ప్రధాన మంత్రి కార్యాలయం

అంకుర సంస్థలతో ప్రధానమంత్రి చర్చాగోష్ఠి ఆరు ఇతివృత్తాలపై అంకుర సంస్థల వివరణాత్మక ప్రదర్శన;


“దేశంలో మూలమూలకూ అంకుర సంస్థల సంస్కృతి విస్తరణ దిశగా ఏటా
జనవరి 16న ‘జాతీయ అంకుర సంస్థల దినోత్సవం’ నిర్వహణకు నిర్ణయం”;

“ప్రభుత్వ కృషిలోని మూడు అంశాలు: మొదటిది… ప్రభుత్వ ప్రక్రియలు-

అధికార ఒంటెద్దు పోకడల నుంచి వ్యవస్థాపన-ఆవిష్కరణలకు విముక్తి;

రెండోది… ఆవిష్కరణల ప్రోత్సాహానికి వ్యవస్థాగత యంత్రాంగం సృష్టి;

మూడోది… యువ ఆవిష్కర్తలు-తరుణ దశ సంస్థలకు చేయూత”;

“మన అంకుర సంస్థలు వ్యవస్థకు కొత్తరూపు దిద్దుతున్నాయి…
అందుకే నవ భారతానికి అవి వెన్నెముక కాగలవని నా విశ్వాసం”;

“దేశంలో నిరుడు 42 కొత్త ‘యూనికార్న్‌’లు ఏర్పడ్డాయి… రూ.వేలకోట్ల విలువైన ఈ సంస్థలు భారత్‌ స్వావలంబన-ఆత్మవిశ్వాసాలకు సిసలైన నిదర్శనాలు”;

“యూనికార్న్‌ల సంఖ్య వందకు చేరేదిశగా దేశం వేగంగా పయనిస్తోంది…
భారత అంకుర సంస్థల స్వర్ణయుగం ఇక మొదలవుతోందని నా నమ్మకం”;

“మీ స్వప్నాలను కేవలం దేశానికి పరిమితం చేయకండి..
ప్రపంచవ్యాప్తం చేయాలనే తారకమంత్రాన్ని గుర్తుంచుకోండి”

Posted On: 15 JAN 2022 1:24PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అంకుర సంస్థలతో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా అంకుర సంస్థల వ్యవస్థాపకులు- “మూలాల నుంచి ఎదగడం; డీఎన్‌ఏకి కదలిక, జాతీయం నుంచి అంతర్జాతీయం వైపు; భవిష్యత్‌ సాంకేతికత; తయారీ రంగంలో విజేతల సృష్టి; సుస్థిర అభివృద్ధి” అనే ఆరు ఇతివృత్తాలపై  వివరణాత్మక ప్రదర్శనలిచ్చారు. ఈ ప్రదర్శనలివ్వడం కోసం 150కి మించిన అంకుర సంస్థలను ఆరు కార్యాచరణ బృందాలుగా విభజించారు. ప్రతి ఇతివృత్తం కింద రెండు అంకుర సంస్థల వంతున వాటి ప్రతినిధులు ప్రదర్శన ఇవ్వగా నిర్దిష్ట ఇతివృత్తం కోసం ఎంపికైన అంకుర సంస్థలన్నిటి తరఫునా ఆ ప్రతినిధులే మాట్లాడారు.

   ప్రదర్శనల ద్వారా తమ ఆలోచనలను పంచుకోగల ఇలాంటి వేదికను ఏర్పాటు చేయడంపై అంకుర సంస్థల ప్రతినిధులు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అంకుర పర్యావరణ వ్యవస్థపై ఆయన దార్శనికతను తమకిస్తున్న మద్దతును కొనియాడారు. వ్యవసాయ రంగ సమాచార సత్వర సేకరణ యంత్రాంగంసహా వివిధ రంగాలకు సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను ప్రధానితో పంచుకున్నారు. భారత్‌ను వ్యవసాయ-వాణిజ్య కూడలిగా రూపుదిద్దడం; సాంకేతికత వినియోగంతో ఆరోగ్య సంరక్షణ రంగానికి ఊపు; మానసిక ఆరోగ్య సమస్య పరిష్కారం; వర్చువల్‌ పర్యటన వంటి వినూత్న ప్రయత్నాలతో ప్రయాణ-పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, విద్యా-సాంకేతిక-ఉపాధి గుర్తింపు; అంతరిక్ష రంగం; డిజిటల్‌ వ్యాపారంతో ఆఫ్‌లైన్‌ చిల్లర వర్తకం అనుసంధానం; తయారీ సామర్థ్యం పెంపు; రక్షణ ఎగుమతులు; సుస్థిర-హరిత ఉత్పత్తులు, రవాణా సదుపాయాలు వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ, శ్రీ అశ్వనీ వైష్ణవ్‌, శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ పర్షోత్తమ్ రూపాలా, శ్రీ జి.కిషన్ రెడ్డి, శ్రీ పశుపతి కుమార్ పరాస్, డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ సోమ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

