ఆర్థిక మంత్రిత్వ శాఖ
వాస్తవానికి దగ్గరగా 2021-22 ఆర్థిక సర్వే రూపకల్పన
స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత జరిగిన అన్ని ఆర్థిక సర్వేలను ప్రస్తుత సర్వే పీఠికలో ప్రస్తావన
వివిధ ఆర్థిక అంశాల విశ్లేషణకు ఉపగ్రహ, జియో స్పెసియల్ చిత్రాల వినియోగంపై నూతన అధ్యాయం
గణాంక అనుబంధంతో ఒకే వాల్యూమ్ తో ఆర్థిక సర్వే నివేదిక రూపకల్పన
Posted On:
31 JAN 2022 3:10PM by PIB Hyderabad
కోవిడ్-19 రూపంలో ఎదురైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు అనుసరించిన చురుకైన వ్యూహం స్ఫూర్తిగా ఈ ఏడాది ఆర్థిక సర్వే చేపట్టి నివేదికను రూపొందించారు. వివిధ వర్గాల నుంచి అందిన సూచనలు, సలహాలు, వాస్తవ పరిస్థితి అంచనా, ప్రతిస్పందన, భద్రత లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నివేదికను రూపొందించడం జరిగింది.
2021-22 ఆర్థిక సర్వే ను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆధునిక విధానాల్లో సమాచారం అందుబాటులో ఉన్న సమయంలో అసంబద్ధతకు తావులేని రీతిలో వాస్తవానికి దగ్గరగా ఉండే విధానాలను రూపొందించి నిరంతర పర్యవేక్షణతో వాటిని అమలు చేసేందుకు అవకాశం ఉందని శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ వసూళ్లు, డిజిటల్ చెల్లింపులు, ఉపగ్రహ చిత్రాలు, విద్యుత్ ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలు, స్వదేశీ/విదేశీ వాణిజ్యం, మౌలిక సదుపాయాల కల్పన, వివిధ పథకాలు అమలు జరుగుతున్న తీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక సర్వే జరుగుతుంది. వీటికి సంబంధించిన సమాచారం ప్రజా వేదికల్లో అందుబాటులో ఉంటాయి. అయితే, ఇటీవల కాలంలో ప్రైవేటు రంగంలో వినూత్న రీతిలో సేకరిస్తున్న సమాచారం అందుబాటులోకి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఊహాజనిత విధానాలతో కాకుండా వాస్తవ పరిస్థితులకు అనువైన స్వల్ప కాలిక విధానాలను రూపొందించి అమలు చేసేందుకు అవకాశం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది.
వ్యవస్థలో ప్రణాళిక అనేది కీలక అంశంగా ఉంటుంది. అయితే, పరిస్థితులు ఫలానా విధంగా ఉంటాయి అన్న నిర్ణయానికి రాకుండా పరిస్థితులను విశ్లేషించి, ప్రభావితమయ్యే రంగాలను గుర్తించి వీటికి అనుగుణంగా విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. గతంలో రూపొందించిన ఆర్థిక సర్వే నివేదికల్లో ఈ అంశాలను ప్రస్తావించడం జరిగింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సర్వేను ఈ అంశాల ప్రాతిపదికగా రూపొందించారు.
