ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2021-22వ సంవత్సరపు ఆర్థిక సర్వే సారాంశం


2022-23లో 8.0శాతంనుంచి 8.5శాతం వృద్ధిని సాధించే దిశగా భారత్


2021-24లో అతివేగంగా ఎదిగే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా
భారతదేశం నిలిచిపోగలదని
ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేస్తున్నాయి...
వాస్తవిక లెక్కల్లో 2021-22లో 9.2శాతం మేర పెరగనున్న భారతీయ ఆర్థిక వ్యవస్థ..


ముందు సంవత్సరంలో 3.6శాతంగా నమోదైన వృద్ధితో పోల్చుకుంటే
2021-22లో వ్యవసాయ రంగం 3.9శాతం మేర వృద్ధిని సాధించే అవకాశం

2020-21లో 7శాతం వృద్ధినుంచి 2021-22లో
11.8శాతం వృద్ధిని సాధించబోతున్న పారిశ్రామిక రంగం...


గత ఏడాది 8.4శాతానికి పరిమితమైన సేవారంగం వృద్ధి,
2021-22లో 8.4శాతానికి ఎదిగే అవకాశం..


2021 డిసెంబరు 31నాటికి అందుబాటులో ఉన్న
విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 634 బిలియన్ల అమెరికన్ డాలర్లు
13 నెలల్లో జరిగిన దిగుమతుల విలువకు ఇది సమానం.,.
దేశం తెప్పిందిన విదేశీ రుణాల విలువకంటే ఎక్కువే.


2021-22లో 15శాతం మేర భారీగా పెరగనున్న పెట్టుబడి


2021 డిసెంబరులో వినియోగదారుల ధరల సూచీతో కూడిన
ద్రవ్యోల్బణం 5.6శాతంగా నమోదు.
భరించదగిన పరమితిలోనే ద్రవ్యోల్బణం

Posted On: 31 JAN 2022 3:11PM by PIB Hyderabad

 2022-23వ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం స్థూల స్వదేశీ ఉత్పాదన 8నుంచి 8.5శాతం వరకూ వృద్ధిని సాధించబోతోంది. దేశంలో కొనసాగుతున్న విస్తృత స్థాయి వ్యాక్సినేషన్ ప్రక్రియ, సరఫరాల రంగంలో సంస్కరణల ద్వారా అందే ప్రయోజనాలు, నియంత్రణల సడలింపు, ఎగుమతుల్లో భారీ స్థాయి వృద్ధి, పెట్టుబడి వ్యయానికి అందుబాటులో ద్రవ్యనిధి..వంటి సానుకూల పరిస్థితుల నేపథ్యంలో స్థూల స్వదేశీ ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి.

 కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-22వ సంవత్సరపు ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాలు తెలిపింది. రాబోయే సంవత్సరంలో ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగనున్నాయని, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సానుకూల పరిచే పటిష్ట స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ ఉందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ బలహీన పడటం ఇకపై జరగబోదని, సాధారణ వర్షపాతం ఉంటుందని, ప్రధాన కేంద్ర బ్యాంకుల ప్రపంచ స్థాయి లిక్విడిటీ సాధారణంగానే ఉంటుందని, చమురు ధర,.. బ్యారెలకు 70నుంచి 75 అమెరికన్ డాలర్ల మధ్యనే ఉంటుందని, ప్రపంచ సరఫరా వ్యవస్థ స్థిరంగా ఉండగలదని భావిస్తూ 2022-23వ సంవత్సరపు వృద్ధిపై ఈ అంచనాలను రూపొందించారు.

 

2022-23వ సంవత్సరంలో స్థూల స్వదేశీ ఉత్పత్తి  8.7శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు, 7.5శాతం నమోదు కావచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ.డి.బి.) వేసిన ముందస్తు అంచనాల ప్రాతిపదికన భారతదేశం ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పోల్చవచ్చని సర్వే పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్.)నుంచి 2022 జనవరి 25న వెలువరించిన ప్రపంచ ఆర్థిక అంచనాల (డబ్ల్యు.ఇ.ఒ.) ప్రకారం భారతదేశం వాస్తవిక స్థూల స్వదేశీ ఉత్పత్తి 2021-22, 2022-23 సవంత్సరాల్లో 9శాతం మేర, 2023-24లో 7.1శాతం మేర పెరుగబోతోంది. ఈ మూడేళ్ల కాలంలోనూ అతి వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలవగలదని ఈ లెక్కలు సూచిస్తున్నాయి.