   ప్రదర్శనల అనంతర ప్రధానమంత్రి మాట్లాడుతూ-‘స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నేపథ్యంలో ‘అంకుర భారతం ఆవిష్కరణ వారోత్సవం’ నిర్వహణకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. భారత స్వాతంత్ర్యం శతాబ్దివైపు దేశం పయనిస్తున్న నేపథ్యంలో అంకుర సంస్థల పాత్ర అత్యంత కీలకం కానుండటమే ఇందుకు కారణమన్నారు. “అంకుర సంస్థల ప్రపంచంలో భారత పతాకను రెపరెపలాడిస్తున్న దేశంలోని అన్ని అంకుర సంస్థలతోపాటు యువ ఆవిష్కర్తలందరికీ నా అభినందనలు. దేశంలో మూలమూలకూ అంకుర సంస్థల సంస్కృతి విస్తరణ దిశగా ఏటా జనవరి 16న జాతీయ అంకుర సంస్థల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించాం” అని ప్రధాని ప్రకటించారు.

   ప్రస్తుత దశాబ్దాన్ని ‘భారత సాంకేతికాబ్దం’ (టెకేడ్‌)గా ప్రకటించడం వెనుకగల భావనను ప్రధాని గుర్తుచేశారు. దేశంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపన, అంకుర సంస్థల పర్యావరణం బలోపేతం దిశగా ఈ దశాబ్దంలో ప్రభుత్వం భారీ మార్పులు తలపెట్టడంలోని మూడు ముఖ్యమైన అంశాలను ఆయన వివరించారు. ఇందులో మొదటిది… ప్రభుత్వ ప్రక్రియలు-అధికార ఒంటెద్దు పోకడల నుంచి వ్యవస్థాపన-ఆవిష్కరణలకు విముక్తి కాగా, రెండోది… ఆవిష్కరణల ప్రోత్సాహానికి వ్యవస్థాగత యంత్రాంగం సృష్టి; మూడోది… యువ ఆవిష్కర్తలు-తరుణ దశలోగల సంస్థలకు చేయూతనివ్వడమని ఆయన విశదీకరించారు. ‘అంకుర భారతం’ (స్టార్టప్‌ ఇండియా), ‘అచంచల భారతం’ (స్టాండప్‌ ఇండియా) కార్యక్రమాలు ఈ కృషిలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘ఏంజెల్‌ టాక్స్‌’ సమస్యల తొలగింపు, పన్ను విధానాల సరళీకరణ, ప్రభుత్వ ఆర్థిక సహాయం లభ్యత, 9 కార్మిక-3 పర్యావరణ చట్టాలకు సంబంధించి స్వీయ ధ్రువీకరణకు అనుమతిసహా 25వేల చట్ట సంబంధిత కట్టుబాట్ల రద్దు తదితరాలు ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాయని చెప్పారు. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ వేదిక (జీఈఎం)ద్వారా ప్రభుత్వానికి అంకుర సేవలు అందించేందుకు ‘స్టార్టప్‌ రన్‌వే’ వీలు కల్పిస్తున్నదని తెలిపారు.

