలో నూటికి నూరుశాతం  కోర్ బాంకింగ్ రంగంలో చేరిపోతాయని చెప్పారు. దీనివలన ఆర్థిక సమ్మిళితం కావటం, నెట్ బాంకింగ్, మొబైల్ బాంకింగ్ , ఏటీఎమ్ ద్వారా  పోస్టాఫీసుల, బాంక్ ఖాతాల మధ్య లావాదేవీలకు వెసులుబాటు కలుగుతుందన్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు, వృద్ధులకు  ఇది చాలా సహాయకారిగా ఉంటుందని, ఆర్థిక లావాదేవీలు పరస్పర మార్పిడికి పనికొస్తుందని చెప్పారు.  

డిజిటల్ చెల్లింపులు :

గత బడ్జెట్ లో డిజిటల్ చెల్లింపులకు ప్రకటించిన ఆర్థిక సంవత్సరం రాబోయే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ రోజు హామీ ఇచ్చారు.  దీనివలన డిజిటల్ చెల్లింపులకు మరింత ఊతం అందినట్టవుతుందని అన్నారు. తక్కువ ఖర్చుతో, వాడకానికి సులువుగా ఉండే చెల్లింపు వేదికలను ప్రోత్సహించటం  మీద కూడా దృష్టి సారిస్తామని మంత్రి వెల్లడించారు.   

 

***



(Release ID: 1794259) Visitor Counter : 386