 

2020-21వ ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతంగా మాత్రమే వృద్ధిని నమోదు చేసుకున్న భారతీయ ఆర్థిక వ్యవస్థ వాస్తవిక లెక్కల ప్రకారం 2021-22లో 9.2శాతం మేర వృద్ధిని సాధించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. తొలి ముందస్తు అంచనాలను ప్రస్తావిస్తూ ఆర్థిక సర్వే ఈ వృద్ధిని లెక్కవేసింది. దేశంలో ఆర్థిక స్థితి బాగా కోలుకున్నదని, వైరస్ మహమ్మారి వ్యాప్తి ముందునాళ్ల స్థాయికి ఆర్థిక కార్యకలాపాలు చేరుకున్నాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. అంటే,..2020-21వ సంవత్సరంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ ఆంక్షలు విధించినప్పటి పరిస్థితి కంటే మొదటి త్రైమాసికంలో  ఆర్థిక కార్యకలాపాలపై “సెకండ్ వేవ్” వైరస్ ప్రభావం చాలా తక్కువేనని, ఆరోగ్యంపై కోవిడ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపినప్పటికీ  మొత్తానికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని దాదాపు అన్ని సూచనలూ తెలియచజేస్తున్నాయి.   

 

వివిధ రంగాల్లో ప్రగతిని గురించి కూడా ఆర్థిక సర్వే  వివరించింది. వ్యవసాయంపై, వ్యవసాయ అనుబంధ రంగాలపై కరోనా మహమ్మారి చూపిన ప్రభావం చాలా తక్కువేనని, 2021-22వ సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.9శాతం మేర వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని, అంతకు ముందు సంవత్సరం వ్యవసాయ రంగం 3.6 శాతం మేర వృద్ధిని సాధించిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఖరీఫ్, రబీ పంటకాల్లో నాట్లు పడిన విస్తీర్ణం, గోధుమ, వరి పంటల ఉత్పత్తి స్థిరంగా పెరుగుతూ వచ్చాయని పేర్కొంది. ప్రస్తుత సంవత్సరంలో ఖరీఫ్ కాలానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 15.5 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీనికి తోడుగా, సెంట్రల్ పూల్ కింద ఆహార ధాన్యాల సేకరణ ప్రక్రియకు సంబంధించి 2021-22లో పెరుగుదల ధోరణే కనిపించింది. అలాగే, కనీస మద్దతు ధరలు కూడా పెరిగాయి. ఇది జాతీయ ఆహార భద్రతకు, రైతుల ఆదాయాల వృద్ధికి దోహదపడింది. ప్రభుత్వ విధానాల తోడ్పాటు, సహాయ, సహకారాలతో వ్యవసాయ రంగం వృద్ధిని సాధించింది. కరోనా వైరస్ వ్యాప్తితో సవాళ్లు ఎదురైనప్పటికీ సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా జరగడం వ్యవసాయ వృద్ధికి దోహదపడింది. గత పదేళ్ల సగటుకు మించి, మంచి వర్షాలు కురవడం, జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడంవల్ల కూడా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.

 

 ఇక, పారిశ్రామిక రంగం కూడా గణనీయమైన ప్రగతిని నమోదు చేసిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2020-21వ సంవత్సరంలో 7శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసిన పారిశ్రామిక రంగం ఆ తర్వాత తిరిగి కోలుకొని మరింత దూకుడు చూపించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 11.8శాతం మేర వృద్ధిని పారిశ్రామిక రంగం సాధించింది. తయారీ, నిర్మాణం, గనుల తవ్వకం వంటి రంగాలు కూడా ఇదే వృద్ధి ధోరణిని ప్రదర్శించాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతున్నా విద్యుచ్ఛక్తి, నీటి సరఫరా వంటి రంగాలు చక్కని ప్రగతిని నమోదు చేశాయి. కాగా స్థూల  విలువల జోడింపు (జి.వి.ఎ.)లో పారిశ్రామిక రంగం వాటా ఏకంగా 28.2శాతం మేర ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

 

సేవారంగానికి చెందిన పలు విభాగాలు, ప్రత్యేకించి మనుషుల భౌతిక ప్రమేయం ఉన్న సేవలు,.. వైరస్ మహమ్మారి వ్యాప్తితో తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. గత ఏడాది 8.4శాతం స్థాయికి పరిమితమైన సేవారంగం,.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.2శాతం మేర ప్రగతిని సాధించవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. సేవలకు సంబంధించిన ఉప రంగాల పనితీరు మాత్రం పలురకాలుగా నమోదైంది. ఆర్థిక, స్థిరాస్తి రంగం, ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం విభాగాలల్లో కార్యకలాపాలు ఇప్పటికే కోవిడ్ ముందునాటి స్థితికి చేరుకున్నాయి. అయితే, ప్రయాణంరంగం, వాణిజ్యం, హోటళ్లు వంటి రంగాలు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోవలసి ఉంది. ఇక, పర్యాటక రంగంనుంచి ఆదాయం వేగంగా పడిపోయినప్పటికీ, సాఫ్ట్.వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.) ఆధారిత సేవల రంగంలో భారీగా ప్రగతి నమోదైంది.

 ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం 2021-22వ సంవత్సరంలో వినియోగ రంగం మొత్తంగా 7శాతం వృద్ధిని నమోదు చేయబోతోంది. గత సంవత్సరంలాగే ఈ సారి కూడా ప్రభుత్వం తరపు వినియోగమే వృద్ధిలో ఎక్కువ పాత్ర పోషించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రభుత్వం తరఫు వినియోగం కోవిడ్ ముందస్తు కాలంకంటే ఎక్కువగా 7.6శాతం స్థాయికి పెరగవచ్చని ఆర్థిక సర్వే అంచనాలు చెబుతున్నాయి. ప్రైవేటు రంగం తరఫు వినియోగం కూడా గణనీయంగా మెరుగుపడినట్టు అంచనా వేశారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తికంటే ముందస్తు స్థాయిలో 97శాతానికి ప్రైవేటు రంగం వినియోగం చేరుకున్నట్టు, వేగంగా వ్యాక్సినేషన్, ఆర్థిక కార్యకలాపాలు మామూలు స్థాయికి చేరుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ రంగం మరింత బలమైన స్థాయికి కోలుకోనున్నట్టు ఆర్థిక సర్వే అంచనా వేసింది.

గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (జి.ఎఫ్.సి.ఎఫ్.) లెక్కల ప్రకారం పెట్టుబడులు 2021-22వ సంవత్సరంలో 15శాతం మే వృద్ధిని సాధించనున్నాయని, త్వరలోనే కోవిడ్ మహమ్మారి ముందస్తుకాలం స్థాయికి వృద్ధి కోలుకుంటుందని  ఆర్థిక సర్వే పేర్కొంది. పెట్టుబడుల వ్యయం, మౌలిక సదుపాయాలపై ఖర్చు వంటి చర్యల ద్వారా వృద్ధి చక్రం గతిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంతో దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల రంగం పాత్ర పెరుగుతోంది. దీనితో స్థూల స్వదేశీ ఉత్పత్తి (జి.డి.పి.)లో పెట్టుబడుల నిష్పత్తి స్థాయి, 2021-22వ సంవత్సరంలో 29.6శాతానికి పెరిగే సూచనలు ఉన్నట్టు ఆర్థిక సర్వే అంచనా వేసింది. గత ఏడేళ్లకాలంలో ఇదే అత్యధికం కాబోతున్నట్టు కూడా పేర్కొంది. ప్రైవేటు పెట్టుబడుల పునరుజ్జీవం ఇంకా ప్రారంభదశలో, ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, భారతదేశంలో పెట్టుబడుల్లో మరింత బలంగా ముందుకు దూసుకుపోనున్నట్టు పలు సూచనలు తెలియజేస్తున్నాయి. ప్రైవేటు రంగం పెట్టుబడులకు తగినంతగా మద్దుతు అందించేందుకు బలిష్టమైన, ప్రక్షాళన పొందిన బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం సంసిద్ధంగా ఉంది.

