ప్రధాన మంత్రి కార్యాలయం
మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ.. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ సంయుక్తంగా ప్రారంభోత్సవం; మారిషస్‌లో సివిల్ సర్వీస్ కాలేజీతోపాటు 8 మెగావాట్ల సోలార్ ‘పివి’ ఫార్మ్ ప్రాజెక్టుకు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన
Posted On:
20 JAN 2022 6:48PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్నాథ్ ఇవాళ మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను సంయుక్తంగా ప్రారంభించారు. భారత-మారిషస్ దేశాల మధ్య ఉజ్వల భాగస్వామ్యంలో భాగంగా ఈ పథకం రూపుదాల్చింది. ఇదే సందర్భంగా అత్యాధునిక ‘సివిల్ సర్వీస్ కాలేజీ, 8 మెగావాట్ల సౌరశక్తి ‘పివి’ ఫార్మ్’ ప్రాజెక్టులకు ప్రధానమంత్రులిద్దరూ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన చేశారు. ఈ రెండింటినీ కూడా భారత మద్దతుతోనే నిర్మిస్తుండటం గమనార్హం. కాగా, ఇవాళ్టి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మారిషస్ ప్రధానమంత్రి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ దేశ మంత్రిమండలి సభ్యులు, ఇతర ప్రముఖులు, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ- భారతదేశం ప్రగతికి సాయపడటం వెనుకగల దార్శనికతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ మేరకు మిత్రదేశాల అవసరాలు, ప్రాథమ్యాలు, సార్వభౌమాధికారంపై పరస్పర గౌరవం, ప్రజా శ్రేయస్సు మెరుగుదల, దేశ సామర్థ్యాల వికాసం తదితరాలకు ప్రాముఖ్యం ఇస్తున్నామని వివరించారు. దేశ నిర్మాణంలో సివిల్ సర్వీస్ కాలేజ్ ప్రాజెక్ట్ ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి విశదీకరించారు. ‘మిషన్ కర్మయోగి’ కింద అనుభవాలను పంచుకుందామని ప్రతిపాదించారు. లోగడ 2018 అక్టోబరులో నిర్వహించిన అంతర్జాతీయ సౌరశక్తి కూటమి (ఐఎస్‌ఏ) తొలి మహాసభలో తాను సభ్యదేశాల ముందుంచిన “ఒకే సూర్యుడు-ఒకే ప్రపంచం-ఒకే గ్రిడ్” (ఓఎస్‌ఓడబ్ల్యూఓజీ) వినూత్న ప్రతిపాదనను ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మారిషస్‌లో ఏర్పాటు కాబోయే 8 మెగావాట్ల సౌరశక్తి ‘పివి’ ఫార్మ్ ప్రాజెక్టు దేశంలో 13,000 టన్నుల కర్బన ఉద్గారాలను నిరోధించడం ద్వారా వాతావరణ మార్పు సవాళ్లను తగ్గించడంలో తోడ్పడగలదన్నారు.
మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ ప్రసంగిస్తూ- తమ దేశానికి ఆర్థిక సహాయంతోపాటు ఇతరత్రా విస్తృత తోడ్పాటు ఇస్తున్న భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వాతన భారత-మారిషస్ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయని ఆయన కొనియాడారు.
మారిషస్ ప్రభుత్వం తమ దేశంలో చేపట్టేందుకు ప్రతిపాదించిన ఐదు ప్రాధాన్య ప్రాజెక్టులుసహా ఇతరత్రా పథకాల అమలుకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ (ఎస్‌ఈపీ) కింద భారత ప్రభుత్వం 2016 మే నెలలో 353 మిలియన్ అమెరికా డాలర్ల గ్రాంటును మంజూరు చేసింది. ఈ పథకాల్లో- మెట్రో ఎక్స్ ప్రెస్ ప్రాజెక్ట్, సుప్రీం కోర్టు భవనం, కొత్త ‘ఈఎన్‌టీ’ ఆస్పత్రి, ప్రాథమిక పాఠశాల పిల్లలకు డిజిటల్ టాబ్లెట్ కంప్యూటర్ల సరఫరా, సామాజిక గృహనిర్మాణం పథం తదితరాలున్నాయి. కాగా, ఇవాళ సామాజిక గృహనిర్మాణ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో ‘ఎస్‌ఈపీ' కిందగల అన్ని ప్రధాన పథకాలు పూర్తయ్యాయి.