తీవ్ర అనిశ్చిత పరిస్థితుల్లో విధానాల రూపకల్పన అంశానికి ప్రస్తుత ఆర్థిక సర్వేలో అత్యధిక ప్రాధాన్యత లభించింది. కోవిడ్-19 రూపంలో ప్రస్తుతం ఎదురవుతున్న, భవిష్యత్తులో ఎదురయ్యే అవాంతరాల వల్ల సాంకేతిక రంగం, వినియోగదారుల అవసరాలు, సరఫరా వ్యవస్థ, భౌగొళిక రాజకీయాలతో పాటు వాతావరణ మార్పులు తదితర అంశాలు విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీటిలో వ్యక్తిగత అంశాలు ఏవిధంగా ఉంటాయన్న అంశం ముందుగానే ఊహించేందుకు అవకాశం ఉండదు. ఇతర అంశాలపై కూడా ఊహాజనిత నిర్ణయాలను తీసుకునేందుకు అవకాశం ఉండదు. దీర్ఘ కాలం అమలు జరిగే సరఫరా రంగంలో కూడా ఈ అనిశ్చితి ప్రభావం ఉంటుంది. వినూత్న ఆవిష్కరణలు, వ్యవస్థాపకత అంశాలకు అనుగుణంగా ఒకవైపు నిర్ణయాలు తీసుకుంటూ మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక భద్రత, స్థూల-ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడి పెట్టే అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంటుంది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అనిశ్చిత నుంచి రక్షణ కలిగి, పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ప్రయోజనం పొందే విధంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. సడలింపులు , సరళీకృత విధానం , ప్రైవేటీకరణ, విదేశీ మారక ద్రవ్య నిల్వలు చేరడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం ,అందరికీ గృహ వసతి , గ్రీన్ టెక్నాలజీ, దివాలా మరియు దివాలా నియమావళి , పేదలకు ఆరోగ్య బీమా, ఆర్థిక చేరిక, మౌలిక సదుపాయాల కల్పనకు చేస్తున్న వ్యయం, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ లాంటి ఒకదానితో ఒకటి సంబంధం లేని అంశాలను ప్రజలు గుర్తించి వీటివల్ల కలుగుతున్న ప్రయోజనాలను గుర్తించాలని నివేదికలో సూచించారు.
1950-51 నుంచి ఇంతవరకు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేల పరిమాణ క్రమాన్ని సర్వే పీఠికలో ప్రస్తావించారు. సర్వే ఉపయోగించిన భాష, గణాంకాలు, అంశాలు, పరిధి, విధానాలు తదితర అంశాలను పీఠికలో ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, 1వ సర్వే తర్వాత ఒక దశాబ్దానికి పైగా సర్వే నివేదికను కేంద్ర బడ్జెట్‌తో కలిపి సమర్పించడం జరిగింది.
నివేదిక సమగ్రంగా, క్లుప్తంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రస్తుత నివేదికను ఒక వాల్యూం గా రూపొందించారు. ఇదివరకు దీనిని రెండు భాగాలతో రూపొందించేవారు. ఇటీవల కాలంలో నివేదికలో పొందుపరుస్తున్న అంశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనితో గత ఏడాది రూపొందించి 2020-21 ఆర్ధిక సర్వే 900 పేజీల వరకు ఉంది. దీనితో ఈ ఏడాది నివేదికను ఒక్క భాగంగా రూపొందించారు. దీనికి గణాంక సమాచార వివరాలను అనుబంధంగా పొందుపరిచారు. గణాంక వివరాలను విడిగా ఒక ప్రత్యేక భాగంగా రూపొందించడం వల్ల ప్రామాణికమైన వివరాలను విశ్లేషించడానికి వీలవుతుంది.
ఫీడ్‌బ్యాక్ లూప్ విధానానికి ప్రాధాన్యతనిస్తూ తాజా సామాజిక-ఆర్థిక సమాచారం అందుబాటులోకి వచ్చే విధంగా రానున్న సంవత్సరాల్లో సర్వే నివేదిక రూపొందుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రంగాల అధ్యాయాలతో పాటు,ఈ సంవత్సరం సర్వే నివేదికలో మరో అధ్యాయాన్ని జోడించారు. దీనిలో ఉపగ్రహ మరియు భౌగోళిక చిత్రాల ఆధారంగా పట్టణీకరణ, మౌలిక సదుపాయాలు, పర్యావరణ ప్రభావం, వ్యవసాయ పద్ధతులు లాంటి వివిధ ఆర్థిక అంశాలను అంచనా వేసి రూపొందించిన అంశాలను పొందుపరిచారు.
***
(Release ID: 1793878)
Visitor Counter : 529