ఇక ఎగుమతులు, దిగుమతుల రంగం గురించి ఆర్థిక సర్వే ప్రస్తావిస్తూ,..2021-22వ సంవత్సరంలో ఇప్పటి వరకూ సరుకుల, సేవల ఎగుమతులు చాలా బలంగా కొనసాగుతూ ఉన్నట్టు పేర్కొంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తితో సరఫరాకు సంబంధించి పలు రకాల అడ్డంకులు ఎదురైనప్పటికీ, 2021-22 సంవత్సరంలో వరుసగా 8 నెలలపాటు వాణిజ్య ఎగుమతులు 30 బిలియన్ అమెరికన్ డాలర్ల పైస్థాయిలోనే నమోదయ్యాయి. సేవల నికర ఎగుమతులు కూడా వేగంగా పెరిగాయి. వృత్తిపరమైన యాజమాన్య సేవలు, కన్సల్టింగ్ సేవలు, దృశ్య శ్రవణ, సంబంధిత సేవలు, సరకు రవాణా సేవలు, టెలికమ్యూనికేషన్లు, కంప్యూటర్-సమాచారం వంటి సేవల్లో ప్రగతి కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైంది. గిరాకీ ప్రాతిపదికన పరిశీలించినపుడు,.. ఇక భారతదేశం మొత్తం ఎగుమతులు 2021-22వ సంవత్సరంలో 16.5శాతం మేర వృద్ధిని సాధించవచ్చని భావిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి ముందస్తు కాలం స్థాయిని కూడా ఈ ఎగుమతులు అధిగమించవచ్చని అంచనావేస్తున్నారు. స్వదేశీయంగా గిరాకీ పెరగడం, దిగుమతి ముడిచమురు, లోహాల ధరల పెరుగుదల కొనసాగుతూ ఉండటం వంటి పరిణామాలతో దేశంలో దిగుమతులు కూడా బాగానే కోలుకున్నాయి. కోవిడ్ ముందస్తు కాలంలో దిగుమతుల కంటే అధికంగా 2021-22వ సంవత్సరంలో దిగుమతులు 29.4శాతం స్థాయికి పెరగనున్నాయి. ఫలితంగా, 2020-21వ సంవత్సరంలో అదే కాలంతో పోల్చినపుడు 2021-22లో భారతదేశపు నిఖర ఎగుమతుల్లో పరిస్థితి రుణాత్మక ధోరణికి దారితీసింది. అయితే కరెంట్ ఖాతా లోటు మాత్రం నిర్వహణా సౌలభ్యంతో కూడిన పరిమిత స్థాయిలోనే కొనసాగవచ్చని భావిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి సవాళ్లు, అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, భారతదేశం చెల్లింపు సమతూక స్థితి గత రెండేళ్లలోనూ లాభదాయంగానే కొనసాగింది. దీనితో, రిజర్వ్ బ్యాంకు కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమకూర్చుకోగలిగింది. 2021 డిసెంబరు నెలాఖరు నాటికి రిజర్వ్ బ్యాంకు వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు 634 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇది  13.2 నెలల దిగుమతుల విలువకు సమానంగా, విదేశీ రుణాల స్థాయి కంటే బాగా ఎక్కువగా ఉంది.

 

 

 అభివృద్ధి సాధించిన దేశాల్లోనూ,  పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్న దేశాల్లోనూ ద్రవ్యోల్బణం ప్రపంచ స్థాయి సమస్యగా తిరిగి తలెత్తిందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇంధన ధరలు, ఆహారేతర సరుకులు, ఉపకరణాల ధరలు పెరగడం, ప్రపంచ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, సరకు రవాణా వ్యయం పెరగడం వంటి పరిణామాలతో ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీసింది. భారతదేశంలో వినియోగ ధరల సూచీ (సి.పి.ఎస్.)తో కూడిన ద్రవ్యోల్బణం 2021-22వ సంవత్సరం ఏప్రిల్-డిసెంబరు కాలంలో 5.2 శాతంగా నమోదైంది. 2020-21వ సంవత్సరం ఇదే కాలంలో ద్రవ్యోల్బణం 6.6శాతంగా నమోదైంది. డిసెంబరు 2021 నాటికి 5.6శాతంగా నమోదైంది. ఇది, భరించదగిన పరిమితికి లోగానే ఉందని భావిస్తున్నారు. 2021-22లో ఆహార సంబంధమైన ద్రవ్యోల్బణంలో తగ్గుదలతో రిటైల్ సరుకుల సంబంధిత ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యు.పి.ఐ.) మాత్రం రెండంకెల స్థాయిలో కొనసాగుతూనే ఉంది.

ఆర్థిక వ్యవస్థకు అందించిన ద్రవ్యపరమైన మద్దతు, ఆరోగ్య రక్షణ రంగంలో తీసుకున్న చర్యల వ్యయం కారణంగా ద్రవ్య లోటు, ప్రభుత్వ రుణం వంటి 2020-21లో పెరిగాయి. అయితే, 2021-22వ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ప్రభుత్వ ఆదాయం బలమైన స్థాయిలో కోలుకోగలిగింది. 2021వ సంవత్సరం ఏప్రిల్-నవంబరు కాలంలో కేంద్ర ప్రభుత్వపు రెవిన్యూ వసూళ్లు 67.2శాతం మేర పెరిగాయి. 2021-22వ సంవత్సరపు బడ్జెట్ అంచనాల ప్రకారం  ఈ వసూళ్ళలో 9.6శాతం వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు ఊపందుకున్న దశలో ఉన్నాయి. అలాగే, నెలసరి వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.)వసూళ్లు 2021 జూలై నెలనుంచి ఇప్పటి వరకూ లక్షకోట్ల రూపాయల స్థాయిని అధిగమించాయి.

 

రెవిన్యూ వసూళ్లను సుస్థిరం చేస్తూ, వ్యయంపై ఒక లక్ష్యంతో కూడిన విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తున్నందున 2021 ఏప్రిల్-నవంబరునెలల మధ్య ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల్లో 46.2శాతానికి నియంత్రించడం సాధ్యమైంది. అంతకు ముందు రెండు సంవత్సరాల్లో ఇదే కాలంలో నమోదైన ద్రవ్య లోటుతో పోల్చితే ఇది మూడింట ఒక వంతు ఉంటుంది. (2020 సంవత్సరం ఏప్రిల్-నవంబరు నెలల మధ్య కాలంలో బడ్జెట్ అంచనాల్లో 135.1శాతంగా, 2019వ సంవత్సరపు ఏప్రిల్-నవంబరు నెలల మధ్యకాలంలో బడ్జెట్ అంచనాలో 114.8శాతంగా ద్రవ్యలోటు రికార్డయింది.)