మారిషస్‌లోని రెడ్యూట్‌లో నిర్మిస్తున్న సివిల్ సర్వీస్ కాలేజీ నిర్మాణానికి 2017నాటి అవగాహన ఒప్పందం కింద ప్రధాని ప్రవింద్ జుగ్నాత్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో 4.74 మిలియన్ అమెరికా డాలర్ల గ్రాంటు ఇవ్వబడింది. ఈ కాలేజీ నిర్మాణం పూర్తయితే మారిషస్ సివిల్ సర్వీసు అధికారుల కోసం పూర్తిస్థాయి సదుపాయాలతో పనిచేసే సౌకర్యం సమకూరుతుంది. తద్వారా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అలాగే దీనివల్ల భారతదేశంతో సంస్థాగత సంబంధాలు విస్తరిస్తాయి. ఇక 8 మెగావాట్ల సౌరశక్తి ‘పివి’ ఫార్మ్ ప్రాజెక్టు కింద 25,000 ‘పివి’ సెల్స్ అమర్చడంద్వారా ఏటా 14 గిగావాట్ అవర్ సామర్థ్యంతో హరిత విద్యుదుత్పాదన సాధ్యమవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే మారిషస్‌లో దాదాపు 10,000 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే వీలుంటుంది. దీంతో ఏటా 13,000 టన్నుల కర్బన ఉద్గారాల నిరోధంద్వారా మారిషస్ వాతావరణ మార్పు సవాళ్లను అధిగమించగలదు.
ఇవాళ్టి కార్యక్రమాల్లో రెండు కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. ఈ మేరకు మెట్రో ఎక్స్ ప్రెస్, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మరో అవగాహన ఒప్పందం కింద చిన్న అభివృద్ధి పథకాల కోసం మారిషస్ ప్రభుత్వానికి 190 మిలియన్ అమెరికా డాలర్ల దశలవారీ రుణాన్ని భారత ప్రభుత్వం అందిస్తుంది.
కోవిడ్-19 వల్ల సవాళ్లు ఎదురైనప్పటికీ భారత-మారిషస్ అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్టులు వేగంగా ముందడుగు వేశాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, ప్రధాని జుగ్నాథ్‌లు 2019లో సంయుక్తంగా మెట్రో ఎక్స్ ప్రెస్ ప్రాజెక్ట్, మారిషస్‌లోని కొత్త ‘ఈఎన్‌టీ' ఆస్పత్రిని వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ప్రారంభించారు. అలాగే 2020 జూలైలో మారిషస్‌లోని కొత్త సుప్రీం కోర్టు భవనం కూడా వారిద్దరి చేతులమీదుగానే ప్రారంభమైంది.
భారత్-మారిషస్ దేశాలు ఉమ్మడి చరిత్ర, పూర్వికత, సంస్కృతి, భాషాపరమైన సన్నిహిత సంబంధాలను పంచుకుంటున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి మారిషస్ కీలక అభివృద్ధి భాగస్వామి కాగా, రెండు దేశాల మధ్యగల విశేష అభివృద్ధి భాగస్వామ్యంలో ఇది ప్రతిఫలిస్తుంది. ఇవాళ్టి కార్యక్రమంతో ఈ విజయవంతమైన, కాలపరీక్షకు నిలిచిన భాగస్వామ్యం ‘సబ్కా సాత్-సబ్కా వికాస్-సబ్కా విశ్వాస్-సబ్కా ప్రయాస్’ స్ఫూర్తికి అనుగుణంగా మరో మైలురాయిని అధిగమించింది.
***
(Release ID: 1791341)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam