సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
గర్భిణులు, దివ్యంగ ఉద్యోగులు కార్యాలయాలకు రానవసరం లేదు
పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నిర్ణయం
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటన
Posted On:
09 JAN 2022 2:46PM by PIB Hyderabad
విధుల నిర్వహణకు గర్భిణులు, దివ్యంగ ఉద్యోగులు కార్యాలయాలకు రానవసరం లేదని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రం, ప్రజా ఫిర్యాదులు,పెన్షన్లు, అణుశక్తి, పిఎంఓ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. అయితే, వారు ఇళ్ల నుంచి విధులను నిర్వర్తించవలసి ఉంటుందని మంత్రి వివరించారు. మహమ్మారి మూడవ దశ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి సిబ్బంది వ్యవహారాలు,శిక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు వివరించారు.
కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాల్లో నివసిస్తున్న అధికారులు, సిబ్బంది కి కూడా కార్యాలయాలకు రాకుండా మినహాయింపు ఇస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. కంటైన్‌మెంట్ జోన్‌ను డీనోటిఫై చేసేంత వరకు ఈ మినహాయింపు ఉంటుందని అన్నారు.
అండర్ సెక్రెటరీ స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భౌతిక హాజరు వాస్తవ సంఖ్యలో 50%కి పరిమితం చేస్తామని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. మిగిలిన 50% మంది ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహిస్తారని మంత్రి తెలియజేశారు.ఈ విధానాన్ని అమలు చేసేందుకు సంబంధిత అన్ని శాఖలు రోస్టర్‌ను సిద్ధం చేస్తాయని ఆయన తెలిపారు.
అయితే, కార్యాలయాలకు రాకుండా ఇళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎల్లప్పుడూ టెలిఫోన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా అందుబాటులో ఉండాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
వైరస్ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు అధికారిక సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ పద్దతిలో నిర్వహించాలని సూచిస్తూ సిబ్బంది వ్యవహారాలు,శిక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయ మెమో జారీ చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మినహా మిగిలిన అన్ని సమయాల్లో సందర్శకులను కలవరాదని ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి తెలిపారు.
కార్యాలయ ఆవరణలో రద్దీని నివారించేందుకు అధికారులు/సిబ్బంది నిర్దిష్ట సమయ వేళలు పాటించాల్సి ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. (ఎ) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు మరియు (బి) ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఉండేలా వీటిని నిర్ణయించామని అన్నారు.
అన్ని కార్యాలయాల్లో కోవిడ్ అనుగుణ ప్రవర్తనను తప్పనిసరిగా పాటించాలని అధికారులు/సిబ్బందిని ఆదేశిస్తూ సిబ్బంది వ్యవహారాలు,శిక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. తరచుగా చేతులు కడుక్కోవడం/శానిటైజేషన్ చేయడం, ఫేస్ మాస్క్/ఫేస్ కవర్ ధరించడం మరియు సామాజిక దూరాన్ని ఎల్లవేళలా పాటించాలని సిబ్బంది వ్యవహారాలు,శిక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు/సిబ్బందికి సూచించింది.
కార్యాలయం ఆవరణలో పరిశుభ్రత పాటిస్తూ, శుభ్రం చేసేందుకు చర్యలు అమలు చేయాలని మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా తరచుగా తాకే వస్తువులపై దృష్టి సారించాలని పేర్కొనడం జరిగింది.
కార్యాలయ మెమోలో సిబ్బంది వ్యవహారాలు,శిక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం జారీ చేసిన మార్గదర్శకాలు 31 జనవరి 2022 వరకు అమలులో ఉంటాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని బట్టి మార్గదర్శకాలను సవరిస్తామని మంత్రి తెలిపారు.
***
(Release ID: 1788796)
Visitor Counter : 212