సంక్షోభ కాలంలో ఆర్థిక రంగంపై ఎప్పటికీ ఒత్తిడికి అవకాశం ఉంటుందని ఆర్థిక సర్వే తెలిపింది. అయితే,..భారతదేశపు పెట్టుబడి మార్కెట్ మాత్రం ఎంతో అద్భుతమైన పనితీరును ప్రదర్శించిందని, ఇండియన్ కంపెనీల రిస్క్ క్యాపిటల్ సమీకరణ రికార్డు స్థాయిలో జరిగిందని ఆర్థిక సర్వే తెలిపింది. 2021వ సంవత్సరం అక్టోబరు 18న సెన్సెక్స్ సూచీ అత్యధికంగా 61,766పాయింట్ల స్థాయికి, నిప్టీ సూచీ 18,477పాయింట్ల స్థాయికి పెరుగుదలను నమోదు చేసింది. 2021వ సంవత్సరం ఏప్రిల్-నవంబరు మధ్యకాలంలో  75 ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐ.పి.ఒ.) ద్వారా  రూ. 89,066కోట్ల మేర పెట్టుబడులు సమకూరాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ ఇంత భారీగా పెట్టుబడులు సమకూరలేదు. దీనికి తోడుగా, బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా చక్కని పెట్టబుడుల మద్దతు లభించింది. నిరర్థక ఆస్తులు (ఎన్.పి.ఎ.) కూడా నిర్మాణపరంగా బాగా తగ్గాయి. షెడ్యూల్డ్ వాణీజ్య బ్యాంకులకు సంబంధించిన గ్రాస్ నాన్ ఫర్ఫార్మింగ్ అడ్వాన్సుల (జి.ఎన్.పి.ఎ.) నిష్పత్తి, నెట్ నాన్-ఫర్ఫార్మింగ్ అడ్వాన్సుల (ఎన్.ఎన్.పి.ఎ.) నిష్పత్తిలో కూడా 2018-19లో తగ్గుదల కొనసాగంది.  2020వ సంవత్సరం సెప్టెంబరు నెలాఖరుకు 7.5శాతంగా ఉన్నషెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల జి.ఎన్.పి.ఎ. నిష్పత్తి 2021వ సంవత్సరం సెప్టెంబరు నెలాఖరుకకల్లా 6.9శాతానికి తగ్గింది.

 

గిరాకీకి తగినట్టుగా చర్యల చేపట్టడం కంటే, సరఫరా రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం భారతీయ ఆర్థిక ప్రతిస్పందనా విధానంలో విశిష్టమైన పరిణామమని ఆర్థిక సర్వే తెలిపింది. అనేక రంగాలకు నియంత్రణలు, నిబంధనలనుంచి విముక్తి కల్పించడం, వివిధ ప్రక్రియలను సరళీకరించడం, ‘గతించినకాలానికి పన్ను విధించే పద్ధతిని’ తొలగించడం, ప్రైవేటీకరణ చేపట్టడం, ఉత్పాదనతో అనుసంధానించిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలతో ప్రభుత్వ తన ఆర్థిక విధానం అమలు చేసిందని సర్వే తెలిపింది.

 భారతీయ సరఫరా వ్యవస్థకు సంబంధించిన వ్యూహంలో రెండు ఉమ్మడి అంశాలకు చోటిచ్చారు.: (1) కోవిడ్ అనంతరం ప్రపంచంలోని అనూహ్యమైన దీర్ఘకాలిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంస్కరణలు చేపట్టి, సడలింపులను మరింత మెరుగుపరచడం. మార్కెట్ సంస్కరణలు, అంతరిక్షం, డ్రోన్లు, జియోస్పేసియల్ మ్యాపింగ్, ట్రేడ్ ఫైన్స్ ఫ్యాక్టరింగ్ వంటి రంగాలపై నియంత్రణలన రద్దు; ప్రభుత్వ సేకరణ, టెలికమ్యూనికేష్లు, గత కాలానికి పన్ను విధింపు, ప్రైవేటీకరణ, ఆస్తులను నగదుగా మార్చుకోవడం, భౌతిక మౌలక సదుపాయాల కల్పన వంటి ప్రక్రియల సంస్కరణలు వంటి చర్యలు తీసుకోవడం.  (2)  భారతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా సంస్కరణలు చేపట్టడం మరో అంశం. వాతావరణ, పర్యావరణ సంబంధిత విధానాలు; పేదలకోసం కుళాయిల ద్వారా నీటి సరఫరా, మరుగుదొడ్లు, మౌలిక గృహవసతి, బీమా, వంటి సామాజిక మౌలిక సదుపాయాలు తదితర అంశాలు ఈ పరిధిలోకి వస్తాయి.; ఆత్మనిర్భర భారత్ పథకంకింద కీలకమైన పరిశ్రమలకు మద్దతు అందించడం; విదేశీ వాణిజ్య ఒప్పందాల్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అనుసరించడం వంటివి కూడా ఈ పరిధిలోకి వస్తాయి.