   విద్యార్థులను బాల్యంనుంచే ఆవిష్కరణల వైపు ఆకర్షించడంద్వారా దేశంలో ఆవిష్కరణ సంస్కృతిని సంస్థాగతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ప్రధానమంత్రి వివరించారు. ఆ మేరకు పాఠశాలల్లోనే ఆవిష్కరణలతోపాటు కొత్త ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9,000 ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌’ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు. డ్రోన్ల సంబంధిత కొత్త నిబంధనలు లేదా కొత్త అంతరిక్ష విధానం వంటివాటిలో వీలైనంత ఎక్కువ సంఖ్యలో యువతకు ఆవిష్కరణ అవకాశాలు ఇవ్వడమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. అంతేకాకుండా ఐపీఆర్‌ రిజిస్ట్రేషన్‌ సంబంధిత నిబంధలను కూడా తమ ప్రభుత్వం సరళీకరించిందని ఆయన వెల్లడించారు.

   విష్కరణ సూచీలలో విశేషంగా పెరుగదల నమోదవడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు 2013-14లో 4,000 పేటెంట్లకు ఆమోదం లభించగా, గత సంవత్సరం 28,000కుపైగా పేటెంట్లు మంజూరైనట్లు ఆయన వివరించారు. అదేవిధంగా 2013-14లో 70,000 ట్రేడ్‌మార్కులు నమోదు కాగా, 2020-21లో ఏకంగా 2.5 లక్షల ట్రేడ్‌ మార్కులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే 2013-14లో కేవలం 4,000 కాపీరైట్లు నమోదైతే, నిరుడు ఈ సంఖ్య 16,000 దాటిందని వెల్లడించారు. ఆవిష్కరణలపై ప్రభుత్వ ముమ్మర కృషి ఫలితంగా అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో 81గా ఉన్న భారత్‌ ర్యాంకు నేడు మెరుగుపడి 46వ స్థానానికి దూసుకెళ్లడం గమనార్హమని ప్రధాని గుర్తుచేశారు.

   భారతదేశంలోని అంకుర సంస్థలు నేడు 55 వేర్వేరు పరిశ్రమలతో కలసి పనిచేస్తున్నాయని శ్రీ మోదీ చెప్పారు. అంతేకాకుండా ఐదేళ్ల కిందట 500కన్నా తక్కువగా ఉన్న అంకుర సంస్థల సంఖ్య ఇవాళ 60,000 దాటిందని వెల్లడించారు. ఈ మేరకు “మన అంకుర సంస్థలు వ్యవస్థకు కొత్తరూపు దిద్దుతున్నాయి. అందుకే నవ భారతానికి అవి వెన్నెముక కాగలవని నేను విశ్వసిస్తున్నాను” అని ప్రధానమంత్రి ధీమాగా ప్రకటించారు. దేశంలో నిరుడు 42 కొత్త ‘యూనికార్న్’లు ఏర్పడ్డాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ కంపెనీలు రూ.వేలకోట్ల విలువైనవని, స్వావలంబిత-ఆత్మ విశ్వాసపూరిత భారతానికి ఇవి సిసలైన నిదర్శనాలని చెప్పారు. “ఇవాళ యూనికార్న్‌ సంస్థల సంఖ్య వందకు చేరేదిశగా దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. భారత అంకుర సంస్థల స్వర్ణయుగానికి ఇది నాంది కాగలదని నా నమ్మకం” అన్నారు.

   భివృద్ధి, ప్రాంతీయ-లింగపరమైన అసమానత సమస్యల పరిష్కారంలో వ్యవస్థాపకత ద్వారా లభించే సాధికారత కీలకపాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. నేడు దేశంలోని 625 జిల్లాల్లో కనీసం ఒకటి వంతున అంకుర సంస్థలు ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిలో సగానికిపైగా సంస్థలు 2వ, 3వ అంచెల్లోని నగరాలలో ఉన్నవేనని పేర్కొన్నారు. ఇవి సామాన్య పేద కుటుంబాల ఆలోచనలను వ్యాపారాలుగా మలుస్తుండగా లక్షలాది యువతకు ఉపాధి లభిస్తున్నదని వివరించారు. భారత్‌కుగల అంతర్జాతీయ ప్రతిష్టకు కీలకమైన శక్తి, పునాది మన దేశపు వైవిధ్యమేనని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత యూనికార్న్‌, అంకుర సంస్థలే ఈ వైవిధ్య సందేశానికి దూతలని ఆయన పేర్కొన్నారు. అంకుర సంస్థలు భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు సులభంగా విస్తరించగలవని ప్రధానమంత్రి అన్నారు. కాబట్టి “మీ స్వప్నాలను దేశానికి మాత్రమే పరిమితం చేయకండి.. ‘దేశం కోసం ఆవిష్కరణలు-దేశం నుంచే ఆవిష్కరణలు’ అనే తారకమంత్రాన్ని గుర్తుంచుకోండి” అని ఆవిష్కర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

   అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ కీలకపాత్ర పోషించగల అనేక రంగాలను ప్రధానమంత్రి సూచించారు. ఈ మేరకు జాతీయ బృహత్‌ ప్రణాళిక ‘ప్రధానమంత్రి గతిశక్తి’ కింద లభించే అదనపు స్థలాన్ని విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్ మౌలిక వసతుల కోసం వాడుకోవచ్చునని పేర్కొన్నారు. అలాగే రక్షణరంగ తయారీ, చిప్ తయారీ వంటి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. డ్రోన్ రంగం గురించి ప్రస్తావిస్తూ- దేశంలో కొత్త డ్రోన్ విధానం ప్రవేశపెట్టాక చాలామంది పెట్టుబడిదారులు డ్రోన్ అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని గుర్తుచేశారు. సదరు అంకుర సంస్థలకు భారత సైన్యం, నావికాదళం, వాయుసేన రూ.500 కోట్ల  విలువైన ఆర్డర్లు ఇచ్చాయని చెప్పారు. మరోవైపు పట్టణ ప్రణాళికల గురించి ప్రధాని వివరిస్తూ- ‘పని ప్రదేశానికి నడక’ భావనలు, ‘సమీకృత పారిశ్రామిక వాడలు’, అత్యాధునిక రవాణా’ తదితరాల్లోనూ అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ శతాబ్దారంభ యువత (మిలీనియల్స్‌) నేడు తమ కుటుంబాలకు సౌభాగ్య ప్రదాతలు మాత్రమేగాక దేశ స్వావలంబనకూ మూలస్తంభాలని ప్రధాని వ్యాఖ్యానించారు. “గ్రామీణ ఆర్థికం నుంచి పారిశ్రామికం 4.0’ వరకూ మన అవసరాలే కాకుండా మన సామర్థ్యం కూడా అపరిమితం. భవిష్యత్‌ సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధన, అభివృద్ధికి పెట్టుబడులే నేడు ప్రభుత్వ ప్రాథమ్యాలు” అని ఆయన స్పష్టం చేశారు.

   విష్యత్ అవకాశాలను ప్రస్తావిస్తూ- ప్రస్తుతం మన జనాభాలో సగం మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్నారని, అందువల్ల భవిష్యత్తు అవకాశాలు అపారమని ప్రధాని చెప్పారు. ఆ మేరకు గ్రామాల దిశగానూ విస్తరించాలని అంకుర సంస్థలకు ఆయన సూచించారు. “మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సంధానం లేదా భౌతిక సంధానం ఏదైనా కావచ్చు… గ్రామాల్లోనూ ఆకాంక్షలు పెరుగుతున్నాయి. గ్రామీణ, పాక్షిక-పట్టణ ప్రాంతాలు కొత్త విస్తరణ దశకోసం ఎదురుచూస్తున్నాయి” అని వివరించారు. ప్రస్తుతం నడుస్తున్నది నవ్యావిష్కరణల శకమని- ఆలోచనలు, పరిశ్రమలు, పెట్టుబడులు, వాటికి సంబంధించిన కార్మిక, పారిశ్రామిక, సంపద సృష్టి, ఉపాధి సృష్టి వగైరాలన్నీ భారతదేశానికే దక్కాలని ప్రధానమంత్రి అన్నారు. చివరగా “నేను మీ వెన్నంటే ఉంటాను… ప్రభుత్వం మీకు చేయూతనిస్తుంది… దేశమంతా మీకు అండగా నిలుస్తుంది.. ఇక ముందంజ వేయడమే తరువాయి” అని ఆయన ముగించారు.

***

DS/AK



(Release ID: 1790273) Visitor Counter : 432