తాజా ఆర్థిక సర్వే సందర్భంగా ‘ప్రక్రియల్లో చేపట్టే సంస్కరణల’పై కూడా ముఖ్యంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా నియంత్రణల తొలగింపు, ప్రక్రియల్లో సంస్కరణలు అన్న రెండు అంశాల తేడాను గుర్తించడం చాలా అవసరం. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రభుత్వ పాత్రను తగ్గించడం, లేదా తొలగించడాన్నే నియంత్రణల తొలగింపుగా పరిగణిస్తారు. ప్రక్రియల్లో సంస్కరణ అంటే, సదుపాయాల కల్పనా వ్యవస్థగా ఉన్న ప్రభుత్వ పాత్రను మరింత సులభతరం చేస్తూ  ప్రక్రియను సరళీకరించడమే ప్రక్రియల సంస్కరణగా పరిగణిస్తారు.

కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా గత రెండేళ్లూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలంగా పరిణమించిందని ఆర్థిక సర్వే పేర్కొంది. పదేపదే వైరస్ దాడి చేయడం, సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం, ఇటీవలి కాలంలో ప్రపంచ ద్రవ్యోల్బణం ఏర్పడటం వంటి పరిణామాలు విధాన నిర్ణాయక ప్రక్రియకు సవాళ్లుగా నిలిచాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం ‘బార్.బెల్ వ్యూహం’ చేపట్టింది. ఈ వ్యూహంలో భాగంగా సమాజంలో దెబ్బతినేందుకు ఆస్కారం ఉన్న వర్గాలకు, అలాగే వాణిజ్య రంగానికి రక్షణ కల్పించే ఒక ఉమ్మడి వ్యవస్థను ప్రభుత్వం చేపట్టింది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల వ్యయాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంది. గిరాకీ తగినట్టుగా సరఫరా వ్యవస్థ బలోపేతమయ్యేలా, ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక విస్తరణకు దోహదపడేలా చర్యలు తీసుకుంది.

 ప్రగతి సాధనకు అండగా నిలిచే రక్షణాత్మక ద్రవ్య విధానాన్ని కోవిడ్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటినుంచి అమలులోకి తెచ్చినట్టు ఆర్థిక సర్వే తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు, అనుసంధానం కల్పించేలా ప్రభుత్వం తరఫునుంచి పూచీ ఇవ్వడం, ప్రత్యేకించి సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థలకు (ఎం.ఎస్.ఎం.ఇ.లకు) అండగా నిలవడం ఈ రక్షణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. గత రెండేళ్లలో పరిశ్రమలు, సేవలకు, ప్రపంచ పరిణామాలు, స్థూల స్థిరత్వ సూచికలు తదితర కార్యకలాపాలకు ప్రాతినిధ్యం వహించే హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్.కు ప్రభుత్వం ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ, ప్రైవేటు వనరుల ద్వారా ఈ వెసులుబాటు కల్పించారు. దీనితో సంప్రదాయ పద్ధతికి, ఆనవాయితీకి భిన్నంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విధాన నిర్ణయకర్తలు ప్రతిస్పందించేందుకు అవకాశం ఏర్పడింది.

 చివరగా,.. మొత్తంగా స్థూల ఆర్థిక స్థిరత్వ సూచికలపై ఆర్థిక సర్వే ఎంతో ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సూచికల ప్రకారం,.. 2022-23వ సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే స్థితికి భారతీయ ఆర్థిక వ్యవస్థ చేరుకున్నట్టుగా సర్వే తెలిపింది. ప్రస్తుత పరిస్థితులకు విభిన్నమైన ప్రతిస్పందనతో కూడిన వ్యూహం అనుసరించినందునే ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన స్థితిలో ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.

 

****


(Release ID: 1793887) Visitor Counter : 1716